• facebook
  • whatsapp
  • telegram

జాతీయ మహిళా కమిషన్‌

    సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైంది. అలాంటి మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. వీరి ప్రాధాన్యాన్ని గుర్తించి భారత రాజ్యాంగం మహిళల రక్షణ, సంక్షేమానికి అనేక చట్టాలను రూపొందించింది. భారత ప్రభుత్వం వీటన్నింటినీ సమీక్షించి మహిళల ప్రగతికి కృషి చేయడానికి జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పాటు
 మహిళల శ్రేయస్సే లక్ష్యంగా 1990లో భారత పార్లమెంటు ‘జాతీయ మహిళా కమిషన్‌’ చట్టాన్ని ఆమోదించింది. దీనికి 1990, ఆగస్టు 30న రాష్ట్రపతి ఆమోదం లభించగా; 1992, జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.

నిర్మాణం, నియామకం, కాల పరిమితి
జాతీయ మహిళా కమిషన్‌లో ఒక అధ్యక్షురాలు, అయిదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరందరినీ కేంద్ర కేబినెట్‌ సిఫార్సులపై రాష్ట్రపతి నియమిస్తారు. సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని తప్పనిసరిగా నియమించాలి. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు.
ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కృషితో 1953లో మహిళా సంక్షేమం కోసం కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిని ఏర్పాటుచేశారు.

* 1985లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖలో మహిళలు, బాలల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ విభాగం 2006లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖగా మారింది.

సుప్రీంకోర్టు తీర్పులు
దిల్లీ డొమెస్టిక్‌ వర్కింగ్‌ వుమెన్స్‌ ఫోరమ్‌ Vs ( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1995)
అత్యాచారం కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదుదారులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని, అత్యాచారం కేసుల్లో బాధితురాలి పేరు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నేర నిర్ధారణ జరిగిన తర్వాత బాధితురాలికి ఆర్టికల్‌ 21 ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని ఈ కేసులో తీర్పు ఇచ్చింది.

విశాఖ స్వచ్ఛంద సంస్థ జు( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌  కేసు (1997)
ఈ కేసులో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెలువరించింది.
* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థల యజమానులు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుని వాటికి బాధ్యత వహించాలి.
* లైంగిక వేధింపులు అంటే శరీరాన్ని తాకడం, లైంగికపరమైన అవసరం తీర్చమని కోరడం, లైంగికపరమైన అర్థం వచ్చే మాటలు మాట్లాడడం, అసభ్యకర చిత్రాలను చూపడం.
* బాధితులకు తమను వేరేచోటికి బదిలీచేయమని అడిగే హక్కు లేదా నేరానికి పాల్పడిన వ్యక్తిని బదిలీ చేయమని కోరే హక్కు ఉండాలి.

నిర్భయ చట్టం, 2013
న్యూదిల్లీలోని ఒక పారా మెడికల్‌ విద్యార్థినిపై 2012, డిసెంబరు 16న జరిగిన దారుణ సంఘటన కారణంగా మహిళలపై హింసను అరికట్టి, ప్రస్తుత చట్టాలను సమీక్షించి మార్పులను సూచించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ వర్మ అధ్యక్షతన కేంద్రప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 2013, ఫిబ్రవరి 3న మహిళల రక్షణ కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీన్ని ‘నేరన్యాయ సవరణ చట్టం’గా పార్లమెంటు ఆమోదించింది. ఇదే  నిర్భయ చట్టం.మహిళల సంరక్షణకు కీలక చట్టాలు
*  హిందూ వివాహ చట్టం, 1955
* హిందూ వారసత్వ చట్టం, 1956
* స్త్రీలు, బాలికల అక్రమ వ్యాపార నిరోధక చట్టం, 1956
* మహిళల ప్రసూతి సౌకర్యాల చట్టం, 1961
* వరకట్న నిషేధ చట్టం, 1961
* గర్భవిచ్ఛిత్తి చట్టం, 1971
* కుటుంబ కోర్టుల చట్టం, 1984
* సతీసహగమన నిరోధక చట్టం, 1987
* మహిళా సమృద్ధి యోజన, 1993
* గృహహింస నిరోధక చట్టం, 2005
* బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006
* లైంగిక నేరాల నిరోధక చట్టం, 2010
* బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం, 2012
* నేరన్యాయ సవరణ చట్టం, 2013

అధికారాలు - విధులు
* మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి అవసరమైతే వాటికి సవరణలు సూచించడం.
* రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.
* అన్యాయానికి గురైన మహిళలకు భరోసా కల్పించి, వారికి చట్టపరంగా పరిహారాన్ని అందేలా కృషిచేయడం.
* కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* ‘పరివారక్‌ మహిళా అదాలత్‌’ల ద్వారా కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.
* వరకట్న నిషేధ చట్టం (1961), గృహ హింస  నిరోధక చట్టం (2005) అమలుకు కృషిచేయడం.
* మహిళా సాధికారత సాధనకు; బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా నియంత్రణకు కృషిచేయడం.
* దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అవసరమైన సిఫార్సులు చేయడం.
* మహిళల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కొన్ని కేసులను సుమోటోగా స్వీకరించడం; ఈ కమిషన్‌ సివిల్‌కోర్టుతో సమానమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
* మహిళలకు సంబంధించిన అంశాలపై సాక్షులను విచారించడానికి కమిషన్‌ ముందు హాజరు కావాలని సమన్లు జారీచేయడం.
* వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం.

ఇతర కీలకాంశాలు
 జాతీయ మహిళా కమిషన్‌ నిర్వహించే ప్రాంతీయ సమావేశాలకు ‘వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌’ అని పేరు పెట్టారు.
 మనదేశంలో 2013 నుంచి ఏటా జనవరి 24న దేశవ్యాప్తంగా జాతీయ బాలికా, శిశు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత జాతీయ విధానాన్ని 2001లో రూపొందించింది.
 నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ - హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు: 011 - 13237166
 వుమెన్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు: 1091
 యాంటీ గర్ల్‌ ఛైల్డ్‌ మ్యారేజెస్‌: 1800 4252908

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌