• facebook
  • whatsapp
  • telegram

స్వాతంత్య్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర

అక్షరాలే అగ్నికణికలై! 


స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ పత్రికల అక్షరాలే అగ్నికణికలై ఆంగ్లేయుల అక్రమాలను, అన్యాయాలను, అణచివేతలను  ఎదిరించాయి. ప్రజాభిప్రాయానికి శక్తిమంతమైన స్వరంగా మారాయి.  వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాయి. సామాజిక కట్టుబాట్లు, దురాచారాల చట్రంలో నలిగిపోతున్న జనానికి మంచిచెడులను వివరించి చైతన్యపరిచాయి. భిన్న మతాలు, జాతులుగా విడిపోయిన సమాజంలో  ఐక్యతను పెంచి, జాతీయవాదాన్ని రగిలించాయి. దోపిడీలను బహిర్గతం చేసి, ధైర్యాన్ని నూరిపోసి పాలకులపై తిరగబడే విధంగా ప్రోత్సహించాయి. ప్రభుత్వాన్ని నేరుగా ధిక్కరిస్తూ, స్వాతంత్య్ర పోరాటానికి దన్నుగా నిలిచాయి. స్ఫూర్తిదాయకమైన భారత పత్రికా రంగం ప్రస్థానాన్ని, పీడితుల తరఫున పోరాడిన పత్రికల వివరాలను, విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన చారిత్రక శక్తుల్లో మన వార్తాపత్రికలకు గణనీయ స్థానం ఉంది. బ్రిటిష్‌ ఇండియాలో విభిన్న జాతులు, మతాలతో కూడిన  ప్రజల్లో సమైక్యతను బోధించి, జాతీయతా భావాలు వ్యాప్తి చేయడంలో పత్రికా రంగం అద్వితీయ పాత్ర పోషించింది. ప్రభుత్వ విధానాలు, చర్యలను విశ్లేషించి ప్రజలకు వివరించడంతోపాటు వలస పాలకుల పక్షపాత వైఖరి, ఆర్థిక దోపిడీని విమర్శించడంలో ఎనలేని ధైర్యాన్ని ప్రదర్శించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే క్రమంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు, అణచివేత విధానాలను తట్టుకుని నిలబడింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం పత్రికా రంగం ఆచరించిన ఆ అసమాన అసిధారావ్రతం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిక్షిప్తమైంది.

ఆధునిక యుగంలో పత్రికా రంగం ఆవిర్భావం పూర్వాపరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన జాన్‌ గుటెన్‌బర్గ్‌ కనుక్కున్న ముద్రణా యంత్రాన్ని (ప్రింటింగ్‌ ప్రెస్‌) 16వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు వారు భారతదేశానికి పరిచయం చేశారు. అనంతరం మనదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పదవీకాలంలో 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ ద్వారా ‘ది బెంగాల్‌ గెజెట్‌’ పేరుతో ప్రచురితమైంది. దీనినే ‘కలకత్తా జనరల్‌ అడ్వర్టైజర్‌’, ‘హిక్కీస్‌ గెజెట్‌’ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాతి అయిదేళ్లలో ‘ది ఇండియా గెజెట్‌’, ‘ది కలకత్తా గెజెట్‌’, ‘ది బెంగాల్‌ జర్నల్‌’ అనే పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్‌ ఇండియాలోని కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రావిన్స్‌ల్లో పత్రికల స్థాపన విరివిగా సాగింది. 1785లో మద్రాసులో రిచర్డ్‌ జాన్సన్‌ ‘మద్రాస్‌ కొరియర్‌’ను, 1795లో ఆర్‌.విలియం ‘మద్రాస్‌ గెజెట్‌’, 1796లో హంఫ్రీ ‘ఇండియా హెరాల్డ్‌’లను స్థాపించారు. 1789లో బొంబాయిలో స్థాపించిన మొదటి వార్తా పత్రిక ‘బాంబే హెరాల్డ్‌’. 1789లో ‘బాంబే కొరియర్‌’, 1791లో ‘బాంబే గెజెట్‌’ వెలువడ్డాయి. ఇవన్నీ ఆంగ్లభాషా పత్రికలే.

 

భారతదేశంలో 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, గుజరాతీ, మరాఠీ భాషల్లో ప్రాంతీయ భాషా పత్రికల స్థాపన వేగంగా సాగింది. 1821లో రాజా రామ్మోహన్‌ రాయ్‌ స్థాపించిన ‘వంగదూత’, ‘సంవాద కౌముది’, పర్షియన్‌ పత్రిక ‘మిరాత్‌-ఉల్‌-అక్బర్‌’లు ప్రజల్లో మూఢాచారాలను ఖండించి, శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచడానికి కృషి చేశాయి.

బొంబాయి రాష్ట్రంలో దాదాభాయ్‌ నౌరోజీ నాయకత్వంలో వెలువడిన ‘రాస్త గోఫ్టర్‌’ అనే గుజరాతీ పత్రిక పార్శీ ప్రజల్లో చైతన్యానికి కృషి చేసింది. బాలశాస్త్రి జంబేకర్‌ ‘బొంబాయి దర్పణం’ అనే పత్రికను మరాఠీ భాషలో ప్రారంభించి, ప్రజల సంక్షేమ విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1822లో ఫర్దాంజీ ముర్జ్‌బాన్‌ ‘బాంబే సమాచార్‌’ను ప్రారంభించారు. ఈయన బొంబాయిలోని వెర్నాక్యులర్‌ ప్రెస్‌కు మార్గదర్శకుడు.


మద్రాసు రాష్ట్రంలో మొదట్లో పత్రికా ప్రచురణ వేగంగా సాగలేదు. 1844లో గాజుల లక్ష్మినరసుశెట్టి ‘క్రిసెంట్‌’ అనే పత్రికను  స్థాపించాడు. ఈ పత్రికలో ప్రభుత్వ అక్రమాలను, ఆంగ్ల ప్రభుత్వోద్యోగుల దోపిడీని విమర్శించారు. 1838 నుంచి 1851 వరకు మద్రాసు నుంచి వెలువడిన తెలుగు పత్రిక ‘వృత్తాంతిని’ ప్రభుత్వాన్ని విమర్శించి ఆంక్షలకు గురైంది.

బ్రిటిష్‌ ఇండియాలో పత్రికలను స్థూలంగా 1858కు ముందు, 1858 తర్వాత అని రెండు దశలుగా చెప్పవచ్చు. 1857కి ముందు ప్రచురితమైన భారతీయ పత్రికలు వినోద, విజ్ఞానాలే కాకుండా సాంఘిక, రాజకీయ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, జాతిని జాగృతం చేయడానికి కృషి చేశాయి.

1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయ పత్రికలు దేశంలో జాతీయత భావాలను పెంపొందించడంలో, దేశభక్తిని ప్రబోధించడంలో, బ్రిటిషర్ల దుష్పరిపాలన, వర్ణ వివక్ష, దోపిడీ విధానాలను ఎండగట్టడంలో విప్లవాత్మక ధోరణిని అవలంబించాయి. లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించినప్పుడు, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో అనేక పత్రికలు ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన పాత్ర అద్వితీయం. బెంగాల్‌లో కె.కె.మిత్ర స్థాపించిన ‘సంజీవని’, సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘బెంగాలీ’, మోతీలాల్‌ ఘోష్‌ ‘అమృతబజార్‌ పత్రిక’; బరింద్రకుమార్‌ ఘోష్, భూపేంద్రనాథ్‌ దత్త స్థాపించిన ‘యుగాంతర్‌’, బిపిన్‌ చంద్రపాల్‌ ‘వందేమాతరం’ వంటి పత్రికలు 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాయి.


ప్రముఖ అతివాద కాంగ్రెస్‌ నాయకుడైన బాలగంగాధర్‌ తిలక్‌ బొంబాయి రాష్ట్రంలో ‘కేసరి’ అనే పత్రికను మరాఠీలో, మరాఠా పత్రికను ఇంగ్లిష్‌లో ప్రచురించారు. తిలక్‌ తన పత్రికల్లో నిప్పు కణికల్లాంటి సంపాదకీయ వ్యాసాల ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆర్థిక దోపిడీ, దాష్టీకాలను తీవ్రంగా విమర్శించేవాడు. కేసరి, మరాఠా పత్రికలు ప్రభుత్వంపై తిరగబడే ధైర్యాన్ని ప్రజలకు నూరిపోసి ఆంగ్లేయ అధికారులకు దడ పుట్టించేవి. ప్రభుత్వ ఆంక్షలకు వెరవక హోమ్‌రూల్‌ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర నిర్వహించాయి. మద్రాసు రాష్ట్రంలో జి.సుబ్రమణ్య అయ్యర్, విజయ రాఘవాచారి స్థాపించిన ‘ది హిందూ’ కూడా ప్రజాభిప్రాయానికి దర్పణంగా నిలిచింది. 

 

ఇవేకాకుండా స్వాతంత్య్ర సమరయోధులు అనేక మంది పత్రికలు స్థాపించి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించడంతో పాటు తమ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఉదాహరణకు అనిబిసెంట్‌ స్థాపించిన ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’ పత్రికలు హోమ్‌రూల్‌ లీగ్‌ భావజాలాన్ని సమర్థంగా ప్రచారం చేశాయి. మౌలానా ఆజాద్‌ స్థాపించిన ‘అల్‌-హిలాల్‌’, గాంధీజీ స్థాపించిన ‘యంగ్‌ ఇండియా’, ‘హరిజన్‌’ ఈ తరహాలోనే ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఎన్నో పత్రికలు గాంధీ సాగిస్తున్న జాతీయోద్యమాలకు బాసటగా నిలిచాయి. 

బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరి: బ్రిటిషర్ల జాత్యహంకార పాలనను, అణచివేత విధానాలను తీవ్రంగా విమర్శించిన అమృత బజార్, హిందూ, స్వదేశీ మిత్రన్, మరాఠా, కేసరి లాంటి ఎన్నో పత్రికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత శిక్షాస్మృతి, 1860లోని 124A సెక్షన్‌ కింద రాజద్రోహం కేసులు పెట్టింది. ఈ విధంగా భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో పత్రికలపై ప్రభుత్వ నిర్బంధం తీవ్రంగా ఉన్నప్పటికీ అధైర్యపడకుండా పోరాడాయి. అకుంఠిత దేశభక్తితో కర్తవ్యాన్ని పాటిస్తూ, జాతీయత, సమైక్యత, మానవత, దేశాభిమానం లాంటి మహోన్నత ఆశయాలను వ్యాప్తి చేశాయి. స్వాతంత్య్ర పోరాటం దిశగా ప్రజలను జాగృతం చేస్తూ, రాజకీయ కార్యోన్ముఖులను చేసిన దేశీయ పత్రికా రంగ పాత్ర చిరస్మరణీయం.

 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 17-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌