• facebook
  • whatsapp
  • telegram

సహాయ నిరాకరణ ఉద్యమం

భారత జాతి ధిక్కారం!

 

ఆ ఉద్యమంలో భారత జాతి చాటిన ధిక్కారం ఆంగ్లేయులను ఆశ్చర్యానికి గురిచేసింది. విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఉద్ధృతంగా జరిగిన పోరు దేశాన్ని మరింత బలంగా ఏకం చేసింది. జాతీయవాదులందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. అన్నింటికీ మించి మొదటిసారి గాంధీజీ సారథ్యంలో సాగిన సహాయ నిరాకరణ సమరం, అహింసా మార్గంలో పోరాటాల శక్తిని నిరూపించింది. కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు అందులో భాగమయ్యాయి.

 

 

భారతదేశ స్వాతంత్య్ర సమర చరిత్రలో గాంధీజీ నాయకత్వంలో నిర్వహించిన ‘సహాయ నిరాకరణ ఉద్యమం (1920 - 22)’ అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టం. మన జాతి ఉవ్వెత్తున ఉద్యమించి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన ప్రజా పోరాటం. 


జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ: 1919లో ఆంగ్లేయులు చేసిన భారత ప్రభుత్వ చట్టం - 1919 ప్రజలకు నిరాశను మిగిల్చింది. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న తీవ్ర వ్యతిరేకతను కఠినంగా అణచి వేసేందుకు తెచ్చిన రౌలత్‌ చట్టంపైనా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పౌర హక్కులను హరించే సైతాన్‌ చట్టంగా గాంధీజీ దానిని అభివర్ణించారు. ప్రజలంతా చైతన్యవంతులై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం విముక్తి పొందుతుందని పిలుపునిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 6న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. హర్తాళ్లు, సమ్మెలు ఉద్ధృతంగా సాగాయి. హిందూ-ముస్లిం ఐక్యత పరిఢవిల్లింది. విదేశీ పాలన పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమైంది. 


ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. ప్రజలపై దమనకాండకు దిగింది. పంజాబ్‌ ప్రాంతం కల్లోలంగా మారింది. ప్రజా నాయకులైన డాక్టర్‌ సైౖఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌ జలియన్‌వాలా బాగ్‌ మైదానంలో ఏప్రిల్‌ 13న సమావేశమైన నిరాయుధ జనసమూహంపై, సైనికాధికారి డయ్యర్‌ తన సైనికదళాలతో కాల్పులు జరిపించాడు. వందలాది మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ దారుణంతో దేశ వ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడింది. నాగరీకులమని ప్రకటించుకునే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వికృత హింసా ధోరణి ప్రపంచానికి బహిర్గతమైంది. భారతీయ రచయితలూ, మేధావులు, మానవతావాదులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదులూ, హోదాలను త్యాగం చేసి, సామాన్య ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఆ తీవ్ర నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం విచారణ కోసం హంటర్‌ కమిషన్‌ను నియమించింది. అది నామమాత్రంగా పని చేసి డయ్యర్‌ను ఆరోపణల నుంచి  విముక్తుడిని చేసింది. కాంగ్రెస్‌ నియమించిన గాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్, జయకర్, అబ్బాస్‌ త్యాబ్జిలతో కూడిన విచారణ సంఘం సాక్ష్యాధారాలను పరిశీలించి, హింసాకాండకు డయ్యర్‌ పూర్తి బాధ్యుడని తేల్చింది. పంజాబ్‌ మారణకాండ దేశప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది.

 

ఖిలాఫత్‌ సమస్య: భారత దేశంలోని ముస్లింలు టర్కీ (ప్రస్తుత తుర్కియే) దేశాధినేత సుల్తాన్‌ను తమ మత గురువుగా (ఖలీఫా) గౌరవిస్తారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ, జర్మనీ పక్షాన చేరి, మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వ్యతిరేకంగా పోరాడి ఓడింది. మిత్ర రాజ్యాలు టర్కీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా, ఖలీఫా పదవి రద్దు చేయడానికి నిశ్చయించాయి. ఈ పరిస్థితుల్లో  టర్కీ సామ్రాజ్యానికి, ఖలీఫా వైభవానికి భంగం కలిగించవద్దని బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయ ముస్లింలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మౌలానా మొహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ సోదరుల నాయకత్వంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పడింది. హకీమ్‌ అఫ్జల్‌ఖాన్, హస్రత్‌ మొహాని, మౌలానా ఆజాద్‌ లాంటివారు ఈ కమిటీలో సభ్యులు. ఖలీఫా స్థానాన్ని భంగపరిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కమిటీ నిర్ణయించింది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీపై విధించిన షరతుల్లో ఖలీఫా పదవి పునరుద్ద్ధరణ ప్రస్తావన లేదు. దాంతో మన దేశంలోని ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమానికి సిద్ధమయ్యారు.  


1920, మే 28న బొంబాయిలో జరిగిన సమావేశంలో గాంధీజీ సూచనతో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఖిలాఫత్‌ కమిటీ ఆమోదించింది. జూన్‌ మొదటి వారంలో అలహాబాదులో జరిగిన హిందూ-ముస్లింల సమావేశంలో ఆ పోరాటానికి హిందువుల సహకారాన్ని కోరుతూ కమిటీ విజ్ఞప్తి చేసింది. హిందూ-ముస్లింలను ఏకం చేయడానికి ఖిలాఫత్‌ ఉద్యమం ఒక సువర్ణావకాశమని గాంధీజీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులూ భావించారు. 1920, జూన్‌లో అలహాబాదులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమం జరపాలని నిర్ణయించి, ఇందుకు సారథ్యం వహించాలని గాంధీజీని కోరారు. ఈ ఉద్యమం 1920, ఆగస్టులో ప్రారంభమైంది. 1920, సెప్టెంబరులో కలకత్తాలో లాలా లజపతిరాయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వరాజ్య సాధనకు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది డిసెంబరులో సి.విజయరాఘవాచారి అధ్యక్షతన నాగ్‌పుర్‌ వార్షిక సమావేశంలో కాంగ్రెస్‌ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.

 

సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమం: బహిష్కరణలు, స్వదేశీ నినాదం, జాతీయ విద్య ఈ ఉద్యమంలో ప్రధాన అంశాలు. బహిష్కరణ అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు, విదేశీ వస్తువులను బహిష్కరించడం. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను వదులుకోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వైదొలగడం. కేంద్ర రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం ఉద్యమంలో భాగం. జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం, వివాదాల  పరిష్కారం కోసం పంచాయతీల పేరుతో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం. స్వదేశీ భావనను పెంపొందిస్తూ, ఖాదీ తయారీకి చేతులతో నూలు వడకడం. హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టడం. అహింసను సంపూర్ణంగా అమలు చేయాలని గాంధీజీ ఉద్బోధించారు. ఒక సంవత్సరంలో స్వరాజ్యం సిద్ధిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


లక్ష్యాలు: పంజాబ్‌ దురాగతాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం  క్షమాపణ చెప్పడం, స్వరాజ్యం, టర్కీ సుల్తాన్‌ పూర్వస్థితిని పునరుద్ధరించడం ఉద్యమ డిమాండ్లు.

 

ఉద్యమ గతి: 1921 - 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ప్రజల్లో అమితమైన ఉత్సాహం వ్యక్తమైంది. విదేశీ వస్త్రాల బహిష్కరణ విజయవంతమైంది. వాటిని కుప్పలుగా పోసి వీధుల్లో తగలబెట్టారు. విదేశీ వస్త్ర దిగుమతులు పడిపోయాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించారు. అనేకమంది ప్రసిద్ధ న్యాయవాదులైన ఎంఆర్‌ జయకర్, ప్రకాశం పంతులు, సీఆర్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ, సైఫుద్దీన్‌ కిచ్లూ, వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, అసఫ్‌ అలీ తదితరులు  తమ ప్రాక్టీస్‌లను వదులుకున్నారు. విదేశీ కోర్టులను బహిష్కరించారు. భారతదేశ సందర్శనకు వస్తున్న వేల్స్‌ రాకుమారుడి పర్యటనను ఉద్యమకారులు బహిష్కరించారు. మద్యపానాన్ని నిషేధించాలంటూ కల్లు దుకాణాల ముందు ఉద్ధృతంగా ధర్నాలు చేశారు. దాంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తిలక్‌ స్వరాజ్య నిధి సేకరణ రూ.కోటి లక్ష్యాన్ని దాటింది. జాతీయోద్యమానికి ఖాదీ ఒక యూనిఫామ్‌గా మారిపోయింది. గాంధీజీ పిలుపుతో కార్యకర్తలు స్వచ్ఛందంగా జైళ్లకు వెళ్లడానికీ సిద్ధమయ్యారు. ఖిలాఫత్‌ నాయకులైన అలీ సోదరులతో కలిసి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. తీవ్రరూపం దాల్సిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఉద్యమకారులను విచక్షణారహితంగా అరెస్ట్‌ చేసింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో చీరాల - పేరాల సత్యాగ్రహం, పల్నాడులో అటవీ సత్యాగ్రహం, పెదనందిపాడులో పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగాయి.

 

చౌరీ చౌరా సంఘటన (1922): సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922, ఫిబ్రవరి 5న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో చోటుచేసుకున్న ఒక  సంఘటన ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపేసేందుకు కారణమైంది. 

ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు, పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని వెంటనే ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యను నాటి కాంగ్రెస్‌ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ 1922, ఫిబ్రవరి 12న బార్డోలీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గాంధీజీ నిర్ణయాన్ని ఆమోదించింది. ఉద్యమం నిలిచిపోయింది. ప్రభుత్వం గాంధీజీపై దేశద్రోహం నేరం మోపి అరెస్టు చేసింది. టర్కీలో ముస్తఫా కెమల్‌ పాషా ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగి, సుల్తాన్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో ఖిలాఫత్‌ ఉద్యమం కూడా ఆగిపోయింది.


సహాయ నిరాకరణ ఉద్యమ ఫలితాలు: ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్న డిమాండ్లను సాధించలేకపోయినప్పటికీ, కొన్ని మంచి ఫలితాలను అందించింది. అప్పటి వరకు భిన్న వర్గాల ప్రజలు తమ ప్రయోజనాల కోసం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు సాగించారు. కానీ గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం  జాతీయోద్యమంగా మారింది. దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమనే ప్రజల కృత నిశ్చయం సంపూర్ణంగా వ్యక్తమైంది. హిందూ ముస్లిం ఐక్యతను సాధించింది. జాతీయవాద భావం, జాతీయోద్యమం దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వ్యాపించాయి. తర్వాత దశలో జరిగిన శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ప్రజల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యశక్తిని ఎదిరించగలమనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. 

ర‌చ‌యిత‌:  వి.వి.ఎస్‌.రామావ‌తారం

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌