• facebook
  • whatsapp
  • telegram

వివాహం

పరస్పర అనురాగ పయనం

 

  రెండు జీవితాలు కలిసి, మరో రెండు కుటుంబాలను కలిపి ఎన్నో బంధుత్వాలను ఏర్పరిచే విశిష్ట వేడుక వివాహం. దీంతో కొత్త కుటుంబం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాల్లో పెళ్లి ఉంది. అదో సామాజిక అవసరంంగా మొదలై, పరస్పర అనురాగంతో సాగే అద్భుతమైన సంస్కారం. సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వివాహం, దాని లక్షణాలు, వివిధ రకాల వివాహాలు, అందులో భాగస్వాముల వివరాలను తెలుసుకోవాలి. 

  భారతీయ సమాజ నిర్మాణ మూలస్తంభాల్లో వివాహ బంధం ఒకటి. వివాహం పవిత్రమైంది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించడానికే వివాహం చేసుకుంటామని భారతదేశంలో భావిస్తారు.

  స్త్రీ, పురుషులనే రెండు జీవనయానపు విభాగాలు వివాహం ద్వారా ఒకటవుతాయి. భార్యాభర్తలు సంసారమనే రథానికి రెండు చక్రాలు. వీరిద్దరి మధ్య సంఘర్షణ ఏమీ ఉండదు. ఒకరికొకరు పరస్పరపూరకంగా ఉంటారు. వివాహం ఒక జైవిక అవసరమే కాదు, ఒక పవిత్ర సంస్కారం, రెండు భాగాలు మానసికంగా మమేకం అయ్యే వ్యవస్థ. వివాహం అనేది జన్మజన్మల బంధం.

  వివాహం ఒక సామాజిక వ్యవస్థ (Marriage is a Social Institution). ఇది విశ్వజనీనం(Marriage is Universe). ప్రపంచంలోని అన్ని సమాజాల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. వివాహం ఒక సామాజిక కలయిక. దీని ద్వారా వీరి మధ్య కొన్ని హక్కులు, బాధ్యతలు, బంధాలు ఏర్పడతాయి. అవి: 1) భార్యాభర్తలు 2) దంపతులు, పిల్లలు 3) దంపతుల అత్తమామలు

* మతాచారాలు, సంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మందితో స్త్రీ, పురుషులు కొన్ని హక్కులకు, బాధ్యతలకు లోబడి ఏర్పరచుకున్న  బంధమే ‘వివాహం’ అని వెస్టర్‌మార్క్‌ పేర్కొన్నారు. ఈయన వివాహం పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించాడు. ‘సంతానోత్పత్తి, పిల్లల పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందమే వివాహం’ అని మలినోస్కి చెప్పారు.

* ‘వివాహం సామాజిక వ్యవస్థ. ఇహలోకంలో, పరలోకంలో సుఖంగా ఉండాలంటే వివాహం అవసరం’ అని మను చెప్పాడు.వివాహంతో సంతానం పొందినవారే పరిపూర్ణులని విశ్లేషించాడు. 

 

వివాహం - లక్షణాలు


నియమావళి (Charter): పెళ్లి ఎందుకు? దాని ఆశయాలు ఏమిటో తెలుపుతుంది.

 

జీవిత భాగస్వామి ఎంపిక (Mate Selection): భాగస్వామికి ఎంత వయసు ఉండాలి, శారీరక పరిస్థితులు ఏమిటి?

మను ప్రకారం: 24 ఏళ్ల పురుషుడికి 8 ఏళ్ల అమ్మాయి సరిజోడు అవుతుంది. అదే 30 ఏళ్ల పురుషుడికి 12 ఏళ్ల అమ్మాయి సరిపోతుంది. అనారోగ్య చరిత్ర ఉన్న కుటుంబం, మగ సంతానం లేని కుటుంబం నుంచి వధువును స్వీకరించకూడదు. అలాగే చర్మంపై దళసరి రోమాలున్న వధువునూ స్వీకరించకూడదు.

వివాహం విధానం: * కన్యాదానం   * వివాహ హోమం   * పాణిగ్రహణం   * లాజహోమం   * అగ్నిపరిణయనం   * అశావిరోహణం   * సప్తపది    * అరుంధతి.

ఆర్థిక వ్యవహారాలు

* ఆదిమ, రైతు సమాజాల్లో ఇప్పటికీ కన్యాశుల్కం పేరుతో వధువు తల్లిదండ్రులకు వరుడు కొంత సొమ్ము చెల్లించడం లేదా వరకట్నం కింద వరుడికి కొంత సొమ్మును వధువు తల్లిదండ్రులు ఇవ్వడం ఆచారంగా ఉంది. హిందూ వారసత్వ చట్టం - 1956 ప్రకారం స్త్రీ ధనంపై సంపూర్ణ అధికారం మహిళకే ఉంటుంది.

 

ఆచారాలు: వివాహ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, రంగులు పూసుకోవడం, బంతి ఆట మొదలైనవి.

 

నిర్ధిష్ట నిమయావళి: ఏ వ్యక్తుల మధ్య వివాహం బంధం ఉండకూడదో తెలియజేస్తుంది.

* తల్లి, కొడుకు, తండ్రి, కూతురు. 

* అన్న, చెల్లి, అక్క, తమ్ముడు.

 

నివాసం: వివాహమైన జంట నివసించే ప్రదేశం.

 

అధికారం: పెళ్లి తర్వాత సంక్రమించే అధికారం.

 

స్థిరత్వం: స్థిరత్వానికి, విడాకులకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

 

వివాహం - రూపాలు

బ్రహ్మ వివాహం: తండ్రి తన కుమార్తెను శాస్త్ర ప్రకారం వరుడికి ఇచ్చి వివాహం చేయడం.

దైవ వివాహం: యజ్ఞం చేసినప్పుడు, కర్మకాండలు జరిగే సమయంలో తండ్రి తన కూతురుని పూజారికి ఇచ్చి వివాహం చేయడం.

అర్స వివాహం: పెళ్లి కుమారుడి నుంచి ఆవు/ఎద్దును స్వీకరించి ధర్మబద్ధంగా పెళ్లి కుమార్తె తండ్రి వధువును దానం చేయడం.

ప్రజాపాత్య: ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా వివాహం చేసుకోవడం. వధూవరులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలని ఆశీర్వదించి కన్యాదానం చేసే వివాహం. 

గాంధర్వ వివాహం: వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. 

అసుర వివాహం: పెళ్లి కుమార్తెను ధనం కోసం వరుడికి అమ్మడం.

రాక్షస వివాహం: వధువును బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం.

పైశాచిక వివాహం: వధువు నిద్రలో లేదా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడం.

 

 

ఏకవివాహం: ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని దంపత్‌ వివాహం/ఏక వివాహం అంటారు.

ఉదా: ఖాసీ, చెంచు, లఖర్, అంగామి, అవో, డాఫ్ల

 

i) ఏకకాలిక ఏకవివాహం: భార్య లేదా భర్త మరణించిన‌ప్పుడు లేదా విడాకులతో విడిపోయినప్పుడు ఒక్కరే ఉండి, వారు మళ్లీ వివాహం చేసుకుంటే అది ఏకకాలిక ఏకవివాహం.

ఉదా: హిందూ సమాజం

ii) జీవితాంతపు ఏకవివాహం: జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటే దాన్ని జీవితాంతపు ఏక వివాహం అంటారు. 

ఉదా: సనాతన హిందూ సమాజం

 

బహువివాహం: ఇందులో ఒక స్త్రీ అనేక మంది భర్తలను, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను కలిగి ఉంటారు. 

i) బహుభార్యత్వం: ఒక పురుషుడికి ఏకకాలంలో పలువురు భార్యలు ఉంటారు. ఇది మళ్లీ 2 రకాలు.

* భగినీ బహుభార్యత్వం: పురుషుడి భార్యలందరూ అక్కాచెల్లెళ్లు అయి ఉంటారు. 

ఉదా: బైగా, భగత, నాగా, గోండు 

* అభగినీ బహుభార్యత్వం: భార్యలందరూ అక్కాచెల్లెళ్లు అయి ఉండరు. 

ఉదా: గోండు తెగ, నాగాలు, ముత్తవన్, పళియన్‌ 


ii) బహుభర్తృత్వం: ఒక స్త్రీకి ఏకకాలంలో పలువురు భర్తలు ఉంటారు.

ఉదా: తోడా (పాండవుల వంశానికి చెందినవారిగా పేర్కొంటారు), ఖాసాలు, లెఫ్చాలు, నాయర్లు 

ఇవి మూడు రకాలు: 

* సోదర బహుభర్తృత్వం: ప్రాచీన కాలంలో అతిసాధారణమైన వివాహ రూపం. దీనిప్రకారం అన్నదమ్ములు అందరూ ఒకే మహిళను వివాహం చేసుకుంటారు.

ఉదా: తోడా 

* అసోదర బహుభర్తృత్వం: ఈ వివాహంలో ఒక స్త్రీ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ స్త్రీని కల్యాణం చేసుకునే వారంతా సోదరులు కావాల్సిన పనిలేదు, స్త్రీని వివాహం చేసుకున్నవారంతా ఒకే గోత్రానికి చెందిన వారైతే దీన్ని స్వగోత్రీయ బహుభర్తృత్వం అంటారు.

ఉదా: జౌన్సర్‌ బవార్‌ ప్రాంతపు ఖాసా తెగ. 

* కుటుంబ బహుభర్తృత్వం: ఇది తోడా, నాగా, ఖాసీల్లో ఉంది.

 

iii) బహుభార్యభర్తృత్వం: కొన్ని తెగల్లో బహు భార్యత్వం, బహు భర్తృత్వం రెండూ కలిసి ఉంటాయి. ఈ రకమైన పద్ధతిని బహుభార్యభర్తృత్వం అంటారు.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ కుటుంబం రకాలు

‣ పెళ్లి.. నాటి ప్రమాణాలు 

‣ బంధుత్వం - అనుబంధం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 14-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌