• facebook
  • whatsapp
  • telegram

జాతీయ భావాల వృద్ధి

వివక్షలతో విసిగి.. విముక్తికి తిరగబడి!

ఆంగ్లేయులు దేశంలోని ప్రాంతాలను ఏకం చేశారు. స్వార్థప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగించారు. మన హక్కులను హరించారు. అణచివేతలకు పాల్పడ్డారు. కానీ వారి సౌకర్యం కోసం అందించిన ఆంగ్లవిద్య, ఆధునిక వ్యవస్థలతో భారతీయుల్లో చైతన్యం మొదలైంది. అది సంస్కరణల ఉద్యమాలతో గట్టిపడింది. దోపిడీ విధానాలపై తిరగబడేంతగా బలపడింది. తర్వాత కాలంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను గడగడలాడించేంతటి ఉద్యమానికి ఊపిరిపోసింది.  

 

పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్ధానికి బ్రిటిషర్లు భారతదేశ పాలకులయ్యారు. మనవాళ్ల ఆశలు, ఆశయాలు వేరు. ఆంగ్లేయుల పాలనా లక్ష్యాలు వేరు. విరుద్ధ ప్రయోజనాలతో రెండు చారిత్రక శక్తులు  పాలకులు, పాలితులుగా ఒకచోట చేరినప్పుడు సంఘర్షణ అనివార్యమైంది. దాని నుంచి పుట్టిందే భారత జాతీయవాదం/ఉద్యమం. దీనికి అనేక కారణాలు తోడై దాన్ని మహత్తర శక్తిగా బలోపేతం చేశాయి.

 

రాజకీయ సమైక్యత 

  అనేక రాజ్యాల సమాహారమైన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఆంగ్లేయులు జయించి దేశాన్ని రాజకీయంగా, భౌగోళికంగా ఏకం చేశారు. దాంతో దేశానికి అధిపతిగా ఒకే గవర్నర్‌ జనరల్, ఒకే పాలనా వ్యవస్థ, ఒకే చట్టం, ఒకే కరెన్సీ, న్యాయవ్యవస్థ, సివిల్‌ సర్వీస్, విద్యావ్యవస్థ ఏర్పడ్డాయి. రవాణా, వార్తా సౌకర్యాలు ప్రాంతాల మధ్య హద్దులను చెరిపేశాయి. భారతీయులందరూ ఒకే విధమైన వివక్షకు, నిరంకుశ పాలనకు, దోపిడీకి గురవడంతో వారిలో సంఘటిత శక్తి బలపడింది. ప్రజల్లో తాము ఒకే జాతి వారమని, ఒకే దేశానికి చెందినవారమనే జాతీయ భావన అంకురించి దినదినాభివృద్ధి చెందింది.

 

రవాణా, వార్తా సౌకర్యాలు 

  ఆధునిక  సౌకర్యాలైన రైల్వే, టెలిగ్రాఫ్, తపాలా వ్యవస్థలు డల్హౌసీ పాలనా కాలంలో (1848 - 56) అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రజలను, వార్తలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి త్వరితగతిన చేరవేశాయి. వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంఘిక సంబంధాలు ఏర్పడి ఐక్యతను, సంఘీభావాన్ని పెంపొందించాయి. జాతీయ భావాల వ్యాప్తికి దోహదపడ్డాయి.

 

ఇంగ్లిష్‌ విద్య - ఆధునిక ఆలోచనలు

 


  విలియం బెంటింక్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో మెకాలే సలహా మేరకు విద్యాసంస్థల్లో ఇంగ్లిష్‌ విద్యను ప్రవేశపెట్టారు. 1835 నుంచి ఇంగ్లిష్‌ భాష విద్యా మాధ్యమం అయింది. నాటి పాశ్చాత్య  విధానంలో విద్యనభ్యసించిన భారతీయులు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం మొదలైన భావనల ప్రాధాన్యాన్ని గ్రహించి ప్రభావితులయ్యారు. విద్యావంతుల్లో ఇంగ్లిష్‌ భాష ఆధునిక, తార్కిక, లౌకిక ప్రజాస్వామ్య జాతీయ దృక్పథాలను ఏర్పరిచింది. పాశ్చాత్య రాజకీయ పండితులు మాజిని, గారిబాల్డి లాంటి దేశభక్తులు యువతకు ఆదర్శమయ్యారు. ఆధునిక విద్యావంతుల్లో కొందరు జాతీయోద్యమాలకు నాయకత్వం వహించారు. దేశంలో భిన్నభాషలు మాట్లాడే ప్రజలు, పరస్పరం ఒకరి భావనలను మరొకరు అర్థం చేసుకునేందుకు ఆంగ్లం ఉపయోగపడి, సంఘీభావం పెంచి భార‌తీయుల్లో జాతీయత భావాలు బలపడేలా చేసింది.

 

గత వైభవ ఆవిష్కరణ

  బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులు, వారి చరిత్రకారులు భారతీయులను నాగరికత, సంస్కృతి లేని జాతి అని అభివర్ణించడంతో మనవాళ్లు ఆత్మన్యూనతకు గురయ్యారు. కానీ కొంతమంది అధికారులు చేసిన కృషి భారతీయులకు అనుకూలంగా పరిణమించింది. 1784లో విలియం జోన్స్‌ కలకత్తాలో ‘ఏషియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌’ను స్థాపించారు. దీని లక్ష్యాల్లో ఒకటి మరుగున పడిన భారతీయ పురాతన సాహిత్యం/సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం. విలియం జోన్స్‌ సంస్కృతంలోని ప్రసిద్ధ గ్రంథాలు చదివి, కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించగా మరో కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు. అనేక భారతీయ గ్రంథాలు ఇంగ్లిష్‌లోకి అనువాదమయ్యాయి. కొంతమంది కంపెనీ అధికారులు పురాతన శాసనాలు, నాణేలు, కట్టడాలపై పరిశోధనలు చేశారు. జేమ్స్‌ ప్రిన్సెస్‌ 1847లో బ్రాహ్మిలిపిలో ప్రాకృతభాషలో దేశవ్యాప్తంగా ఉన్న అశోకుడి శాసనాల్లోని లిపిని గుర్తించి వెలుగులోకి తెచ్చాడు. అలెగ్జాండర్‌ కన్నింగ్‌ హోం సాంచీ, బార్హుట్‌ బౌద్ధ స్తూపాల చరిత్రను ఆవిష్కరించాడు. కళలు, శిల్పం, సాహిత్యం, తత్త్వశాస్త్రం, లాంటి వాటిలో ఐరోపా, భారతీయ పండితులు చేసిన కృషి వల్ల మరుగునపడిన ఘనమైన భారతీయుల చరిత్ర, సంస్కృతి ఆవిష్కృతమైంది. తాము ఎంతో గొప్ప నాగరికత/సంస్కృతికి వారసులమో తెలుసుకున్న భారతీయులు నైరాశ్యాన్ని వదలి ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, జాతీయ భావాలతో వ్యవహరించడం ప్రారంభించారు. నిజానికి ఆనాటి కొంత‌మంది బ్రిటిష్ అధికారులు ప్రాచీన భార‌తీయ సంస్కృతి ఔన్న‌త్యాన్ని ప్ర‌శంసించారు.

 

మత, సాంఘిక పునర్జీవం 

  19వ శతాబ్దంలో జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలు, హిందూమతంలోని దురాచారాలు, మూఢ విశ్వాసాలను ప్రక్షాళన చేశాయి. భారతీయులకు మాతృభూమి, నాగరికత పట్ల ప్రేమాభిమానాలు పెంపొందించి ఉత్తేజితులను చేసి, జాతీయోద్యమ పుట్టుక, పురోగతికి దోహదపడ్డాయి. బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, సత్యశోధక్‌ సమాజం వంటి అనేక భక్తి ఉద్యమాల నాయకులు జాతీయోద్యమానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. స్వరాజ్‌ అనే పదం మొదట వాడినవారు దయానంద. వేదాంతంతో పాటు దేశభక్తిని చాటి యువతకు ఉత్సాహాన్ని ఇచ్చినవారు వివేకానంద. సంస్కర్తలు అందరూ సాంఘిక, మత పునర్జీవనం లేకపోతే రాజకీయ పునర్జీవనం ఉండదని విశ్వసించినవారే.

 

ఆర్థిక దుస్థితి

  భారతదేశం బ్రిటిషర్ల వలస రాజ్యం. ఇక్కడి ఆర్థిక వనరుల దోపిడి వారి పాలనా లక్ష్యమైంది. బ్రిటన్‌ పరిశ్రమలకు ముడిసరకులు సరఫరా చేయడానికి, వారి కర్మాగారాల్లో తయారైన వస్తువుల అమ్మకానికి మార్కెట్‌గా మన దేశం మారింది. ఇక్కడి సంపద వివిధ రూపాల్లో ఇంగ్లండ్‌కు నిరంతరం తరలివెళ్లింది. భారతదేశ ఎగుమతులకు బ్రిటన్‌లో అధిక దిగుమతి సుంకం విధించి ఎగుమతులను నిరుత్సాహపరిచారు. వారి వివక్షాపూరిత వ్యాపార విధానంతో ఇక్కడి కుటీర పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిపై ఆధారపడినవారు వృత్తులు కోల్పోయి పల్లెలకు వలసపోయారు. సాగు భూమిపై భారం పెరిగి గ్రామీణ పేదరికం పెరిగింది. భూమి శిస్తు పేరుతో రైతులపై మోయలేని ఆర్థికభారం మోపడంతో వ్యవసాయం కష్టంగా మారింది. కరవులు, దుర్బిక్ష పరిస్థితులు, నిరుద్యోగం, పేదరికం దేశంలో విలయతాండవం చేస్తూ దేశాన్ని అథమస్థాయికి తెచ్చాయి. ఈ విధానాలను ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ ఉద్యమాలకు ఇవన్నీ మూల కారణాలుగా మారాయి. 

 

వార్తా పత్రికలు 

  భారతదేశంలోకి ముద్రణ యంత్రాన్ని పోర్చుగీసు వారు ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం చివరి భాగంలో దేశంలో పత్రికలు ప్రారంభమయ్యాయి. ఆధునిక భావాల వ్యాప్తికి,  జాతీయోద్యమ ఆవిర్భవానికి వార్తాపత్రికలు అనేక విధాలుగా  తోడ్పడ్డాయి. బెంగాల్‌లో హిందూ పాట్రియాట్, అమృతబజార్‌ పత్రిక, ఇండియన్‌ మిర్రర్, ది బెంగాలీ; బొంబాయిలో ఇందుప్రకాష్, రాస్త గోప్తార్, కేసరి, మరాఠీ; మద్రాసులో ది హిందూ, ఆంధ్రప్రకాశిక, కేరళ పత్రిక వంటి పత్రికలు జాతి ప్రయోజనాలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రభుత్వ నిరంకుశ, దోపిడీ విధానాలను తమ సంపాదకీయ వ్యాసాల్లో ఎండగట్టి ప్రజలను నిరంతరం చైతన్యపరిచాయి. నవలలు, గీతాలు, వ్యాసాలతో కూడా రచయితలు ప్రజలను మేలుకొలిపారు. బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన ఆనందమఠ్, దీనబంధు మిత్ర రాసిన నీల్‌ దర్పణ్‌ ప్రభావం ఆనాటి సమాజంపై ఎంతో ఉంది.

 

లిట్టన్‌  విధానాలు

  లిట్టన్‌ గవర్నర్‌ జనరల్‌గా (1876-80) ఉన్న కాలంలో భారతీయుల పట్ల జాతి వివక్ష, అణిచివేత విధానాలను అవలంబించాడు. వాటి ద్వారా మనవారిలో జాతీయ భావాల వృద్ధికి కారణమయ్యాడు. ఇతడి పాలనలోనే జాతీయత భావాలు స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్నాయి. 1877లో భారతదేశంలో అనేక ప్రాంతాలు కరవు కాటకాల కోరల్లో చిక్కుకుని, వేలమంది మరణిస్తున్న పరిస్థితులను పట్టించుకోకుండా విక్టోరియా మహారాణి గౌరవార్థం మిలియన్‌ రూపాయలు ఖర్చుపెట్టి దర్బారు నిర్వహించి, దేశ ప్రజల్ని రెచ్చగొట్టాడు. తనపై వస్తున్న విమర్శల దాడిని అణచడానికి, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం (1878), జాత్యహంకారానికి ప్రతీక అయిన ఆయుధ చట్టం (1878) తీసుకువచ్చాడు. సివిల్‌ సర్వీస్‌ ప‌రీక్ష‌ గరిష్ఠ వయసును తగ్గించాడు. వివక్షపూరిత వాణిజ్య విధానంతో దేశీయ వస్త్ర పరిశ్రమలకు నష్టం చేశాడు. రెండో అఫ్గాన్‌ యుద్ధం చేసి ఆర్థిక నష్టం కలిగించాడు. దీంతో భారతీయుల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు, ఆంగ్లేయుల దుష్ట పాలన నుంచి విముక్తి సాధించాలనే లక్ష్యం కోసం జాతీయోద్యమం వైపు నడిపించాయి.

 

ఇల్బర్ట్‌ బిల్లు వృత్తాంతం 

  భారతీయ న్యాయమూర్తి ఐరోపా పౌరుడి కేసు విచారించకూడదు అనేది న్యాయవ్యవస్థలో కొన‌సాగుతున్న ఒక వివక్ష. 1880లో గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన రిప్పన్‌ దీన్ని తొలగించాలని తన కౌన్సిల్‌ సభ్యుడు అయిన ఇల్బర్ట్‌ను ఆదేశించారు. దీంతో భారతీయ న్యాయమూర్తులకు ఇక్కడ ఉన్న ఐరోపా నేరగాళ్లను విచారించే అవకాశం కల్పించే బిల్లు సిద్ధమైంది. కానీ తెల్లవారు ఈ బిల్లును ప్రతిఘటించడంతో సవరించాల్సి వచ్చింది. ఈ సంఘటన మనవాళ్లకు చక్కటి పాఠాన్ని బోధించింది. తమ డిమాండ్లు ఆమోదం పొందడానికి, భారతీయులు కూడా సమీకృతంగా, సమైక్యంగా ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఈ పరిస్థితులు 1885 నాటికి పరిణతి చెంది జాతీయోద్యమానికి బలమైన పునాది పడి, భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు దారితీశాయి.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌