• facebook
  • whatsapp
  • telegram

గవర్నర్‌

సమాఖ్య వ్యవస్థకు సంరక్షకులు!

  రాష్ట్రాలకు తొలి పౌరులు. కేంద్రానికి ప్రతినిధులు. పదవీ కాలానికి పరిమితులు లేవు. పాలన అంతా వారి పేరు మీదే జరుగుతుంది. అయినా నిర్ణయాల్లోని లోపాలకు బాధ్యత ఉండదు. న్యాయస్థానాల ద్వారా ప్రశ్నించే వీలులేదు. విచక్షణ మేరకు వ్యవహరిస్తారు. అలా అని అధికారాలు అపరిమితం కాదు. అలంకారప్రాయం అంతకంటే కాదు. అన్నింటికీ మించి సమాఖ్య వ్యవస్థకు సంరక్షకులుగా విధులు నిర్వహిస్తారు.

 

భారత రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్ర స్థాయిలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రాష్ట్రాధినేతగా గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. పరిపాలన అంతా గవర్నర్‌ పేరు మీద జరుగుతుంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్‌ వ్యవహరిస్తారు. రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరించారు. అందులో గవర్నర్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్‌ జనరల్‌ అంతర్భాగంగా ఉంటారు. 

 

రాజ్యాంగ వివరణ

 

ఆర్టికల్‌ 153: ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్‌ ఉంటారు. 

  అయితే జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించి, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్‌గా వ్యవహరించవచ్చని నిర్దేశించారు.

 

ఆర్టికల్‌ 154: గవర్నర్‌ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారు. రాష్ట్రాధినేత, రాష్ట్ర ప్రథమ పౌరుడు. రాజ్యాంగం ద్వారా తనకు లభించిన అధికారాలను  స్వయంగా లేదా తన కింది అధికారుల ద్వారా అమలు చేస్తారు.

 

ఆర్టికల్‌ 155: రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై చర్చ జరిగినప్పుడు గవర్నర్‌ను ఎన్నుకోవాలా లేదా నియమించాలా అనే అంశంపై అనేక వాదనలు తలెత్తాయి. గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని రాజ్యాంగ సభ సలహాదారుడైన బి.ఎన్‌.రావు ప్రతిపాదించారు. కానీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ గవర్నర్‌ను నియమించే పద్ధతినే బలపరిచి దాన్నే అమలుచేయాలని తీర్మానించారు. అందుకు కింది కారణాలను పేర్కొన్నారు.

* గవర్నర్‌ ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైతే రాష్ట్రస్థాయిలో రెండు రకాల అధికార కేంద్రాలు ఏర్పడి పరిపాలనలో సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల ముఖ్యమంత్రితో విభేదాలు వస్తాయి. 

* గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది.

* రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్నే అమలు చేస్తుండటం వల్ల గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలే ఉంటాయి. అందుకే ఎన్నిక అవసరం లేదు.

* గవర్నర్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తే ఆ పదవి పార్టీ రాజకీయ ప్రేరేపితమవుతుంది. దానివల్ల గవర్నర్‌ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా పనిచేయలేరు.

* గవర్నర్‌ నియామకం విషయంలో మన రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగ నమూనాను అనుసరించారు. దాని ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

 

సర్కారియా కమిషన్‌ సిఫార్సులు

జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌ సర్కారియా ఆధ్వర్యంలోని కమిషన్‌ గవర్నర్లకు సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. 

* ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.

* క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేనివారిని, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే నియమించాలి.

* గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.

* సాధ్యమైనంత వరకు మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను నియమించాలి.

* విశిష్ట వ్యక్తిత్వం, ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్నవారిని నియమించాలి.

 

ఆర్టికల్‌ 156: సాధారణంగా గవర్నర్‌ పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారు.

* రాష్ట్రపతి ఎప్పుడైనా గవర్నర్‌ను పదవి నుంచి తొలగించవచ్చు లేదా వేరే రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు.

* పదవీకాలం ముగియక ముందే గవర్నర్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు.

* గవర్నర్‌ పదవికి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడితే సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు.

 

అభీష్ట సూత్రం: గవర్నర్‌ను తొలగించేందుకు మహాభియోగ తీర్మానం లేదా మరే ఇతర పద్ధతిని రాజ్యాంగంలో పేర్కొనలేదు. రాష్ట్రపతి ఎలాంటి కారణం తెలియజేయకుండానే గవర్నర్‌ను తొలగించవచ్చు. దీన్నే అభీష్ట సూత్రం అంటారు.

 

బి.పి.సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2010: గవర్నర్‌ ప్రవర్తన సరిగ్గా లేదనే ఆరోపణలు వచ్చిప్పుడు, ఏవైనా అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు తలెత్తినప్పుడు, అవి రుజువైతేనే పదవి నుంచి తొలగించాలి. సరైన కారణాలు లేకుండా గవర్నర్‌ను పదవి నుంచి తప్పించకూడదని 2010, మే 7న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 

సూర్యనారాయణ్‌ చౌదరి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1982: రాజ్యాంగంలో గవర్నర్‌ను తొలగించడానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను నిర్దేశించలేదు. కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు రాష్ట్రపతి ద్వారా గవర్నర్‌ను పదవి నుంచి తొలగిస్తుంది. రాష్ట్రపతి అభీష్ట సూత్రాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ఆర్టికల్‌ 157: గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలను వివరిస్తుంది.

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* గరిష్ఠ వయసు పరిమితిని పేర్కొనలేదు.

 

ఆర్టికల్‌ 158: గవర్నర్‌గా నియమితులయ్యే వారికి సంబంధించిన షరతులు, జీతభత్యాలు, నివాస భవనం గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. 

షరతులు: * పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలో ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు. ఒకవేళ చట్టసభలో సభ్యత్వం ఉంటే గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి దాన్ని కోల్పోయినట్లుగానే పరిగణిస్తారు. 

* ఎలాంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు. 

* కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటితమై ఉండకూడదు.

జీతభత్యాలు: * ఆర్టికల్‌ 158(3) ప్రకారం గవర్నర్‌ జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా గవర్నర్‌కు జీతభత్యాలు అందుతాయి.

* ప్రస్తుతం గవర్నర్‌ నెల జీతం రూ.3,50,000. దీన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తే అతడి జీతభత్యాలను సంబంధిత రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో చెల్లించాలనే విషయాన్ని రాష్ట్రపతి నిర్దేశిస్తారు.

* గవర్నర్‌ నివాసాన్ని రాజ్‌భవన్‌ అంటారు.

 

ఆర్టికల్‌ 159: ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి పరిరక్షిస్తాను. రాజ్యాంగ విలువలకు లోబడి నా విధులను నిర్వర్తిస్తాను. ఎలాంటి రాగద్వేషాలకు లోబడకుండా నా పదవీ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాను’ అని గవర్నర్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

 

చట్టపరమైన రక్షణలు 

రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలు, విధులు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వర్తించడానికి; రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగించే విధంగా చూసేందుకు రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని చట్టపరమైన రక్షణలను కల్పించింది.

* అధికార హోదాలో గవర్నర్‌ తీసుకున్న ఏ చర్యకు లేదా గవర్నర్‌ తీసుకున్నట్లుగా భావించే ఏ నిర్ణయానికైనా వ్యక్తిగతంగా బాధ్యులను చేయకూడదు.

* తన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపే విధివిధానాలకు, ఆ సందర్భంగా చేసే నిర్ణయాల్లోని లోటుపాట్లకు సంబంధించి గవర్నర్‌ ఎవరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

* తన అధికార హోదాలో పదవీ నిర్వహణలో భాగంగా గవర్నర్‌ చేపట్టిన ఏ చర్యకు, కార్యక్రమానికి గవర్నర్‌పై చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.

* పదవిలో ఉన్న గవర్నర్‌పై ఏ న్యాయస్థానం క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించకూడదు.

* గవర్నర్‌ అరెస్ట్‌కు లేదా జైలుకు పంపేందుకు న్యాయస్థానం ఎలాంటి చర్యలను చేపట్టకూడదు.

* గవర్నర్‌పై సివిల్‌ కేసులను నమోదు చేయాలంటే కనీసం రెండు నెలలు ముందుగా నోటీసు అందించాలి.

* రాజ్యాంగపరమైన హోదాలో రాష్ట్రపతికి, గవర్నర్‌కు కొన్ని విషయాల్లో ప్రధానమైన తేడాలు ఉన్నాయి

- రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాన్ని ఇస్తుంది. కానీ రాష్ట్రపతికి అలాంటి అధికారాన్ని ఇవ్వలేదు.

- ఏదైనా విషయం తన విచక్షణలోకి వస్తుందా లేదా అనే అంశంలో గవర్నర్‌ నిర్ణయమే అంతిమం. తద్వారా గవర్నర్‌ నిర్వర్తించిన ఏ పనిని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించకూడదు.

ఉదా: * రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం.

* రాష్ట్రపతి పరిశీలనకు రాష్ట్ర బిల్లులను రిజర్వ్‌ చేయడం.

* రాష్ట్ర పరిపాలన, శాసన సంబంధమైన విషయాలపై సమాచారాన్ని ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకోవడం.

 

రాష్ట్రపతి ఆదేశంతో గవర్నర్‌కు లభించే బాధ్యతలు: రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేసినప్పుడు గవర్నర్‌కు నిర్దిష్టమైన, ప్రత్యేకమైన బాధ్యతలు లభిస్తాయి. వాటిని రాజ్యాంగం ప్రకారం తన విచక్షణ మేరకు గవర్నర్‌ నిర్వహిస్తారు. 

ఉదా: * మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు.

* గుజరాత్‌లో సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డుల ఏర్పాటు.

* సిక్కింలో వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, శాంతి భద్రతలను నెలకొల్పడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.

* మణిపుర్, అస్సాం రాష్ట్రాల్లో కొండ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల పరిపాలనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం.

 

గవర్నర్, రాష్ట్రపతి మధ్య వ్యత్యాసాలు

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 27-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌