• facebook
  • whatsapp
  • telegram

ఆదిమ తెగల్లో వివాహాలు  (గిరిజన సామాజిక వ్యవస్థ)

మత సంప్రదాయాలు లేని సామాజిక సంబరాలు!
 


ఆధునిక సమాజానికి దూరంగా అడవుల్లో, కొండల్లో జీవించే ఆదిమ జాతుల జీవన విధానం అంతా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఆచార వ్యవహారాలతో పాటు వివాహ పద్ధతులు  విభిన్నంగా ఉంటాయి. మతపరమైన సంప్రదాయాలు తదితర పట్టింపులు లేకుండా కేవలం తమ తెగ, జాతి అవసరాలకు అనుగుణంగా వివాహ  ఆచారాలు నిర్ణయమవుతుంటాయి. సమాజ నిర్మాణ శాస్త్రంలో భాగంగా ఈ అంశాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. తెగ వివాహ పద్ధతులు, రకాలతోపాటు బహుభార్యత్వం, ఇందులోని    లాభనష్టాలపై తగిన అవగాహనతో ఉండాలి.

వివాహం అన్ని మానవ సమాజాల్లోనూ అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక సామాజిక ఆచారం. దాని ద్వారా స్త్రీ, పురుషులు లైంగిక సంభోగ హక్కు పొంది, పిల్లలకు జన్మనిస్తారు. జనాభా కొరత లేకుండా చేసి, సమాజం సజావుగా సాగిపోవడానికి తోడ్పడతారు. గిరిజన లేదా ఆదిమ తెగ వ్యవస్థాపనలో వివాహ వ్యవస్థ ముఖ్యమైన భాగం. హిందూ వివాహ వ్యవస్థకు, ఆదిమ తెగ వివాహ వ్యవస్థకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఆదిమ తెగ - వివాహం,

వివరణ: ఆదిమ తెగలో వివాహం జరిగే విధానం సాధారణ సమాజం పెళ్లిళ్లకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదిమ తెగ వివాహం రెండు విధాలుగా జరుగుతుంది.

1) వరుడు.. వధువు నుదుట తిలకం దిద్దడం ద్వారా వివాహ తంతు ముగుస్తుంది.

2) కొన్ని ఆదిమ తెగల్లో వధూవరుల సంగమానికి గుర్తుగా ఇద్దరి రక్తాలను కలుపుతారు. వధూవరులకు చిన్న గాయం చేసి వారి ఇద్దరి రక్తాలను కలపడం ద్వారా వివాహ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. 

* సహజంగా వివాహ ఊరేగింపు వరుడి ఇంటి నుంచి మొదలవుతుంది. కానీ గోండు తెగలో వధువు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. వివాహ కార్యక్రమాల్లో మతపరమైన సంప్రదాయాలేవీ అమలుచేయరు. ఆదిమ తెగలో వివాహం సామాజిక సంబరం లాంటిది. వివాహ సందర్భంగా మందు, విందు, నృత్యాలు లాంటివి ఉంటాయి.

ఆదిమ తెగ - వివాహ పద్ధతులు:

1) సేవా వివాహం: ఇది అతి ప్రాచీన వివాహ పద్ధతి. ఆదిమ సమాజాల్లో ఎక్కువగా అమలులో ఉండేది. దీన్ని హిందూ వివాహ అష్ట పద్ధతుల్లోని అసుర    వివాహంతో పోల్చవచ్చు.

ఆర్థిక స్థోమత లేని పురుషుడు కాబోయే మామ ఇంటిలో కన్యాశుల్కానికి బదులుగా సమాన విలువైన సేవలు అందిస్తాడు. ఆ విధంగా సేవలు అందించి స్త్రీని పరిణయమాడటం వల్ల దీనికి సేవా వివాహమని పేరు వచ్చింది. ఇందులో పురుషుడిని ‘లమ్‌ నాయ్‌’, ‘లమ్‌ సేనా’ లాంటి పేర్లతో వ్యవహరిస్తారు. ఇక్కడ పురుషుడు సేవలు అందించడమే కాకుండా కాబోయే మామ మన్నన కూడా పొందాలి. లేకపోతే ఆ అవకాశం మరొక పురుషుడికి ఇచ్చి ఇతడిని పంపేస్తారు.సేవలు అందించే కాలంలో పురుషుడు తాను వివాహం చేసుకోబోయే స్త్రీతో మాట్లాడవచ్చు, కానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

2) పరిగ్రహణ వివాహం: ఈ పద్ధతిలో వరుడు వధువును బలాత్కారంగా తీసుకెళ్లి వివాహమాడిన తర్వాత సమాజం గుర్తింపు పొందుతాడు. వధువు తరఫు వారిని హింసించి లేదా గాయపరచి బలవంతంగా స్త్రీని తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి.. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు స్త్రీ తనకు తానుగా సహకరించవచ్చు లేదా స్త్రీ ఆడపడుచులు ఇందుకు సహకరించవచ్చు. మరికొన్నిసార్లు కోరుకున్న స్త్రీ వచ్చే దారిలో అడ్డంగా నిలబడి అకస్మాత్తుగా ఆమె నుదుట తిలకం దిద్దడం ద్వారా కూడా ఈ రకమైన వివాహాలు జరుగుతూ ఉంటాయి. అవి సంతాల్, ముండా, గోండు నాగా తెగల్లో ఎక్కువగా అమలులో ఉన్నాయి.

3) పరస్పర అవగాహనతో సహపలాయన వివాహం: గోండు, సవర, కొండదొర లాంటి తెగల్లో ఈ వివాహ పద్ధతి అమలులో ఉంది. హిందూ అష్టవివాహ పద్ధతుల్లోని గాంధర్వ వివాహంతో దీన్ని పోల్చవచ్చు. యువతీ, యువకులు పరస్పర అవగాహనతో ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహానికి సిద్ధపడినప్పుడు, పెద్దలు అంగీకరించపోతే వారు పారిపోయి వివాహం చేసుకుంటారు. తల్లిదండ్రులు సమ్మతి తెలిపేంత వరకు తిరిగిరారు. బిహార్‌లోని ‘హెూ తెగ’ వారు ఈ రకమైన వివాహాన్ని ‘రాజ్‌ కుషి’గా పిలుస్తారు. ఇందులో కన్యాశుల్కం సమస్య ఉండదు.

4) వినిమయ వివాహం: దీన్నే కుండ మార్పిడి వివాహం అంటారు. ఇందులో వరుడు తన సోదరిని వేరే ఇంట్లోని వరుడికి వధువుగా ఇచ్చి, అతడి సోదరిని ఇతడు భార్యగా స్వీకరిస్తాడు. ఇలాంటి వివాహాల ద్వారా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పటిష్ఠమవుతాయి. యురాలి, ఖోటియా తెగల్లో ఈ వివాహం ఎక్కువగా అమలులో ఉంది. ఈ పద్ధతిలో కూడా కన్యాశుల్కం ప్రస్తావన ఉండదు.

5) పరీక్షావధి వివాహం: ఈ పద్ధతిలో పురుషుడు తాను కోరుకున్న యువతి ఇంట్లో కొంతకాలం నివసిస్తాడు. వరుడు ఆ విధంగా ఉన్న కాలంలో కన్య ఇంట్లోని వాళ్లు అతడి ప్రవర్తన, అలవాట్లు, పద్ధతులు గమనిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులకు పురుషుడి నడవడిక నచ్చితే కన్యాశుల్కం నిర్ణయించి వివాహం జరిపిస్తారు. నచ్చకపోతే అతడు వారి ఇంట్లో నివసించిన కాలంలో అయిన ఖర్చులను వసూలు చేసుకుని పంపిస్తారు. స్త్రీ ఇంట్లో పురుషుడు నివసించే కాలంలో ఆమెను కలుసుకోవచ్చు. కానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.ఈ పద్ధతి అస్సాంలోని ‘కుకి’ ఆదిమ తెగలో ఉంది.

6) ప్రయోగ వివాహం: యువకులకు కొన్ని పరీక్షల నిర్వహించడం ద్వారా ఈ రకమైన వివాహం జరుగుతుంది. వాటిలో విజయం పొందినవారు తమకు నచ్చిన కన్యను వివాహం చేసుకోవచ్చు.ః ఆదిమ తెగ ప్రజలు ప్రమాదకరమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. ఇక్కడి యువకులకు ధైర్య సాహసాలు ఉండాలి. అందుకే వాటికి సంబంధించిన పరీక్షలను వివాహం పేరుతో నిర్వహిస్తారు. ఉదాహరణకు భిల్‌ తెగలో జరిపే ఈ విధమైన పరీక్షను ‘గోలిటేట్‌’ అంటారు. వివాహానికి సిద్ధపడిన యువతీ, యువకులను ఒక స్థలం వద్దకు పిలుస్తారు. ఒక పొడమైన కర్రను భూమిలో పాతి, దాని చివర ఒక పళ్లేన్ని ఉంచి అందులో కొబ్బరికాయ, కొన్ని పండ్లు, మిఠాయిలు ఉంచుతారు. ఆ స్తంభం చుట్టూ యువతులు వలయాకారంలో దడిగా నిలబడతారు. వారి వెనుక యువకులు మరొక దడిగా నిలబడతారు. వివాహానికి సిద్ధపడిన యువకుడు పురుష, స్త్రీ వలయాలను ఛేదించుకుని స్తంభం పైకి ఎగబాకి పళ్లెంలోని కొబ్బరికాయ పగలగొట్టి, దానిలో ఉంచిన పండ్లు, మిఠాయిలు తిని కిందికి దిగివచ్చిన తర్వాత తనకు నచ్చిన స్త్రీని వివాహం కోసం ఎంచుకోవచ్చు. యువకుడు స్తంభాన్ని ఎక్కుతున్నప్పుడు అతడిని నిరోధించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటన్నింటినీ అధిగమించి యువకుడు విజయం సాధిస్తే తాను కోరుకున్న యువతితో వివాహం జరుగుతుంది.

7) కన్యాశుల్క వివాహం: స్త్రీకి ఆర్థిక విలువ ఉన్న ఆదిమ తెగల్లో కన్యాశుల్క వివాహ పద్ధతి ఎక్కువగా అమలులో ఉంది. కన్యాశుల్కం అంటే వరుడు, వధువు తల్లిదండ్రులకు కొంత ధనాన్ని శుల్కంగా చెల్లించి వివాహం చేసుకోవడం. స్త్రీ ఆర్థిక గుర్తింపు పొంది ఉన్నప్పుడు ఆమెను వివాహం ద్వారా ఒక పురుషుడికి ఇచ్చి వేయడం వల్ల ఆ కుటుంబానికి కొంత నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి స్త్రీ తల్లిదండ్రులు ఆమెకు కన్యాశుల్కాన్ని నిర్ణయించి అది చెల్లించినప్పుడే వివాహం జరిపిస్తారు. ఈ రకమైన వివాహం చేసుకున్న స్త్రీ, మరొక పురుషుడితో వెళ్లిపోయినప్పుడు ఆమె రెండో భర్త మొదటి భర్తకు కన్యాశుల్కం చెల్లిస్తాడు. ఈ పద్ధతి నాగా, హెూ తెగల్లో అమలులో ఉంది.

8) అవాహుత వివాహం: యువతి తాను కోరుకున్న యువకుడితో వివాహం జరగనప్పుడు, తాను కోరుకున్న యువకుడు కానీ, అతడి తల్లిదండ్రులు కానీ వివాహానికి అంగీకరించనప్పుడు వరుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశిస్తుంది. వారు పెట్టే హింస, నిందలు, అవహేళనలను భరిస్తూ అక్కడే ఉంటుంది. యువకుడి ఇంటి సభ్యులు ఆమెను నిర్ణీత కాలంలోగా బయటకు పంపలేకపోతే ఆమె కోరుకున్న యువకుడితో వివాహం జరిపించాలి. ఆ నిర్ణీత కాలం ప్రతి తెగకు వేర్వేరుగా ఉంటుంది. ఈ రకమైన పద్ధతి ఓరాన్, హెూ, బిరోహెూర్‌ తెగల్లో అమల్లో ఉంది. 

ఈ ఎనిమిది పద్ధతులే కాకుండా మరో రెండు వివాహ పద్ధతులు కూడా ఆదిమ వివాహ వ్యవస్థలో ఉన్నాయి.

1) దేవర న్యాయం: ఈ రకమైన వివాహంలో   పురుషుడు తన సోదరుడు చనిపోతే అతడి భార్యను వివాహమాడతాడు. ఈ పద్ధతి సంతాల్, గోండు, ఖరియా తెగల్లో అమలులో ఉంది.

2) భార్యా భగిని న్యాయం: పురుషుడు తన భార్య మరణిస్తే ఆమె అవివాహిత   సోదరిని పెళ్లి చేసుకుంటాడు. ఈ పద్ధతిని గోండు, ఖరియా తెగల్లో పాటిస్తున్నారు.
బహుభార్యత్వం

బహుభార్యత్వం ఆదిమ తెగ వివాహ వ్యవస్థలో రూపాల్లో ప్రధానమైంది. ఈ వివాహంలో పురుషుడికి ఏకకాలంలో ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది స్త్రీలు భార్యలుగా ఉంటారు. ఇది నాగ, వేగ, తోట మరికొన్ని ఆదిమ తెగల్లో కనిపిస్తుంది. 

లాభాలు: ఈ వివాహం సామర్థ్యం ఉన్న ధనవంతులైన పురుషుల విషయంలో జరుగుతుంది. దీనివల్ల శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది.

నష్టాలు:

* భర్త ప్రేమను, అనురాగాన్ని, సంపదను పొందే విషయంలో భార్యల్లో కలతలు ఏర్పడతాయి.

* స్త్రీలు నైతికంగా పతనం కావచ్చు.  

* కుటుంబం సంఖ్య నానాటికీ పెరిగి పేదరికం బారిన పడొచ్చు.    

* జనాభా సమస్య ఉత్పన్నమవుతుంది.

 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి 


 

Posted Date : 22-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు