• facebook
  • whatsapp
  • telegram

ఆదిమ తెగ

(గిరిజన సామాజిక వ్యవస్థ)

సనాతన సంప్రదాయాలతో సహజీవనం!


దేశ సామాజిక వ్యవస్థలో గిరిజన తెగల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆధునిక ప్రపంచానికి దూరంగా, అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆదిమ కాలం నాటి అలవాట్లనే అనుసరిస్తూ మనుగడ సాగిస్తున్నారు. సామాజిక శాస్త్రం అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆదిమ తెగలు, వాటి ఉమ్మడి లక్షణాలు, ప్రాంతీయ వైవిధ్యాలు, పరిణామ క్రమరూపాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. అసలైన భారతీయులుగా గుర్తింపు పొందిన వీరి ఆచార వ్యవహారాలు, జాతుల వారీ పాలనా వ్యవస్థ, సంస్కృతి, ఆచారాలు, జీవన విధానంతోపాటు  ఇతర సంప్రదాయాల ప్రాధాన్యం గురించి అవగాహన కలిగి ఉండాలి.

గిరిజన సామాజిక వ్యవస్థ హిందూ, ముస్లిం, క్రైస్తవ  సామాజిక వ్యవస్థలకు భిన్నంగా ఉన్నప్పటికీ భారత   సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఆదిమ తెగ   ప్రజలను గిరిజనులుగా వ్యవహరిస్తారు.

ఆదిమ తెగ - భౌగోళిక వివరణ: భారత సమాజంలో నివసించే గిరిజనులను భౌగోళికంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) పశ్చిమ తూర్పు ప్రాంతాల్లో నివసించే గిరిజనులు: మంగోల్‌ జాతికి చెందిన ఈ తెగలు అస్సాం, త్రిపుర, మణిపుర్‌ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. 1986-87 లెక్కల ప్రకారం వీరి జనాభా 21 లక్షలు. వీరిది ఆస్ట్రిక్‌ కుటుంబ భాష. ఇందులో ముఖ్యమైన తెగలు కుకి, హగ, మిక్కిర్‌.

2) మధ్య ప్రాంతంలో నివసించే గిరిజనులు: భారత సమాజంలోని అధిక శాతం గిరిజనులు మధ్య ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ప్రధానంగా వింధ్యాచల్, సాత్పురా, కేకల్, ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఉంటున్నారు. 1986-87 నాటికి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒక్క సంతాల్‌ తెగ జనాభానే 25 లక్షలు. మధ్యప్రదేశ్‌లోని గోండు, రాజస్థాన్‌లోని భిల్లులు ఇతర ముఖ్యమైన తెగలు. చోటానాగ్‌పుర్‌లోని ‘సంతాల్‌’, సింగ్‌ భూమిలో నివసించే ‘హో’లు,  ఒడిశాకు చెందిన ‘ఖోండులు’, ‘లారియా’; గంజామ్‌ ప్రాంతంలో నివసించే ‘సవారా’, ‘ముండా’ తెగలవారు కూడా ఇక్కడే ఆవాసం ఉంటున్నారు. దట్టమైన అడవులు, పర్వత శ్రేణుల్లో నివసిస్తూ, నాగరిక ప్రపంచంతో   సంబంధాలు లేకుండా నేటికీ ప్రాచీన కాలపు జీవన విధానాలను కొనసాగిస్తున్నారు.

3) దక్షిణ భూభాగ ప్రాంతం: భారత సమాజంలోని అతి ప్రాచీన ఆదిమ తెగ ‘కాదిర్‌’ కేరళ ప్రాంతంలో నివసిస్తోంది. నీలగిరిలోని తోడా, ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు, కోయ; కొచ్చిన్‌లోని కురోవన్, కర్ణాటకలోని కూర్గ్‌ లాంటి పలు భౌగోళిక ప్రాంత తెగలతోపాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నివసించే ఆదిమ తెగలున్నాయి.దీ పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో చెండా, మహస్సు అనే ఆదిమ తెగలు ఉండగా, దెహ్రాదూన్, డార్జీలింగ్‌లోనూ ఆదిమ తెగలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో నివసించే ఆదిమ తెగల్లో సంస్కృతిపరమైన విభిన్నతలున్నాయని, కొన్ని పరిశోధనల ద్వారా అర్థమవుతోంది. ఈనాటికీ కొన్ని ఆదిమ తెగలు నాగరిక సమాజంతో సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో ప్రాచీన జీవన విధానాన్ని అవలంబిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ‘నాగా’, ‘సంతాల్‌’ తెగలు.

ఆదిమ తెగ - లక్షణాలు: 

1) స్థిరమైన భౌగోళిక ప్రాంతం: స్థిరమైన భౌగోళిక ప్రాంతాన్ని ఆశ్రయించి నివసించడం ఆదిమ తెగ మొదటి లక్షణం. దీన్ని కోల్పోతే కొన్ని ఇతర లక్షణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

2) ఐకమత్య భావన: స్థిర భౌగోళిక ప్రాంత లక్షణాన్ని ఆదిమ తెగ కలిగి ఉన్నప్పటికీ, తెగలో నివసిస్తున్న సభ్యుల మధ్య ఐక్యభావన లేకపోతే ఆ సమూహాన్ని ఆదిమ తెగగా వ్యవహరించడానికి వీల్లేదు. సభ్యులు స్థిర నివాసం పేరుతో అక్కడే పుట్టి, పెరిగి, మరణిస్తారు. తప్పనిసరిగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఐక్య భావనతో జీవించాల్సి ఉంటుంది. ఈ లక్షణం ఆదిమ తెగకు అతి ముఖ్యమైంది.

3) ఒకే భాష: ఆదిమ తెగ ప్రజలంతా ఒకే భాష మాట్లాడతారు. ఈ లక్షణం వీరిలో సాముదాయిక ఐక్యత భావన వృద్ధి చెందడానికి సహకరిస్తుంది.

4) అంతర్వివాహ సమూహం: ఆదిమ తెగ అంతర్వివాహ సమూహం. అంటే ఏ తెగ వారు ఆ తెగలోని వారినే వివాహమాడతారు. మరొక తెగ వారితో వివాహ సంబంధాలు ఉండవు.

5) రక్త సంబంధ బాంధవ్యాలు: ఆదిమ తెగ ప్రజలంతా ఒకే పితరుడి నుంచి జన్మించామని విశ్వసిస్తారు. అతడు పురాణపురుషుడై కూడా ఉండొచ్చు. ఈ భావన వల్ల తామంతా రక్త సంబంధీకులమనే భావన కలిగి, ఐక్యతతో జీవిస్తారు.

6) రక్షణ పరమైన వ్యవస్థాపన: ఆదిమ తెగ ప్రజలకు నిరంతరం రక్షణ, భద్రతాపరమైన సమస్యలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదిమ తెగ ప్రత్యేకమైన రాజకీయ, పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. పరిపాలనా బాధ్యతలను ఒక వ్యక్తికి అప్పగిస్తారు. అతడిని ఆదిమ తెగ అధిపతిగా గుర్తిస్తారు. అతడు తన సామర్థ్యం, ప్రజ్ఞ ద్వారా తెగను పరిపాలిస్తూ సమస్యలను పరిష్కరిస్తాడు. పాలనా సౌలభ్యం కోసం ప్రతి ఆదిమ తెగను కొన్ని భాగాలుగా విభజించి, ఒక్కో భాగానికి ఒక్కో అధిపతిని నియమిస్తారు. 

7) మత ప్రాముఖ్యం: ఆదిమ తెగలో మతానికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఆదిమ తెగ రాజకీయ, సామాజిక వ్యవస్థలు మతంపై ఆధారపడతాయి. మత అంగీకారం, గుర్తింపు లేకపోతే ఏ అంశానికైనా విలువ ఉండదు.

8) ఒకే సంస్కృతి, నామధేయం: ఒకే భాష, మతం, రాజకీయ వ్యవస్థాపన, ఐకమత్య భావన లాంటి అంశాలు ఆదిమ తెగకు ఒకే సంస్కృతి ఉండే విధంగా చేస్తాయి. ప్రతి ఆదిమ తెగకు సహజంగా ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. దాంతోనే ఆ తెగ ప్రజలను పిలుస్తారు.

9) గోత్రాల వ్యవస్థాపన: ఆదిమ తెగలో కొన్ని గోత్రాలుంటాయి. ప్రతి గోత్రానికి కొన్ని నిర్దిష్ట ప్రకార్యాలు, లక్షణాలు ఉంటాయి. ఒక అధిపతి కూడా ఉంటాడు.

ఆదిమ తెగ - హోర్డ్‌: హోర్డ్‌ అంటే సంచార సమూహం లాంటిది. నిర్దిష్టమైన ఒక ప్రాంతం, స్థిర నివాసం లేకుండా సంచరిస్తూ ఉండే ఒక చిన్న సమూహం. ఈ రకమైన చిన్న సమూహం కాలక్రమేణా తన పరిమాణాన్ని పెంచుకుని ఆదిమ తెగగా మారుతుంది. హోర్డ్‌లోను, ఆదిమ తెగలోను రక్తసంబంధ భావన, సాముదాయిక భావన ఉంటుంది. అయితే ఈ రెండింటికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని బొగార్డిస్‌ అభిప్రాయపడ్డారు. అవి -  

1) ఆదిమ తెగ పరిమాణం హోర్డ్‌ కంటే పెద్దది.    

2) ఆదిమ తెగలో హోర్డ్‌ కంటే మత ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది.

3) హోర్డ్‌ కంటే ఆదిమ తెగలో రక్షణకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.    

4) పెద్ద పరిమాణం ఉండటం వల్ల   హోర్డ్‌తో పోల్చినప్పుడు ఆదిమ తెగలో ఐక్యత తక్కువగా ఉంటుంది.    

5) ఆదిమ తెగ కొన్ని భాగాలుగా  విభజితమై ఉంటే, హోర్డ్‌లో అలాంటి భాగాలు ఉండవు.

6) వ్యవసాయం సహజంగా ఆదిమ తెగ వృత్తి. అయితే హోర్డ్‌ సంచార జీవనం కలిగి ఉండటం వల్ల వ్యవసాయ వృత్తికి ప్రాధాన్యం లేదు.

7) ఆదిమ తెగకు స్థిర నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివాసం ఉంటే, హోర్డ్‌ సంచార జీవనం గడుపుతుంది.

ఆదిమ తెగ - డార్మిటరీ: ఆదిమ తెగలో ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ యువజన వ్యవస్థాపన. సాయంత్రం కాగానే యువతీ, యువకులను ఈ డార్మిటరీలోకి పంపి రాత్రి సమయం గడిపేలా చేస్తారు. గిరిజనుల సామాజిక జీవనానికి ఈ డార్మిటరీలు చాలా ముఖ్యం. వీటికి పలు తెగల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. అస్సాంలోని నాగా తెగలో మగవారు నివసించే పడక ఇల్లును ‘మొరంగ్‌’ అని, ఆడవారు ఉండే పడక ఇంటిని ‘యొ’ అని అంటారు. నాగా తెగలో ‘కుంచికి’, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆదిమ తెగలో ‘రంగభంగ్‌’, ముండా తెగలో ‘గితియార’ లాంటి పేర్లతో పిలుస్తారు. ఇవి ఆడవారికి, మగవారికి వేర్వేరుగా ఉంటాయి. 15, 16 ఏళ్ల వయసున్న బాలబాలికలు రాత్రుళ్లు వీటిలోనే నిద్రించాలి. అస్సాంలోని మియామి తెగలో ఆడ, మగ పిల్లలు ఒకే డార్మిటరీలో నిద్రిస్తారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని వీటిలోకి అనుమతించరు. అవివాహిత యువతీ యువకులు రాత్రి సమయంలో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ రాత్రి దీనిలోనే గడపాలి.

* కొన్ని ఆదిమ తెగల్లో డార్మిటరీలు గ్రామం వెలుపల, ఇంకొన్ని తెగల్లో గ్రామానికి దగ్గరగా, మరికొన్ని తెగల్లో గ్రామం మధ్యలో నిర్మించి ఉంటాయి. వీటిలో నివసించడానికి వయో పరిమితి తెగకు, తెగకు వేరుగా ఉంటుంది.

* వివాహానంతరం వీటిలో నివసించే సభ్యత్వం ఉండదు. భర్త మరణించిన స్త్రీ మళ్లీ దీనిలో సభ్యత్వం పొందుతుంది.సభ్యులంతా కొన్ని సంప్రదాయబద్ధమైన నిబంధనలు అనుసరించాలి.

* సాయంత్రం కాగానే వీరు తమ ఇళ్లలో భోజనం ముగించి డార్మిటరీ వద్దకు చేరతారు. చలి మంట వేసుకుని దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, కథలు చెబుతూ తర్వాత నిద్రిస్తారు. ఈ సభ్యులను వయసు ఆధారంగా సీనియర్లు, జూనియర్లు అని రెండు తరగతులుగా విభజిస్తారు. సీనియర్‌ విభాగంలోని ఒకరు నాయకుడిగా వ్యవహరిస్తారు. గృహనిర్మాణం, వివాహం, పొలం పనులు మొదలైన వాటికి సహాయం చేస్తుంటారు. సహజంగా ఈ డార్మిటరీలకు ద్వారాలు, కిటికీలు ఉండవు. లోపలికి ప్రవేశించేందుకు మనిషి పట్టేంత రంధ్రం మాత్రం ఉంటుంది.

* గోండు తెగలోని గోతుల్‌ డార్మిటరీలో దాని అధిపతిని ‘చల్లన్‌’ అంటారు. ఇతడి కింద దివాన్, తహసీల్దార్, సుబేదార్, కొత్వాల్‌ ఉంటారు. వీరు క్రూర జంతువులు, విష పురుగుల దాడి నుంచి తెగను కాపాడేందుకు రాత్రుళ్లు కాపలా కాస్తారు.

* ఎస్‌.సి. రాయ్‌ అభిప్రాయంలో డార్మిటరీలకు పలు రకాల ప్రకార్యాలు ఉన్నాయి. అవి-

1) ఆర్థికపరమైన ప్రకార్యాలకు తోడ్పడటం.

2) ఆడ, మగ పిల్లలకు సామాజిక విధులను తెలియజేయడం. లైంగిక విద్యను బోధించడం.

3) యువతీ, యువకుల ప్రవర్తనలను క్రమబద్ధం చేయడం.

* నేటికాలంలో నాగరిక ప్రపంచంతో గిరిజనులకు సంబంధాలు పెరగడంతో వీరికున్న వివిధ సామాజిక సంస్థలతోపాటు డార్మిటరీలు అంతరించిపోతున్నాయి.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

Posted Date : 17-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌