• facebook
  • whatsapp
  • telegram

ఉపరాష్ట్రపతి

   ప్రారంభ ముసాయిదా రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావించలేదు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన హెచ్.వి. కామత్ పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుంచి 70 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ఉపరాష్ట్రపతి పదవిని గురించి వివరించారు.
* ఆర్టికల్, 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.


ఉపరాష్ట్రపతి అర్హతలు - షరతులు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండరాదు.
* 15 వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది సభ్యులు అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, మరో 20 మంది సభ్యులు బలపరచాలి.
* పోలై చెల్లుబాటయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొంది ఉండాలి.


ఎన్నిక పద్ధతి
* 1962 వరకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్‌ను నిర్వహించడం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు.
* 11వ రాజ్యాంగ సవరణ చట్టం (1962) ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను పార్లమెంటు ఉభయసభల సభ్యుల ద్వారా ఏర్పడిన 'ఎలక్టోరల్ కాలేజీ' ద్వారా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాల శాసన సభ్యులకు అవకాశం లేదు. ఆర్టికల్, 66లో ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పొందుపరిచారు.


పదవీ కాలం
* ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. కానీ ఈ పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని మన తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. దీన్నే అనుసరిస్తున్నారు.
* ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.


తొలగింపు
  అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలతో ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఆర్టికల్, 67(B) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కనీసం 1/4వ వంతు సభ్యుల సంతకాలతో కూడిన తొలగింపు తీర్మాన నోటీసును 14 రోజుల ముందు సభాధిపతికి అందించాలి.
* తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు హాజరుకావచ్చు. కానీ అధ్యక్షత వహించరాదు.
* ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతిని తొలగించలేదు.


జీతభత్యాలు
* ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఆర్టికల్, 97 ప్రకారం రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మాత్రమే ఉపరాష్ట్రపతి నెలకు రూ.1,25,000 వేతనం పొందుతారు.
* ఈ వేతనానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
* వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి వేతనంపై పార్లమెంటులో ఓటింగ్‌కు అవకాశం లేదు.


ఉపరాష్ట్రపతి అధికారాలు - విధులు
   ఆర్టికల్, 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.
* ఆర్టికల్, 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక పదవీ బాధ్యతలను నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో రాష్ట్రపతి పొందే జీతభత్యాలను పొందుతారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు.
* 'భారతరత్న' లాంటి అత్యున్నత పౌరపురస్కారాల ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తారు.
* 'ఉపరాష్ట్రపతి తన మేథోసంపత్తి, వ్యక్తిగతమైన నైతిక విలువలు, హుందాతనంతో వ్యవహరించడం వల్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రులు అనేక విషయాల్లో ఉపరాష్ట్రపతిని సంప్రదించేలా చేయుచున్నారు' - నార్మన్.డి. పామర్
* భారత ఉపరాష్ట్రపతి పదవిని 'వేల్స్ యువరాజు'తో పోల్చవచ్చు - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'భారత రాజ్యాంగం రాష్ట్రపతి పదవికి ఇచ్చినంత గొప్ప గౌరవం ఉపరాష్ట్రపతి పదవికి ఇవ్వక పోయినప్పటికీ ఆ పదవి ఉపయోగకరమైంది, ప్రతిష్ఠాత్మకమైంది' - ఎమ్.వి. పైలీ


కీలకాంశాలు
* మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* మన దేశానికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.
* రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినవారు.
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. హమీద్ అన్సారీ
* తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్.
* పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కె. కృష్ణకాంత్.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారు భైరాన్‌సింగ్ షెకావత్.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* జ్ఞానీ జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు 1982, అక్టోబరు 6 నుంచి 31 వరకు 25 రోజులపాటు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన వారు హిదయతుల్లా.
* అత్యధిక మెజార్టీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ (700 ఓట్లు).
* కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన తాత్కాలిక రాష్ట్రపతి - బి.డి. జెట్టి.
* బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* పదవికి రాజీనామా చేసిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* పదవికి రాజీనామా చేసిన రెండో ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్.
*  ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీరీత్యా 14వ వారు, వ్యక్తులరీత్యా 12వ వారు.
* ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంగా ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి సమర్పించాలి. రాజీనామా పత్రాన్ని మాత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి మాత్రమే రాయాలి.


ముగింపు
  అమెరికా ఉపాధ్యక్ష పదవితో మన ఉపరాష్ట్రపతి పదవిని పోల్చవచ్చు. ఎందుకంటే ఇద్దరూ తమ దేశాల్లో ఎగువసభకు అధ్యక్షత వహిస్తారు. అయితే మనదేశంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు మించి ఉండటానికి వీల్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం తాత్కాలిక అధ్యక్షుడిగానే కాకుండా అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు మిగిలిన అధ్యక్ష పదవీకాలమంతా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌