• facebook
  • whatsapp
  • telegram

ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు


ఏకపార్టీ వ్యవస్థ:
* ఏదైనా దేశంలో ఒక పార్టీ మాత్రమే ఉండే పరిస్థితిని ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఇలాంటి వ్యవస్థ కమ్యూనిస్టు, నియంతృత్వ దేశాల్లో అమల్లో ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉండవు.
* ఏకపార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో ప్రజాభిప్రాయం కంటే రాజ్యాధికారానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థల్లో ప్రజలకు హక్కులు పరిమితంగా, విధులు అపరిమితంగా ఉంటాయి.
* ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది.
* గతంలో సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌పార్టీ, జర్మనీలో నాజీపార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీలను ఏకపార్టీ వ్యవస్థలుగా పేర్కొనవచ్చు.
* ఇలాంటి వ్యవస్థల్లో ప్రజాసంక్షేమం కంటే, రాజ్యం విధానాలకు ప్రాధాన్యం ఉంటుంది.
* అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తారు.
* నిర్బంధ సైనిక సేవ, నిర్బంధ పన్నుల వ్యవస్థ అమల్లో ఉంటుంది.
* ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం ఉండదు. ఏకపార్టీ వ్యవస్థ రూపొందించిన నియంతృత్వ విధానాలను ప్రజలందరూ పాటించాల్సిందే.

ద్విపార్టీ వ్యవస్థ:
* ఏదైనా దేశ రాజకీయాల్లో రెండు పార్టీలు మాత్రమే వర్ధిల్లుతుంటే దాన్ని ద్విపార్టీ వ్యవస్థ అంటారు. ఇలాంటి చోట ఇతర రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ఉనికి చెప్పుకోదగిందిగా ఉండదు.
* ఒకవేళ మూడో రాజకీయ పార్టీ ప్రాముఖ్యం సంతరించుకుంటే అది అంతకు ముందున్న రెండు పార్టీల స్థానాన్ని ఆక్రమిస్తుంది.
* అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు; ఇంగ్లండ్‌లో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు ప్రాబల్యంలో ఉన్నాయి.
* రెండు పార్టీలున్న దేశాల్లో అధికార బదిలీ ఆయా పార్టీల విధానాలు, ప్రజాభిప్రాయం ఆధారంగా ఏదో ఒకపార్టీ ప్రభుత్వాధికారాన్ని చేపడుతుంది.
* ద్విపార్టీ వ్యవస్థలో రాజకీయ సుస్థిరత ఉంటుంది. అనిశ్చిత ప్రజాభిప్రాయానికి అవకాశాలు ఉండవు. ప్రజలకు అధికార పక్షాన్ని మినహాయిస్తే కేవలం ప్రతిపక్ష పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుంది.
* ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కూడా అధికార పక్షానికి స్పష్టమైన వైఖరి ఉంటుంది.

 

బహుళ పార్టీ వ్యవస్థ: 
* ఏదైనా దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటే దాన్ని బహుళ పార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో ఏ పార్టీ అధికారానికి వస్తుందో కచ్చితంగా చెప్పలేం.
* ఫ్రాన్స్, ఇటలీ, భారత దేశాల్లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది.

బహుళ పార్టీ వ్యవస్థ - లక్షణాలు 
* పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు స్పష్టంగా లేకపోవడం.
* అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ముఠాలుగా ఏర్పడటం.
* నాయకుల వ్యక్తిత్వం, ఆకర్షణలపై రాజకీయ పార్టీలు ఏర్పడటం.
* నిరంతరం చీలికలు, కలయికలతో వర్ధిల్లి ఉండటం.
* ప్రజాభిప్రాయం స్పష్టతను కలిగి ఉండకపోవడం.
* తరచూ ప్రభుత్వాలు మార్పులకు గురికావడం.
* రాజకీయ అనిశ్చిత నెలకొనడం.
* ప్రజలకు అనేక ప్రత్యామ్నాయాలు ఉండటం.
* బలమైన ప్రతిపక్షం ఏర్పడకపోవడం.
* సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొని ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం.
* సుస్థిరమైన రాజకీయ నిర్ణయాలు లేకపోవడం.

భారత రాజకీయ పార్టీ వ్యవస్థ - పరిశీలన 
* సాధారణంగా ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ద్విపార్టీ వ్యవస్థ లేదా బహుళపార్టీ వ్యవస్థ ఉంటుంది.
* భారతదేశంలో పార్టీ వ్యవస్థ ద్విపార్టీ వ్యవస్థ కాదు. ఇది బహుళ పార్టీ వ్యవస్థ అయినప్పటికీ సంపూర్ణంగా బహుళ పార్టీ వ్యవస్థ అని కూడా చెప్పలేం.
* మనదేశ రాజకీయ వ్యవస్థను కొందరు ఏకపార్టీ ఆధిక్యత కలిగిన బహుళపార్టీ వ్యవస్థ అంటారు. ఈ పోకడ దాదాపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది.
* భారత రాజకీయ వ్యవస్థ మరో ముఖ్య లక్షణం - నిరంతరం చీలికలు, కలయికలు.
* 1969లో కాంగ్రెస్‌పార్టీ కొత్త కాంగ్రెస్, వ్యవస్థ కాంగ్రెస్‌గా చీలిపోయింది.
* 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చి ఇందిరా కాంగ్రెస్, KBR కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయి.
* సోనియాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులైన శరద్‌పవార్, పి.ఎ. సంగ్మా, తారిఖ్ అన్వర్‌లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు.
* 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలికకు గురై CPI, CPMగా అవతరించాయి. 1969లో CPM నుంచి CPI ఏర్పడింది.
* ప్రాంతీయ పార్టీలైన DK (ద్రవిడ కజగం) నుంచి DMK (ద్రవిడ మున్నేట్ర కజగం) ఏర్పడింది.
* DMK నుంచి AIADMK ఏర్పడింది.
* తెలుగుదేశం పార్టీ నుంచి 1984లో నాదెండ్ల భాస్కరరావు నాయకత్వంలో ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏర్పడింది. 1995 ఆగస్టులో చంద్రబాబు నాయకత్వంలో TDP మరొకసారి చీలిపోయింది.
* 1977లో వ్యవస్థా కాంగ్రెస్, సోషలిస్ట్‌పార్టీ జనసంఘ్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, భారతీయ లోక్‌దళ్ కలిసి జనతా పార్టీగా అవతరించాయి.
* 1979-80 మధ్యకాలంలో ఈ పార్టీలు మళ్లీ విడిపోయాయి.
* 1989లో జనతాపార్టీ లోక్‌దళ్ కలిసి, జనతాదళ్‌గా అవతరించాయి.
* 1989లో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు నేషనల్ ఫ్రంట్ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి.
* 1996లో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
* 1998లో BJP నాయకత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) కూటమిగా ఏర్పడ్డాయి.
* 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు UPA (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్) కూటమిగా ఏర్పడ్డాయి.
* ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలోని 16వ లోక్‌సభలో BJP నాయకత్వంలోని NDA కూటమి అధికారంలో ఉంది.

ఏకాధిపత్య పార్టీ వ్యవస్థ 
* భారతదేశంలో ఫ్రెంచ్, ఇటలీ దేశాల్లో మాదిరి బహుళపార్టీ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ దేశాల్లో మాదిరిగా కాకుండా మనదేశంలో ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగుతుందని రాజనీతి శాస్త్రవేత్తలైన మైరన్ వీనర్, రజినీ కొఠారీ పేర్కొన్నారు.
* మనదేశంలో స్వాతంత్య్రం లభించిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలపాటు కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కలిగి ఉంది.
* 1967 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధిపత్యం అంతరించి పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* 1970 నుంచి 1977 వరకు తిరిగి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. 1980లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రలో అధికారానికి వచ్చి, 1989 వరకు కొనసాగింది.
* 1991 నుంచి 1996 వరకు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చెలాయించింది.

ప్రాంతీయతత్వం 
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌పార్టీ తన విధానాలను మార్చుకోకపోవడం వల్ల వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న ధ్యేయంతో 1967 తర్వాత అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ ఆకాంక్షాలకు అనుగుణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
* 1980 తర్వాత ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరిగి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాయి.
* లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్ధతుతో జాతీయ స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు.
* మనదేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల ఏర్పాటు 1989 నుంచి సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

ఇంతవరకు మన దేశంలో కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు

లోక్‌సభ - వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు
1వ లోక్‌సభ ఎన్నికలు (1951)
1. కాంగ్రెస్ పార్టీ                    -               364
2. సీపీఐ                             -               16
3. సోషలిస్ట్ పార్టీ                    -               12
4. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ      -                9
5. భారతీయ జనసంఘ్          -                3
6. ఇతర పార్టీలు                    -              48
7. స్వతంత్రులు                     -              37
                                                    
                      మొత్తం స్థానాలు:           489
                                                       

2వ లోక్‌సభ ఎన్నికలు (1957)
1. కాంగ్రెస్ పార్టీ                          -        371
2. సీపీఐ                                  -        27
3. భారతీయ జనసంఘ్               -        4
4. పీఎస్పీ                                 -        5
5. ఇండిపెండెంట్స్                       -       42
6. ఇతరులు                              -       45
                                                 
                            మొత్తం స్థానాలు:  494
                                                 

 

3వ లోక్‌సభ ఎన్నికలు (1962)
1. కాంగ్రెస్ పార్టీ                     -        361
2. సీపీఐ                             -         29
3. జనసంఘ్                        -        14
4. పీఎస్పీ                            -        12
5. ఎస్‌డబ్ల్యూఏ                     -        18
6. ఇండిపెండెంట్స్                 -         20
7. రిపబ్లికన్ పార్టీ                  -          3
8. సోషలిస్ట్ పార్టీ                   -          6
9. హిందూ మహాసభ            -           1
10. స్వతంత్ర పార్టీ                -           18
11. ఇతరులు                      -           12
                                                
            మొత్తం స్థానాలు:-               494
                                                       

4వ లోక్‌సభ ఎన్నికలు (1967)
1. కాంగ్రెస్ పార్టీ                     -        283
2. జనసంఘ్                        -        35
3. సీపీఐ                              -        23
4. సీపీఎం                            -         19
5. పీఎస్పీ                             -        13
6. ఎస్ఎస్‌పీ                          -        23
7. స్వతంత్ర పార్టీ                    -         44
8. డిఎంకే                             -         25
9. ఇండిపెండెంట్స్                  -         35
10. ఇతరులు                       -         20
                                            
                      మొత్తం స్థానాలు:      520 
                                             

5వ లోక్‌సభ ఎన్నికలు (1971)
1. కాంగ్రెస్                           -           352
2. భారతీయ జనసంఘ్         -             22
3. సీపీఐ                            -             23
4. సీపీఎం                          -              25
5. కాంగ్రెస్ (సంస్థ)               -              16
6. డీఎంకే                         -               22
7. స్వతంత్ర పార్టీ                -                 8
8. ఇతరులు                      -              50
                                                
                మొత్తం స్థానాలు:             518
                                                

6వ లోక్‌సభ ఎన్నికలు (1977)
1. జనతా పార్టీ                      -          295
2. సీపీఐ                              -          7
3. సీపీఎం                             -         22
4. కాంగ్రెస్                            -         154
5. ఇండిపెండెంట్స్                  -          9
6. డీఎంకే                             -          1
7. ఏఐఏడీఎంకే                      -         18
8. అకాళీదళ్                         -          8
9. ఇతరులు                          -        28
                                                 
                     మొత్తం స్థానాలు:         542
                                                 

 

7వ లోక్‌సభ ఎన్నికలు (1980)
1. సీపీఐ                             -        10
2. సీపీఎం                           -         37
3. కాంగ్రెస్ (ఐ)                     -        353
4. కాంగ్రెస్ (యు)                  -         13
5. జనతాపార్టీ                      -          31
6. జనతా పార్టీ (ఎన్)            -           41
7. డీఎంకే                           -          16
8. ఆర్ఎస్పీ                        -            4
9. ఇండిపెండెంట్స్                -            9
10. ఇతరులు                     -          28
                                              
                   మొత్తం స్థానాలు:         542
                                               

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌