• facebook
  • whatsapp
  • telegram

రాబర్ట్‌ క్లైవ్‌ తర్వాత పరిస్థితులు

అతడి సంస్కరణలు.. ఆంగ్లేయ సామ్రాజ్యానికి పునాదులు

పాలనను క్రమబద్ధీకరించేందుకు ఒక గవర్నర్‌ జనరల్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు భారతదేశంలో బ్రిటిషర్ల అధికారాన్ని సుస్థిరం చేసేందుకు, తర్వాత కాలంలో సామ్రాజ్య విస్తరణకు పునాదులు వేశాయి. ఆ రెవెన్యూ, న్యాయపాలనా విధానాలు అమలై దాదాపు 250 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉన్నాయి. వరుస యుద్ధాలతో కంపెనీ రాజ్యాన్ని కాపాడాడు. స్థిరమైన పాలన అందించే ప్రయత్నం చేశాడు. భారతీయ సంస్కృతి పట్ల మక్కువ పెంచుకొని పరిరక్షణకు చర్యలు చేపట్టాడు.  

 

బక్సర్‌ యుద్ధం తర్వాత జరిగిన అలహాబాదు సంధి (క్రీ.శ.1765) బెంగాల్‌లో ఇంగ్లిష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు మార్గం సుగమం చేసింది. పదవీకాలం ముగియడంతో బెంగాల్‌ గవర్నర్‌గా చేసిన రాబర్ట్‌ క్లైవ్‌ 1767లో ఇంగ్లండ్‌ వెళ్లిపోయాడు. అతడి తర్వాత హారీ వేరెలెస్ట్‌ (1767 - 69), జాన్‌ కార్టియర్‌ (1769 - 72) వరుసగా బెంగాల్‌ గవర్నర్‌లయ్యారు. ఈ ఇద్దరి అనుభవరాహిత్యం పాలన వల్ల బెంగాల్‌ రాజ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

   రాబర్ట్‌ క్లైవ్‌ బెంగాల్‌లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పరిపాలన దాని లక్ష్య సాధనలో విఫలమైంది. కంపెనీ ఉద్యోగుల్లో అవినీతి, స్వార్థం పెరిపోయాయి. ఫలితంగా కంపెనీ రెవెన్యూ గణనీయంగా తగ్గింది. మైసూర్‌ రాజ్య పాలకుడు హైదర్‌ అలీతో కంపెనీ చేసిన మొదటి ఆంగ్లో మైసూర్‌ యుద్ధం (1767 - 69) మద్రాసు సంధితో ముగిసి ఆర్థిక నష్టం కలగజేసింది. అదే సమయంలో బెంగాల్‌ అంతటా క్షామం, అంటువ్యాధులు విలయతాండవం చేశాయి. గ్రామాలు, పట్టణాలు శ్మశానాలను తలపించాయి. పశుసంపద నశించింది. అయినా భూస్వాములైన జమీందార్లు, ప్రభుత్వోద్యోగులు ప్రజలను పీడించడం మానలేదు. జనం కష్టాల గుర్తించి పట్టించుకునేవారు లేరు. మరొక వైపు మహారాష్ట్రులు, మైసూర్‌ పాలకుడు హైదర్‌ అలీ తమ బలాన్ని పెంచుకున్నారు. బెంగాల్‌ రాజ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.

   ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ డైరెక్టర్‌లు వారన్‌ హేస్టింగ్స్‌పై విశ్వాసంతో సమస్యల పరిష్కారం కోసం అతడిని క్రీ.శ.1772లో బెంగాల్‌ గవర్నర్‌గా నియమించారు. క్రీ.శ.1773లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ తీసుకువచ్చిన రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం బెంగాల్‌ గవర్నర్‌ పేరు బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా మారింది. ఆ విధంగా వారన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌కు మొదటి గవర్నర్‌ జనరల్‌ అయ్యాడు. తన పదవీ కాలంలో (1772 - 85) ఆంగ్ల రాజ్య సుస్థిరత ప్రధానంగా కంపెనీ పాలనను క్రమబద్ధం చేయడానికి పాలనలో సంస్కరణలు తీసుకువచ్చాడు. వాటిలో కొన్ని నేటికీ ప్రామాణికంగా నిలిచాయి.

 

రాజకీయ సంస్కరణలు

రాబర్ట్‌ క్లైవ్‌ స్థాపించిన ద్వంద్వ పాలనతో అధికారుల్లో జవాబుదారీతనం లోపించింది. కాబట్టి వారన్‌ హేస్టింగ్స్‌ అధికారంలోకి రాగానే క్లైవ్‌ నెలకొల్పిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. పాలనా బాధ్యతలను కంపెనీ నేతృత్వంలోకి తీసుకువచ్చాడు. మొగల్‌ చక్రవర్తి మహారాష్ట్రులతో స్నేహం చేస్తున్నాడనే కారణంతో కంపెనీ ఆయనకు ఇవ్వాల్సిన సాలీనా భరణం ఆపేశాడు. అతడి నుంచి కోరా,  అలహాబాద్‌లను తీసివేసి అయోధ్య నవాబుకు రూ.50 లక్షలకు అమ్మేశాడు. దివానీ అధికారానికి ప్రతిఫలంగా కంపెనీ పాలకులు నవాబుకు ఇచ్చే చెల్లింపులను గణనీయంగా తగ్గించాడు.

 

రెవెన్యూ సంస్కరణలు

వారన్‌ హేస్టింగ్స్‌ కంపెనీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చాల్సిన అవసరాన్ని గుర్తించాడు. శిస్తు వసూలు చేయడంలో సౌలభ్యం కోసం కంపెనీ రాజ్యాన్ని జిల్లాలుగా విభజించి శిస్తు వసూలు చేయడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్‌ను నియమించాడు. కోశాగారాన్ని ముర్షిదాబాదు నుంచి కలకత్తాకు మార్చాడు. దానిపై అధికారం ఆంగ్లేయులదే అని ప్రకటించాడు. అప్పటి నుంచి కంపెనీ బెంగాల్‌ ప్రాంతానికి కలకత్తా ప్రధాన కేంద్రంగా మారింది. హేస్టింగ్స్‌ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనుకుని స్వదేశీయులతో పాటు విదేశీయులపైనా 2.5% సుంకం విధించాడు.

   దేశంలో లెక్కకు మించి ఉన్న వాణిజ్య సుంకం వసూలు కేంద్రాలను తగ్గించి అయిదు కేంద్రాల ద్వారా మాత్రమే సుంకం వసూలు చేశాడు. అవి కలకత్తా, హుగ్లీ, ముర్షిదాబాదు, ఢాకా, పాట్నా.  బెంగాల్‌ రాజ్యాధికారాన్ని కంపెనీ అనుభవిస్తోంది. ఉద్యోగులు దస్తక్‌లను దుర్వినియోగం చేయడం వల్ల కంపెనీకి ఆర్థిక నష్టం కలిగింది. కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత వ్యాపారాన్ని, దస్తక్‌లను అక్రమ వినియోగాన్ని హేస్టింగ్స్‌ నిషేధించాడు.

 

న్యాయ సంస్కరణలు 

వారన్‌ హేస్టింగ్స్‌ అధికారంలోకి వచ్చేటప్పటికి బెంగాల్‌లో న్యాయపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఆయన చాలా వరకు హిందూ ధర్మశాస్త్రాలు, మహ్మదీయ న్యాయ గ్రంథాల సహాయంతో పండితులను సంప్రదించి న్యాయ సంస్కరణలు తీసుకువచ్చాడు. ప్రతి జిల్లాలో సివిల్‌ కేసులను విచారించడానికి దివానీ అదాలత్‌ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటుచేశాడు. ఈ కోర్టు నుంచి పై న్యాయస్థానానికి అప్పీల్‌ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కలకత్తాలో సాదర్‌ దివానీ అదాలత్‌ అనే ముఖ్య న్యాయస్థానాన్ని స్థాపించాడు. దీనిలో గవర్నర్‌ జనరల్‌ కూడా తీర్పు చెప్పేవాడు. 

    క్రిమినల్‌ కేసులను విచారించడానికి ప్రతి జిల్లాలో నిజామత్‌ అదాలత్‌ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కోర్టు నుంచి పై న్యాయస్థానానికి అప్పీల్‌ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కలకత్తాలో సాదర్‌ నిజామత్‌ అదాలత్‌ అనే ముఖ్య న్యాయస్థానాన్ని స్థాపించాడు. హాల్‌ హెడ్‌ ఇదేకాలంలో హిందూ ధర్మశాస్త్రాలను ‘ఎ కోడ్‌ ఆఫ్‌ జెంటూ లాస్‌’ అనే పేరుతో అనువాదం చేశాడు.

 

ఇతర సంస్కరణలు 

హేస్టింగ్స్‌కు భారతీయ సంస్కృతిపై అపారమైన గౌరవం ఉండేది. ఆయన మిత్రుడు, కలకత్తా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీని స్థాపించాడు. ఈ సంస్థ మరుగునపడిన భారతీయ సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడానికి అవిరళ కృషి చేసింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్‌ ఇంగ్లిష్‌లోకి అనువాదం చేశాడు. చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. 

రోహిల్లా యుద్ధం (1774), మొదటి మరాఠా యుద్ధం (1778 - 82), రెండో మైసూర్‌ యుద్ధం (1780 - 84) చేసిన హేస్టింగ్స్‌ శైశవ దశలో ఉన్న కంపెనీ బెంగాల్‌ రాజ్యాన్ని సంరక్షించి చక్కటి పౌర పరిపాలనతో పాటు సుస్థిరతను అందించి భావి పాలకులకు మార్గదర్శి అయ్యాడు.  

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 26-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌