• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి అధికారాలు)

అధినేత చేతిలో అసాధారణ అస్త్రాలు!
 


ప్రజాస్వామ్య విధానంలో ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఆర్థిక, రాజకీయ వ్యవస్థల స్థిరత్వం తప్పనిసరి. అసాధారణ పరిస్థితులు తలెత్తితే ఒక్కోసారి దేశ పరిపాలనే గతి తప్పుతుంది. అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు, వ్యవస్థలను చక్కదిద్దేందుకు రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతికి కొన్ని విశిష్టమైన అధికారాలు కల్పించారు. అవసరమైనప్పుడు, అత్యంత అరుదుగా మాత్రమే వినియోగించే అలాంటి అధికారాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. అందులో భాగమైన ఆర్థిక అత్యవసర పరిస్థితి, దాని పర్యవసానాలతో పాటు రాష్ట్రపతికి ఉండే విచక్షణాధికారాలు, సంబంధిత రాజ్యాంగ నియమాలు, ఇంతవరకు వాటిని  ఉపయోగించిన సందర్భాలు, అనంతర పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి.


దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినప్పుడు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు  రాష్ట్రపతి ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ని ప్రకటిస్తారు. తద్వారా దేశంలో సాధారణ ఆర్థిక పరిస్థితులను  నెలకొల్పుతారు.


రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఉన్న ఆర్టికల్‌ 360 ‘ఆర్థిక అత్యవసర   పరిస్థితి’ గురించి వివరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీత  భత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 360ని ప్రయోగించి దేశంలో ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ విధిస్తారు.


ఆర్టికల్‌ 360(1): దేశం మొత్తానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా రాష్ట్రపతి ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తారు.


ఆర్టికల్‌ 360(2): రాష్ట్రపతి ‘ఆర్థిక అత్యవసర  పరిస్థితి’ ప్రకటన చేసిన తర్వాత దాన్ని పార్లమెంటు రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ ప్రకటన వెలువడే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో అమల్లోకి వస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన లోక్‌సభ 30 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ ప్రకటన రద్దవుతుంది.


గరిష్ఠ కాలపరిమితి: పార్లమెంటు ఆమోదం పొందిన ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ నిరంతరం కొనసాగుతుంది. అంటే దాన్ని ఉపసంహరించే వరకు కొనసాగుతుంది. గరిష్ఠ కాలపరిమితి ఏదీ లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు.

ఆర్థిక అత్యవసర పరిస్థితి - ప్రభావాలు:  రాష్ట్రపతి జీతభత్యాలు మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల జీతభత్యాలు గణనీయంగా తగ్గిస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. కేంద్రం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ వార్షిక బడ్జెట్‌ కాపీలను ముందుగానే కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించాలని కేంద్రం ఆదేశించవచ్చు. ఆర్టికల్‌ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే సహాయక గ్రాంట్లను గణనీయంగా తగ్గించవచ్చు లేదా పూర్తిగా నిలిపివేయవచ్చు. ఇప్పటివరకు దేశంలో ఆర్థిక   అత్యవసర పరిస్థితిని ఒక్కసారి కూడా విధించలేదు.


వివిధ సందర్భాల్లో రాష్ట్రపతులు వినియోగించిన  విచక్షణాధికారాలు


* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్‌ రూపొందించిన ప్రసంగం బదులుగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.


1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’ రూపొందించిన నూతన టెలికాం విధానం, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ.125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.


* 2006లో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ‘లాభదాయక పదవుల బిల్లు’కు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఆమోదముద్ర వేయకుండా పునఃపరిశీలనకు పంపారు.


1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ద్వారా రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ చేసిన సిఫార్సును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పునఃపరిశీలనకు పంపారు.


* రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే విశిష్ట వ్యక్తుల  విషయంలో ‘యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం’ చేసిన సిఫార్సులను రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ పునఃపరిశీలనకు పంపారు.


* ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన వివాదాస్పద కార్మిక బిల్లును అప్పటి రాష్ట్రపతి  వి.వి.గిరి పునఃపరిశీలనకు పంపారు.


విచక్షణాధికారాలు


రాష్ట్రపతి విచక్షణాధికారాలను రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఇవి సందర్భానుసారం రాష్ట్రపతికి లభించి,   పరిపాలనలో రాష్ట్రపతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి. ఏదైనా ఒక అంశంపై రాజ్యాంగంలో వివరణ లేనప్పుడు కేంద్ర మంత్రిమండలి సలహాలతో సంబంధం లేకుండా రాష్ట్రపతి తన విచక్షణను అనుసరించి నిర్వహించే   అధికారాలను విచక్షణ అధికారాలుగా చెప్పొచ్చు.


ప్రత్యామ్నాయమా? రద్దు చేయడమా?: కేంద్రంలో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని కల్పించాలా? లేదా లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలను నిర్వహించాలా అనేది రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.


* 1979లో జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించిన మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో చరణ్‌ సింగ్‌ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆయనతో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి 30 రోజుల్లోగా లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. అయితే చరణ్‌ సింగ్‌ పార్లమెంటులో అడుగు పెట్టకుండానే పదవి చేపట్టిన 23వ రోజు రాజీనామా చేశారు. దాంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ బాబూ జగ్జీవన్‌రాం ముందుకొచ్చారు. కానీ అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆ అవకాశం కల్పించకుండా విచక్షణాధికారాన్ని వినియోగించి లోక్‌సభను రద్దు చేశారు.


* 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలు గెలుపొందింది. ఈ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ (272 స్థానాలు) సాధించకపోయినప్పటికీ లోక్‌సభ పక్షనాయకుడిగా ఎన్నికైన వాజ్‌పేయీని ప్రధానిగా రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ నియమించారు. 1999లో ప్రతిపక్షాలు వాజ్‌పేయీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.కేవలం ఒక్క ఓటు తేడాతో తీర్మానం నెగ్గడంతో వాజ్‌పేయీ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి 12వ లోక్‌సభను రద్దుచేశారు.అతి తక్కువ కాలం (13 నెలలు) పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.


ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ/కూటమి నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ఆర్టికల్‌ 75(1) ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తారు. ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి లభించకపోతే ప్రధాని ఎంపికలో రాష్ట్రపతి విచక్షణాధికారాలను వినియోగిస్తారు.              


1989లో 9వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి లభించలేదు. ఫలితంగా దేశంలో తొలిసారిగా ‘హంగ్‌ పార్లమెంటు’ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 191 స్థానాలతో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీ నాయకుడైన రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ముందుకు రాలేదు. దీంతో 141 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా/కూటమిగా ఉన్న జనతాదళ్‌ పార్టీకి చెందిన విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ఆహ్వానించారు. దీంతో     వి.పి.సింగ్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 


* 1990లో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రధాని పదవి కోల్పోయారు. దీంతో చంద్రశేఖర్‌ను ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ఆహ్వానించారు. 1990, నవంబరు 10న చంద్రశేఖర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 1991లో చంద్రశేఖర్‌ ప్రభుత్వం    అధికారం కోల్పోవడంతో రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ లోక్‌సభను రద్దుచేశారు.


1996లో 11వ లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించలేదు. 161 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన వాజ్‌పేయీని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి  శంకర్‌దయాళ్‌ శర్మ నియమించారు. అయితే లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమైన వాజ్‌పేయీ 13 రోజులకే పదవి కోల్పోయారు. 1996, జూన్‌ 1న హెచ్‌.డి.దేవేగౌడ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టేందుకు రాష్ట్రపతి అవకాశం కల్పించారు. దేవేగౌడ ప్రభుత్వం కూడా లోక్‌సభలో విశ్వాస తీర్మానం నిరూపించుకోవడంలో విఫలమవడంతో 1997, ఏప్రిల్‌ 21న ఐ.కె.గుజ్రాల్‌ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టేందుకు మళ్లీ రాష్ట్రపతి అవకాశం కల్పించారు. గుజ్రాల్‌ ప్రభుత్వం కూడా అనతికాలంలోనే పతనం కావడంతో రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ 1997, డిసెంబరులో లోక్‌సభను రద్దు చేశారు.
 

*  ఆర్థిక అత్యవసర పరిస్థితిని అవసరమైన సమయంలో విధించడం వల్ల ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను  సమర్థంగా ఎదుర్కోవచ్చు.’’

- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

*  ఆర్థిక అత్యవసర పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.’’

 - హెచ్‌.ఎన్‌.కుంజ్రు

*  భగవంతుడికి కూడా నేను రబ్బర్‌స్టాంప్‌గా పనిచేయను.’’ 

- వి.వి.గిరి

* భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యత కూడా కల్పించింది.’’

 - జవహర్‌లాల్‌ నెహ్రూ

 


రచయిత: బంగారు సత్యనారాయణ 



 

Posted Date : 23-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు