• facebook
  • whatsapp
  • telegram

బంధుత్వం

అనుబంధాల బంధం!

  అన్నా అంటూ అనురాగం కురిపించినా, అత్తా అని ఆప్యాయంగా పలకరించినా, మామా అని మమతను వ్యక్తం చేసినా.. అన్నీ బంధుత్వాలే, అనుబంధాల రూపాలే. సమాజం మొత్తం మానవ సంబంధాల సమాహారం. ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాటి ఆచరణ విధానం ఏమిటి? తదితర వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  బంధుత్వం అనేది వివాహం లేదా ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం. ప్రపంచంలో ఉనికిలో ఉన్న సముదాయాలన్నింటిలో బంధుత్వం ఉంది. ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రకారం సమాజం అంటే బంధుత్వాల అల్లిక, మానవ సంబంధాల సాలెగూడు. కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం లాంటి వ్యవస్థలు ఉన్న ప్రతి సమాజంలో అక్కడి సమాజ నిర్మాణం, సామాజిక సంబంధాలకు బంధుత్వమే ప్రధాన కారణం. బంధుత్వం వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరిచి, వారిని క్రమపద్ధతిలో పేర్చి సమూహాన్ని ఏర్పరుస్తుంది.

 

నిర్వచనాలు

మర్డాక్‌: సంక్లిష్టమైన పరస్పర సంబంధం ఉన్న బంధువుల మధ్య ఉండే సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వం.

సెకల్సర్‌: జైవిక సంబంధాలు, వివాహం, దత్తత, సంరక్షణలకు సంబంధించిన చట్టపరమైన నియమాల లాంటి కారకాలపై ఆధారపడిన సామాజిక సంబంధాల గుచ్ఛమే బంధుత్వం.

హారి.ఎం.జాన్సన్‌: లైంగికత, తరాలు; వైవాహిక, జ్ఞాతి సంబంధాలు బంధుత్వానికి ఆధారాలు.

* బంధుత్వం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు హెన్రీ మెయిన్‌. ఈయన 1861లో ఏన్షియంట్‌ లా (Ancient Law) అనే పుస్తకాన్ని రచించారు.

* బంధుత్వం ప్రాముఖ్యతను విశ్లేషించినవారు మెక్‌లెనన్‌. ఈయన 1865లో ప్రిమిటివ్‌ మ్యారేజ్‌ (Primitive Marriage) అనే పుస్తకాన్ని రచించారు.

 

బంధుత్వం - రకాలు

 

వైవాహిక బంధుత్వం: వివాహం ద్వారా ఏర్పడేది.

ఉదా: భార్యాభ‌ర్త‌లు

 

రక్త సంబంధ బంధుత్వం: ఒకే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడేది.

ఉదా: తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు

 

 

ఐరావతి కార్వే అనే మహిళా సామాజికవేత్త 1953లో నాలుగు సాంస్కృతిక మండలాలను తులనాత్మకంగా పరిశీలించారు. 

1) ఒక ప్రాంతంలో వివిధ ప్రాంతీయ నమూనాలు

2) క్రమానుగత శ్రేణి

3) కులాల మధ్య ఒంటరితనం

4) కులాల మధ్య వైవిధ్యం

 

 ఐరావతి కార్వే 3000 సంవత్సరాల చరిత్ర కాలాన్ని పరిశీలించి దేశంలో బంధుత్వం ఆవశ్యకత గురించి తెలియజేశారు.

* భారతీయ భాషలోని బంధుత్వ పదాలు

* భాషాపరమైన సందర్భం, ప్రవర్తన

* వంశానుక్రమం, వారసత్వ నియమాలు

* వివాహం, కుటుంబ నియమాలు

* ఉత్తర, ద్రవిడియన్‌ ప్రాంతాల మధ్య తేడాలు

 

బంధుత్వ స్థానం

బంధువులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

 

ప్రాథమిక బంధుత్వం: ప్రాథమిక సమూహంలోని వ్యక్తుల మధ్య ఉన్న బంధుత్వాన్ని ప్రాథమిక బంధుత్వం అంటారు. ఒక వ్యక్తి కనిష్ఠ కుటుంబంలోని వ్యక్తులు అతడికి ప్రాథమిక బంధువులు అవుతారు. ఏ వ్యక్తికి అయినా తన జీవిత భాగస్వామితోపాటు తల్లిదండ్రులు, పిల్లలు ప్రాథమిక బంధువులుగా ఉంటారు. అంటే వివాహం, రక్త సంబంధాల ద్వారా ఏర్పడే తొలి బంధువులను ప్రాథమిక బంధువులు అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఏడు రకాల ప్రాథమిక బంధువులు ఉంటారు.

 

ద్వితీయ/గౌణ బంధుత్వం: ఒక వ్యక్తి ప్రాథమిక బంధువుకి ఉన్న ప్రాథమిక బంధువులంతా ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు. ప్రతి వ్యక్తికి మొత్తం 33 రకాల ద్వితీయ బంధువులు ఉంటారు.

 

తృతీయ బంధుత్వం: ఒక వ్యక్తి ద్వితీయ బంధువుకి ఉన్న ప్రాథమిక బంధువులంతా ఆ వ్యక్తికి తృతీయ బంధువులవుతారు. ముత్తాతలు, మునిమనుమలు ఈ కోవలోకి వస్తారు. ప్రతి వ్యక్తికి ఇలాంటి 151 రకాల తృతీయ బంధువులు ఉంటారు.

 

 

1) సాధారణ ఏక వంశానుక్రమం

 ఏక వంశానుక్రమంలో తండ్రి వంశానుక్రమం నుంచి లేదా తల్లి వంశానుక్రమం నుంచి ఒక వ్యక్తి సభ్యత్వాన్ని నిర్ణయిస్తారు. 

పితృ వంశానుక్రమం: ప్రతి తరం సంతతి తమ తండ్రి, తండ్రి-తండ్రి వంశానికి చెందుతారు. అంటే ఇక్కడ పురుషుడు వంశకర్త. ఆ సమూహపు సభ్యత్వం మాత్రం పురుషుల ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది.

మాతృ వంశానుక్రమం: ప్రతి తరం సంతతి తమ తల్లి, తల్లి-తల్లి వంశానికి చెందుతారు. ఇక్కడ స్త్రీ వంశకర్తగా ఉంటారు. ఆ సమూహ సభ్యత్వం స్త్రీల ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది. వివాహం అయ్యేంత వరకు మాత్రమే పురుషులు తమ తల్లి వంశానికి చెందుతారు.

 

2) సంక్లిష్ట ఏక వంశానుక్రమం 

ద్వంద్వ వంశానుక్రమం: ఇందులో ఒక వ్యక్తి కొన్ని ప్రయోజనాల కోసం తల్లి వంశానుక్రమాన్ని, మరికొన్ని ప్రయోజనాలకు తండ్రి వంశానుక్రమాన్ని స్వీకరిస్తాడు. 

ఉదా: అషాంటి, యాకో, తోడా 

 

* ఏక వంశానుక్రమ సమూహాల్లోని రకాలు 

1) వంశం 2) గోత్రం 3) గోత్ర కూటమి 4) ద్విశాఖ

 

ఏక వంశానుక్రమం కాని సమూహాలు:

యాంబీలీనియల్‌: ఈ తరహా సమాజాల్లో కొంతమంది తల్లి నుంచి కూతురికి, మరికొంతమంది తండ్రి నుంచి కుమారుడికి వంశానుక్రమాన్ని అందిస్తారు. అంటే మాతృ, పితృ వంశానుక్రమాలు రెండింటినీ పాటిస్తారు. ఈ సమూహంలోని సభ్యులు తామంతా ఒకే వంశపూర్వీకుడి నుంచి వచ్చినట్లుగా భావిస్తారు. అయితే వంశవృక్షంలోని అన్ని శాఖలను గుర్తించరు.

ఉదా: దక్షిణ పసిఫిక్‌లోని సమోవన్లు 

 

* సమోవన్లలో ఏక వంశానుక్రమ సమూహాల్లోని గోత్రం - ఉపగోత్రం మాదిరి రెండు యాంబీలీనియల్‌ డీసెంట్‌ గ్రూప్‌లు ఉంటాయి. ఈ రెండు బహిర్‌ వివాహాన్ని పాటిస్తాయి.

 

ద్విపార్శ్వ బంధుత్వం (కిండ్రెడ్‌): అనేక సమాజాలు మాతృ వంశీయ, పితృ వంశీయ లేదా రెండింటిలో ఏదో ఒక పార్శ్వాన్నే బంధువర్గంగా గుర్తించరు. ఇందులో ఒక వ్యక్తి తన తల్లి వైపు, తండ్రి వైపు ఇద్దరి బంధువులను సమానంగానే గుర్తిస్తారు.

ఉదా: సగాడా ఇక్రత్‌ - ఫిలిప్పీన్స్, గిస్పర్డ్‌ ద్వీప వాసులు - పసిఫిక్‌

 

బంధుత్వ పరిభాష

బంధువు అనేది సరళమైన పదం అయినప్పటికీ బంధుత్వ ప్రాధాన్యం అతికీలకమైంది. బంధుత్వంలో పరిభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. బంధుత్వ పదాలు విలువలు, ఆచరణలు, సూచనలను కలిగి ఉంటాయి. 

 

మోర్గాన్‌ (1877) వర్గీకరణ

బంధుత్వ ప‌రిభాష‌ను మోర్గాన్  రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు.

 

1) వర్ణనాత్మక వ్యవస్థ: వివిధ సంబంధీకులందరినీ ఒకే వర్గంలో చేర్చడంతో పాటు వారిని ఒకే పదంతో సంబోధిస్తారు. 

ఉదా: ‘మామ’ ఒక వర్ణణాత్మక పదం

 

సంబోధన పదాలు: ఒక వ్యక్తి తన బంధువులతో సంభాషిస్తున్నప్పుడు వాడే పదాలు.

ఉదా: ఒక వ్యక్తి తన తండ్రితో సంభాషిస్తున్నప్పుడు నాన్న అని, తల్లితో సంభాషిస్తున్నప్పుడు అమ్మ అని పిలవడం. 

 

అన్వయ పదాలు: ఒక వ్యక్తి మూడో వ్యక్తితో తన బంధువుల్లో ఒకరి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే సంభాషణ.

ఉదా: ఒక వ్యక్తి తన సోదరుడి గురించి మరో వ్యక్తితో చెప్పినప్పుడు ‘నా పెద్దన్న’ అని పిలవడం.

 

టెక్నానమి: కొన్నిసార్లు కుటుంబంలోని ఒక బంధం గురించి మూడో వ్యక్తికి చెప్పినప్పుడు అతడి పేరు పెట్టి చెప్పకుండా ఒక ప్రత్యేకమైన బంధుత్వ పదాన్ని వాడటం.

ఉదా: ఒక మహిళ ఆమె భర్త గురించి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు అతడిని వారి పిల్లల తండ్రిగా పేర్కొంటుంది.

 

2) వివరణాత్మక వ్యవస్థ: ఇందులో ఒక సంబంధానికి ఒక పదాన్ని మాత్రమే సూచిస్తారు.

 

* ప్రాథమిక పదాలు: కుటుంబంలోని దగ్గరి బంధువులను పిలవడానికి ఉపయోగిస్తారు. 

ఉదా: తండ్రి, తల్లి

 

ఉత్పన్న పదాలు: వీటిలో ఒక ప్రాథమిక పదం మరొక ఉత్పన్న పదం కలిసి ఒక కొత్త పదం ఏర్పడుతుంది.

ఉదా: చిన్నమ్మ (చిన్న + అమ్మ)

 

వివరణాత్మక పదం: రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక పదాల కలయిక వల్ల ఏర్పడుతుంది. 

ఉదా: నాన్నమ్మ (నాన్న + అమ్మ), జేజమ్మ (అమ్మ + అమ్మ + అమ్మ)

 

బంధుత్వ ఆచరణలు

బంధు సమూహంలోని వ్యక్తుల మధ్య కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు కనిపిస్తాయి. వాటినే బంధుత్వ ఆచరణలు అంటారు. వాటిలో ముఖ్యమైనవి.  

 

1) పరిహాస సంబంధాలు: ఒకరిని ఒకరు పరిహసించుకోవడం, చిన్న చిన్న వస్తువులను నష్టపరచడం లాంటి చనువు తీసుకుంటారు. ఇవి రెండు రకాలు.

సౌష్ఠవ పరిహాసం: ఇందులో ఒకరు పరిహాసం చేస్తే మరొకరికి అదేస్థాయిలో పరిహాసం చేసే హక్కు ఉంటుంది. ఉదా: బావమరదళ్లు 

అసౌష్ఠవ పరిహాసం: ఒక బంధువు రెండో బంధువును పరిహసించవచ్చు కానీ వారు తిరిగి మొదటి బంధువును పరిహసించకూడదు. 

ఉదా: తాత - మనుమరాలు

 

2) వైదొలుగు నడవడి: ఇంటి కోడలు, అత్తమామల నుంచి తప్పించుకొని తిరగడం, ముఖాముఖిగా మాట్లాడకపోవడం, ఎక్కువ పరిచయం పెట్టుకోకపోవడం లాంటివి.

సిగ్మండ్‌ ఫ్రాయిడ్, జేమ్స్‌ ఫ్రేజర్‌ అనే సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం ఆగమ్యగమన సంబంధాలు ఏర్పడకుండా ఉండటానికి ఈ పద్ధతిని ఆచరించారు.

 

3) మాతులాధికారం: ఒక వ్యక్తి జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనమామ ముఖ్యం అనే ఆచారం ఉంటుంది. మేనమామ అన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. మాతుల స్థానీయ నివాసం, మేనమామ నుంచి ఆస్తి పొందడం లాంటివన్నీ మాతులాధికారంగా పేర్కొంటారు.

 

4) కుహనా ప్రసూతి: భార్య ప్రసూతి సమయంలో భర్త ఆమె ప్రసవ వేదనను నటిస్తాడు. ఇది తోడా, ఖాసీ తెగల్లో ఇలాంటి ఆచారం ఉంటుందని మలినోస్కి తెలిపారు. 

 

5) పితృస్వాధికారం: ఒక వ్యక్తి జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనత్త ముఖ్యం. పితృస్థానీయ నివాసం, మేనత్త నుంచి ఆస్తి పొందడం లాంటి ఆచారాలు పితృస్వాధికారంలో ఉంటాయి.

 

బంధుత్వ సమూహాల

ఒక ఇంట్లో లేదా ఒక కుటుంబంలో కలిసి ఉండే సమూహాలను బంధుత్వ సమూహాలుగా పేర్కొంటారు.

 

1) వంశం: ఒకే రక్త సంబంధం కలిగిన కుటుంబాల కలయిక. వివాహం సొంత వంశంలోని వారితో జరగదు.

మాతృ వంశం: దీనిలో స్త్రీ వంశకర్తగా ఉంటుంది. ఉదా: నాయర్‌ (కేరళ), శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలు

పితృ వంశం: వంశకర్తగా పురుషుడు ఉంటాడు. ఉదా: అన్ని దేశాలు

తరవంశం: ఒక్కో తరానికి చెందినవారు ఒక్కొక్కరిని వంశకర్తగా భావిస్తారు. 

 

2) గోత్రం: ఏక వంశానుక్రమ సమూహాన్నే గోత్రం అంటారు. గోత్రం అంటే ఏకరక్త సంబంధం ఉన్న వంశాలు. ఇది  ఊహాజనిత వంశక్రమం. ప్రతి గోత్రానికి ఒక చిహ్నం ఉంటుంది.

ఉదా: వైశ్యుల గోత్రాలు - పెండ్లికుల, పడిగశిల, బుధనకుల; శూద్రుల గోత్రాలు - జంతువుల పేర్లు, చెట్ల పేర్లు (గోండులు - నాగుపాము)

 

3) గోత్ర కూటమి: రెండు లేదా అంతకంటే ఎక్కువ గోత్రాలు కలిసి ఏర్పడేది. 

ఉదా: రాజ్‌గోండ్స్, గోండ్స్‌

 

4) ద్విశాఖ: తండ్రి నుంచి ఒక శాఖను, తల్లి నుంచి ఒక శాఖను స్వీకరిస్తే అది ద్విశాఖ అవుతుంది. ఉదా: నీలగిరి (తోడా) - తైవాళియర్, తర్తారియర్‌ 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  బంధుత్వం - అనుబంధం

‣  గిరిజన సమూహాలు

భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

Posted Date : 29-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌