• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో పేదరికం

కనీస అవసరాలకూ కొనసాగుతున్న కష్టాలు!

 

  కనీస జీవితావసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. అలాంటి పరిస్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేని వారిని పేదలుగా పరిగణిస్తారు. భారతదేశం ఆర్థిక, సాంకేతిక అంశాల్లో ఎంతో పురోగతి సాధించినప్పటికీ తలసరి ఆదాయం, జీవన ప్రమాణాల పరంగా నేటికీ పేద దేశాల జాబితాలోనే ఉంది. గుణాత్మక ప్రగతికి, దేశ ఖ్యాతికి ప్రతిబంధకంగా నిలిచే పేదరికం భావన గురించి పోటీ పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. దేశంలో పేదరికానికి ప్రధాన కారణాలు, పేదరికాన్ని గుర్తించే ప్రామాణిక విధానాలు, పేదరికంలో రకాలు, రాష్ట్రాలవారీగా ఉన్న హెచ్చుతగ్గులు, ముఖ్యమైన పేదరిక నిర్మూలన పథకాల గురించి అవగాహన పెంచుకోవాలి.


భారతదేశంలో పేదరికం అధికారిక గణాంకాలను ప్రజల రోజువారీ కనీస ఆహార కొనుగోలు సామర్థ్యంపై ఆధారపడి నిర్ణయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి 2,400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం, పట్టణ ప్రాంతాల్లో 2,100 క్యాలరీల ఆహారం పొందలేని, సమకూర్చుకోలేని వారిని పేదలుగా పరిగణిస్తారు. గ్రామీణ ప్రజల శారీరక శ్రమ దృష్ట్యా వారి కనీస క్యాలరీలను ఎక్కువగా నిర్ధారించారు. ఈవిధంగా ప్రతివ్యక్తికి కనీస ఆహారం అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.356, పట్టణ ప్రాంతాల్లో రూ.536 చొప్పున అవసరమని భారత ప్రణాళికా సంఘం అంచనా వేసింది. పేదరికాన్ని లెక్కించడంలో గృహనిర్మాణం, ఆరోగ్యం, రవాణా వంటి కారణాలను కూడా పరిశీలించింది.


జాతీయ, ప్రాంతీయ స్థాయిలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న జనాభాను అధికారికంగా పేదలుగా గుర్తిస్తారు. బీపీఎల్‌ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం, పట్టణ ప్రాంతాల్లో 26 శాతం ఉన్నట్లు ప్రణాళికా సంఘం పేర్కొంటోంది. రాయితీ ధరలకు ఆహార పదార్థాలను అందించేందుకు, రేషనన్‌ కార్డుల జారీపై పరిమితి విధించేందుకు ఈ గణాంకాలు ఉపయోగపడతాయి.


రాష్ట్రాల వారీగా పేదరికం పోలిక: పేదరికం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పరిమాణాల్లో కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పేదరికం ఒక అంకె శాతంలో ఉండగా; వెనుకబడిన ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో 40% కంటే ఎక్కువ జనాభా దీర్ఘకాలంగా పేదరికంలో ఉంది. పేదరికంలో రాష్ట్రాలకు ఇచ్చే ర్యాంకుల విధానంలోనూ పెద్దగా మార్పు రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పేదరికం ఒడిశాలో, పట్టణప్రాంతాల్లో అత్యధిక పేదరికం మధ్యప్రదేశ్‌లో ఉంది. పంజాబ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పేదరికం 5 శాతం ఉంది. ఈ విషయంలో హరియాణా రెండో స్థానంలో ఉంది. పేదరిక నిర్మూలన పరంగా మంచి ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, హరియాణా, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ ఉన్నాయి. సంస్కరణల అనంతరం మెరుగైన వృద్ధి సాధిస్తున్న కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు పేదరికాన్ని మాత్రం మోస్తరుగానే తగ్గించగలిగాయి.

 


భారతదేశంలో పేదరికం బహుముఖ సామాజిక సమస్య. దీనికి ఎన్నో కారణాలున్నాయి.

 


1) ప్రతికూల వాతావరణం: పేదరికం మూలకారణాల్లో ప్రధానమైనది ఇక్కడి వాతావరణం. దేశంలో తరచూ సంభవించే వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంటాయి. సరైన సమయానికి వర్షాలు కురవకపోవడం, భారీ వర్షపాతం లేదా వర్షాభావ పరిస్థితులు ఉత్పాదకతను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి.

 


2) జనాభా: 


ఎ) జనాభా విస్తరణ: జనాభా వేగంగా పెరగడం వల్ల పేదరికం తీవ్రం అవుతుంది. జనాభా పెరుగుదల జాతీయ ఆదాయంలో వృద్ధి రేటును మించిపోయింది. ఈ పరిణామం తలసరి ఆదాయాన్ని తగ్గించడమేకాకుండా, పేదరిక నిర్మూలనకు ఆటంకాలను సృష్టిస్తోంది.


బి) కుటుంబ పరిమాణం: గ్రామీణ పేదరికంలో కుటుంబ పరిమాణం ముఖ్యపాత్ర పోషిస్తోంది. కుటుంబంలో సభ్యుల సంఖ్య ఎక్కువైతే తలసరి ఆదాయం, జీవన ప్రమాణం తగ్గుతాయి.



3) వ్యక్తిగత కారణాలు (ప్రేరణ లేకపోవడం): గ్రామీణ పేదరికానికి ప్రేరణ లేకపోవడం కూడా ఒక కారణం. కొంతమంది గ్రామీణ ప్రజల్లో కష్టపడి పనిచేయాలనే ప్రేరణ లేకపోవడం, ఎంతోకొంత సంపాదించాలనే ఉత్సాహం లేకపోవడం వల్ల పేదరికంలో ఉండిపోతున్నారు. 



4) ఆర్థిక కారణాలు:


ఎ) తక్కువ వ్యవసాయ ఉత్పాదకత: భారతదేశంలో వ్యవసాయ సంబంధిత సాంకేతికత మెరుగైనప్పటికీ, రైతులు ఎక్కువమంది నేటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండి పేదరికానికి దారితీస్తోంది.


బి) భూమి, ఇతర ఆస్తుల అసమాన పంపిణీ: గ్రామీణ ప్రజలకు వ్యవసాయ భూములే ప్రధాన ఆదాయ వనరు. దేశంలో భూమి, ఇతర ఆస్తుల పంపకంలో అసమానతలు ఎక్కువ. అధికశాతం రైతులు 5 ఎకరాల కంటే తక్కువ సాగు భూములున్నవారే. వీరు కష్టపడి పంటలు పండించినా, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తరచూ నష్టపోతుంటారు. ఫలితంగా పేదరికాన్ని అధిగమించలేకపోతున్నారు.


సి) గ్రామీణ పరిశ్రమల క్షీణత: పారిశ్రామికీకరణ ఫలితంగా గ్రామీణ కుటీర పరిశ్రమలు ఉనికి కోల్పోతున్నాయి. ఆధునిక పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే వస్తువుల ధర, నాణ్యత విషయంలో గ్రామీణ ఉత్పత్తులు పోటీ పడలేక మూసివేయాల్సిన స్థితిలో పడ్డాయి. దీంతో ఇక్కడి కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోనే ఉండిపోతున్నారు.

 


పేదరికం కొలమానాలు:


1) నిరపేక్ష పేదరికం: ఒక వ్యక్తి ఆదాయం కనీస జీవన అవసరాలను సమకూర్చుకునే స్థాయిలో లేకపోతే, అతడు లేదా ఆమె నిరపేక్ష పేదరికంలో జీవిస్తున్నారని అర్థం.


2) సాపేక్ష పేదరికం: వివిధ ఆదాయ వర్గాల జీవన ప్రమాణాలను లేదా ఆదాయ పంపిణీని సరిపోల్చినప్పుడు సాపేక్ష పేదరికాన్ని గణన చేయవచ్చు. విభిన్న వర్గాల మధ్య ఆదాయంలో అసమానతలు సాపేక్ష పేదరికానికి సూచికలు. భారతదేశంలో దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్న ప్రజల శాతం మలేసియా, థాయిలాండ్, చైనా లాంటి ఆసియా దేశాలతో పోలిస్తే ఎక్కువ. భారత ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం పేదరికం 2002 నాటికి 18 శాతానికి, 2012 నాటికి 4 శాతానికి తగ్గింది.


పేదరిక నిర్మూలన కార్యక్రమాలు:  దేశంలో అమలవుతున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో చాలావరకు గ్రామీణ పేదరికాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించినవే. వీటిని పలు రకాలుగా విభజించవచ్చు. 1) వేతన ఉపాధి కార్యక్రమాలు 2) వ్యయం ఉపాధి కార్యక్రమాలు 3) ఆహార భద్రత కార్యక్రమాలు 4) సామాజిక భద్రత కార్యక్రమాలు 5) పట్టణ పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు.


జవహర్‌ గ్రామ సమృద్ధి యోజన (జేజీఎస్‌వై): ఇదివరకే అమలులో ఉన్న జవహర్‌ రోజ్‌గార్‌ యోజన (జేఆర్‌వై)కు రూపాంతరమైన సమగ్ర పథకం ఇది. 1999, ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు, ఆస్పత్రి భవనాల నిర్మాణం లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధే దీని ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సంబంధాలను మెరుగుపరచి, నిరంతరాయంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలన్నది లక్ష్యం.


జాతీయ వృద్ధాప్య పింఛన్‌: ఈ పథకం 1995, ఆగస్టు 15న అమల్లోకి వచ్చింది. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు నెలకు రూ.200 పింఛను ఇస్తారు. ఎలాంటి జీవనాధారం, ఆర్థిక తోడ్పాటు లేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ అమలుచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

 

జాతీయ మాతృత్వ సహాయ పథకం: దారిద్రరేఖ దిగువనున్న కుటుంబాల్లోని గర్భిణీలకు మూడు దఫాలుగా రూ.6 వేలు ఆర్థిక సహాయం అందించే పథకమిది. 19 సంవత్సరాలు నిండిన వారు ఈ లబ్ధికి అర్హులు. సాధారణంగా ప్రసవానికి 12-8 వారాల ముందు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకాన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. దీనిని 2005-06 నుంచి జననీ సురక్ష పథకంగా నవీకరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి రూ.1400లు అందజేస్తారు.


అన్నపూర్ణ: ఈ పథకాన్ని కేంద్రం 1999-2000 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న, వృద్ధాప్య పింఛనుకు అర్హత లేని వయోవృద్ధులకు ఆహారాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. అర్హులకు నెలకు 10 కిలోల ఆహారధాన్యాలు అందిస్తారు.


సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఐఆర్‌డీపీ): గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారికి ఆదాయాన్నిచ్చే ఆస్తులు సమకూర్చి, వారి పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన పథకం ఇది. 1978-79లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, 1980 నవంబరు నాటికి అన్ని ప్రాంతాలకు విస్తరించారు. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు నిరంతరాయంగా కల్పించడం. ఈ పథకం కింద బ్యాంకులు అందజేసే రుణాలపై ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. తక్కువ ఆదాయం వచ్చే చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తుల వారు ఈ పథకానికి అర్హులు.


ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన: ప్రతిఒక్కరికి సొంతింటి సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన పథకం. 1985లో ప్రారôభమైంది. 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. ఇందులో 13 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాలి. ఎంపికైన లబ్ధిదారులకు రాయితీపై ఇంటి రుణం అందజేస్తారు.


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా): గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం 2005లో ప్రకటించగా, 2006 నుంచి అమల్లోకి వచ్చింది. 2009, అక్టోబరు 2 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఏడాదికి 150 రోజుల ఉపాధి పనికి హామీ ఇస్తున్న ఈ పథకం గ్రామీణ ప్రజల స్థిర ఆదాయాన్ని పెంచుతున్నట్లు రుజువైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ పథకానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.


సురేష్‌ తెండూల్కర్‌ కమిటీ నివేదిక: భారత ప్రణాళికా సంఘం 2005లో సురేష్‌ తెండుల్కర్‌ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రస్తుతం పేదరికం అంచనా వేసే పద్ధతులు అమలవుతున్నాయి.


ముఖ్యమైన సిఫార్సులు: 1) గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఏకరూప దారిద్య్రరేఖ ప్రమాణాలు పాటించాలి. 2) విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటు రంగం చేసే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటూ దారిద్య్రరేఖలో ప్రత్యేక ఏర్పాటు కోసం ధరల సర్దుబాటు విధానంలో మార్పులు తీసుకురావాలి. 3) పేదరికాన్ని గుర్తించడానికి జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న ప్రజలను గుర్తించడానికి ప్రతిరోజు తలసరి వ్యయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రూ.27గా, పట్టణ ప్రాంతాల్లో రూ.33గా నిర్ణయించారు. ఈ లెక్కన దేశంలో 22 శాతం జనాభా దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్నారని కమిటీ అంచనా వేసింది.


నిరుద్యోగం: ఒక వ్యక్తి ఉద్యోగం కోసం చురుగ్గా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం పొందలేని స్థితినే నిరుద్యోగం అంటారు. వ్యక్తి ఆర్థిక స్థితికి కొలమానంగా ఉద్యోగాన్ని పరిగణిస్తారు. శ్రామిక వర్గంలోని మొత్తం ప్రజలను నిరుద్యోగుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే నిరుద్యోగ రేటు.


నిరుద్యోగం లక్షణాలు: సాధారణంగా నిరుద్యోగిత అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడం లేదా జీతం పొందకపోవడం అనుకుంటారు. ఇది పాక్షిక నిజం. ఈ  అభిప్రాయంలో విద్యావంతులు ఉద్యోగాన్ని పొందలేకపోవడం లేదా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైనప్పుడే అని అర్థం వస్తుంది. అధికసంఖ్యలో వ్యవసాయ రంగంపై ఆధారపడేవారు, స్థిర వేతనాలను పొందలేని వారిని ఇందులో విస్మరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు తాము చేసే పనులకు నెలవారీ వేతనాలు పొందరు. వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు, చిన్న దుకాణదారులు, చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలు, టాక్సీ డ్రైవర్లు, మెకానిక్‌లు మొదలైనవారంతా ఈ కోవలోకే వస్తారు. కానీ వీరంతా ఉద్యోగంలో ఉన్నవారుగానే పరిగణనలో ఉంటారు. వీరు తాము చేసే పనులకు నగదు లేదా వస్తురూపంలో ప్రతిఫలం పొందుతారు. లాభదాయక ఉద్యోగం పొందలేని వారే నిరుద్యోగులు. వీరిని గుర్తించడం సులువు కాదు. మనదేశంలో 15- 58 సంవత్సరాల మధ్య వయసువారిని ఆర్థికంగా క్రియాశీలమైనవారిగా పరిగణిస్తారు. అంటే లాభదాయక ఉద్యోగం పొందే సామర్థ్యం ఉన్నవారు. ఈ భావన కూడా పూర్తిగా నిజం కాదు. ఈ వయసులో చాలామందికి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోవచ్చు. విద్యార్థులు, ఇతరుల సంపాదనపై ఆధారపడగలిగే వారికి కూడా ఉద్యోగం చేసే అవసరం ఉండదు.

 


- రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి
 

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌