• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలన సంస్థలు

కరణాలు పోయి.. కార్యదర్శులు వచ్చి!

  భారత ప్రజాస్వామ్యాన్ని పునాదుల నుంచి బలోపేతం చేస్తున్నది స్థానిక స్వపరిపాలన వ్యవస్థే. ఇందులో మొదటి, కీలక అంచె అయిన గ్రామ పంచాయతీల పరిపాలనకు అమిత ప్రాధాన్యం ఉంది. బ్రిటిష్‌ హయాంలో కరణం, మునసబుల పేరిట పెత్తందారీ వ్యవస్థ అమలులో ఉండగా, స్వాతంత్య్రానంతరం మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ రూపొంది విజయవంతంగా కొనసాగుతోంది. కరణాల వ్యవస్థ పోయి, గ్రామ కార్యదర్శుల పాలన వచ్చింది. ఆధునిక కాలంలో స్థానిక పాలనా వ్యవస్థ పరిణామక్రమం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ స్థాయిల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థల నిర్మాణం, అధికారాలు, విధులు, పాలకవర్గం ఎన్నిక విధానాలను తెలుసుకోవాలి.

  

  స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా స్థానిక సమస్యలకు సత్వర పరిష్కార మార్గం లభిస్తుంది. ప్రజలకు స్థానిక పాలనలో భాగస్వామ్యం లభిస్తుంది.

 

వర్గీకరణ: స్థానిక స్వపరిపాలనా సంస్థలు రెండు రకాలు. 

1) గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు 

2) పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు.

 

గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు: ఇవి మూడు స్థాయుల్లో ఉంటాయి. 

1) గ్రామ పంచాయతీ 

2) మండల పరిషత్‌ 

3) జిల్లా పరిషత్‌

 

గ్రామ పంచాయతీ

 

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ స్థాయిలో ఉండే అత్యంత కీలక వ్యవస్థ గ్రామ పంచాయతీ. 

* 1802లో ఆంగ్లేయుల పాలనా కాలంలో రూపొందించిన రెగ్యులేషన్‌ చట్టంలోని సీరియల్‌ నెంబరు 29 ద్వారా మన దేశంలో పంచాయతీ విధానం ప్రారంభమైంది. దీని ఫలితంగానే కరణం వ్యవస్థ వచ్చింది. 

* 1816లో రూపొందించిన రెగ్యులేషన్‌ నియమాల ఫలితంగా గ్రామపెద్ద ‘గ్రామ మునసబు’గా అవతరించాడు. 

* లార్డ్‌ రిప్పన్‌ పాలనా కాలంలో 1884లో రూపొందించిన స్థానిక బోర్డుల చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాల ఏర్పాటుకు కృషి జరిగింది. 

* 1884 నాటి స్థానిక బోర్డుల చట్టంలోని అంశాలను తగ్గించేందుకు 1915లో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది. 

* 1915లో మద్రాసు ప్రభుత్వం ‘ఇన్‌ఫార్మల్‌ పంచాయతీ’లను ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలు గ్రామీణ పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా, సాగు నీటిపారుదల లాంటి పనులు నిర్వహించేవి.

 

మద్రాసు పంచాయతీల చట్టం - 1920:  * పంచాయతీల తనిఖీ కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌ నియమితులవుతారు.

* పురుషులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.

* ఓటుహక్కు పురుషులకు మాత్రమే లభిస్తుంది.

* ప్రత్యక్ష పద్ధతి ద్వారా పంచాయతీ సభ్యుల ఎన్నిక జరగాలి.

* పంచాయతీలకు ఇతర పన్నులు విధించే అధికారం ఉంది.

 

మద్రాసు స్థానిక బోర్డుల చట్టం - 1930: * దీని ప్రకారం 1920 నాటి మద్రాసు పంచాయతీల చట్టాన్ని రద్దు చేశారు.

* పంచాయతీలు స్థానిక బోర్డుల చట్టంలో అంతర్భాగమయ్యాయి.

* పంచాయతీలపై పర్యవేక్షణ, నిర్వహణాపరమైన అధికారాలను స్థానిక బోర్డులకు అప్పగించారు.

* తాలుకా బోర్డుల రద్దు అనంతరం పంచాయతీలపై అధికారాన్ని జిల్లా బోర్డులకు అప్పగించారు.

 

మద్రాసు పంచాయతీ చట్టం-1946: * సాధారణ పాలన నిర్వహణ కోసం రెవెన్యూ బోర్డులను ఏర్పాటు చేశారు.

* మేజర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పూర్తి కాలం పనిచేసే అధికారులకు, మైనర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పార్ట్‌ టైం అధికారులకు అప్పగించారు.

* పంచాయతీలకు సంబంధించిన కీలక అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ల నియంత్రణలో ఉంచారు.

 

మద్రాసులో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు- 1946: మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కీలక విధానాలను ప్రకటించింది. అవి: * పంచాయతీల నియంత్రణ, నిర్వహణ అధికారాన్ని ఇన్‌స్పెక్టర్ల పరిధిలోకి తీసుకొచ్చారు.

* ప్రత్యేక పరిస్థితుల్లో మినహా పంచాయతీలపై కలెక్టర్లకు పరిమిత అధికారం ఉంటుంది.

 

మద్రాసు పంచాయతీల చట్టం-1950: * ఈ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. 

* 1950 తర్వాత జరిగిన అన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా ఎన్నుకునే విధానం ప్రారంభమైంది.

 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959లో ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం’ రూపొందింది.

* 1983లో అధికారం చేపట్టిన ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం మునసబ్, కరణం వ్యవస్థను రద్దు చేసింది.

* 1986లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘మండల పరిషత్‌’ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

* చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002, జనవరి 1 నుంచి గ్రామ కార్యదర్శి వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 నుంచి 1986 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం 

1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 

2) మధ్య స్థాయిలో - పంచాయతీ సమితి 

3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986 నుంచి 1994 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం: 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల ప్రజా పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా ప్రజా పరిషత్‌.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ఏర్పాటైన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం: దీని ప్రకారం మూడంచెల పంచాయతీ రాజ్‌ విధానం వచ్చింది. 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌.

 

తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018: తెలంగాణ రాష్ట్రంలో 2018, ఏప్రిల్‌ 18 నుంచి తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని మొత్తం సెక్షన్లు 297. ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఉన్న అన్ని స్థాయుల్లోని పదవులకు ఇదివరకు ఉన్న ఎన్నిక విధానమే కొనసాగుతుంది.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018లోని సెక్షన్‌ 3 గ్రామసభ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ సమావేశాలను  నిర్వహించాలి.

* గ్రామ సభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీలో ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉంటారు. వీరు 1) పదవీవిరమణ ఉద్యోగి లేదా గ్రామ అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన సీనియర్‌ సిటిజన్‌ 2) గ్రామ సమాఖ్య అధ్యక్షులు 3) గ్రామ పంచాయతీ అభివృద్ధికి విరాళం అందించిన దాత.

 

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం-2020: ఈ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. అవి: 

* సర్పంచులు తప్పనిసరిగా స్థానికంగా నివసించాలి. 

* గ్రామ సభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించకపోతే సర్పంచి పదవిని కోల్పోతారు. 

* పంచాయతీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగేందుకు అర్హులు కారు. * పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేయాలి.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, ఓటర్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం లాంటి అభియోగాలు ధ్రువీకరణ అయితే అతడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు.

* నాన్‌-షెడ్యూల్‌ ఏరియాలో 100% గిరిజన జనాభా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకే రిజర్వు చేశారు.

* ప్రకృతి వైపరీత్యాలు లేదా నీటి కొరత విషయంలో సర్పంచిలకు నిర్ణయాధికారం ఇచ్చారు.

* గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి అంశాల్లో సర్పంచ్‌కు మరిన్ని అధికారాలు కల్పించారు.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ నిర్మాణం:  సాధారణంగా 300 మంది జనాభా ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పంచాయతీ పరిధిలో ఉండే 18 ఏళ్లు నిండిన వయోజన ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

* జనాభా తక్కువ ఉన్న కొన్ని గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేస్తారు.

* గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలోని పరిపాలనా విభాగం. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు.

 

వార్డుల విభజన: ప్రతి గ్రామ పంచాయతీని పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా వార్డులుగా విభజిస్తారు. కనీస వార్డుల సంఖ్య 5 కాగా, గరిష్ఠ వార్డుల సంఖ్య 21.

 

గ్రామ పంచాయతీ - ఎన్నిక విధానం: * ఆర్టికల్, 243(K) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది.

* గ్రామ ఓటర్ల జాబితాలో పేరు నమోదైన వారు మాత్రమే ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు అర్హులు.

* ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లను వినియోగించుకుంటారు. ఒక ఓటును వార్డు సభ్యుడిని, రెండో ఓటును సర్పంచిని ఎన్నుకోవడానికి వినియోగిస్తారు.

 

పోటీకి అర్హతలు: * గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. 

* 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* దివాళాతీసి ఉండకూడదు.* అస్పృశ్యత నేర నిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురై ఉండకూడదు.

 

రిజర్వేషన్లు: ఆర్టికల్‌ 243(D): * గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లలో ఈ వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* ఓబీసీ (వెనుకబడిన వర్గాల) వారికి 34% రిజర్వేషన్లు కల్పించారు.

* మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 50% నిర్దేశించారు.

 

పదవీకాలం: * గ్రామ పంచాయతీ మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి అయిదేళ్లు పదవీకాలం కొనసాగుతుంది. 

* గ్రామ పంచాయతీని పదవీకాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

 

సమావేశాలు: * గ్రామ పంచాయతీ సమావేశాలు సర్పంచి అధ్యక్షతన నెలకోసారి జరుగుతాయి. గత సమావేశపు నివేదికతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి.

* గత నెలలో జరిగిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సర్పంచి వివరిస్తారు.

* మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు/సభ్యురాలు (ఎంపీటీసీ) తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. వీరు సమావేశాల చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు ఉండదు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌