• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌సీఆర్‌బీ వార్షిక నివేదిక - 2022

మహిళలపై భర్తలు.. బంధువుల అకృత్యాలే అధికం!

విశ్వసనీయ గణాంకాలను విశ్లేషించి, నేరాల ధోరణులను గుర్తించి సమగ్ర సమాచారాన్ని ఎన్‌సీఆర్‌బీ ప్రభుత్వానికి ఏటా అందిస్తుంది. నేరాలను అరికట్టడానికి, తగ్గించడానికి అవసరమైన విధానాలను, చట్టాలను రూపొందించడానికి ఆ నివేదికలు ఉపయోగపడతాయి. 2022 నివేదిక ప్రకారం మహిళలపై అకృత్యాలు నాలుగు శాతం పెరిగాయి. చిన్నారులపైనా దౌర్జన్యాలు అధికమవుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మనుషుల అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోయింది. దేశంలో ఇప్పటికీ రోజుకి 78 హత్యలు జరుగుతున్నాయి. సమాజ సమస్యల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి.  సామాజిక భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకోవాలి. 

‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)’ అనేది నేర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే ఒక జాతీయ సంస్థ. దీన్ని 1986, మార్చి 11న దిల్లీలో స్థాపించారు. ఇది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది. ఎన్‌సీఆర్‌బీ నేరాలు, నేరగాళ్లకు సంబంధించిన జాతీయ డేటాబేస్‌లను నిర్వహిస్తుంది. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, విధాన రూపకర్తలకు విలువైన సమాచారాన్ని అందిస్తుంది. 

ఎన్‌సీఆర్‌బీ సమాచారం: భారతీయ శిక్షా స్మృతి (ఐపీఎస్‌), ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్‌ఎల్‌ఎల్‌) నిర్వచించిన నేర డేటాను సేకరించడం, విశ్లేషించడం లాంటి బాధ్యతలను నిర్వర్తించే భారతీయ ప్రభుత్వ సంస్థే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో. ఎన్‌సీఆర్‌బీ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)లో భాగమిది. ప్రస్తుతం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డైరెక్టర్‌ వివేక్‌ గోగియా (ఐపీఎస్‌). 

 మాతృ విభాగం - హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  

నేరగాళ్ల సమాచారాన్ని సేకరించడానికి; నేరాన్ని నేరగాళ్లకు అనుసంధానించడంలో పరిశోధకులకు సహాయం చేయడానికి ఎన్‌సీఆర్‌బీని ఏర్పాటు చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ (1985); నేషనల్‌ పోలీస్‌ కమిషన్‌ (1977)   సిఫార్సుల ఆధారంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ కోఆర్డినేషన్‌ అండ్‌ పోలీస్‌ కంప్యూటర్‌ (డీసీపీసీ), సీబీఐ ఇంటర్‌ స్టేట్‌  క్రిమినల్స్‌ డేటా బ్రాంచ్, సీబీఐ సెంట్రల్‌ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలను విలీనం చేసి దీన్ని ఏర్పాటు చేశారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌  (బీపీఆర్‌ అండ్‌ డీ) శాఖను కూడా దీనిలో విలీనం చేశారు.

నినాదం: సమాచార సాంకేతికతతో భారతీయ పోలీసులకు సాధికారత కల్పించడం

2022లో దేశంలో నమోదైన నేరాలకు సంబంధించి జాతీయ నేరాల నమోదు సంస్థ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) రూపొందించిన వార్షిక నేర నివేదికను కేంద్రహోంశాఖ 2023, డిసెంబరు 4న విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

2022లో మొత్తం 58,24,948 నేరాలు నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ కింద 35,61,379; ఇతర ప్రత్యేక, స్థానిక చట్టాల కింద 22,63,567 కేసులు, ఇతరాలు నమోదయ్యాయి. అంతకు ముందు నమోదైన 60,96,310 కేసులతో పోలిస్తే 2022లో 2,71,364 (4.5%) మేర తగ్గుదల నమోదైంది.

క్రైమ్‌ రేట్‌ (ప్రతి లక్ష మంది జనాభాకు) 445.9 నుంచి 422.2కు తగ్గింది.

1) అపహరణ (కిడ్నాప్‌) కేసులు:

దేశవ్యాప్తంగా 2022లో 1,07,588 కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే (1,01,707) 5.8% ఎక్కువ. ఇందులో మహిళలు (88,861) అత్యధికంగా ఉన్నారు.

2) మహిళలపై అకృత్యాలు-కేసులు:

మహిళలపై జరిగిన అకృత్యాలపై పెట్టిన కేసులు 4,28,278 నుంచి 4,45,256 (4%)కు పెరిగాయి. ఇందులో భర్త, బంధువుల హింస (31.4%)లకు సంబంధించినవే అత్యధికం ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కిడ్నాప్‌ (19.2%), లైంగికదాడి (18.7%), అత్యాచారం (7.1%) కేసులు ఉన్నాయి. ప్రతి లక్ష మంది మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి నమోదైన కేసులు 2021లో 64.5 మేర ఉండగా, 2022లో ఆ సంఖ్య 66.4కు పెరిగింది.

3) చిన్నారులపై దౌర్జన్యాలు- కేసులు:

చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 1,49,404 నుంచి 1,62,449 (8.7%)కి పెరిగింది. ఇందులో అత్యధికం కిడ్నాప్‌ (45.7%), అత్యాచారం సహా పోక్సో చట్టం కింద నమోదైన కేసులు (39.7%) ఉన్నాయి. చిన్నారులపై క్రైం రేట్‌ ప్రతి లక్షమందికి  33.6 నుంచి 36.6 కు పెరిగింది.

 జువెనైల్‌ కేసులు 31,170 నుంచి 30,555 (2%)కు తగ్గాయి. ఈ కేసుల్లో 37,780 మంది బాలలను అరెస్టు చేశారు. ఇందులో  78.6% మంది 16 నుంచి 18 ఏళ్లలోపు వారే.

4) వృద్ధులపై నమోదైన కేసులు:

సీనియర్‌ సిటిజన్లపై  నమోదైన కేసులు 26,110 నుంచి 28,545 (9.3%)కు పెరిగాయి. ఇందులో 27.3% సాధారణ దాడులు, 13.8% దొంగతనాలు కాగా; ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్‌లకు సంబంధించినవి 11.2% ఉన్నాయి. 

5) ఎస్సీ అట్రాసిటీ కేసులు:

ఎస్సీ అట్రాసిటీ కింద నమోదైన కేసులు 50,900 నుంచి 57,572  (13.1%)వరకు పెరిగాయి. వీరిపై క్రైమ్‌ రేట్‌ ఏడాదిలో 25.3 నుంచి 28.6కు పెరిగింది.

6) ఎస్టీ అట్రాసిటీ కేసులు:

 

8,802 నుంచి 10,064 (14.3%)కి పెరిగాయి. వీరిపై క్రైమ్‌ రేట్‌ 8.4 నుంచి   9.6 కి పెరిగింది.

7) ఆర్థిక నేరాలు:

ఆర్థిక నేరాలు 1,74,013 నుంచి 1,93,385 (11.1%)కి పెరిగాయి. ఇందులో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, చీటింగ్, దొంగనోట్ల కేసులు అత్యధికం ఉన్నాయి.

8) రాష్ట్రాల వారిగా అవినీతి కేసులు:

రాష్ట్రాల అవినీతి నిరోధక శాఖలు నమోదు చేసిన అవినీతి కేసులు 3,745 నుంచి 4,139 (10.5%)కి పెరిగాయి. ఇందులో 69.7% పట్టుబడిన కేసులే.

ఈ కేసుల్లో 4,994 మందిని అరెస్ట్‌ చేయగా, 852 మందికి శిక్షపడింది.

9) సైబర్‌ నేరాలు:

ఏడాది కాలంలో  సైబర్‌ నేరాలు 52,974 నుంచి 65,893 (24.4%)కు పెరిగాయి. ఈ విభాగంలో క్రైమ్‌ రేట్‌ 3.9 నుంచి 4.8 కి పెరిగింది. ఇందులో 64.8% కేసులకు ప్రధాన కారణం మోసం చేయడమే.

అక్రమ వసూళ్లు 5.5%, లైంగిక దోపిడీ కింద 5.2% కేసులు నమోదయ్యాయి.

10) విదేశీయులకు వ్యతిరేకంగా:

విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు 150 నుంచి 192కు పెరిగాయి. 28% వృద్ధి నమోదైంది. ఇందులో 34 దొంగతనాలు, 28 అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇందులో 56.8% మంది ఆసియా, 18% మంది ఆఫ్రికన్‌ ఖండాలకు చెందినవారు ఉన్నారు.

11) మనుషుల అక్రమ రవాణా:

 ఇవి 2,189 నుంచి 2,250 (2.8%)కు పెరిగాయి. అక్రమ రవాణాకు గురైన వారిలో 2,878 మంది చిన్నారులు, 3,158 మంది పెద్దలు ఉన్నారు.

2022లో 4,42,572 మంది వ్యక్తులు తప్పిపోయారు. అంతకుముందు సంవత్సరం కంటే ఇది 13.5% అధికం. ఇందులో 1,49,008 మంది పురుషులు, 2,93,500 మంది మహిళలు, 64 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2022లో తప్పిపోయిన వారిలో మొత్తం 4,01,077 మందిని గుర్తించారు.

12) తప్పిపోయిన చిన్నారులు:

వీరి సంఖ్య ఏడాదిలో 77,535 నుంచి 83,350 కి పెరిగింది. ఇందులో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

13) హత్య కేసులు:

ఎన్‌సీఆర్‌బీ వార్షిక నేర  నివేదిక-2022 ప్రకారం దేశంలో 2022లో 28,522   హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో (29,272) పోలిస్తే 2022లో   2.6 శాతం తగ్గుదల నమోదైంది.

14) ఆత్మహత్యలు:

దేశవ్యాప్తంగా 2021లో జరిగిన అన్ని రకాల ప్రమాదాల్లో 3,97,530 మంది మృతి చెందగా, 2022లో ఆ సంఖ్య 4,30,504కు చేరింది.

2022లో దేశంలో మొత్తం 1,70,924 మంది  ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,64,033గా ఉంది. 2021తో పోలిస్తే 2022లో దాదాపు 4% మేరకు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు (7,876), మహారాష్ట్ర (6,275), మధ్యప్రదేశ్‌ (5,371),  తెలంగాణ (4,513) ఉన్నాయి.

15) రైతులు, కూలీలకు సంబంధించిన అంశాలు: 

2022 లో దేశవ్యాప్తంగా 11,290 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 5,207 మంది రైతులతోపాటు మరో 6,083 మంది కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలో రోజూ 154 మంది రైతులు, రోజువారి కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. నీ 2021లో ఈ సంఖ్య 144గా ఉంది. మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 6.6 శాతం కాగా, రోజువారి కూలీలు 26.4 శాతం మేర ఉన్నారు. అంటే 2022 ఏడాదికి మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో రోజువారి కూలీలే 44,713 మంది ఉన్నారు. నీ దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది.

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2022లో ప్రతి లక్ష జనాభాకు కనిష్ఠ సంఖ్యలో గుర్తించదగిన నేరాలు   నమోదైన నగరాల్లో 86.5% కేసులతో కోల్‌కతా ప్రథమ స్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణే (280.7%), హైదరాబాద్‌  (299.2%) నగరాలు ఉన్నాయి. నీ 2022లో అత్యంత ఎక్కువ అల్లర్లు చోటుచేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. 2022లో ఈ రాష్ట్రంలో అల్లర్లకు సంబంధించి 8,218 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత బిహార్‌లో  4,736,  ఉత్తర్‌ప్రదేశ్‌లో 4.478 అల్లర్ల కేసులు నమోదయ్యాయి.

16) హత్యలు:

2022లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 3,491 హత్య కేసులు నమోదయ్యాయి. బిహార్‌లో 2,930, మహారాష్ట్రలో 2,295 హత్యలు జరిగాయి.

2022లో రాజస్థాన్‌లో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌ (3,690 కేసులు), మధ్యప్రదేశ్‌ (3,029 కేసులు), మహారాష్ట్ర (2,904 కేసులు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2022లో దేశంలోనే అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 4,01,787 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 3,74,038 క్రిమినల్‌ కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

17) యాసిడ్‌ దాడులు:

2022లో 19 మెట్రోపాలిటన్‌ నగరాల్లో నమోదైన మహిళలపై యాసిడ్‌ దాడి కేసులకు సంబంధించి 8 కేసులతో బెంగళూరు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దిల్లీ, అహ్మదాబాద్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

 

Posted Date : 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌