• facebook
  • whatsapp
  • telegram

భారత రాష్ట్రపతి

 భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, విధివిధానాలను  ఆర్టికల్స్ 52 నుంచి 151 మధ్య వివరించారు. మన దేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటు దేశానికి అవసరమైన చట్టాలను రూపొందిస్తే... కార్యనిర్వాహక శాఖ అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చట్టాలను అమలుపరుస్తాయి. న్యాయశాఖ అయిన సుప్రీంకోర్టు శాసన, కార్యనిర్వాహక శాఖలు నిర్వర్తించే విధులు రాజ్యాంగబద్దంగా ఉండేలా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుంది.
 

A. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తున్నాయి. కార్య నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.

 

రాష్ట్రపతి
  రాజ్యాంగంలోని 52 - 62 వరకు ఉన్న 11 ప్రకరణలు రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు, షరతులు, ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు తదితర అంశాలను వివరిస్తున్నాయి.
* మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణాధికారులు ఉంటారు.
1. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉండి, భారత దేశానికి రాజ్యాంగ రీత్యా అధిపతిగా వ్యవహరిస్తారు.
2. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలు చెలాయిస్తుంది.
* దేశ పరిపాలనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషించినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది.

 

ఆర్టికల్ 52
* భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు.  దేశాధినేత, రాజ్యాంగ అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు.

 

ఆర్టికల్ 53
* దేశ కార్యనిర్వహణాధికారాలను రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరిట నిర్వహించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు. రాష్ట్రపతి పరిపాలనను స్వయంగా లేదా, ఇతర అధికారుల సహకారంతో నిర్వహిస్తారు.

 

ఆర్టికల్ 54
* రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.

 

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు
* లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు - 543
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు - 233
* దేశంలోని 31 విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ఏలు - 4,120
* 70వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎంఎల్ఏలను ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా చేర్చారు. ఈ చట్టం 1995, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా ఓటును వినియోగించుకున్నారు.

 

ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
* లోక్‌సభకు నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్లు - 2
* రాజ్యసభకు నామినేట్ అయిన విశిష్ట వ్యక్తులు - 12
* రాష్ట్రాల విధానసభలకు నామినేట్ అయ్యే ఆంగ్లో ఇండియన్లు - 31
* రాష్ట్రాల విధాన పరిషత్‌లకు ఎన్నికైన ఎంఎల్‌సీలు - 7
* రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష విధానంలో నిర్వహిస్తుంది.

 

ఆర్టికల్ 55
* రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది.
* రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
* భారత రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీన్నే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక అని కూడా అంటారు. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు.
* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కొన్ని సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను
నిర్వహించవచ్చు.

* రాష్ట్ర శాసనసభ రద్దవడం, పార్లమెంటులో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణాలతో రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.
*1967లో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఆర్టికల్ 356(1)(C) ప్రకారం రాజస్థాన్ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికీ, ఆ శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వినియోగించుకున్నారు
* 1974లో గుజరాత్ శాసనసభ రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహాను కోరినప్పుడు ఎన్నికను నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది.
* రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
* 1950లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్ వ్యవహరించారు.
* 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.డి.టి.ఆచారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ వి.కె.అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 1971 జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రపతి ఎన్నికలో ఎంఎల్ఏ, ఎంపీల ఓటు విలువను లెక్కిస్తున్నారు.
* ఎక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
   ఉత్తర్‌ప్రదేశ్ = 208, తమిళనాడు = 176, మహారాష్ట్ర = 175
* తక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
    సిక్కిం = 7, అరుణాచల్‌ప్రదేశ్ = 8, మిజోరం = 8, నాగాలాండ్ = 9
*  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్ఏ ఓటు విలువ = 148
*  విభజనానంతరం ఏపీలో ఎంఎల్ఏ ఓటు విలువ = 158
* తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ఏ ఓటు విలువ = 133
*  మన దేశంలో అన్ని రాష్ట్రాల మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474

 

రాష్ట్రాలవారీగా ఓట్లు, ప్రతి రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ

ఓటు బదలాయింపు పద్ధతి:
* ఓటు బదలాయింపు పద్ధతిని తొలిసారిగా ప్రస్తావించినవారు థామస్ హేర్. అందుకే దీన్ని హేర్ పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిని డెన్మార్క్‌లో ఆండ్రే అనే వ్యక్తి మొదటిసారి అమలు పరచడం వల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ఓటు బదలాయింపు పద్ధతిని ప్రతిపాదించారు.

 


* 2012లో జరిగిన 13వ రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓటు విలువ = 708

* మన దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓట్ల విలువ, మొత్తం ఎంపీల ఓట్ల విలువకు సమానంగా ఉండటం సమాఖ్య విధానాన్ని ప్రతిఫలిస్తోంది.
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల సంఖ్య = 4,120
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474
దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య = 776
* దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల ఓటు విలువ = 5,49,408
* 50 శాతం మించి ఓట్లను అంటే కోటా ఓట్లను ఏ అభ్యర్థీ పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యతా ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
* 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం ద్వారా గెలిచిన వ్యక్తి వి.వి.గిరి. ఈ ఎన్నికలో సి.డి.దేశ్‌ముఖ్ రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం వల్ల వి.వి.గిరి గెలిచారు.
* రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించినవారు హెచ్.వి.కామత్, కె.టి.షా.
* ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని పేర్కొన్నవారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ.
* మన దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించినవారు కె.టి.షా.


రాష్ట్రపతి ఎన్నిక - వివాదాలు - పరిష్కారం
ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది.
* రాష్ట్రపతి ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ ఎలక్టోరల్ కాలేజీలోని కనీసం 25 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేయాలి.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కింద పేర్కొన్న మార్పులను రాష్ట్రపతి ఎన్నిక విధానంలో వచ్చే వివాదాల్లో చేర్చారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయనే కారణంపై ఎన్నికను వాయిదా వేయమని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు.
* పార్లమెంటు ఒక చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగ పరిధికి లోబడి నిర్ణయించవచ్చు.
* సస్పెండ్ అయిన ఎంఎల్ఏ, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనవచ్చు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే, వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి.
* రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు, ఎంఎల్ఏలకు నిర్దేశించిన విధంగా ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. దీనికి కారణం ఈ ఎన్నికలు శాసనసభ బయట జరుగుతాయి. విప్ శాసనసభలో జరిగే తీర్మానాలకు, బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆర్టికల్ 56: రాష్ట్రపతి పదవీ కాలం
* సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ కింది సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చు.
A. మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు
B. దీర్ఘకాలిక అస్వస్థతకు గురైనప్పుడు
C. అకాల మరణం చెందినప్పుడు
D. రాజీనామా చేసినప్పుడు
* భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.
* 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి.


ఇంటరెగ్నం:
* రాష్ట్రపతి పదవీ కాలం ముగిసినప్పటికీ, నూతన రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై, ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తికానప్పుడు అంటే నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఇంటరెగ్నం అంటారు.
ఆర్టికల్ 57: రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నిక కావడం
* భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. మన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు.
ఆర్టికల్ 58: అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* లోక్‌సభకు ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలుండాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* దివాలా తీసి ఉండకూడదు.
* ఎంపీ లేదా ఎంఎల్ఏగా ఉన్న అభ్యర్థి ఆ పదవులకు రాజీనామా చేయకుండానే రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే ఎంపీ లేదా ఎంఎల్ఏ పదవి రద్దవుతుంది. ఓడిపోతే సంబంధిత పదవి కొనసాగుతుంది.
* 1952 నాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.


షరతులు:
*  రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది సభ్యులు బలపరచాలి.
* అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.15,000 ధరావత్తుగా రిజర్వ్ బ్యాంకులో చెల్లించాలి.
*  పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు లభిస్తే డిపాజిట్ (ధరావత్తు) లభిస్తుంది.


ఆర్టికల్ 59: జీతభత్యాలు
* రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్‌లో జీతభత్యాలను పొందుపరిచారు.
* రాష్ట్రపతి వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఐటీ పరిధిలోకి రాదు.
* రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ ప్రవేశపెట్టరాదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూడా రాష్ట్రపతి జీతంలో కోత విధించరాదు.
* ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ.1,50,000.
* పదవీ విరమణ అనంతరం సంవత్సరానికి రూ.9,00,000 పెన్షన్ లభిస్తుంది.
* రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. ఈ భవన రూపకర్తలు ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ ఇక్కడే ఉంది.
* 1921 - 26 మధ్య రాష్ట్రపతి భవన్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలోకి అధికారికంగా మొదట అడుగు పెట్టిన వ్యక్తి లార్డ్ ఇర్విన్.
* రాష్ట్రపతి భవన్‌ను 320 ఎకరాల్లో 340 గదులతో నిర్మించారు. దీన్ని ప్రారంభంలో Vice Regal అని పిలిచేవారు. సామాన్య ప్రజలు దీన్ని లాట్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రైజీనా హిల్స్ (Raisina Hills) అంటారు.
* రాష్ట్రపతికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి.
* విదేశీ పర్యటనల కోసం ఎయిరిండియా వన్ అనే అధికారిక విమానం ఉంది.
* దేశంలో, విదేశాల్లోనూ పర్యటించేటప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు.
* ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి తన పదవీ కాలంలో చేపట్టిన చర్యలకు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
* రాష్ట్రపతిపై క్రిమినల్ కేసు నమోదు చేయకూడదు. సివిల్ కేసు వేయాలన్నా 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి.


ఆర్టికల్ 60: ప్రమాణ స్వీకారం
* రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి లేకపోతే తదుపరి సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తారు.
* రాష్ట్రపతి తన ప్రమాణాన్ని దేవుడి పేరుతో లేదా ఆత్మసాక్షిగా చేస్తారు. రాజ్యాంగ శాసనాన్ని పరిరక్షించి, సంపూర్ణ సామర్థ్యం మేరకు భారత ప్రజల సేవకు, వారి సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు కూడా పైన పేర్కొన్న విధంగానే పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి.


రాష్ట్రపతి రాజీనామా:
* రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు కూడా తెలియజేయాలి. ఇలాంటి పరిస్థితి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ రాజీనామా చేయడంతో ఏర్పడింది.


ఆర్టికల్ 61: మహాభియోగ తీర్మానం
*  రాష్ట్రపతిని రాజ్యాంగ అతిక్రమణ అనే కారణంతో ఆర్టికల్ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు.
*  రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి గ్రహించారు.
*  మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
*  ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే మహాభియోగ ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.
*  తర్వాత మహాభియోగ తీర్మానం రెండో సభకు చేరుతుంది. రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుంచి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.
*  తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ సభ తిరస్కరిస్తే, ఆ తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు.
*  మహాభియోగ తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి, మరొక సభ తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది.
*  రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
*  1971లో వి.వి.గిరిపై తొలిసారిగా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి తర్వాత విరమించుకున్నారు.

ఆర్టికల్ 62
* రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి.


మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
   పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
* బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
* మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
* ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
* తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
* హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
* రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.


2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
  పదవీకాలం:  1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
* అమెరికా ప్రభుత్వం ప్రసాదించే 'టెంపుల్‌టన్' అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* 8 దేశాల్లో 'విజిటింగ్ ప్రొఫెసర్‌'గా పనిచేశారు.
* ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'ప్రజా దర్బార్‌'ను ఏర్పాటు చేశారు.
*" Hindu View Of Life", "All Idealist View Of Life"అనే గ్రంథాలను రచించారు.
* దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.


3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
  పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
* జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
* మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
* పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
* జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో
(1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
* దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


4. వి.వి. గిరి (1884 - 1980)
  పదవీకాలం:  1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
* వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
* నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
* అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
* రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
* తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
* కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
* బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
* 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
* ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి


5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
  పదవీకాలం:  1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
* ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
* టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
* ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని 'రబ్బర్‌స్టాంప్‌'గా విమర్శకులు పేర్కొన్నారు.
* ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


6. నీలం సంజీవ రెడ్డి (1913 - 1996)
  పదవీకాలం:  1977, జులై 25 నుంచి 1982, జులై 25
* నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
* 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
* లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.


7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 - 1994)
  పదవీకాలం:  1982, జులై 25 నుంచి 1987, జులై 25
* ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై "Pocket Veto"ను వినియోగించారు.
* వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
* 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
* 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non - Aligned Movements) సదస్సు జరిగింది.


8. ఆర్. వెంకట్రామన్: (1910 - 2009)
 పదవీకాలం:  1987, జులై 25 నుంచి 1992, జులై 25
* ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
* అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
* కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
* ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
* పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
* 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
* మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
* 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.


9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 - 1999)
 పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
* ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
* విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
* దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
* 'రాజనీతిజ్ఞ రాష్ట్రపతి'గా పేరుపొందారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.


10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)
   పదవీకాలం:  1997 జులై 25 నుంచి 2002, జులై 25
* ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
* ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
* గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి  కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

 

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 - 2015)
  పదవీకాలం:  2002 జులై 25 నుంచి 2007 జులై 25
* ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
* ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
* భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
* భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
* వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
* 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
* డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
* కలాం జన్మదినమైన అక్టోబరు 15న 'స్టూడెంట్స్ డే'గా నిర్వహిస్తున్నారు.
* PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
* కలాం 2015, జులై 27న మరణించారు.


2. ప్రతిభాపాటిల్ (1934)
  పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
* ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
* భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి మహిళా రాష్ట్రపతి.
* రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* సుఖోయ్ యుద్ధ విమానం, టీ - 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
* గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
* ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
* బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
* విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.


13. ప్రణబ్ ముఖర్జీ (1935)
   పదవీకాలం:  2012 జులై 25 నుంచి - ప్రస్తుతం
* ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా 'మిరాటి' గ్రామంలో జన్మించారు.
* పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1982 - 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
* 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
* 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
* 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
* 2011లో 'బెస్ట్ అడ్మినిస్ట్రేటర్' అవార్డును అందుకున్నారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
* 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
* ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 - 2012 మధ్య
వ్యవహరించారు.
* ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
* 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
* లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు:
* The Dramatic Decade
* Midterm
* Off the Track
* కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.


రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు
1. సుమిత్రాదేవి (1962)
2. మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
3. లక్ష్మీ సెహగల్ (2002)
4. ప్రతిభా పాటిల్ (2007)


తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు
1. వి.వి. గిరి
2. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3. బి.డి. జెట్టి


ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు
1. బాబూ రాజేంద్ర ప్రసాద్
2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
3. నీలం సంజీవరెడ్డి
4. జ్ఞానీ జైల్‌సింగ్
5. అబ్దుల్ కలాం
6. ప్రతిభా పాటిల్
7. ప్రణబ్ ముఖర్జీ


ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు
1. జి.ఎస్ పాఠక్
2. బి.డి. జెట్టి
3. జస్టిస్ హిదయతుల్లా
4. కె. కృష్ణకాంత్
5. భైరాన్‌సింగ్ షెకావత్


ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు
1. సర్వేపల్లి రాధకృష్ణన్
2. జాకీర్ హుస్సేన్
3. వి.వి. గిరి
4. ఆర్. వెంకట్రామన్
5. శంకర్ దయాళ్‌శర్మ
6. కె.ఆర్. నారాయణన్


భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు
1. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
2. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
4. వి.వి. గిరి (1975)
5. ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌