• facebook
  • whatsapp
  • telegram

లోక్‌సభ (10 - 17) ఎన్నికలు - విశేషాలు

అస్థిరతను దాటి.. సుస్థిరతకు చేరి!

ఒకే లోక్‌సభా కాలంలో మూడు సంకీర్ణ సర్కారులు పాలించాయి. ఒక్క ఓటు తేడాతో ఒక ప్రభుత్వం పడిపోయింది. విశ్వాస తీర్మానాలను గట్టెక్కలేక ఇంకొన్ని కూలిపోయాయి. క్రమంగా ఆ అనిశ్చితి తొలగింది. బలహీన దశలు దాటి బలమైన స్థితికి పార్టీలు చేరాయి. అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగగలిగిన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ పది నుంచి పదిహేడో లోక్‌సభ వరకు జరిగిన పరిణామాలు. ఈ అంశాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 

 

భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ దేశ శాసన నిర్మాణంలో అత్యంత కీలకం. ఈ సభలో ఆధిపత్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజకీయపార్టీలు ప్రయత్నిస్తుంటాయి. మొదటి నుంచి తొమ్మిదో లోక్‌సభ వరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సంపూర్ణంతో మొదలై సంకీర్ణానికి పడిపోయింది. తర్వాత పదో లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీని ఏ పార్టీ సాధించలేదు. పదిహేడో లోక్‌సభకు వచ్చేసరికి స్థిరమైన ప్రభుత్వాలు పాలనలోకి వచ్చాయి. 


10) 1991

పదో లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ 232, భారతీయ జనతా పార్టీ 129, జనతాదళ్‌ 59, సీపీఐ 14, సీపీఐ(ఎం) 35 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 56%, ఎన్నికైన మహిళల సంఖ్య 39. పి.వి.నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. పదో లోక్‌సభ పదవీకాలం 1991, జూన్‌ నుంచి 1996, మే వరకు. స్పీకర్‌గా శివరాజ్‌పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా మల్లికార్జునయ్య వ్యవహరించారు.

* పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రతిపాదించారు. వీటిని ప్రభుత్వం అమలుచేయడంతో భారతదేశ ఆర్థిక ప్రగతి పుంజుకుంది.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1992, డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. 1993, డిసెంబరు 23న ఎంపీ లాడ్స్‌ (Local Area Development Scheme) పథకం ప్రారంభించారు. దీనికింద పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి.


11) 1996 

పదకొండో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 161, కాంగ్రెస్‌ 140, జనతాదళ్‌ 46, సీపీఐ 12, సీపీఐ(ఎం) 32, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 16 స్థానాలు గెలుపొందాయి. ఈ సభ పదవీకాలం 1996, మే నుంచి 1997, డిసెంబరు. ఈ సభాకాలంలో 3 సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1996లో బీజేపీ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమై 13 రోజుల్లోనే అధికారం కోల్పోయింది.

* జనతాదళ్‌ ఇతర పార్టీలతో కలిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో హెచ్‌.డి.దేవెగౌడ 1996, జూన్‌ 1న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. లోక్‌సభలో దేవెగౌడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రభుత్వం పతనమైంది.

* ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1997 ఏప్రిల్‌లో అధికారం చేపట్టింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ ప్రభుత్వం కూడా 1998 మార్చిలో అధికారం కోల్పోయింది.

* 11వ లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 58%, ఎన్నికైన మహిళల సంఖ్య 40.

* స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా, డిప్యూటీ స్పీకర్‌గా సూరజ్‌భాన్‌ వ్యవహరించారు.

 

12) 1998

పన్నెండో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182, కాంగ్రెస్‌ - 141, సీపీఐ 9, సీపీఐ(ఎం) 32, టీడీపీ 12 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 62%, ఎన్నికైన మహిళల సంఖ్య 43. వాజ్‌పేయీ లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ఏఐఏడీఎంకే పార్టీ వాజ్‌పేయీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. దీంతో వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో వీగిపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. ఈ సభ పదవీకాలం 1998, మార్చి నుంచి 1999, ఏప్రిల్‌. అంటే కేవలం 13 నెలల 4 రోజులు మాత్రమే కొనసాగింది. స్పీకర్‌గా జి.ఎం.సి.బాలయోగి, డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎం.సయీద్‌ వ్యవహరించారు. బడ్జెట్‌ను సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.


13) 1999

పదమూడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182, కాంగ్రెస్‌ 114, సీపీఐ 4, సీపీఐ(ఎం) 33, టీడీపీ 29, శివసేన 15 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 59%, ఎన్నికైన మహిళలు 49 మంది. 21 రాజకీయ పార్టీలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి- ఎన్‌డీఏ’ నాయకుడిగా వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ 1999, అక్టోబరు నుంచి 2004, ఏప్రిల్‌ వరకు కొనసాగింది. ఈ సమయంలోనే పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 2001, డిసెంబరు 13న భారత పార్లమెంట్‌పై పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. 2002లో పోటా చట్టం విషయంలో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం జరిగింది. భారతదేశం వెలిగిపోతుంది (Shine India) అనే నినాదం ప్రాచుర్యం పొందింది. స్పీకర్‌గా జి.ఎమ్‌.సి.బాలయోగి ఉన్నారు. పదవిలో ఉండగానే ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తర్వాత స్పీకర్‌గా మనోహర్‌ జోషి వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎం.సయీద్‌ ఉన్నారు.


 14) 2004

పద్నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 145, బీజేపీ 138, సీపీఐ 10, సీపీఐ(ఎం) 43, టీఆర్‌ఎస్‌ 5, టీడీపీ 5, శివసేన 12 స్థానాలు గెలిచాయి. నమోదైన పోలింగ్‌ 58%, ఎన్నికైన మహిళలు 45 మంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌) వినియోగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ)గా ఏర్పడి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్‌ ఛటర్జీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా చరణ్‌జిత్‌ సింగ్‌ అతవాల్‌ వ్యవహరించారు. 2004, మే నుంచి 2009, మే వరకు ఈ సభ కొనసాగింది. ఈ కాలంలో రాష్ట్రపతి (డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం), ఉప రాష్ట్రపతి (హమీద్‌ అన్సారీ), ప్రధాని (మన్మోహన్‌ సింగ్‌) ముగ్గురూ మైనార్టీ వర్గానికి చెందినవారే.


* భారత్, అమెరికా మధ్య 123 పేరిట ‘పౌర అణు ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంపై ఓటింగ్‌ సమయంలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్లమెంటు సభ్యులు కొందరు లంచం తీసుకున్నారు. ఈ ఓటుకు నోటు కుంభకోణం 2008, జులై 22న వెలుగులోకి వచ్చింది. ఈ సభాకాలంలో 2005లో గృహహింస చట్టం ఆమోదం పొందింది. అది 2006, అక్టోబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ సమాచార హక్కు చట్టం-2005 అదే ఏడాది అక్టోబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 రూపొంది 2006, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది.


15) 2009

పదిహేనో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 206, బీజేపీ 116, తృణమూల్‌ కాంగ్రెస్‌ 19, తెలుగుదేశం పార్టీ 6, టీఆర్‌ఎస్‌ 2, సీపీఐ 4, సీపీఐ(ఎం) 16 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదవగా, 59 మంది మహిళలు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన రెండోసారి అధికారాన్ని చేపట్టింది. ఆహార భద్రతా బిల్లు, లోక్‌పాల్‌ బిల్లు, నిర్భయ బిల్లు చట్టాలుగా మారాయి. 6 - 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ‘ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009 రూపొంది 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సభ 2009, మే నుంచి 2014 మే వరకు కొనసాగింది. ఈ కాలంలో కేవలం 165 బిల్లులు ఆమోదం పొందాయి. స్పీకర్‌గా మీరాకుమార్‌ (లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌), డిప్యూటీ స్పీకర్‌గా కరియా ముండా వ్యవహరించారు.


16) 2014

పదహారో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 336 స్థానాలు గెలుపొందింది. ఈ కూటమిలో బీజేపీ 282, శివసేన 18, తెలుగుదేశం 16, లోక్‌ జనశక్తి 6, శిరోమణి అకాలీదళ్‌ 4 స్థానాలు గెలుపొందాయి. ఇతర పార్టీల్లో టీఆర్‌ఎస్‌ 11, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 9, ఏఐఏడీఎంకే 37, తృణమూల్‌ కాంగ్రెస్‌ 34 స్థానాలు సాధించాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 66%. ఎన్నికైన మహిళల సంఖ్య 62. స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్‌గా తంబిదొరై వ్యవహరించారు. లోక్‌సభా నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ పదవీకాలం 2014, మే నుంచి 2019, మే.


17) 2019

పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 353 స్థానాలు సాధించింది. 

కూటమిలో పార్టీల వారీగా సీట్లు (నాడు ఎన్నికల అనంతరం)

* భారతీయ జనతా పార్టీ - 303

* శివసేన - 18

* జనతాదళ్‌ (యునైటెడ్‌) - 16

* లోక్‌జనశక్తి పార్టీ - 6

* అప్నాదళ్‌ పార్టీ - 2

* శిరోమణి అకాలీదళ్‌ - 2

* ఏఐఏడీఎంకే - 1

* రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ - 1

* నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ - 1

* నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ - 1

* మిజో నేషనల్‌ ఫ్రంట్‌ - 1

* ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ - 1

 

యూపీఏ కూటమి 91 స్థానాలు సాధించింది. 

పార్టీల వారీగా సాధించిన సీట్లు

* భారతీయ జాతీయ కాంగ్రెస్‌ - 52

* ద్రవిడ మున్నేట్ర కజగం - 23

* నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - 5 

* ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ - 3

* జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్పరెన్స్‌ - 3

* జనతాదల్‌ (సెక్యులర్‌) - 1

* ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా - 1

* కేరళ కాంగ్రెస్‌ - 1

* రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ - 1

* విథుతలై చిరుత్తైగల్‌ కచ్చి - 1


ఇతర పార్టీలు గెలిచిన స్థానాలు

* ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ - 22

* వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ - 22

* బిజూ జనతాదళ్‌ - 12

* తెలంగాణ రాష్ట్ర సమితి - 9

* తెలుగుదేశం పార్టీ - 3

 

17వ లోక్‌సభ 2019, జూన్‌ 7న ఏర్పడి ప్రస్తుతం కొనసాగుతోంది. స్పీకర్‌గా ఓం ప్రకాశ్‌ బిర్లా వ్యవహరిస్తున్నారు. ఈయన రాజస్థాన్‌లోని ‘కోట’ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 1.04% నోటా ఓట్లు నమోదయ్యాయి. నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 17వ లోక్‌సభకు మొదటిసారిగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 267, ఈ సభకు ఎన్నికైన ముస్లిం ఎంపీల సంఖ్య 27.


17వ లోక్‌సభకు స్వతంత్రులుగా నలుగురు ఎన్నికయ్యారు.

1) సుమలత (మాండ్యా - కర్ణాటక)

2) నాబాకుమార్‌ సరోనియో (కోక్రాజర్‌ - అస్సాం)

3) నవనీత్‌ కౌర్‌ (అమరావతి - మహారాష్ట్ర)

4) సంజీభాయ్‌ థేల్కర్‌ (దాద్రానగర్‌ హవేలి)

 

 వైశాల్యపరంగా దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గాలు

* లద్దాఖ్‌ - జమ్మూ కశ్మీర్‌ (1,73,266 చ.కి.మీ.)

* బార్మర్‌ - రాజస్థాన్‌ (76,601 చ.కి.మీ.)

* కచ్‌ - గుజరాత్‌ (41,644 చ.కి.మీ.)

 

అతిచిన్నవి

* చాందినీ చౌక్‌ - దిల్లీ (10.59 చ.కి.మీ.)

* వాయవ్య కోల్‌కతా - పశ్చిమ బెంగాల్‌ (13.23 చ.కి.మీ.)

* దక్షిణ ముంబై - మహారాష్ట్ర (13.73 చ.కి.మీ.)


రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ లోక్‌సభ ఎన్నికలు - ప్రత్యేకతలు (1 నుంచి 9వ లోక్‌స‌భ వ‌ర‌కు)

 రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

 కేంద్ర‌మంత్రి మండ‌లి

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌