• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో సామాజిక ఉద్యమాలు

సమాజ శ్రేయస్సుకు.. సమూహ ప్రయోజనాలకు!

వ్యవస్థలు సమర్థంగా.. బాధ్యతాయుతంగా పనిచేయనప్పుడు, ప్రభుత్వాల విధానాలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించినప్పుడు క్రమంగా పెరిగే అసంతృప్తి నిరసనగా వ్యక్తమై, పోరాటంగా మారి, చివరికి ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. పరిస్థితులను బట్టి తీవ్రమై అనేక సామాజిక మార్పులకు కారణమవుతుంది. అలాంటి పోరాటాలు అనేకం మన దేశంలో జరిగాయి. సమూహ ప్రయోజనాలే లక్ష్యంగా, సమాజ శ్రేయస్సు కోసం సంభవించిన ఆ ఉద్యమాల చరిత్ర గురించి పోటీ పరీక్షార్థులు  తెలుసుకోవాలి.


ఫ్రెంచి విప్లవ కాలం నుంచీ మానవ చరిత్ర గమనాన్ని చాలా సందర్భాల్లో అసమ్మతి ఉద్యమాల యుగంగా అభివర్ణిస్తారు. ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాల్లో సమ్మెలు, బంద్‌లు, బహిష్కరణలు, రాస్తారోకోలు, సత్యాగ్రహ రూపంలో ఉపవాసం చేయడం, ఆత్మాహుతి లాంటి తీవ్రమైన నిరసనలు కనిపిస్తాయి. భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదు.


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోనూ అనేక రకాల ఉద్యమాలు జరిగాయి. రైతుల ఉద్యమాలు, గిరిజనోద్యమాలు, దళిత ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, వెనుకబడిన కులాల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు వంటివి వాటిలో ఉన్నాయి. సమాజంలోని వివిధ వర్గాల వారు తమ సమస్యలను వ్యక్తం చేయడానికి, తమ వర్గం ప్రయోజనాల రక్షణకు ఉద్యమాలు చేపడతారు. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఓటు హక్కు కోసం చేపట్టిన స్త్రీల ఉద్యమం, జాతివాదానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నల్లవారి పోరాటాలను వాటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలకు మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్రల్లో వాటిని పర్యాయ పదాలుగానే ఉపయోగిస్తారు.


సామాజిక ఉద్యమాల లక్ష్యం సాంఘిక పరివర్తన. రాజకీయ ఉద్యమాల లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం లేదా రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేయడం. అయితే సమాజంతో సంబంధం లేకుండా రాజకీయాలు జరగవు. కాబట్టి అన్ని రాజకీయ ఉద్యమాలను సామాజిక ఉద్యమాలుగానే పరిగణించాలి. రాజకీయ ఉద్యమాలకు స్పష్టమైన ఉద్దేశాలు, డిమాండ్‌లు ఉండి, రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేయగలిగినప్పుడు, అధికారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటిని సామాజిక ఉద్యమాలుగా పేర్కొనవచ్చు.


సామాజిక ఉద్యమం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. అది ప్రధానంగా వ్యక్తుల సమూహ ప్రవర్తన రూపాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో ఏదో ఒక సమస్యపై ఉద్యమాలు జరిగాయి. నిర్దిష్ట లక్ష్యంతో సామాజిక శ్రేయస్సు, ప్రయోజనాన్ని ఆశించే ఏ ఉద్యమమైనా జరుగుతుంది. సనాతన సాంప్రదాయిక సామాజిక   నిర్మితి ఉన్న మన దేశంలో సామాజిక చైతన్యం, ఉద్యమాలు లేకపోతేే ఇంతటి అభివృద్ధి మార్పు సాధ్యమయ్యేది కాదు.  

 

అనేక రకాలు

భారతదేశంలో సామాజక ఉద్యమాలను అధ్యయనం చేసిన పలువురు రాజనీతి, సామాజిక శాస్త్రవేత్తలు వాటిని అనేక రకాలుగా వర్గీకరించారు. ‘గణ్‌శ్యాం షా’ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం అవి నాలుగు రకాలు.


1. సంస్కరణవాద ఉద్యమాలు: ఈ వాదం ప్రకారం సామాజిక ఉద్యమాలు రాజకీయ అధికారాన్ని సవాలు చేయవు. కానీ వ్యవస్థ మరింత సమర్థంగా, బాధ్యతాయుతంగా పని చేయడానికి కావాల్సిన మార్పులను సంస్కరణల రూపంలో ప్రవేశపెట్టాలని అభిలషిస్తాయి.

2. వ్యతిరేకవాద ఉద్యమాలు: ప్రస్తుతం అమలులో ఉన్న విధివిధానాలు ప్రజాప్రయోజనాలకు అనువుగా లేకపోతే వాటిని వ్యతిరేకిస్తూ రాజకీయాధికారంపై ధ్వజమెత్తుతాయి.

3. తిరుగుబాటువాద ఉద్యమాలు: పాలనలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో రాజకీయ అధికారాన్ని సవాలు చేస్తాయి.

4. విప్లవాత్మక ఉద్యమాలు: ఈ తరహా ఉద్యమాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని వ్యవస్థీకృతమైన పోరాటం ద్వారా కూలదోసేందుకు ప్రయత్నిస్తాయి. విప్లవం ద్వారా ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక నిర్మితిని ప్రశ్నిస్తాయి. ఒక కొత్త సామాజిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు కృషి చేస్తాయి. 


సామాజిక వ్యవస్థలోని వివిధ పార్శ్వాల మధ్య సరైన సంబంధాలను నెలకొల్పడానికి, తద్వారా రాజకీయ వ్యవస్థతో మరింత సమర్ధంగా, బాధ్యతాయుతంగా పని చేయించేందుకు ఈ ఉద్యమాలు దోహదం చేస్తాయని ‘గణ్‌శ్యాం షా’ అభిప్రాయపడ్డారు.


* మరో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త పార్థా ముఖర్జీ సామాజిక ఉద్యమాలను సమీకరణ ఉద్యమాలు, ప్రత్యామ్నాయ ఉద్యమాలు, పరివర్తనా ఉద్యమాలుగా వర్గీకరించారు.


* ఎం.ఎస్‌.ఎ.రావు అనే సామాజిక శాస్త్రవేత్త సంస్కరణవాద ఉద్యమాలు, పరివర్తనా ఉద్యమాలు, విప్లవాత్మక ఉద్యమాలుగా విభజించారు.


*  వివిధ సమస్యల చుట్టూ జన సమీకరణ జరిగే తీరుపై ఆధారపడి సామాజిక ఉద్యమాలను వర్గీకరిస్తారు. ఉద్యమంలో భాగస్వాములయ్యే వారిని ఆధారంగా చేసుకుని కూడా వాటిని వర్గీకరిస్తారు. విభిన్న ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న మన సమాజంలో ప్రజల దైనందిన జీవితాన్ని మార్చే దిశగా వచ్చిన వివిధ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు అంటే వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు పేర్కొనదగినవి.


రైతుల ఉద్యమాలు


వ్యవసాయ ప్రధానమైన భారతీయ సమాజంలో స్వాతంత్య్రానికి ముందు, తర్వాత ఎన్నో రైతు ఉద్యమాలు జరిగాయి. దేశంలోని రైతులు ఒక సజాతీయ సముదాయం కాదు. భూకమతాల పరిమాణాల ఆధారంగా రైతులను ఉపాంత, చిన్నకారు, మధ్యస్థాయి, పెద్ద రైతులుగా పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన భూమి లేని వర్గాలను వ్యవసాయ శ్రామికులు, కౌలుదారులు, షేర్‌ క్రాపర్‌లు అంటారు.


చరిత్ర: ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త ఎ.ఆర్‌.దేశాయ్‌ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో రైతు ఉద్యమాల చరిత్రను మొగలుల కాలం నుంచి లెక్కించవచ్చు. సాంప్రదాయిక భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, తర్వాత, రైతుల ఉద్యమాలెన్నో జరిగాయి. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత రైతులను దోచుకున్న భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, ఆ పరిణామాలను పట్టించుకోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో ఇండిగో తిరుగుబాటు (1859-60), జనతియా తిరుగుబాటు (1860-63), కుకు తిరుగుబాటు (1860-90), పవానా తిరుగుబాటు (1872-73) తదితరాలను ప్రధానంగా చెప్పవచ్చు.


20వ శతాబ్దపు తొలి దశకంలో మలబార్‌ కోస్తా ప్రాంతంలో (ప్రస్తుత కేరళ)  భూస్వాములకు వ్యతిరేకంగా ముస్లిం రైతులు మోప్లా లేదా మపిలా తిరుగుబాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో భూస్వాములైన దొరలు బలహీన వర్గాలను జోగిని పద్ధతి, బసివిని పద్ధతి తదితర రూపాల్లో దోచుకునేవారు. ప్రఖ్యాత సాంఘిక శాస్త్రవేత్త బారీ పావియర్‌ తన ‘ది తెలంగాణ మూవ్‌మెంట్‌’ గ్రంథంలో రైతుల తిరుగుబాటుకు కారణాలను విశ్లేషించి, ఉద్యమం డిమాండ్లను వివరించారు. భూమిపై హక్కు పత్రాలను (పట్టాదారు హక్కులు) నిజమైన/వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు ఇవ్వడం, జాగీర్దారీ వ్యవస్థ రద్దు, వెట్టి నిర్మూలన, కౌలుదార్ల నుంచి అధిక పన్ను వసూళ్లు తగ్గించడం వంటివి నాటి రైతుల డిమాండ్లు. వ్యవసాయ శ్రామికులు, చిన్న రైతులు, ఉపాంత రైతులు, భూమిపై సమష్టి ఆక్రమణదార్లు (పాట్‌ పట్టాదార్లు), రక్షిత కౌలుదార్లు (షిక్మిదార్లు), టెనెంట్స్‌ - అట్‌ - విల్‌ (ఆసామి షిక్మిదార్లు)లను కమ్యూనిస్టు పార్టీ చైతన్యపరచి వ్యవస్థీకృతం చేసింది. నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సారథ్యం వహించింది. ఈ సందర్భంగానే రైతులను ఉద్యమింపజేసేందుకు ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదాన్ని ప్రచారం చేసింది. ప్రముఖ నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మఖ్దూం మొహియుద్దీన్‌, దేవులపల్లి వెంటేశ్వరరావు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. మరోవైపు నిజాం, అతడి రజాకార్ల సైన్యం ఈ ఉద్యమాన్ని ప్రతిఘటించారు.దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948లో హైదరాబాదు రాజ్యంలోకి భారత సాయుధ దళాలు ప్రవేశించాయి. పోలీసు చర్యకు నిజాం లొంగిపోయి భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా ఇక్కడి రైతు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ ఉద్యమాల ప్రధాన విజయాలను డి.ఎన్‌.ధనగారె తన ‘సోషల్‌ ఆరిజన్స్‌ ఆఫ్‌ ది పెజెంట్‌ ఇన్‌సరెక్షన్‌ ఇన్‌ తెలంగాణ’ అనే గ్రంథంలో వివరించారు.


నాటి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో రైతులు, భూమి లేనివారు వేల ఎకరాల భూమిని అప్పట్లో ఆక్రమించుకున్నారు. ధాన్యం లెవీ పద్ధతి నిర్మూలన, వెట్టి తగ్గడం, జనబాహుళ్యం పెద్దఎత్తున రాజకీయీకరణ చెందడం వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. 1949 నుంచి 1954 వరకు వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రగతిశీల చట్టాలను రూపొందించారు. వీటిలో కొన్ని - జాగీర్‌ అబాలిషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌  (1949), ది హైదరాబాద్‌ టెనెన్సీ అండ్‌ అగ్రికల్చరల్‌ లాండ్స్‌ యాక్ట్‌ (1950), అగ్రికల్చరల్‌ టెనెన్సీ లాండ్స్‌ యాక్ట్‌ (సవరణ) 1954.


 రైతు ఉద్యమాల చరిత్రలో తెలంగాణ రైతుల ఉద్యమం (1946-1951) ఒక మైలురాయి. ఆ ఉద్యమం వల్ల అప్పటి ప్రభుత్వం కొత్త సామాజిక-ఆర్థిక వ్యూహాలను అనుసరించాల్సి వచ్చింది. సామాజిక ఉద్యమాలపై విస్తృత పరిశోధన చేసిన ఎం.ఎస్‌.ఎ.రావు అభిప్రాయంలో తెలంగాణ రైతుల ఉద్యమం సంప్రదాయ పంపిణీ వ్యవస్థలో ఎన్నో మార్పులకు కారణమైంది. 

వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

Posted Date : 17-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌