• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

క్రీ.శ.19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్నే 'సాంస్కృతిక పునరుజ్జీవనం' అంటారు. ఈ ఉద్యమాలు, సంస్కరణలు భారతీయుల్లో అంకురిస్తున్న జాతీయవాద స్పృహ, పాశ్చాత్య ఉదారభావ ధోరణిని ప్రతిబింబిస్తాయని ఎ.ఆర్. దేశాయ్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణమిషన్ లాంటి సంస్థలు మత సంస్కరణలతో పాటు సాంఘిక సంస్కరణలకూ కృషి చేశాయి. మన దేశ సంస్కృతిని పునరుద్ధరించడానికి, భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించడానికి రాజా రామ్మోహన్‌రాయ్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి భారతీయులతోపాటు ఐర్లాండ్‌కు చెందిన అనిబిసెంట్ కూడా ఎంతో కృషి చేశారు. 'భారతీయ సాంస్కృతిక పునర్వికాస పితామహుడి'గా రాజా రామ్మోహన్‌రాయ్ పేరొందారు. 'ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పునర్వికాస పితామహుడి'గా కందుకూరి వీరేశలింగం ప్రసిద్ధిచెందారు.

బ్రహ్మ సమాజం
రాజా రామ్మోహన్‌రాయ్ 1815లో ఆత్మీయ సభను స్థాపించారు. దాన్నే 1828లో బ్రహ్మ సమాజంగా మార్చారు. ఏకేశ్వరోపాసన, వర్ణ వ్యవస్థ రద్దు, విగ్రహారాధన నిర్మూలన లాంటి లక్ష్యాలు, సిద్ధాంతాలతో బ్రహ్మ సమాజం పనిచేసింది. పురోహితులు, పూజారుల అవసరంలేదని, వర్ణాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు, బహు భార్యత్వం, దేవదాసీ వ్యవస్థ, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాలను నిర్మూలించాలని బ్రహ్మ సమాజం పిలుపునిచ్చింది.
రాజా రామ్మోహన్‌రాయ్ మరణానంతరం రామచంద్ర విద్యా వాగీష్ బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించారు. ఇది ద్వారకానాథ్ ఠాగూర్ ఆర్థిక సహాయంతో నామమాత్రంగా నడిచేది. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో  తిరిగి బలపడింది. కేశవచంద్రసేన్ రాకతో దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించింది. 1866లో బ్రహ్మ సమాజం సిద్ధాంత విభేదాల వల్ల ఆదిబ్రహ్మ సమాజం, నవ వర్షీయ భారత బ్రహ్మ సమాజంగా విడిపోయింది. ఆదిబ్రహ్మ సమాజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్, నవబ్రహ్మ సమాజానికి కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించారు. తారాచంద్ అనే చరిత్రకారుడు బ్రహ్మ సమాజ కార్యదర్శిగా పనిచేశారు. బ్రహ్మ సమాజీకులు ప్రతి శనివారం సాయంత్రం సమావేశాలు నిర్వహించేవారు. 1878లో ఆనంద్‌బోస్ సాధారణ బ్రహ్మసమాజం అనే మరో శాఖను ఏర్పాటు చేశారు. కేశవ చంద్రసేన్ ప్రభావంతో మద్రాస్‌లో రాజగోపాలాచారి, సుబ్బరాయలు శెట్టి మొదలైనవారు వేద సమాజాన్ని స్థాపించారు. దీని పేరును తర్వాతి కాలంలో దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మార్చారు. ఆంధ్రదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వేంకటరత్నం నాయుడు, పిఠాపురం రాజా లాంటి వారు బ్రహ్మ సమాజ సేవలను విస్తరించారు.

దేవేంద్రనాథ్ ఠాగూర్
ఈయన 1817లో బెంగాల్‌లో జన్మించారు. 1838లో బ్రహ్మ సమాజంలో చేరి 1839లో తత్త్వబోధిని సభ,  పత్రిక, పాఠశాలను స్థాపించారు. 'బ్రహ్మధర్మం' అనే గ్రంథాన్ని కూడా రాశారు. 'మహా నిర్యాణ తంత్ర' అనే గ్రంథ సూత్రాలను అనుసరించి బ్రహ్మ సమాజ సభ్యులకు 'ప్రమాణ కర్మ' విధానాన్ని ఏర్పాటు చేశారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ వేదాల అమోఘత్వ సిద్ధాంతాన్ని అక్షయ్ కుమార్ దత్తా లాంటి సమకాలీనులు వ్యతిరేకించారు.

దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు శిష్యుడైన కేశవ చంద్రసేన్‌తో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల 1866లో బ్రహ్మ సమాజంలో చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఆది బ్రహ్మ సమాజం ఏర్పడింది. ఈయన మరణానంతరం రాజనారాయణ్ బోస్ ఆది బ్రహ్మ సమాజానికి నాయకుడయ్యాడు.

కేశవ చంద్రసేన్
బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి కేశవ చంద్రసేన్. ఈయన 1857లో బ్రహ్మ సమాజంలో చేరారు. సంగత్ సభను (సంగీత సభ) ఏర్పాటు చేశారు. 1866లో నవ భారత వర్షీయ బ్రహ్మ సమాజానికి నాయకుడయ్యాడు. ఈయన కృషి ఫలితంగానే 1872లో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని (నేటివ్ సివిల్ మ్యారేజ్ యాక్ట్) చేశారు. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 12, బాలుర వివాహ వయసును 14 సంవత్సరాలుగా నిర్ణయించారు. కానీ తన కుమార్తెకు బాల్య వివాహం చేసి విమర్శల పాలయ్యారు. సేన్ తన కుమార్తె రమాబాయిని కూచ్ బిహారీ యువరాజుకిచ్చి బాల్య వివాహం చేశారు. ఫలితంగా 1878లో శివనాథశాస్త్రి, ఆనంద మోహన్ బోస్‌లు సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. కేశవ చంద్రసేన్ భారత సంస్కరణ సమాజాన్ని స్థాపించి, దాని తరపున 'సులభ్ సమాచార్' పత్రికను నడిపారు. ఆ రోజుల్లో ఆ పత్రిక ఖరీదు ఒక పైసా మాత్రమే.

రాజా రామ్మోహన్‌రాయ్
  రాజా రామ్మోహన్‌రాయ్ 1774లో బెంగాల్‌లోని బర్ధ్వాన్ జిల్లాలో ఉన్న రాధానగర్‌లో జన్మించారు. కానీ రాయ్ జీవిత చరిత్రను రాసిన సోఫియా డాబ్సన్ కోవెట్ 1772లో జన్మించినట్లు రాశారు. రాయ్ కాశీలో సంస్కృత భాషను అభ్యసించారు. ఈయన గొప్ప రచయిత. బహుభాషా కోవిధుడు. ఈయన 'ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక' (తుహఫత్-ఉల్-మువాహద్దీన్ లేదా A Gift to monothies) అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఇంకా జీసస్ బోధనలు, శాంతి సంతోషాలకు మార్గం అనే గ్రంథాలు కూడా రచించారు. నాటి రంగపూర్ కలెక్టర్ విలియం డిగ్బే వద్ద దివాన్‌గా పనిచేశారు. హరిహరానంద తీర్థస్వామి సహాయంతో తాంత్రిక గ్రంథాలను అధ్యయనం చేశారు. 1815లో ఆత్మీయ సభను, 1825లో వేదాంత కళాశాలను, 1828లో బ్రహ్మ సమాజాన్ని, 1830లో బ్రహ్మ మందిరాన్ని స్థాపించారు. విలియమ్ ఆడమ్స్ అనే బాప్టిస్ట్ మతాచార్యుడు రాయ్ ఏకేశ్వరవాదాన్ని స్వీకరించారు. రాజా రామ్మోహన్‌రాయ్ గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన 'సంవాద కౌముది' అనే బెంగాలీ వార పత్రిక, 'మిరాతువ్ అక్బర్' అనే పారశీక పత్రికను ప్రచురించారు. రాయ్ కృషి ఫలితంగానే 1829లో విలియం బెంటింక్ సతీ సహగమన పద్ధతిని రద్దు చేశాడు. ఆంగ్ల విద్యను భారతీయులకు అందుబాటులోకి తేవాలని రాయ్ వాదించారు. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించిన సనాతన హిందువులు రాధాకాంత్ దేవ్ నాయకత్వంలో ధర్మసభను నెలకొల్పి 'సమాచార చంద్రిక' అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో రాజా రామ్మోహన్‌రాయ్ ఉద్యమ విధానాన్ని విమర్శించేవారు. నాటి మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ 1832లో రామ్మోహన్‌రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చి, తన తరపున ఇంగ్లండ్ పంపించాడు. కానీ 1833లో రాయ్ ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ నగరంలో మరణించారు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (1820 - 91)
ఈయన 1820లో బెంగాల్‌లోని వీరసింఘ అనే గ్రామంలో జన్మించారు.  సంస్కృత సాహితీ ప్రతిభ వల్ల కలకత్తా సంస్కృత కళాశాల నుంచి 'విద్యాసాగర్' అనే బిరుదును పొందారు. స్త్రీ విద్యాభివృద్ధికి, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేశారు. కలకత్తా మెట్రో పాలిటన్ కళాశాలను స్థాపించారు. 'వితంతు వివేకము' అనే గ్రంథాన్ని రచించారు. తన కుమారుడికి వితంతువుతో వివాహం జరిపించారు. ఇతడి కృషి ఫలితంగానే 1856లో వితంతువును వివాహం చేసుకున్న వ్యక్తికి ఆస్తి హక్కును కల్పించే చట్టాన్ని డల్హౌసీ చేశారు. విద్యా సాగరుడు 'బెంగాల్ చరిత్ర', 'సత్పురుషుల చరిత్ర', 'సీతా వనవాసము' గ్రంథాలను రాశారు. ఈయన రూపొందించిన బెంగాలీ ప్రాథమిక వాచకం ఇప్పటికీ వాడుకలో ఉంది. 1856, డిసెంబరు 7న దేశంలోనే మొదటి వితంతు వివాహాన్ని కలకత్తాలో జరిపించారు. 1856-60 సంవత్సరాల మధ్య ఈయన సుమారు 20 వితంతు వివాహాలను జరిపించారు. 1849లో స్త్రీ విద్యాభివృద్ధికి స్థాపించిన బెథూనిన్ పాఠశాలకు కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ప్రార్థనా సమాజం (1867)
ఆత్మారాం పాండురంగ 1867లో బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఎం.జి. రనడే, ఆర్.జి. భండార్కర్‌లు స్థాపక సభ్యులుగా ఉన్నారు. వీరు మతోద్ధరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్మికులు, మహిళలకు రాత్రి పాఠశాలలను నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఎం.జి. రనడే 'దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ'ని స్థాపించి, వితంతు వివాహ సంఘాన్ని నెలకొల్పారు.
ఎం.జి.రనడే ప్రార్థనా సమాజం మూల సూత్రాలకు వివరణ కల్పించారు.  ప్రార్థనా సమాజం మహిళా విభాగంలో పండిత రమాబాయి సరస్వతి విశేష కృషి చేశారు. కోస్తా ఆంధ్రాలో కూడా ప్రార్థనా సమాజం ప్రాచుర్యాన్ని పొందింది. (తారాచంద్ రాసిన గ్రంథంలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది 1867 అని, తెలుగు అకాడమీ పుస్తకాల్లో 1869 అని ప్రచురితమై ఉంది.)
           వాస్తవానికి బొంబాయిలో మత సంస్కరణకు 1840లోనే శ్రీకారం చుట్టిన సంస్థ పరమహంస మండలి. పశ్చిమ భారతదేశంలో మొదటి సంఘ సంస్కర్తగా పేరొందిన గోపాల్ హరిదేశ్‌ముఖ్‌ ఈ సంస్థ ద్వారా సంఘ సంస్కరణకు కృషిచేశారు. ఈయన లోకహితవాది అనే బిరుదును పొందాడు.  విగ్రహారాధన, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. 'పురోహితులు మహా అపవిత్రులు. పండితులు పురోహితులకంటే భ్రష్టులు, అజ్ఞానులు, అహంకారులు. మానవులంతా సమానులు, ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని సంపాదించే హక్కు ఉంది' అని ఎలుగెత్తిచాటారు.

ఆర్య సమాజం
ఆర్య సమాజాన్ని 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. దయానందుడి అసలు పేరు మూల్ శంకర్. ఈయన 1824లో గుజరాత్‌లో ఉన్న మొర్వి ప్రాంతంలో టంకార్ గ్రామంలో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన పరమానంద సరస్వతి వద్ద దీక్ష స్వీకరించి, సన్యాసిగా మారి, దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నారు. మధురలోని విరజానంద స్వామి వద్ద వేదాల్లోని సత్యాన్ని తెలుసుకున్నారు.
దయానంద సరస్వతి ఆర్య సమాజం తరఫున 10 సూత్రాలను హిందీ భాషలో ప్రచారం చేశారు. కానీ సంస్కృత భాషలోనే తన రచనలు చేశారు. 'సత్యార్థ ప్రకాశిక' , 'రుగ్వేద భాష్య భూమిక' అనే గ్రంథాలను రచించారు. 1882లో గోరక్షణ సభను స్థాపించారు. 'వేదాలకు మరలండి' (Go Back to Vedas) అనే నినాదాన్ని ఇచ్చారు. 'భారతదేశం భారతీయులకే' అని ప్రకటించారు. ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 'ఆంగ్లేయుల పాలన కంటే భారతీయుల స్వపరిపాలన మరెంతో మంచిది' అని వ్యాఖ్యానించారు. 1883లో దయానంద సరస్వతి మరణం తర్వాత 1886లో లాహోర్‌లో దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాలను స్థాపించారు. స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో ఆర్య సమాజం కొనసాగింది. కానీ 1892లో ఆర్య సమాజం గురుకుల, కళాశాల వర్గాలుగా చీలిపోయింది. గురుకుల వర్గానికి స్వామి శ్రద్ధానంద నాయకత్వం వహించగా, కళాశాల వర్గానికి లాలా హన్సరాజ్, శయన దాస్, లాలా లజపతిరాయ్‌లు నాయకత్వం వహించారు. స్వామి శ్రద్ధానంద అసలు పేరు మున్షీ రామ్. గురుకుల వర్గం హరిద్వార్ కేంద్రంగా కాంగీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, సేవలు కొనసాగించగా, కళాశాల వర్గం లాహోర్ కేంద్రంగా పనిచేసింది. నాటి ఆర్య సమాజ కృషిని, ఉద్యమ ప్రచారాన్ని గమనించిన ప్రముఖ ఆంగ్ల పాత్రికేయులు వాలెంటైన్ చిరోల్ (టైమ్స్ పత్రిక) 'బ్రిటిష్ సార్వభౌమాధికారానికి ఆర్య సమాజం ప్రమాదికారికాగలదు' అని పేర్కొన్నాడు.
స్వామి రామానందతీర్థ హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజాన్ని నడిపారు. హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఆర్య సమాజం సాంఘిక, మత సంస్కరణలతోపాటు జాతీయ చైతన్యాన్ని కూడా ప్రచారం చేసింది. స్వామి వివేకానందుడు ఉపనిషత్తులకు, దయానంద సరస్వతి వేదాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు.

ఆంధ్రాలో బ్రహ్మ సమాజం
బ్రహ్మ సమాజ సేవలను దక్షిణ భారతదేశానికి కేశవ చంద్రసేన్ విస్తరించినట్లుగా పేర్కొంటారు. 1878లో మన్నవ బుచ్చయ్య పంతులు బ్రహ్మ సమాజంలో చేరారు. ఉత్తర సర్కారు ప్రాంతానికి చెందిన రాజా గజపతిరావు ధన సహాయంతో బ్రహ్మసమాజ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్. కళాశాల) ప్రధానాచార్యుడిగా పనిచేసి అక్కడ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు, సంస్కరణలను ప్రచారం చేశారు. బ్రహ్మధర్మ ప్రచారక నిధిని ఏర్పాటు చేశారు. కాకినాడలో బ్రహ్మ మందిరం, అనాథ శరణాలయాలను స్థాపించారు. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించి దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. ఆంధ్రదేశంలో రాజమండ్రి కేంద్రంగా బ్రహ్మ సమాజ సేవలను అందించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ఈయన గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, పాత్రికేయుడు. స్త్రీ విద్యాభివృద్ధికి, వితంతువుల ఉద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. హితకారిణీ సమాజం, వితంతు శరణాలయం, బాలికా పాఠశాలలు నెలకొల్పి ఆంగ్ల ప్రభుత్వంతో 'రావు బహద్దూర్' బిరుదును పొందారు. ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహాన్ని 1881, డిసెంబరు 11న రాజమండ్రిలో జరిపించారు.

రామకృష్ణ మిషన్
1897లో స్వామి వివేకానంద కలకత్తాలోని బేలూర్‌లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించాడు. తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడానికే ఈ సంస్థను స్థాపించాడు. (వాస్తవానికి 1897లో కాశీపూర్ సమీపంలోని బరానగర్‌లో వివేకానందుడు తొలి ఆశ్రమాన్ని స్థాపించి, 1899లో కలకత్తా సమీపంలోని బేలూరులో రామకృష్ణ మఠాన్ని నెలకొల్పాడు). 'మానవ సేవే మాధవ సేవ' అనే రామకృష్ణ పరమహంస సందేశం రామకృష్ణ మిషన్ నినాదమైంది. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసిన స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.

రామకృష్ణ పరమహంస
రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ లేదా గదాధరుడు. 1833లో బెంగాల్‌లోని కామర్‌కుర్/కామర్పకూర్ గ్రామంలో జన్మించాడు. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌లో రాసమణీదేవి నిర్మించిన కాళికామాత ఆలయంలో తన అన్న రామకుమార్ ఛటర్జీ అనంతరం అర్చకుడిగా చేరాడు. రామకృష్ణుడి గురువు తోతాపురి. గదాధరుడికి అయిదేళ్ల వయసున్న శారదామణి (శారదామాత)తో బాల్య వివాహం జరిగింది. రామకృష్ణుడు సాంఘిక, మత సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. 'వివిధ మతాలు భగవంతుడిని చేరుకోవడానికి ఉన్న వివిధ మార్గాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లే, మతాలన్నీ భగవంతుడిలో విలీనమవుతాయి' అని ప్రచారం చేశాడు. వర్ణ వ్యవస్థను, కులపరమైన విభేదాలను ఖండిస్తూ సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టాడు. రామకృష్ణ పరమహంస 1886లో అనారోగ్యంతో కాశీపూర్‌లో మరణించాడు.

పార్శీ మత సంస్కరణోద్యమం
ప్రాచీన కాలంలోనే పారశీకులు భారతదేశంపై దండెత్తి వచ్చారు. ఫలితంగా భారతీయులతో పారశీకులకు సంబంధాలు ఏర్పడ్డాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో అనేకమంది పారశీకులు (ఇరానియన్లు) గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు వచ్చారు. కానీ ఎక్కువగా బొంబాయిలో స్థిరపడ్డారు. హిందూ మత సంస్కరణ ఉద్యమ ప్రభావంతో పారశీకులు కూడా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చదివిన పారశీక విద్యావంతులు ఆధునిక భావాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. 1851లో నౌరోజీ ఫరందోజీ 'రహ్న మాయెమస్ దయానన్' సంస్కరణ సంఘాన్ని స్థాపించాడు. 1858లో పార్శీ బాలికా పాఠశాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీబోధ్, దస్త్ గఫ్తర్ లాంటి పత్రికలను స్థాపించి సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. దాదాభాయి నౌరోజీ, షాపూర్‌జీలు వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు. 1910లో పార్శీ మహాసభను నిర్వహించారు. దాదాభాయ్ నౌరోజీ రచించిన 'పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకంతో సంపద తరలింపు సిద్ధాంతం/ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రచురించారు. ఖుర్షీద్ నారీమన్ బొంబాయిలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన తొలి బొంబాయి పౌరుడిగా ప్రసిద్ధి చెందాడు. బొంబాయి రాష్ట్రం (ప్రెసిడెన్సీ)లో బద్రుద్దీన్ త్యాబ్జీ, సంయుక్త పరగణాలు(యూపీ)లో షేక్ అబ్దుల్ హలీల్ షరార్ సంస్కరణ ఉద్యమాలను ప్రచారం చేశారు. ఈ విధంగా భారతదేశంలోని అనేకమంది పారశీక సంఘ సంస్కర్తలు సంస్కరణ ఉద్యమాలను నడిపారు.

అలీఘర్ ఉద్యమం
వాస్తవంగా ముస్లింల సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్ని అలీఘర్ ఉద్యమంగా పేర్కొంటారు. దీన్ని ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్. ఈయన భారతీయ ముస్లిం సంఘ సంస్కర్తల్లో ముఖ్యమైన వ్యక్తి.  ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ మత సత్యాలు, సంప్రదాయాలను హేతువాదంతో సమన్వయ పరచడం, సచ్ఛీలతను - నైతిక ప్రవర్తనను పెంపొందించడం, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించడం లాంటి లక్ష్యాలతో మూడంచెల విద్యా వ్యవస్థలను స్థాపించాడు. 1875లో అలీఘర్ కేంద్రంగా ఆంగ్లో - ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. అది తర్వాతి కాలంలో అలీఘర్ విశ్వవిద్యాలయంగా మారింది. అలీఘర్ కేంద్రంగా అహ్మద్‌ఖాన్ నడిపిన ఉద్యమమే అలీఘర్ ఉద్యమంగా పేరొందింది. మొదట్లో జాతీయవాదిగా ఉన్న అహ్మద్‌ఖాన్ 'సుందర భారత వధువుకు హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటివారు' అని ప్రకటించాడు. కానీ అలీఘర్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడైన థియోడర్ బెక్ ప్రభావంతో ముస్లిం మతవాదిగా మారిపోయిన అహ్మద్‌ఖాన్ హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని (మీరట్ ఉపన్యాసంలో) ప్రకటించాడు.

           1859లో అహ్మద్‌ఖాన్ విధేయులైన భారతీయ ముస్లింలు, సిపాయిల తిరుగుబాటుకు కారణాలు అనే గ్రంథాలు రాశాడు. 'ఖురాన్ వైపు మరలండి' అనే నినాదాన్ని ఇచ్చాడు. 'తహరీక్ ఉల్ అబ్లాఖ్' అనే పత్రికను ప్రారంభించాడు. థియోడర్‌ బెక్ ప్రోత్సాహంతో అలీఘర్‌లో 1893లో 'మహ్మదీయ రక్షణ సమితి'ని స్థాపించాడు. 'భావ స్వాతంత్య్రం వికసించనంత వరకు నాగరిక జీవితమనేది ఉండదు' అని వ్యాఖ్యానించాడు. 'మూసిన మనసు సామాజికమైన, మేధా సంబంధమైన వెనకబాటుతనానికి ప్రతీక' అని చాటాడు. అన్ని మతాల్లో ఒకానొక అంతర్గతమైన ఏకత్వం ఇమిడి ఉందని పలికిన వ్యక్తి చివరికి ముస్లిం మతవాదిగా మారిపోయాడు.

ముస్లింల మత సంస్కరణ ఉద్యమం
 హిందూ మతంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం ఇస్లాం మతంపై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ముస్లింలు తమ మతం, సంఘంలో ఉన్న బహు భార్యత్వం, పరదా పద్ధతి, కులవ్యవస్థ లాంటి  దురాచారాలను తొలగించడానికి, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బెంగాల్ కేంద్రంగా షరియతుల్లా నాయకత్వంలో ఫెరైజీ ఉద్యమాన్ని నిర్వహించారు. 1830 - 57 మధ్య బిహార్, బెంగాల్ ప్రాంతాల్లో ముస్లింలు వహాబీ ఉద్యమాన్ని నడిపారు. షా వలీయుల్లా, షా అబ్దుల్ అజీజ్, సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హహరాన్‌పూర్ జిల్లాలో ఉన్న దేవ్‌బంద్ కేంద్రంగా దర్శ్‌నిజామీ దేవ్‌బంద్/ దియోబంద్ ఉద్యమాన్ని నడిపారు. 1867లో స్థాపించిన విద్యా సంస్థలో దర్శ్‌నిజామీ రూపొందించిన సంప్రదాయ విద్యాప్రణాళికను అమలు చేశారు. ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలని దేవ్‌బంద్ అధ్యక్షుడైన రషీద్ అహ్మద్ గంగోహి పిలుపునిచ్చాడు. రషీద్ అహ్మద్ గంగోహీ (గంగోవాలా), మహ్మద్ ఖాసిం నానాతాపీలు లక్నోలో దారుల్ ఉలూమ్ పాఠశాలను స్థాపించారు. ప్రాచ్య-పాశ్చాత్య భాషలతో కూడిన ఉమ్మడి విద్యా ప్రణాళికను హిబ్లీ నుమానీ ప్రవేశపెట్టాడు. 1863లో నవాబ్ అబ్దుల్ లతీఫ్ 'మహ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను స్థాపించి ముస్లింల విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. సంప్రదాయక ముస్లింలు షా వలీయుల్లా నాయకత్వంలో దిల్లీలో ఒక మదరసాను నెలకొల్పారు. అతడి కుమారుడు షా అబ్దుల్ అజీజ్ ఆంగ్లేయులపై జిహాద్ ప్రకటించాడు. షిబ్లి, నుమానీ మహ్మద్ హసన్, ఉబైదుల్లా సింధీ లాంటి ముస్లిం సంఘ సంస్కర్తలు హిందూముస్లిం ఐక్యతకు కృషి చేశారు.

స్వామి వివేకానంద
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్. 1863, జనవరి 12న కలకత్తాలో జన్మించాడు. కలకత్తా రాష్ట్రీయ కళాశాలలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. మొదట బ్రహ్మ సమాజికులతో చేరి విగ్రహారాధనను ఖండించాడు. కానీ రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారిన తర్వాత విగ్రహారాధనలో విశేషార్థమున్నదని గ్రహించాడు. విజ్ఞాన శాస్త్రానికి, బాహ్య జ్ఞానానికి వర్తింపజేసే పరిశోధనా పద్ధతులనే మతం అనే శాస్త్రానికి కూడా అనువర్తింపజేయాలని స్వామి వివేకానంద పేర్కొన్నాడు. భారతీయ ఉపనిషత్తుల్లోని బోధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి హైందవ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశాడు. 'నేను సోషలిస్ట్‌ను' అని ప్రకటించుకున్న తొలి భారతీయుడు వివేకానందుడే. ఈయన ప్రబుద్ధ భారత్ (ఆంగ్లం), ఉద్బోధ (బెంగాలీ) అనే పత్రికలను ప్రారంభించాడు. నా గురువు, రాజయోగ, కర్మయోగ, భక్తియోగ గ్రంథాలను రాశాడు. 'మన మాతృదేశానికి హిందూ-ఇస్లాం మహా వ్యవస్థల కూడలి ఏకైక ఆశాకిరణం' అని పేర్కొన్నాడు. 'మనం ప్రపంచంలోని ఇతర జాతులతో సంబంధం పెట్టుకోకుండా వేరుపడిపోవడమే మన దౌర్భాగ్యానికి కారణమని, మనం మళ్లీ మిగతా ప్రపంచపు వెల్లువలో కలవడమే తరుణోపాయం' అని ప్రకటించాడు. 'అన్ని జాతుల్లో ఉన్న పేదలే నేను విశ్వసించే ఏకైక దైవం' అని పేర్కొన్నాడు. భారతదేశ యువతను జాతీయ చైతన్యం పెంపొందించుకునేలా చేసి 'ఆధునిక జాతీయతా పితామహుడు'గా పేరొందాడు. వివేకానందుడు అతి చిన్న వయసులోనే 1902, జులై 4న మరణించాడు. ఇప్పటికీ భారతదేశంలో సేవలను అందిస్తున్న ఏకైక సంస్థ రామకృష్ణ మిషన్.

దివ్యజ్ఞాన సమాజం
 అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడం బ్లావెట్‌స్కీ, కల్నల్ ఆల్కాట్ 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని (థియోసోఫికల్ సొసైటీ) స్థాపించారు. థియోస్ అంటే దైవం, సోఫియా అంటే జ్ఞానం. అందుకే దీన్ని తెలుగులో 'దివ్యజ్ఞాన సమాజం'గా పిలిచారు. ఈ సమాజ ప్రధాన కేంద్రాన్ని 1879లో బొంబాయికి, 1882లో మద్రాస్ వద్ద ఉన్న అడయార్‌కు మార్చారు. బ్లావెట్‌స్కీ 'రహస్య సిద్ధాంతం' అనే గ్రంథాన్ని రాశారు. ఆమె మరణానంతరం కల్నల్ ఆల్కాట్ ఈ సమాజానికి నాయకత్వం వహించాడు. 1907లో కల్నల్ ఆల్కాట్ మరణానంతరం అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. ఈ సమాజం సాంఘిక, మత సంస్కరణతోపాటు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి కూడా కృషి చేశారు. ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో దివ్యజ్ఞాన సమాజ శాఖను నెలకొల్పారు. అనిబిసెంట్ 1888లోనే ఇంగ్లండ్‌లో దివ్యజ్ఞాన సమాజంలో చేరారు.

సిక్కు మత సంస్కరణ ఉద్యమం
గురునానక్ స్థాపించిన సిక్కు మతం క్రమంగా రాజకీయంగా ఏకమై రంజిత్‌సింగ్ నాయకత్వంలో స్వతంత్ర సిక్కు రాజ్యంగా రూపాంతరం చెందింది. సిక్కులు కూడా తమ మతం, సంఘంలో ఉన్న లోపాలను తొలగించడానికి సంస్కరణ ఉద్యమాలను నడిపారు. భాయి దయాళ్ సింగ్ రావల్పిండి ప్రధాన కేంద్రంగా నిరంకారీ ఉద్యమాన్ని నడిపాడు. విగ్రహారాధన, కర్మకాండలను విడిచిపెట్టమని, ఆనంద్ పద్ధతిలో వివాహాలు జరుపుకోవాలని, నిరాకారుడైన భగవంతుడిని మాత్రమే పూజించాలని ప్రబోధించాడు. అతడి కుమారుడైన భాయి దర్బార్‌సింగ్ నిరంకారీ ఉద్యమానికి నాయకుడై ఆనంద్ వివాహ పద్ధతిని ప్రోత్సహించాడు. భాయి రాంసింగ్ 'నామ్‌ధారీ' ఉద్యమాన్ని నడిపాడు. సిక్కుల్లోని మరో వర్గం గోవధను వ్యతిరేకిస్తూ, కసాయివారిని హత్య చేస్తూ, దేవాలయాలు, సమాధులు, శ్మశానాలు నాశనం చేస్తూ 'కూకా' ఉద్యమాన్ని ప్రారంభించింది. 1873లోనే సిక్కులు తొలి సింగ్‌ సభను ఏర్పాటు చేసుకున్నారు. 1920లో రాజకీయ పార్టీగా అకాళీదళ్‌ను స్థాపించారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని ఏర్పాటు చేశారు. 
           ఆధునిక భారతదేశంలో క్రీ.శ. 19వ శతాబ్దంలో ప్రారంభమైన వివిధ మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలనే సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ ఉద్యమాల వల్ల అటు మతంలో ఇటు సంఘంలో అనేక సంస్కరణలు జరిగాయి. అనుకూల అంశాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నిమ్న వర్గాల, కుల వ్యతిరేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. అనేక సాంఘిక దురాచారాలను నిషేధించారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌