• facebook
  • whatsapp
  • telegram

ప్రధానమంత్రి 

ప్రజలు ఎన్నుకునే రారాజు!

దేశ ప్రగతి, భవిష్యత్తు ప్రభుత్వాలు అనుసరించే, అవలంబించే విధానాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి దేశ పాలన సాగిస్తారు. అధికారాలన్నీ ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చేతుల్లో ఉంటాయి. రాజ్యాంగ రీత్యా ఆ పదవి అత్యంత కీలకం. అందుకే ప్రధానిని ప్రజలు ఎన్నుకునే రారాజుగా వ్యవహరిస్తారు. 

 

  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్స్‌ 74, 75, 78లలో ప్రధానమంత్రి, కేంద్ర మత్రిమండలి గురించి వివరణ ఉంది.

 

ఆర్టికల్‌ 74(1): దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సహకరించేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రిమండలి ఉంటుంది.

 

ఆర్టికల్‌ 74(2): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పదవీకాలం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

 

ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి కింది సందర్భాల్లో అధికారాన్ని కోల్పోతుంది

* లోక్‌సభలో అధికారపక్షం ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానం వీగిపోయినప్పుడు

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గినప్పుడు 

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు

* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు 

* లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తిరస్కరణకు గురైనప్పుడు 

* లోక్‌సభలో అధికారపక్షం వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేట్‌ బిల్లులు నెగ్గినప్పుడు

 

ఆర్టికల్‌ 75(1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా మెజారిటీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు.

* ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రివర్గ సహచరులను నియమించి వారికి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

* లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించకపోతే రాష్ట్రపతి తన విచక్షణ మేరకు ప్రధానిని నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 75(1)(A): కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు.

 

ఆర్టికల్‌ 75(1)(B): పార్టీ ఫిరాయంపుల నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడిని సభాపతి అనర్హుడిగా ప్రకటిస్తే అలాంటి సభ్యుడిని ఆ సభ పదవీకాలం కొనసాగినంత వరకు ఎలాంటి లాభదాయకమైన పదవిలోనూ నియమించ కూడదు.

* ఆర్టికల్స్‌ 75(1)(A),  75(1)(B) లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది.

 

ఆర్టికల్‌ 75(2): ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి.

 

ఆర్టికల్‌ 75(3): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి. లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రిమండలి అధికారంలో ఉంటుంది.

 

ఆర్టికల్‌ 75(4): ప్రధాని నాయకత్వంలోని కేంద్రమంత్రి మండలి సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

ఆర్టికల్‌ 75(5): ప్రధానమంత్రిగా లేదా కేంద్రమంత్రిగా నియమితులవ్వాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఏదైనా సభలో సభ్యులై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేనివారు ప్రధానిగా లేదా కేంద్రమంత్రిగా నియమితులైతే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.

సుప్రీంకోర్టు తీర్పు: బి.ఆర్‌. కపూర్‌ వర్సెస్‌  స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడానికి అర్హతలున్న వారిని మాత్రమే ప్రధానిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమించాలని పేర్కొంది. 

 

ఆర్టికల్‌ 75(6): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 78(1): కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేయాలి.

 

ఆర్టికల్‌ 78(2): దేశ పరిపాలనకు సంబంధించిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవచ్చు.

ఉదా: బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోలు విషయమై 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 

 

ఆర్టికల్‌ 78(3): రాష్ట్రపతి తన ఆమోద ముద్ర కోసం వచ్చిన బిల్లులు/ తీర్మానాలను మొత్తం మంత్రిమండలి పరిశీలించలేదని, దాన్ని పునఃపరిశీలన చేసి పంపాలని ప్రధానిని కోరవచ్చు.

 

ప్రధానమంత్రి - అధికారాలు, విధులు

* ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకే కేంద్ర మంత్రులను రాష్ట్రపతి నియమించి, మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

* ప్రధానమంత్రి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

* ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. 

* ప్రధాని లోక్‌సభకు నాయకుడిగా, జాతికి ప్రతిబింబంగా వ్యవహరిస్తారు.

* ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దుచేస్తారు. 

* మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య ప్రధానమంత్రి సంధానకర్తగా వ్యవహరిస్తారు. 

* భారతదేశ విదేశాంగ విధానం ప్రధాని ఆధ్వర్యంలోనే రూపొందిస్తారు.

* విదేశాలతో వ్యవహరించేటప్పుడు ప్రధాని మనదేశానికి నాయకుడిగా వ్యవహరిస్తారు.

* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపడితే, లోక్‌సభలో తన ప్రతినిధిగా మరొకరిని నియమిస్తారు.

* ప్రభుత్వం, పార్లమెంటు, ప్రజలకు నాయకుడు ప్రధానమంత్రి. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుడు. దేశ ప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది.

 

ప్రధాని పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు

* ప్రధాని సమానుల్లో ప్రథముడు - లార్డ్‌ మార్లే

* ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు - హింటన్‌

* ప్రధానమంత్రి సూర్యుడు అయితే అతడి మంత్రివర్గ సహచరులందరూ అతడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లాంటివారు - ఐవర్‌ జెన్నింగ్స్‌

* ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడిలాంటివారు - విలియం వెర్నార్‌ కోట్‌

* ప్రధానమంత్రి పార్లమెంటరీ ప్రభుత్వమనే పడవను నడిపే కెప్టెన్‌ లాంటివారు - రాంసేమ్యూర్‌

* రెండో ప్రపంచ యుద్ధానంతరం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా మారింది - ఆర్‌.ఎస్‌.క్రాస్‌మన్‌ 

 

పలు సంస్థలకు అధ్యక్షుడిగా 

పదవిరీత్యా ప్రధానమంత్రి పలు సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

* నీతిఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమైక్యతా మండలి, అంతర్‌రాష్ట్ర మండలి

* జాతీయ భద్రతా మండలి, జాతీయ జనాభా నియంత్రణ మండలి

* జాతీయ విపత్తు నిర్వహణ మండలి

* జాతీయ జలవనరుల మండలి

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

  కేంద్ర‌మంత్రి మండ‌లి

‣  రాష్ట్రపతి పాలన 

 

ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌