• facebook
  • whatsapp
  • telegram

హోమ్‌ రూల్‌ ఉద్యమం

స్వరాజ్య సమరం!


బెంగాల్‌ విభజనపై జరిగిన తిరుగుబాటు భారతీయుల సంఘటిత శక్తిని చాటింది. యుద్ధకాలంలో అండగా ఉంటే సంస్కరణలు అమలు చేస్తామంటూ నమ్మించిన బ్రిటన్, మోసం చేసి వంచన వైఖరిని ప్రదర్శించింది. దాంతో పెరిగిన అసంతృప్తి మళ్లీ ఉద్యమంగా మారింది. విప్లవకారులు విజృంభిచారు. విభేదాలు విడిచి నేతలు ఏకమై పోరాడారు. కష్టనష్టాలను లెక్కచేయకుండా ప్రజలు నాయకుల వెంట నడిచారు. స్వయం పాలన కోసం దేశవ్యాప్తంగా సమరం చేశారు. వలస ప్రభుత్వం వణికిపోయింది. స్వపరిపాలనకు తలొగ్గింది.

 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం భారత జాతీయవాద వెల్లువలో ఒక గొప్ప విప్లవ కెరటం. ‘ప్రజలు తరతరాల గాఢ సుప్తావస్థ నుంచి మేల్కొన్నారు. రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. మహాజర్ల (పిటీషన్‌)కు ప్రజామద్దతు ఉండాలని, తమకు కష్టనష్టాలు భరించే శక్తి ఉండాలని గుర్తించారు.’ అని గాంధీ ఆ ఉద్యమం గురించి పేర్కొన్నారు. 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని భారతీయులు సంఘటితంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను తిరస్కరించిన మొదటి ఘట్టంగా వర్ణించవచ్చు.ఆ తర్వాత దేశ స్వాతంత్య్ర సమరంలో హోమ్‌ రూల్‌ ఉద్యమాన్ని (1916-1918) ద్వితీయ ఘట్టంగా పేర్కొనవచ్చు. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం అనంతరం అనేక పరిస్థితులు హోమ్‌ రూల్‌ ఉద్యమానికి (స్వయం పాలన) దారితీశాయి.

 

దారితీసిన పరిస్థితులు

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమ కాలంలో ప్రభుత్వం అనుసరించిన దమననీతి, క్రూర అణచివేత విధానాలు అంతిమంగా విప్లవ హింసావాదంగా పరిణమించాయి. సంధ్య, యుగాంతర్, కాల్, వందేమాతరం, మరాఠీ, కేసరి లాంటి పత్రికలు విప్లవవాదానికి మద్దతిచ్చాయి. చాపేకర్‌ సోదరులు, సావర్కర్‌ సోదరులు, ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి లాంటి విప్లవకారులు ఆ మార్గాన్ని అనుసరించారు. వారు విదేశాల్లో కూడా తమ కేంద్రాలను స్థాపించారు. శ్యాంజీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా లాంటి వారు ఐరోపాలో, లాలా హర్‌దయాళ్‌ అమెరికాలో తమ రహస్య కార్యకలాపాలను సాగిస్తూ, భారతదేశంలో విదేశీ సామ్రాజ్య శక్తులపై సాయుధ తిరుగుబాటుకు సంసిద్ధమయ్యారు.

వందేమాతర ఉద్యమం 1911లో విజయవంతంగా ముగిసిన తర్వాత, భారత జాతీయోద్యమంలో స్తబ్దత ఏర్పడింది. ఈ మధ్యలో 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. గ్రేట్‌ బ్రిటన్, ఇటలీ, రష్యా, జపాన్, అమెరికా కలిసి ఒక పక్షంగా, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, టర్కీ (తుర్కియే) లు మరో పక్షంగా యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధం (1914 - 18) వల్ల భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో కీలక మార్పులు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రక్రియలో బ్రిటన్‌ భారత నాయకుల మద్దతు కోరింది.  యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయ సమస్యల పట్ల ఉదార వైఖరితో వ్యవహరిస్తుందని విశ్వసించిన కాంగ్రెస్‌ మితవాద వర్గం మద్దతుకు అంగీకరించింది. 1914లో తిలక్‌ జైలు నుంచి విడుదలయ్యారు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, కృతజ్ఞతగా భారతదేశానికి రాజ్యాంగ సంస్కరణలు ప్రకటిస్తారని అతివాదులు కూడా నమ్మి మద్దతు ప్రకటించారు. విప్లవకారులు మాత్రం, ఇది తమకు అందివచ్చిన అవకాశంగా భావించి, బ్రిటన్‌కు శత్రువులైన టర్కీ, జర్మనీ లాంటి దేశాల నుంచి ఆర్థిక, మిలటరీ సహాయం పొందడానికి ప్రయత్నించారు. దాంతో విప్లవకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్రమైన అణచివేత విధానాలు అవలంబించింది. విప్లవ కార్యకలాపాలను నిరోధించేందుకు 1915లో భారతదేశ రక్షణ చట్టం తీసుకొచ్చింది. దాన్ని విచక్షణారహితంగా ప్రయోగించి అనుమానితులను పెద్దసంఖ్యలో ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో బంధించింది.

 

ఒక లక్ష్యం - రెండు లీగ్‌లు 

అనిబిసెంట్‌ సహకరించడంతో కాంగ్రెస్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు తిలక్‌ వర్గానికి అనుమతి లభించింది. అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశస్థురాలు. ఉన్నత విద్యావంతురాలు, ఆధ్యాత్మికవేత్త, భారతీయ సంస్కృతి పట్ల అభిరుచి, ఇష్టం ఉన్న వ్యక్తి. దివ్యజ్ఞాన సమాజసేవలో భాగంగా ఆమె భారతదేశానికి వచ్చారు. సమాజం ప్రధాన కార్యాలయం మద్రాస్‌లోని అడయార్‌లో ఏర్పాటైంది. ఆమె రాజకీయాల్లో కూడా ప్రవేశించి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1916లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ తమ వార్షిక సమావేశాల కోసం లఖ్‌నవ్‌లో సమావేశమయ్యాయి. అందులో పరస్పర సంప్రదింపుల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియలోనూ అనిబిసెంట్‌ ముఖ్య భూమిక పోషించారు.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడిచిన తర్వాత బ్రిటన్‌కు  అందించిన సహాయ సహకారాలకు బదులుగా దేశంలో స్వపరిపాలన అమలు చేస్తుందనే భ్రమలు భారతీయులకు తొలగిపోయాయి. ఒత్తిడి చేస్తేగాని ప్రభుత్వం రాజకీయ సంస్కరణలు తీసుకురాదని నాయకులు, ప్రజలు గ్రహించారు. అయితే  అప్పటికి నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయింది. కానీ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల ఐక్యత, కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌ మైత్రి మరొక రాజకీయ పోరాటానికి అనువైన వాతావరణాన్ని కల్పించాయి. దాంతో ఈ ఉద్యమాన్ని జాతీయ కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా, జాతీయ నాయకులైన బాలగంగాధర్‌ తిలక్, అనిబిసెంట్‌లు నిర్వహించారు. వీరు దేశానికి స్వయంపాలనను డిమాండ్‌ చేస్తూ 1916లో విడివిడిగా హోమ్‌ రూల్‌ లీగ్‌లు స్థాపించారు. లక్ష్యం ఒక్కటే అవడంతో రెండు లీగ్‌లూ కలిసే పనిచేశాయి.

తిలక్‌ హోమ్‌ రూల్‌ లీగ్‌: దీన్ని తిలక్‌ 1916, ఏప్రిల్‌లో పుణెలో స్థాపించాడు. ఈ లీగ్‌ మహారాష్ట్ర (అప్పటి బొంబాయి మినహా), కర్ణాటక, సెంట్రల్‌ ప్రావిన్స్‌ల్లో కార్యకలాపాలును నిర్వహించింది. తిలక్‌ తన పత్రికలు ‘మరాఠా’, ‘కేసరి’ ద్వారా హోమ్‌రూల్‌ ఉద్యమ లక్ష్యాన్ని వ్యాసాలు, వార్తల రూపంలో తెలియజేసి, ప్రజలను కార్యోన్ముఖులను చేశాడు. ఉద్యమ విశిష్టతను చాటేందుకు కన్నడ, గుజరాతీ, మరాఠి, ఇంగ్లిష్‌ భాషల్లోనూ కరపత్రాలు విడుదల చేశాడు. తిలక్‌ లీగ్‌ స్వపరిపాలనను, భాషా రాష్ట్రాలను, ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను డిమాండ్‌ చేసింది. ‘స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాను’ అని తిలక్‌ ఎలుగెత్తి చాటాడు.

అనిబిసెంట్‌ లీగ్‌: అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశంలో నిర్వహించిన స్వపరిపాలన ఉద్యమం తరహాలో ఇక్కడ కూడా హోమ్‌ రూల్‌ లీగ్‌ (1916, సెప్టెంబరు) స్థాపించి రాజకీయ పోరాటం సాగించారు. ఆమె తన పత్రికలు ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’; కరపత్రాలు, సమావేశాల ద్వారా లీగ్‌ లక్ష్యాలు, కార్యాచరణ గురించి బొంబాయి, కాన్పుర్, అలహాబాద్, బెనారస్, మధుర, కాలికట్, అహ్మద్‌నగర్, లాంటి చోట్ల ప్రచారం చేశారు. అనిబిసెంట్‌ లీగ్‌ ద్వారా స్వపరిపాలనను డిమాండ్‌ చేశారు. జార్జ్‌ అరండల్‌ (లీగ్‌ కార్యదర్శి), వాడియా, ద్వారకాదాస్, శంకర్‌లాల్‌ బంకర్, ఇందూలాల్, సి.పి. రామస్వామి అయ్యర్‌ లాంటి ప్రముఖులు ఉద్యమంలో అనిబిసెంట్‌ అనుయాయులయ్యారు. ఆమె బెనారస్‌లో స్థాపించిన హిందూ కళాశాల 1916 నాటికి మదన్‌ మోహన్‌ మాలవ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయంగా మారింది (1915 చట్టం ప్రకారం).

హోమ్‌రూల్‌ ఉద్యమంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. బ్రిటిష్‌ పాలకులు తమ సామ్రాజ్యవాద ధోరణిని విడనాడేందుకు ఇష్టపడలేదు. స్వపరిపాలన ఉద్యమాన్ని అణచివేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వం ఉద్యమ నేతలపై అప్రజాస్వామ్య భారతదేశ రక్షణ చట్టాన్ని ప్రయోగించింది. ఉద్యమ పత్రికలపై ఆంక్షలను విధించింది. ప్రభుత్వం 1917లో అనిబిసెంట్‌ను ఆమె అనుచరులతో కలిపి అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్టును దేశం యావత్తు వ్యతిరేకించింది. అనిబిసెంట్‌ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, భూలాభాయ్‌ దేశాయ్, చిత్తరంజన్‌ దాస్, మదన్‌ మోహన్‌ మాలవ్య, మహమ్మద్‌ అలీ జిన్నా, లాలా లజపతిరాయ్‌ వంటి నాయకులు హోంరూల్‌ ఉద్యమాన్ని సమర్థించారు. దేశం పోరాటాలతో అట్టుడికిపోయింది. ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకుంది. 1917 ఆగస్టులో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్‌ ‘భారతీయులకు స్వయంపాలన ప్రసాదించడం బ్రిటిష్‌ ప్రభుత్వ లక్ష్యం’ అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన తర్వాత అనిబిసెంట్‌ తన ఉద్యమ తీవ్రతను తగ్గించారు. తిలక్‌ కూడా ‘ఇండియన్‌ అన్‌రెస్ట్‌’ గ్రంథ రచయిత వాలెంటైన్‌ చిరోల్‌పై పరువునష్టం దావా కోసం లండన్‌ వెళ్లడంతో ఉద్యమ తీవ్రత తగ్గింది.

 

ఉద్యమ ఫలితాలు

హోమ్‌ రూల్‌ ఉద్యమం భౌగోళికంగా దేశమంతా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు విశేషంగా పాల్గొన్నారు. మొదటిసారి అతివాదులు, మితవాదుల మధ్య; కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య ఐకమత్యం ఏర్పడటంతో రాజకీయ ఉత్సాహం తొణికిసలాడింది. చివరకు ప్రభుత్వం జాతీయవాదులను సంతృప్తి పరచడానికి మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను ‘1919, భారత ప్రభుత్వ చట్టం’గా తీసుకొచ్చింది. భారతీయులు తమ డిమాండ్ల సాధనకు ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా వెనుకాడమని రుజువు చేశారు. తర్వాతి కాలంలో గాంధీజీ ప్రజాఉద్యమాలకు వీలుగా  ఈ ఉద్యమం ముందుగానే ప్రజలకు శిక్షణ ఇచ్చి సమాయత్తం చేయడంతో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

Posted Date : 03-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌