• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి - శాసనాధికారాలు

చట్టాలకు అత్యున్నత ఆమోదముద్ర!

  రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతికి విస్తృతమైన శాసనాధికారాలు ఉన్నాయి. పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేయడం ద్వారా వాటిని చట్టాలుగా అమల్లోకి తీసుకువస్తారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి సంక్రమించిన శాసనాధికారాలపై తరచూ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వీటిపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

 

  భారత రాష్ట్రపతి.. పార్లమెంటు సభ్యుడు కాదు. కానీ అందులో అంతర్భాగంగా కొనసాగుతారు. ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ అని అర్థం. పార్లమెంటు రూపొందించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ద్వారా వాటిని చట్టాలుగా మారుస్తారు.

 

ఆర్టికల్‌ 80(3) - రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్‌ చేస్తారు (కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లోని ప్రావీణ్యులు). 

 

ఆర్టికల్‌ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్‌’ అంటారు.

* పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్‌’ అంటారు.

* లోక్‌సభను రద్దు చేయడాన్ని ‘డిసాల్వ్‌’ అంటారు.

 

ఆర్టికల్‌ 86 - పార్లమెంటు ఉభయ సభలకు తన సందేశాలను పంపగలరు.

 

ఆర్టికల్‌ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాలు, విశేష ప్రసంగాలు చేయగలరు. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే మొదటి సమావేశానికి, ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్‌ సమావేశాలకు హాజరై ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం పార్లమెంటు మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ సందేశం చేస్తారు.

 

ఆర్టికల్‌ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు అందుబాటులో లేకపోతే తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 95(1) - లోక్‌సభ సమావేశాల నిర్వహణకు సభాధ్యక్షులు అందుబాటులో లేకపోతే తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 103 - కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి పార్లమెంటు సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు.

 

ఆర్టికల్‌ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు.. రాష్ట్రపతి ఆమోదముద్ర ద్వారానే చట్టాలుగా రూపొందుతాయి.

 

ఆర్టికల్‌ 201 - రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లుల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని గవర్నరు భావించినప్పుడు.. సంబంధిత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్‌ చేస్తారు. ఇలాంటి బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగలరు లేదా పునఃపరిశీలనకు పంపగలరు లేదా తిరస్కరించగలరు.

 

 

ఆర్డినెన్స్‌ : ఆర్టికల్‌ 123

ప్రజా/దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.  దీనికి సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ ఉంటుంది. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవిత కాలం కింది విధంగా ఉంటుంది.

* పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా) 

* 6 నెలల 6 వారాలు (లేదా) 

* 7 1/2 నెలలు లేదా 222 రోజులు  

పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే రద్దవుతుంది.

 

ఆర్డినెన్స్‌ - సుప్రీంకోర్టు తీర్పులు

 

కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1970)

  రాష్ట్రపతి ఆర్టికల్‌ 123 ప్రకారం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను న్యాయసమీక్షకు పంపొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

డి.సి.వాద్వా Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు (1987)

  ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసినప్పుడు అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యథాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్‌ను జారీచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది రాజ్యాంగంపై దాడి లాంటిదని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం

సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 108 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఏర్పాటయ్యే ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ స్పీకర్‌ అందుబాటులో లేకపోతే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఇప్పటివరకు మన దేశంలో కేవలం మూడుసార్లు మాత్రమే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఆర్టికల్‌ 108 ప్రకారం ఏర్పాటు చేశారు. అవి...

* 1961లో వరకట్న నిషేధం బిల్లుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌.

* 1978లో బ్యాంకింగ్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లు ఆమోదం విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే.

* 2002లో POTO (ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆర్డినెన్స్‌) బిల్లు ఆమోదం విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అటల్‌ బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ డిప్యూటి స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు. (స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి ఈ సమావేశాలకు కొద్దిరోజుల ముందు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

* పైన పేర్కొన్న మూడు సమావేశాల్లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్న ప్రముఖ వ్యక్తి అటల్‌ బిహారి వాజ్‌పేయీ.

 

వీటో అధికారాలు

వీటో (veto) అంటే తిరస్కరించడం, నిరోధించడం, నిలుపుదల చేయడం అని అర్థం. పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి మూడు రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. ఇవి శాసనాధికారాల్లో అంతర్భాగం.

 

1) అబ్జల్యూట్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, ఏదైనా కారణం చూపి లేదా కారణం చూపకుండానే తిరస్కరించడాన్ని అబ్జల్యూట్‌ వీటో అంటారు.

ఉదా: * 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ PE-P-SU (పటియాలా ఈస్ట్‌ పంజాబ్‌ స్టేట్స్‌ యూనియన్‌) బిల్లు విషయంలో, 1991లో అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లు విషయంలోను అబ్జల్యూట్‌ను వీటోను వినియోగించారు.

* రాష్ట్రపతి అబ్జల్యూట్‌ వీటోను పార్లమెంటు రద్దు చేయగలదు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా బిల్లును ఆమోదించాలి.

* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నరులు రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేసినప్పుడు ఆర్టికల్‌ 201 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత బిల్లులను తిరస్కరించవచ్చు. అవే బిల్లులను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపినప్పుడు కూడా వాటిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చు.

 

2) సస్పెన్సివ్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేయకుండా సవరణలు, సూచనలు చేస్తూ బిల్లులను పునఃపరిశీలనకు పంపడాన్ని సస్పెన్సివ్‌ వీటో అంటారు.

ఉదా: * 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లాభదాయక పదవుల బిల్లుపై ఆమోద ముద్ర వేయకుండా సస్పెన్సివ్‌ వీటోను వినియోగించారు. 

* రాష్ట్రపతి సస్పెన్సివ్‌ వీటోను పార్లమెంటు రద్దు చేయగలదు. సంబంధిత బిల్లులను రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలి.

 

3) పాకెట్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా, పునఃపరిశీలనకు పంపకుండా, ఎలాంటి నిర్ణయం తెలియజేయకుండా తన దగ్గర అట్టిపెట్టుకోవడాన్ని పాకెట్‌ వీటో అంటారు.

ఉదా: 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన పోస్టల్‌ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ పాకెట్‌ వీటోను ప్రయోగించి 18 నెలల పాటు అట్టిపెట్టారు.

 

రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే కింద పేర్కొన్న బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

* ఆర్టికల్‌ 3 - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు

* ఆర్టికల్‌ 19(1)(G) - వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు.

* ఆర్టికల్‌ 31(A) - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు

* ఆర్టికల్‌ 112 - కేంద్ర బడ్జెట్‌

 

ర‌చ‌యిత‌: బంగారు స‌త్య‌నారాయ‌ణ‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

‣  రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

‣  ఆర్థిక అత్యవసర పరిస్థితి

 

ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

 

Posted Date : 16-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌