• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాహిత్య చరిత్ర

పోరాటాల గడ్డలో సాహితీ వికాసం!

 ఆధునిక కాలంలో పోరాటాల గడ్డగా ప్రసిద్ధికెక్కిన తెలంగాణ ప్రాచీన, మధ్యయుగాల్లో సాహితీ వనంగా, కవుల నిలయంగా వెలిగింది. గుణాఢ్యుడు, హాలుడు వంటి ప్రాచీన కవులు మొదలు పాల్కురికి సోమనాధుడు, బమ్మెర పోతన వంటి మధ్యయుగ మహనీయుల వరకు అసమాన అక్షర సేద్యం సాగింది. గొప్ప సంస్కృత, తెలుగు కావ్యాలెన్నో వెలువడ్డాయి. అద్భుతమైన సాహిత్య ప్రకియలెన్నో ఆవిర్భవించాయి. రచనాశైలిలో విభిన్న ప్రయోగాలు జరిగాయి. ప్రముఖ సంస్కృత కావ్యాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.  తెలంగాణ కీర్తిని చరిత్రతో చిరస్థాయి చేశాయి. తెలుగు భాషా వికాసానికి బాటలు వేశాయి. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా తెలుగు భాషాభివృద్ధికి ఇక్కడి కవుల కృషిని పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి ప్రధాన కవులు, వారి రచనలు, విశేషాలను గుర్తుంచుకోవాలి.


(ప్రాచీన, మధ్యయుగాలు)


తెలంగాణ ప్రాంతం అనాదిగా కవులకు నిలయం. చాలామంది రాజులు తమ ఆస్థానాల్లో అనేకమంది కవులను పోషించి భాషాభివృద్ధికి కృషిచేశారు. ఈ గడ్డపై ప్రధానంగా తెలుగు, సంస్కృత భాషల వికాసం జరిగింది. .


  ప్రాచీనయుగ కవులు


శాతవాహనుల కాలం నాటి కవుల్లో గుణాఢ్యుడు అగ్రగణ్యుడు. ఈయన మొదటి తెలంగాణ లిఖిత కవి. ఉమ్మడి మెదక్‌ జిల్లా కొండాపుర్‌లో ఉండి బృహత్కథ అనే గ్రంథాన్ని పైశాచీ భాషలో రచించారు. ఈ గ్రంథం ఆధారంగా క్షేమేంద్రుడు ‘బృహత్కథా మంజరి’, సోమదేవసూరి ‘కథాసరిత్సాగరం’ అనే గ్రంథాలు రాశాడు. మరో కవి హాలుడు ‘గాథాసప్తశతి’ గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఇందులో హాలుడు 350 మంది తెలంగాణ కవుల గురించి పేర్కొన్నాడు. ఉత్తర తెలంగాణను పాలించిన వాకాటకుల కాలంలో అనేక మంది కవులుండేవారు. వీరిలో కాళిదాసు అనే కవి మొదట వాకాటక రాజ్యంలో నివసించేవాడు. ఈయన ‘మేఘసందేశం’ అనే నాటకాన్ని వాకాటక రాజ్యంలోని రాంటెక్‌ (కరీంనగర్‌ జిల్లా రామగిరి)లో ఉండి రచించారు. వాకాటక రాజైన రెండో ప్రవరసేనుడు ‘సేతుబంధం’ అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. సేతుబంధం శ్రీరాముడు లంకా నగరంపై చేసిన దాడిని ఇతివృత్తంగా చేసుకుని వెలువడిన గ్రంథం. 


విష్ణుకుండినుల కాలంలో మాధవవర్మ పాలనా కాలంలో గుణస్వామి జనాశ్రయ చందోవిచ్ఛిత్తి రచించారు. బాదామి చాళుక్యుల కాలంలో భవభూతి ప్రఖ్యాత తెలంగాణ కవి. ఈయన మాలతీ మాధవం (సంస్కృతం), ఉత్తర రామచరిత (నాటకం), మహావీర చరిత్ర (నాటకం) అనే రచనలు చేశారు. రాష్ట్రకూటుల కాలంలో అమోఘవర్షుడు ‘కవిరాజ మార్గం’ (కన్నడంలో), రత్నమాలిక, చందోవిచ్ఛిత్తి అనే గ్రంథాలను రచించాడు. ముదిగొండ చాళుక్యుల కాలంలో మూడో కుసుమాయుధుడు కొరివి శాసనం రచించాడు. ఇది తొలి తెలుగు గద్య శాసనం. ఈయనకు వినేత జనాశ్రయుడు అనే బిరుదు ఉంది. వేములవాడ చాళుక్యుల కాలంలో పంప కవి విక్రమార్జున విజయం, ఆదిపురాణం, జినేంద్రపురాణం (తెలుగు) గ్రంథాలు రాశాడు. సోమదేవ సూరి కథాసరిత్సాగరం, యశస్తిలక చంపువు (సంస్కృత కథా కావ్యం) అనే గ్రంథాలను రచించాడు. ఈయనకు ‘శద్వాదచల సింహ’ అనే బిరుదు ఉంది. బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’, ‘దశదిశాభరణాంక’ అనే పద్య రచన చేశాడు. ఇతడికి ‘కమలాసన’ అనే బిరుదుండేది. మరోకవి రేచన కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని లిఖించాడు. కల్యాణి చాళుక్యుల కాలంలో సంస్కృతం స్థానంలో దేశభాషలు క్రమంగా రాజాదరణ పొందాయి. కందూరి చోడుల కాలంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది. వీరి శాసనాలు తెలుగు, కన్నడ లిపుల్లో ఉన్నాయి. ఒకటో గోకర్ణుడు గోకర్ణ చంధస్సు అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. ఉదయాదిత్యుడు ‘ఉదయాదిత్యలంకారం’ అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. విరియాల కామసాని గూడూరు శాసనాన్ని రచించింది. ఇది తెలుగు భాషలో ఆదికవి నన్నయ్యకు ముందే వృత్త పద్యాలు రాసిఉన్న తొలి శాసనం.

మధ్యయుగ కాలం నాటికి తెలుగుకు ప్రాధాన్యం పెరిగింది. కాకతీయుల కాలంలో సంస్కృత సాహిత్యానికి కూడా విశేష ఆదరణ లభించింది. కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు ‘నీతిసారం’ రచించాడు. వినుకొండ వల్లభామాత్యుడు ‘క్రీడాభిరామం’ అనే వీధి నాటకాన్ని రచించాడు. ఈ నాటకం హనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని వివరిస్తుంది. పాలకుర్తి గ్రామానికి చెందిన పాల్కురికి సోమనాథుడు శైవ కవి. శివ కవిత్రయంలో ఒకరు. ఈయన స్వతంత్ర ఇతివృత్తాన్ని తీసుకుని పూర్తిగా దేశీయమైన భాషను ఉపయోగించి ‘బసవపురాణం’ (తొలి దేశీ ద్విపద), ‘పండితారాధ్య చరిత్ర’, ‘వృషాధిప శతకం’, ‘చతుర్వేదసారం’ తదితర గ్రంథాలు రచించాడు. ఈ గ్రంథాల్లో నాటి తెలంగాణ సాంఘిక జీవనాన్ని, శూద్రులకు సంబంధించిన ఆచార సంప్రదాయాలను, దళితుల స్థితిగతులను వివరించాడు. పోతన జనగాం తాలూకా బమ్మెర గ్రామానికి చెందినవాడు, తెలంగాణలో ముఖ్య కవి. ఈయన ‘తొలి విప్లవకవి’. దేశీపదాలను, సంస్కృత పదాలను సమానంగా ప్రయోగించి రెండు భాషల్లో సమాన పాండిత్యం ప్రదర్శించిన సహజ పండితుడు. ఈయన ‘వీరభద్ర విజయం’, నారాయణ శతకం, భాగవతం తదితర గ్రంథాలు రచించాడు. గోన బుద్ధారెడ్డి (1210-1240) తెలుగులో తొలి రామాయణమైన రంగనాథ రామాయణాన్ని ద్విపద కావ్యంగా రచించాడు. ఈయన కుమార్తె కుప్పాంబిక తొలి తెలుగు తెలంగాణ కవియిత్రిగా ఖ్యాతి గాంచింది. ఈయన కుమారుడైన గోన గన్నారెడ్డి, తన తండ్రి కోసం బుద్ధేశ్వరాలయం నిర్మించాడు. ఈశ్వర భట్టోపాధ్యాయుడు (1262) బూదపుర శాసనం వేయించాడు. ఈ శాసనంలో చిత్ర కవిత కనిపిస్తుంది. చక్రపాణి రంగనాథుడు అనే కవి ‘శివభక్తి దీపిక’, ‘చంద్రాభరణ శతకం’, ‘శ్రీగిరినాథ విక్రయం’, ‘గిరిజాది నాయక శతకం’ తదితర గ్రంథాలు రచించాడు. కపర్ది అనే కవి ‘శ్రేత కల్పకావృత్తి’, ‘భరద్వాజ గృహ్యసూత్ర భాష్యం’, ‘దివ్యపూర్ణ భాష్యం’, ‘అపస్తంబ శ్రేత సూత్ర భాష్యం’ తదితర గ్రంథాలు రచించాడు. గంగాధర కవి ‘మహాభారతం’ను నాటక రూపంలో రచించాడు. జాయపసేనాని సంస్కృత భాషలో గొప్ప కవి. ఈయన ‘నృత్తరత్నావళి’, ‘గీతరత్నావళి’, ‘వాద్య రత్నావళి’ తదితర సంస్కృత గ్రంథాలు రచించాడు. క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన మడికి సింగన అనే కవి తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని రాశాడు. ఈయన ‘సకల నీతి సమ్మతము’, ‘పద్మ పురాణోత్తర ఖండం’, ‘జ్ఞాన వాసిష్ట రామాయణం’, ‘భాగవత దశమ స్కంథము (ద్విపద కావ్యం) లాంటి గ్రంథాలు రచించాడు.


వేములవాడ భీమకవి స్వస్థలం వేములవాడ. ఈయన ‘కవిజనాశ్రయం’, ‘రాఘవ పాండవీయం’, ‘నృసింహ పురాణం’ మొదలైన గ్రంథాలు రచించాడు. క్రీ.శ. 14వ శతాబ్దానికి చెందిన మల్లినాథుడు ‘కొలిచెలమ’ (మెదక్‌ జిల్లా) గ్రామానికి చెందినవాడు. ఈయన సంస్కృత గ్రంథాలపై వ్యాఖ్యానాలు రచించాడు. శ్రీ హర్షుడి నైషేధంపై జివాతు రచించాడు. రఘు వంశంపై సంజీవని అనే వ్యాఖ్యానం కూడా రాశాడు.  కిరాతార్జునీయంపై ఘంటాపథం అనే వ్యాఖ్యానం రచించాడు. 15వ శతాబ్దానికి చెందిన ఎలకూచి బాలసరస్వతి అనే కవి ‘వామన పురాణం’, ‘చంద్రికా పరిణయం’, ‘రంగ కౌముది’ (నాటకం), ‘బాహాటం’, ‘కార్తికేయాభ్యుదయం’ లాంటి గ్రంథాలు రాశాడు. భర్తృహరి రచించిన సుభాషిత శతకాన్ని తెలుగులో ‘మల్లభూపాలియం’ పేరుతో అనువదించాడు.  అగస్త్యుడు (1289-1323) ‘బాల భారతం’, ‘నలకీర్తి కౌముది’ (పద్య కావ్యం), ‘కృష్ణ చరిత్ర’ (గద్య కావ్యం), ‘లలిత సహస్రనామం’, ‘శివ సంహిత’, ‘మణి పరీక్ష లక్ష్మీ స్తోత్రము’, ‘శివస్తవము’ మొదలైన గ్రంథాలు రచించాడు. 15వ శతాబ్దానికి చెందిన చరిగొండ ధర్మన్న అనే కవి ‘చిత్ర భారతం’ (పెద్దన మంత్రికి అంకితం ఇచ్చాడు) రచించాడు. ఇతడు ‘శతఘంట సురత్రాణ’ అనే బిరుదు పొందాడు. పల్లె వెంకట సుబ్బారావు ఈ ‘చిత్రభారతం’ను 1920లో వచనంగా మలిచాడు. అవధాన శబ్దాన్ని తెలుగు కావ్యాల్లో మొదటిసారిగా ప్రయోగించింది చరిగొండ ధర్మన్న. మరో కవి అయిన కవివల్లభుడు ‘పదమంజరి’, గుణమంజరి, ‘బేతాల పంచవింశతి’, శూద్రక రాజ చరిత్రము’ తదితర గ్రంథాలు రచించాడు. విశ్వేశ్వరుడు వీరభద్ర విజృంభణ, చమత్కార చంద్రిక తదితర గ్రంథాలు రచించాడు. 17వ శతాబ్దానికి చెందిన కాకునూరు అప్పకవి ‘అంబికా వాదం’ (యక్షగానం), ‘సాధ్విజన ధర్మం’ (ద్విపద కావ్యం) ‘అప్పక వీయం’ (లక్షణ గ్రంథం), అనంత వ్రతకల్పం (కావ్యం); రెండో సింగమనాయకుడు ‘సంగీత సుధాకరం’ (సారంగ దేవుడి సంగీత రత్నాకరం అనే గ్రంథానికి వ్యాఖ్య), రసార్ణవ సుధాకరం (అలంకారశాస్త్ర గ్రంథం), ‘కందర్ప సంభవం, రత్న పాంచాలిక (కువలయావళి అనే సంస్కృత నాటకం) తదితర గ్రంథాలు రచించాడు. కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక గ్రంథాన్ని రచించాడు. దీనికి మూలం ‘విక్రమార్క చరిత్ర’ అనే సంస్కృత కావ్యం. గౌరన కవి ‘నవనాథ చరిత్ర’, ‘హరిశ్చంద్రోపాఖ్యానం’, ‘లక్షణ దీపిక’ తదితర గ్రంథాలు రచించాడు. ఈయనకు ‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాద మదగజ పంచాననుడు’ అనే బిరుదులుండేవి. కృష్ణమాచార్యుడు ‘సింహగిరి వచనాలు’, ‘నరహరి వచనాలు’ రాశాడు. బ్రహ్మ శివకవి ‘త్రైలోక్య చూడామణి’, ‘సమయ పరీక్ష’, ‘చత్తీస్‌ రత్నమాల’ లాంటి గ్రంథాలు రచించాడు.


మాదిరి ప్రశ్నలు


1. ‘సేతు బంధం’ గ్రంథ రచయిత ఎవరు?

ఎ) కాళిదాసు బి) హాలుడు సి) సోమదేవుడు డి) ప్రవరసేనుడు2. కిందివాటిలో భవభూతి రచన కానిది ఏది?

ఎ) మాలతీ మాధవం బి) ఆదిపురాణం సి) ఉత్తర రామచరిత్ర డి) మహావీర చరిత్ర3. ‘కవిరాజ మార్గం’ గ్రంథ రచయిత ఎవరు?

ఎ) పంప బి) పొన్న సి) అమోఘ వర్షుడు డి) రన్న4. కిందివాటిలో తొలి తెలుగు గద్య శాసనం ఏది?

ఎ) హనుమకొండ శాసనం బి) బీదర్‌ శాసనం సి) బయ్యారం శాసనం డి) కొరివి శాసనం5. కిందివారిలో ఎవరికి ‘శద్వాదచల సింహ’ అనే బిరుదుండేది?

ఎ) సోమదేవ సూరి బి) మల్లియ రేచన సి) పంపకవి డి) భవభూతి6. ‘కవిజనాశ్రయం’ గ్రంథ రచయిత ఎవరు?

ఎ) ఉదయాదిత్యుడు బి) కాళిదాసు సి) మల్లియరేచన డి) అమోఘవర్షుడు7. ఏ పాలకుల కాలంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది?

ఎ) రాష్ట్ర కూటులు బి) పశ్చిమ చాళుక్యులు సి) కాకతీయులు డి) కందూరి చోడులు8. ఏ గ్రంథం హనుమకొండ ప్రజల సాంఘిక జీవనాన్ని తెలియజేస్తుంది?

ఎ) నీటిసారం బి) క్రీడాభిరామం సి) శివభక్తి దీపిక డి) కాకతీయ శతకం9. తెలంగాణ తొలి తెలుగు కవయిత్రి ఎవరు?

ఎ) గంగాదేవి బి) మధురవాణి సి) మాచల్దేవి డి) కుప్పాంబిక10. మల్లినాథుడు తెలంగాణలో ఏ గ్రామానికి చెందినవాడు?

ఎ) రాయగిరి బి) పాలకుర్తి సి) కొలిచెలమ డి) కొండాపుర్‌11. కమలాసన బిరుదు ఎవరిది?

ఎ) మల్లినాథుడు బి) సోమనాథుడు సి) భట్టోపాధ్యాయుడు డి) బద్దెన12. తొలిసారి వృత్త పద్యాలు వాడిన తెలుగు శాసనం ఏది?

ఎ) పాకాల శాసనం, బి) నాగార్జునకొండ శాసనం సి) గూడూరి శాసనం డి) కొరివి శాసనంసమాధానాలు: 1-డి, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ, 6-సి, 7-డి, 8-బి, 9-డి, 10-సి, 11-డి, 12-సి.

 


డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి


 

 

Posted Date : 24-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌