• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి - అత్యవసర అధికారాలు

(జాతీయ అత్యవసర పరిస్థితి)

సంక్లిష్ట సమయంలో సంరక్షణ సాధనాలు!
 


దేశ భద్రత, సార్వభౌమత్వం, ఐక్యతలకు ముప్పు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ప్రయోగిస్తారు. ఆ సమయంలో పౌరుల కొన్ని మౌలిక హక్కులను నిలిపేస్తారు. ప్రత్యేక చట్టాలను రూపొందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తారు. నిర్బంధ చర్యలు తీసుకుంటారు. శక్తిమంతమైన ఆ అధికారాలు దుర్వినియోగం కాకుండా రాజ్యాంగంలో పలు నియంత్రణ విధానాలను పొందుపరిచారు. న్యాయవ్యవస్థ కూడా వాటిని పర్యవేక్షిస్తుంది. వీటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆ అధికారాల నేపథ్యం, ముఖ్యంగా జాతీయ అత్యవసర పరిస్థితి, విధించిన సందర్భాలు, దానికి చేసిన మార్పులు, పార్లమెంటు ఆమోదప్రక్రియ, సంభవించిన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. 

రాజ్యాంగంలో అత్యవసర అధికారాలను పొందుపరచాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై రాజ్యాంగ సభలో విస్తృత చర్చ జరిగింది. వీటిని రాజ్యాంగంలో తప్పనిసరిగా పొందుపరచాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి.కృష్ణమాచారి పేర్కొన్నారు. ఆ అవసరం లేదని హెచ్‌.వి.కామత్, సి.డి.దేశ్‌ముఖ్, కె.టి.షా అభిప్రాయపడ్డారు. 

స్ఫూర్తినిచ్చిన అంశాలు: భారత రాజ్యాంగ నిర్మాతలు అత్యవసర అధికారాలను భారత ప్రభుత్వ చట్టం-1935 నుంచి స్ఫూర్తి పొంది రాజ్యాంగంలో చేర్చారు. వీటిని  వినియోగించినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించారు. వీటిని వినియోగించినప్పటికీ జీవించేహక్కును రద్దు చేయకూడదనే విధానాన్ని జపాన్‌ రాజ్యాంగం నుంచి సేకరించారు.

రాజ్యాంగ వివరణ:  భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్స్‌ 352 నుంచి 360 మధ్య మూడు రకాల అత్యవసర అధికారాలు పేర్కొన్నారు.

1) జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 352,

2) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 356,

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 360.

జాతీయ అత్యవసర పరిస్థితి:  జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్‌ 352 ప్రకారం రెండు రకాల కారణాలతో విధిస్తారు.

1) బాహ్య కారణాలు: దేశంపై విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు లేదా దేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు, దేశ భద్రతకు లేదా దేశంలోని ఏదోక ప్రాంత భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు దేశ సమగ్రతను పరిరక్షించడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు. 

2) ఆంతరంగిక కారణాలు: దేశంలో ఆంతరంగిక అల్లకల్లోలాలు చెలరేగి శాంతిభద్రతలు క్షీణించినప్పుడు దేశ సమగ్రతను కాపాడేందుకు కేబినెట్‌ సిఫార్సుల మేరకు ఆర్టికల్‌ 353ను ప్రయోగించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు.

44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసిన మార్పులు: మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి పలు మార్పులు చేస్తూ ఆర్టికల్‌ 352ను సవరించింది. అవి

కేంద్ర కేబినెట్‌ లిఖితపూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి.

* ఆంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ దళాల తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు 30 రోజుల్లోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలని నిర్దేశించారు. ఇది అంతకుముందు రెండు నెలల్లోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి అని ఉండేది.

కేంద్ర కేబినెట్‌ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపొచ్చు. అదే అంశాన్ని కేంద్ర కేబినెట్‌ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి.

 జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా లేదా దేశంలోని ఏదైనా ఒక ప్రాంతంలో విధించవచ్చు.

జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయసమీక్ష పరిధిలో ఉంటుంది.

 1980లో మినర్వామిల్స్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిపై న్యాయసమీక్ష జరపవచ్చని పేర్కొంది.

పార్లమెంటు ఆమోదం:  రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 30 రోజుల్లోగా పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే 6 నెలలు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని ఆరు నెలలకు ఒకసారి చొప్పున పొడిగిస్తూ ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు. 

 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసే సమయానికి ఒకవేళ లోక్‌సభ రద్దయి ఉంటే దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. అయితే నూతన లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను   2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి   ప్రకటన రద్దవుతుంది.

 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

ఉపసంహరణ: జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలల కంటే ముందే కూడా రాష్ట్రపతి ఉపసంహరించవచ్చు. పార్లమెంటు ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరించవచ్చు.

 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం లోక్‌సభలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరించాలని 1/10వ వంతు సభ్యులు లిఖిత పూర్వకంగా సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్‌సభ స్పీకర్‌కు, సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతికి నోటీసు అందజేస్తే, నోటీసు అందుకున్న 14 రోజుల్లోగా లోక్‌సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభ్యులు సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరిస్తారు. ఈ ప్రక్రియలో రాజ్యసభపాత్ర ఉండదు.

ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు:

1) 1962లో భారతదేశంపై చైనా దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇది 1962, అక్టోబరు 26 నుంచి 1968, జనవరి 10 వరకు కొనసాగింది. 

2) 1971లో బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం మొదలవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇది 1971, డిసెంబరు 3 నుంచి 1977, మార్చి 21 వరకు కొనసాగింది. 

3) 1975లో రాజ్‌నారాయణ్‌ వర్సెస్‌ ఇందిరాగాంధీ కేసులో అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిస్తూ రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని పేర్కొంది. దీనివల్ల దేశంలో శాంతిభద్రతలు క్షీణించి ఆంతరంగిక అల్లకల్లోలాలు చెలరేగాయి. ఈ పరిస్థితి నియంత్రణకు ఇందిరా గాంధీ ప్రభుత్వం సిఫార్సుల మేరకు 1975లో అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇది 1975, జూన్‌ 25 నుంచి 1977, మార్చి 21 వరకు కొనసాగింది.

 ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్‌ 352(4) ద్వారా ఒకే సమయంలో వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించి కొనసాగించవచ్చని నిర్దేశించారు.

1975-1977 మధ్య దేశంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో (బాహ్య కారణాలు, ఆంతరంగిక అల్లకల్లోలాలు) జాతీయ అత్యవసర పరిస్థితి విధించి కొనసాగించారు.

చట్టసభల పదవీకాలంపై ప్రభావం: జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని వాటి గడువు ముగిసినప్పటికీ ఒక సంవత్సర కాలం పాటు పొడిగించవచ్చు.

 5వ లోక్‌సభ పదవీకాలం 1976, మార్చి 18తో ముగుస్తుందనగా అదే సమయంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977, జనవరి 18న లోక్‌సభను రద్దు చేశారు. 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది.

జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కారణంగా 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం అదనంగా 1977 నుంచి 1978 వరకు పొడిగించారు.

భారత రాజ్యాంగం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలే అత్యవసర అధికారాలు.  

 భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది.  - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్

 అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి శ్మశానపు ప్రశాంతతను తలపిస్తుంది.   - హెచ్‌.వి.కామత్‌  

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌