• facebook
  • whatsapp
  • telegram

ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిత నియమాలు

ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలేనని, వాటిని శ్రేయో రాజ్యాలుగా పేర్కొనవచ్చని రూస్కో పౌండ్‌ అభిప్రాయపడ్డారు. రాజ్యం అనేది అత్యధిక ప్రజల సంతోషం కోసం పాటుపడాలని ఉపయోగితావాద సిద్ధాంతకర్త జెర్మీ బెంథామ్‌ పేర్కొన్నారు. రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించేందుకు ఏర్పడిందని, అందుకే అది కొనసాగుతుందని రాజనీతిశాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్‌ అభిప్రాయపడ్డారు. క్రీ.శ.18వ శతాబ్దంలో స్కాండినేవియన్‌ దేశాల్లో సంక్షేమ రాజ్య స్థాపనకు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను అమలు చేశారు. స్పెయిన్‌ రాజ్యాంగంలో డైరెక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ సోషల్‌ పాలసీ అనే పేరుతో తొలిసారిగా ఆదేశిక సూత్రాలను చేర్చారు. ఐర్లాండ్‌ 1937లో స్పెయిన్‌ నుంచి ఆదేశిక సూత్రాలను గ్రహించింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలను Instruments Of Instructions గా పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చేర్చడంలో 1928 నాటి ‘నెహ్రూ రిపోర్ట్‌’, 1931 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ కరాచీ తీర్మానం, 1945 నాటి సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ నేతృత్వంలోని కమిటీ నివేదికలు తోడ్పడ్డాయి. సప్రూ నేతృత్వంలోని బృందం సిఫార్సుల మేరకు సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యంగా ఐర్లాండ్‌ నుంచి స్ఫూర్తి పొందిన రాజ్యాంగ నిర్మాతలు ‘ఆదేశిక సూత్రాలను’ రాజ్యాంగంలో పొందుపరిచారు.

లక్షణాలు
* ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల న్యాయసంరక్షణ లేదు. స్వతహాగా అమల్లోకి రావు.
* వీటి అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి. ఇవి స్వభావరీత్యా సలహా సంబంధమైనవి.
* ప్రభుత్వాల పనితీరుకు వీటిని కొలమానంగా పరిగణిస్తారు.
* ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యతను అనుసరించి ఇవి అమలవుతాయి.
* ప్రభుత్వ విధులు, బాధ్యతలను తెలుపుతాయి.
* రాజ్య కార్యకలాపాల పరిధిని విస్తృతపరుస్తాయి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.
* రాజ్యాంగ ప్రవేశికలోని ఆశయాలకు ఆచరణ రూపాన్నిస్తాయి.
* ప్రాథమిక హక్కులకు పోషకాలుగా ఉండి, వాటిలోని వెలితిని పూరిస్తాయి.
* దేశంలో ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య స్థాపనకు ఉపయోగపడతాయి.

రాజ్యాంగ వివరణ
ఆదేశిక సూత్రాలు/నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలోని ఖిజువ భాగంలో, ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు. వీటి స్వభావం ఆధారంగా ప్రొఫెసర్‌ ఎం.పి.శర్మ వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి:
1. సామ్యవాద నియమాలు: ఆర్టికల్స్‌ 38, 39, 41, 42, 43

2. గాంధేయవాద నియమాలు: ఆర్టికల్స్‌ 40, 46, 47, 48, 49
3. ఉదారవాద నియమాలు: ఆర్టికల్స్‌ 44, 45, 50, 51

ఆర్టికల్‌ 36: ‘రాజ్యం’ నిర్వచనాన్ని వివరిస్తుంది. ఆదేశిక సూత్రాల అమల్లో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ఇతర అధికార సంస్థలన్నీ ‘రాజ్యం’ నిర్వచనంలో అంతర్భాగమే.

ఆర్టికల్‌ 37: ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు. పౌరులు ఆదేశిక సూత్రాల అమలు కోసం కోర్టులను ఆశ్రయించకూడదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం న్యాయస్థానాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయరాదు.

సామ్యవాద నియమాలు
సామ్యవాద ఆదర్శాల ప్రాతిపదికపై శ్రేయోరాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 38, 39, 41, 42, 43లలో వీటిని వివరించారు. అవి: 
ఆర్టికల్‌ 38: భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.

ఆర్టికల్‌ 38(A): 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ హయాంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం విభిన్న ప్రాంతాల్లో, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న పౌరుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించేదుకు ప్రభుత్వం కృషి చేయాలి.

ఆర్టికల్‌ 39: జాతీయ సంపదను, సహజ వనరులను దేశ ప్రజల సమష్టి ప్రయోజనానికి వినియోగించాలి.

ఆర్టికల్‌ 39(a): దేశ ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి.

ఆర్టికల్‌ 39(b): దేశ సమగ్రాభివృద్ధి కోసం దేశంలోని భౌతిక వనరుల యాజమాన్యం, నియంత్రణను సక్రమంగా నిర్వహించి, వినియోగించాలి.

ఆర్టికల్‌ 39(c): దేశ సంపద, ఆర్థిక వనరులు, ఇతర ఉత్పత్తి సాధనాలు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి.

ఆర్టికల్‌ 39(d): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

ఆర్టికల్‌ 39(e): కార్మికులు వారి శారీరక సామర్థ్యానికి మించి పనులు చేయకుండా నియంత్రించాలి. 

ఆర్టికల్‌ 39(f): ఈ ఆర్టికల్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. దీని ప్రకారం బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వారు ఎలాంటి పీడనానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలి.

ఆర్టికల్‌ 39(A): ఈ ఆర్టికల్‌ను 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చింది. దీని ప్రకారం పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు ‘ఉచిత న్యాయ సహాయాన్ని’ పొందుతారు.
 

ఆర్టికల్‌ 41: ప్రభుత్వం తనకున్న ఆర్థిక పరిమితులకు లోబడి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు పింఛన్‌ సదుపాయం కల్పించాలి. పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ఉపాధి అవకాశాలు అందేలా చేయాలి.

ఆర్టికల్‌ 42: కార్మికులు పనిచేసేందుకు తగిన పరిస్థితులు, న్యాయమైన పనిగంటలు కల్పించాలి. మాతా, శిశు సంక్షేమానికి కృషి చేయాలి. స్త్రీలకు మెరుగైన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.
 

ఆర్టికల్‌ 43: గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తులు, సహకార సంస్థలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించాలి.
 

ఆర్టికల్‌ 43(A): 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగానికి చేర్చింది. దీని ప్రకారం పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


గాంధేయవాద నియమాలు 
గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు, ప్రజాస్వామ్య పాలనా వికేంద్రీకరణకు తోడ్పడే అంశాలే గాంధేయవాద నియమాలు. వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 40, 46, 47, 48, 49 లలో వివరించారు. 

ఆర్టికల్‌ 40: గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పటిష్ఠంచేసి, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. గ్రామస్వరాజ్య సాధనకు కృషిచేయాలి.

ఆర్టికల్‌ 46: విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఈ వర్గాల వారు సాంఘిక దోపిడీకి గురికాకుండా కృషి చేయాలి.

ఆర్టికల్‌ 47: ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే మద్యపానం, మత్తు పానీయాలను నిషేధించాలి. పోషకాహారాన్ని అందించడం ద్వారా ప్రజారోగ్య స్థాయిని పెంపొందించాలి.

ఆర్టికల్‌ 48: వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తులను సాధించాలి. ‘గోవధ’ను నిషేధించాలి.

ఆర్టికల్‌ 48(A): ఈ ఆర్టికల్‌ను ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. దీని ప్రకారం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల అభివృద్ధికి కృషిచేయాలి.

ఆర్టికల్‌ 49: భారతీయుల ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వానికి చిహ్నంగా నిలిచే పురాతన కట్టడాలు, శిల్ప సంపదను పరిరక్షించాలి.

ప్రముఖుల వ్యాఖ్యానాలు
*‘ఆదేశిక సూత్రాలు మనదేశంలో ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి.’    - డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

* ‘ఆదేశిక సూత్రాలు శ్రేయోరాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలుగా పనిచేస్తాయి’     -ఎం.సి.సెతల్‌వాడ్‌

* ‘ఆదేశిక సూత్రాలు నూతన సంవత్సర తీర్మానాలు. అవి ఆరోజే ఉల్లంఘనకు గురవుతాయి’     - నసీరుద్దిన్‌ మహ్మద్

* ‘ఆదేశిక సూత్రాలు బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి ఇచ్చే చెక్కుల వంటివి.’    - కె.టి.షా

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌