• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక తెలంగాణ కవులు

అభ్యుదయ అక్షర పోరాట యోధులు!

ప్రాచీన, మధ్యయుగాల్లో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేసి, భాషను పరిపుష్టం చేసిన తెలంగాణ కవులు, ఆధునిక కాలంలో అభ్యుదయ రచనలతో జాతిని జాగృతం చేశారు. సాయుధ పోరాట కాలంలో అక్షరాలనే ఆయుధాలుగా మలిచి, పీడిత ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాల వైపు నడిపించారు. రచనలతో అన్యాయాలను ప్రశ్నించారు. పాటలతో హక్కుల కోసం కృషి చేశారు. జనం అభిమానంతో పాటు ప్రభుత్వాల నుంచి విశిష్ట పురస్కారాలెన్నో అందుకున్నారు. అలాంటి కవుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. రచనాశైలిలో వారికున్న ప్రత్యేకతలు, అందించిన సేవలపై అవగాహన పెంచుకోవాలి.


ఆధునిక తెలంగాణ కవులు తమ రచనల ద్వారా ప్రజలను జాగృతపరిచి వారిలో చైతన్యం నింపారు. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజలను   స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లించారు.


కాళోజీ నారాయణరావు (1914-2001): ఈయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మడికొండలో 1914, సెప్టెంబరు 9న జన్మించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆర్యసమాజ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆంధ్ర మహాసభల కార్యక్రమాల్లో పాల్గొని నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1946, ఆగస్టు 8న వరంగల్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన బత్తిని మొగిలయ్యను రజాకార్లు నరికివేశారు. ఈ సందర్భంగా నిజాం నవాబును ప్రశ్నించిన కాళోజీకి 3 నెలల నగర బహిష్కార శిక్ష విధించారు. 1934లో గాంధీజీ పిలుపునందుకుని ప్రథమ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1939లో తొలిసారిగా జైలుకెళ్లారు. జైలులోనే ప్రముఖ గ్రంథాలను అనువదించారు. హెచ్‌.ఎస్‌. బ్రెయిల్స్‌ రచించిన ‘రెబల్‌ ఇండియా’ను ‘నా భారతదేశ యాత్ర’ పేరుతో, నారాయణ సీతారాం ఫెడ్కె గ్రంథాన్ని ‘భారతీయ సంస్కృతి’ పేరుతో తర్జుమా చేశారు. ‘థాట్స్‌ ఆఫ్‌ అర్కేవియస్‌ అరేబియస్‌’ను ‘పరమాత్ముని ఆత్మకథ’గా అనువదించారు. ‘నా భారతదేశ యాత్ర’ 1941లో అచ్చయింది. కాళోజీ గొప్ప ప్రజాకవి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తన కవితలతో ప్రశ్నించేవారు. తెలంగాణలో పౌరహక్కులకు ఏమాత్రం భంగం కలిగినా ప్రతిఘటించారు. ఈయన తన కవితలను ‘నా గొడవ’ పేరుతో ఏడు సంపుటాలుగా ప్రచురించారు. తెలంగాణ మాండలికాల ఆవశ్యకతను నొక్కి చెప్పిన వ్యక్తి కాళోజీ. ఆయన జన్మదినమైన సెప్టెంబరు 9న తెలంగాణ మాండలిక దినోత్సవం నిర్వహిస్తారు. కాళోజీ సోదరుడు రామేశ్వర్‌ రావు గొప్ప ఉర్దూ కవి. ఆయన ప్రభావం కాళోజీపై ఉంది.


రచనలు: తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో రచనలు చేశారు. అణాకతలు (1941), కాళోజీ కథలు (1943), పార్థీవ న్యాయం (1946), నా గొడవ (1953), తుది విజయం మనది నిజం (1962), జీవన గీతం (1968), తెలంగాణ ఉద్యమ కవితలు (1969), బాపు! బాపు!! బాపు!!! (1995) వంటి రచనలు చేశారు.


అవార్డులు: కాళోజీ రచించిన ‘జీవన గీతం’ అనే గ్రంథానికి ఉత్తమ అనువాద రచయిత అవార్డు వచ్చింది. 1972లో తామ్రపత్ర అవార్డు అందుకున్నారు. బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు మొదటి గ్రహీత కాళోజీనే. 1981లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్కరించింది. 1982లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. సామాజిక సాంస్కృతిక రంగంలో కాళోజీ చేసిన కృషికి 1982లో పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. ఆంధ్ర సారస్వత పరిషత్‌ (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ) స్థాపకుల్లో కాళోజీ ఒకరు. ఈయన కొంతకాలం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1960-1962ల మధ్య శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరున ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది.


వట్టికోట ఆళ్వారు స్వామి: ఆళ్వారు స్వామి 1915, నవంబరు 1న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువు మాధవరంలో జన్మించారు. తెలంగాణ తొలి నవలా రచయిత, ఉద్యమకారుడు. గ్రంథాలయోద్యమం ద్వారా స్ఫూర్తి పొంది నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1947లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అరెస్టయి మూడేళ్ల పాటు పలు జైళ్లలో శిక్ష అనుభవించారు. 1938లో సికింద్రాబాద్‌లో దేశోద్దారక గ్రంథాలయాలను స్థాపించి 33 గ్రంథాలను ప్రచురించారు. దేశోద్దారక సూచీ గ్రంథాలయాన్ని స్థాపించి పాతపత్రికలు, సంచికలు పరిశోధకులకు అందజేశారు.


రచనలు: ప్రజల మనిషి (1938 నాటి తెలంగాణ ప్రజాజీవనం), గంగు అనే తెలంగాణ తొలినవల (1940-45 నాటి తెలంగాణ ప్రజాజీవనం) రచించారు. ‘జైలు లోపల’ అనే కథల సంపుటి (నేరస్థుల మనోభావాల విశ్లేషణ), రామప్పతల్లి అనే వ్యాససంపుటి వెలువరించారు. ‘తెలుగు తల్లి’ అనే మాసపత్రిక నిర్వహించారు. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్‌ గ్రంథాలయానికి వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆళ్వారు స్వామి శతజయంతి ఉత్సవాలను 2014, నవంబరు 1న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ప్రారంభించింది. ఆళ్వారు స్వామి సాహిత్యాన్నంతా ఒక సంకలనంగా మార్చి తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


దాశరథి కృష్ణమాచార్యులు: దాశరథి 1927, జులై 22న ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిన గూడూరు (మానుకోట)లో జన్మించారు. ఈయన ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం, ఆర్య సమాజం మొదలైన సంస్థల నుంచి ప్రేరణ పొంది రచనలు సాగించారు. దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని సగర్వంగా చెప్పారు. పద్యాన్ని ఆయుధంగా చేసుకుని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించారు. ‘‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను’’ అని పలికిన దాశరథి నాడు నిద్రాణమైన తెలంగాణ జాతిని మేల్కొలిపారు.


రచనలు: రుద్రవీణ, అగ్నిధార, ధ్వజమెత్తిన ప్రజ, మహాంద్రోదయం, మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనలు తదితర గ్రంథాలు రచించారు. పీడిత ప్రజల గొంతుకగా మారి వారికి జరుగుతున్న అన్యాయాలపై నినదించారు. ‘తిమిరంతో సమరం’ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. జైలులో కూడా బొగ్గుతో గోడలపై పద్యాలు రాస్తూ దెబ్బలు తిన్నారు. ఆంధ్రసారస్వత పరిషత్తు స్థాపకుల్లో కృష్ణమాచార్యులు ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా ఉన్నారు. సినిమాలకు పాటలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.


సుద్దాల హనుమంతు: హనుమంతు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుద్దాల అనే గ్రామంలో జన్మించారు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1946-1951లో తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. ఈయన పాటల్లో ప్రఖ్యాతి గాంచినది ‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ’. ఈ పాటను ‘మా భూమి’ సినిమాలో పెట్టారు. హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ ‘వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. ఈయన కుమారుడే ప్రస్తుత గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ.


దాశరథి రంగాచార్య: రంగాచార్య 1928, ఆగస్టు 24న ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిన గూడూరు (మానుకోట)లో జన్మించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 17 సంవత్సరాలకే జైలుకెళ్లారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం ప్రార్థన చేయనంటూ బడి నుంచి బర్తరఫ్‌ అయ్యారు. రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరారు. వెట్టిచాకిరీ, దోపిడీ గుణాన్ని చూసి స్పందించి నవలా రచన చేశారు.


రచనలు: దాశరథి రంగాచార్య గొప్ప రచనలు చేశారు. ‘చిల్లర దేవుళ్లు’ (నాటి సామాజిక ఇతివృత్తం ఆధారంగా), ‘మోదుగు పూలు’ (నిజాం కాలంలో ప్రజల స్థితిగతులు), జనపదం (నిజాం కాలం నాటి పరిస్థితులు) వంటి నవలలు రాశారు. ఈయన తొలిసారిగా నాలుగు వేద సంహితలను తెలుగులో అనువదించారు. తెలంగాణ ఆత్మతత్వం గురించి వివరించారు.


మాదిరి ప్రశ్నలు

 

1. ‘నా గొడవ’ గ్రంథ రచయిత ఎవరు?

ఎ) దాశరథి రంగాచార్య       బి) దాశరథి కృష్ణమాచార్య 

సి) కాళోజీ నారాయణరావు   డి) సుద్దాల హనుమంతు


2. దేశోద్ధారక గ్రంథాలయాలను ఎవరు స్థాపించారు?

ఎ) వట్టికోట ఆళ్వారు స్వామి  బి) మాడపాటి హనుమంతరావు 

సి) రామానుజరావు     డి) రంగారెడ్డి


3. కిందివారిలో తెలంగాణ తొలి నవలా రచయిత ఎవరు?

ఎ) దాశరథి కృష్ణమాచార్యులు     బి) దాశరథి రంగాచార్యులు 

సి) మాడపాటి హనుమంతరావు   డి) వట్టికోట ఆళ్వారు స్వామి


4. తెలంగాణ తొలి నవల ఏది?

ఎ) గంగు    బి) జైలు లోపల సి) మోదుగు పూలు   డి) చిల్లర దేవుళ్లు


5. కింది ఏ గ్రంథానికి ఉత్తమ అనువాద రచయిత అవార్డు వచ్చింది?

ఎ) తుది విజయం     బి) జీవనగీత 

సి) అణా కతలు       డి) పార్థీవ న్యాయం


6. కిందివారిలో పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిన కవి- 

ఎ) కాళోజీ నారాయణ రావు     బి) కృష్ణారావు 

సి) మాడపాటి హనుమంతురావు  డి) సుద్దాల హనుమంతు


7. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పలికినవారు ఎవరు?

ఎ) దాశరథి రంగాచార్యులు   బి) దాశరథి కృష్ణమాచార్యులు

సి) వట్టికోట ఆళ్వారు స్వామి  డి) సుద్దాల హనుమంతు


8. కిందివాటిలో ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది?

ఎ) రుద్రవీణ     బి) అగ్నిధార

సి) తిమిరంతో సమరం   డి) రామప్ప తల్లి


జవాబులు: 1-సి, 2-ఎ, 3-డి, 4-ఎ, 5-బి,  6-ఎ, 7-బి, 8-సి.
 

 


రచయిత: డాక్టర్‌ జితేందర్‌ రెడ్డి 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌