• facebook
  • whatsapp
  • telegram

స్వరాజ్య పార్టీ - క్రియాశీలక రాజకీయాలు


మార్పు కోరిన మరో పోరాటం!

 

సహాయ నిరాకరణ సమరోత్సాహంతో సాగుతున్న సమయంలో సంభవించిన చౌరీ చౌరా సంఘటన వల్ల మొత్తం ఉద్యమం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దేశమంతా రాజకీయ స్తబ్ధత ఆవరించింది. పోరాటాన్ని నిలిపివేయాలనే గాంధీజీ నిర్ణయాన్ని కొందరు జాతీయ నాయకులు తీవ్రంగా నిరసించారు. కొత్త పార్టీ పెట్టి, శాసనసభల్లో ప్రవేశించి, ఆంగ్లేయుల అరాచక పాలనను అడ్డగించే లక్ష్యంతో మరో సమరానికి సిద్ధమయ్యారు. ఎంతమంది కాదన్నా ముందుకే వెళ్లారు. ఎన్నికల్లో విజయాలను సాధించారు. చట్టసభల్లో తెల్లవారికి చుక్కలు చూపించారు. ప్రజలను మళ్లీ పోరాట పథంలోకి  నడిపించారు. జాతీయోద్యమంలోని ఈ ముఖ్యఘట్టాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

 

అప్పట్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ స్ఫూర్తి దేశమంతా విస్తృతంగా వ్యాపించి పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. అప్పుడే  ఎక్కడో చౌరీచౌరాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గాంధీజీని కలచివేసింది. సత్యాగ్రహ విధానంలో పోరాడటానికి ప్రజలు సిద్ధంగా లేరనే భావన ఆయనకు కలిగింది. మొత్తం ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపేశారు. ఆ నిర్ణయం కొంతమంది జాతీయోద్యమ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. అదే అదనుగా బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీపై రాజద్రోహం నేరం మోపి, కారాగార శిక్ష విధించింది. ఈ పరిణామాలు, గాంధీజీ అరెస్ట్‌ ప్రజలను నైరాశ్యంలోకి నెట్టేశాయి. దేశంలో తాత్కాలిక రాజకీయ స్తబ్ధత నెలకొంది. కొంతమంది స్వాతంత్య్ర ఉద్యమకారులు స్వరాజ్య సాధనకు దౌర్జన్య విధానాన్ని అవలంబించాలనే ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించడానికి 1922లో ఏఐసీసీ ఒక కమిటీని వేసింది. అందులోని ఎం.ఎ.అన్సారీ, రాజగోపాలాచారి, కస్తూరి రంగ అయ్యంగార్‌లు గాంధేయ గ్రామీణ నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

 

సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడం మోతీలాల్‌ నెహ్రూ, హకీమ్‌ అజ్‌మల్‌ ఖాన్, విఠల్‌ భాయ్‌ పటేల్, చిత్తరంజన్‌ దాస్‌ లాంటి నాయకులకు రుచించలేదు. ఉద్యమంలో భాగంగా నిర్వహించిన శాసన సభల బహిష్కరణను విరమించి, మళ్లీ పోటీ చేసి ఆ సభలోకే ప్రవేశించి సహాయ నిరాకరణను కొనసాగించాలనుకున్నారు. బ్రిటిష్‌ పాలన లోపాలను ఎండగట్టి, ప్రభుత్వం చేసిన శాసనాలకు ఫలితం లేకుండా చేయాలని భావించారు. అప్పట్లో రాబోయే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి గెలవాలని నిర్ణయించారు. సభాకార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని స్తంభింప చేయాలనుకున్నారు. అందుకే వీరిని ‘మార్పుకోరే వారు’ అంటారు. ఈ ఆలోచనలను గాంధీజీ అనుచరులైన డాక్టర్‌ రాజగోపాలాచారి, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కస్తూరి రంగ అయ్యంగార్‌  తదితరులు వ్యతిరేకించారు. శాసన సభ రాజకీయాలు జాతీయావేశాన్ని నిర్వీర్యపరుస్తాయని, నాయకుల మధ్య స్పర్థలు వస్తాయని వారు హెచ్చరించారు. వీరంతా గాంధీజీ నిర్ణయించిన కార్యక్రమంలో ‘మార్పు కోరని వారు’. ఈ పరిణామాల సమయంలోనే 1922, డిసెంబరులో గయలో వార్షిక సమావేశాలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి.శాసన సభలో ప్రవేశించి  ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించాలనే విషయాన్ని ‘మార్పు కోరే వారి’ తరఫున తమ వైఖరిని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు సి.ఆర్‌.దాస్‌ స్పష్టం చేశారు. కానీ వారి అభిప్రాయాన్ని గాంధీజీ అనుకూల వర్గం  ఆమోదించలేదు. నూలు వడకడం, నేత నేయడం, అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం సఖ్యత లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు మార్పు కోరని వర్గం ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సి.ఆర్‌.దాస్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, మోతిలాల్‌ నెహ్రూ, మరికొంతమంది నాయకులతో కలిసి ‘స్వరాజ్య పార్టీ’ని స్థాపించారు. కొత్త పార్టీ శాసన సభలో పునఃప్రవేశానికి సంబంధించిన అంశం మినహా మిగతా కార్యక్రమం మొత్తాన్ని కాంగ్రెస్‌ యథాతథంగా ఆమోదించింది. ఆ విధంగా స్వర్యాజ్య వాదులు, గాంధీజీ అనుకూల వర్గానికి మధ్య తీవ్ర రాజకీయ అంతరాలు పెరిగాయి. 1924, ఫిబ్రవరిలో అనారోగ్య కారణాలతో గాంధీజీని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. అప్పుడు రెండు పక్షాల మధ్య రాజీకి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.అయితే ఆయన సలహా మేరకు ఇరు పక్షాలు కాంగ్రెస్‌లోనే ఉండి, ఎవరికి నచ్చిన మార్గంలో వారు కృషి చేయడానికి అంగీకరించారు.

 

 

పార్టీ కార్యక్రమాలు

స్వాతంత్య్ర సాధనే ఇరువర్గాల అంతిమ లక్ష్యం. కానీ సత్యాగ్రహం ప్రభుత్వంపై అంతగా ప్రభావం చూపదని స్వరాజ్య పార్టీ భావన. శాసన సభల్లో ప్రవేశించి, ప్రభుత్వ విధానాలను నిరంతరం విమర్శిస్తూ, ప్రజాకంటక చర్యలకు అవరోధం కల్పించాలని ఆ పార్టీ భావించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని ముఖ్యమైన బిల్లులు, బడ్జెట్‌ను నిరోధించి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింజేయాలనేదే వీరి ఆలోచన. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా సామాన్య జనంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలనుకున్నారు. కౌన్సిల్‌ కార్యకలాపాలను అడ్డుకొని, ఆంగ్లేయులతో మరికొన్ని సంస్కరణలను ఆమోదింపజేసే విధంగా ఒత్తిడి చేయవచ్చని యోచించారు. ఈ నేపథ్యంలో 1923 నవంబరులో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ గణనీయమైన విజయాలను సాధించింది. కేంద్ర శాసన సభలోని 101 స్థానాలకు 42 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర శాసన సభల్లో కూడా అనుకున్న స్థాయిలో స్థానాలను సంపాదించుకుంది.మధ్య పరగణాల రాష్ట్రం (ప్రస్తుత మధ్యప్రదేశ్‌)లో స్వరాజ్యపార్టీకి విజయం లభించింది. బెంగాల్‌లోనూ ఎక్కువ స్థానాలను పొందింది.

 

విజయాలు

1925, మార్చిలో కేంద్ర శాసన సభ సభాపతి పదవికి విఠల్‌ భాయ్‌ పటేల్‌ను పోటీకి నిలిపి, స్వరాజ్య పార్టీ నేతలు గెలిపించారు. నేషనలిస్ట్‌ పార్టీ, మరికొందరు  స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ బిల్లులను కొంతవరకు నిరోధించగలిగారు. శాసన సభల్లో భారత ప్రభుత్వ చట్టం 1919 పనితీరును ఎండగట్టారు. వీరి డిమాండ్‌ మేరకే రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ పనితీరుపై విచారణకు ‘మడ్డి మాస్‌ కమిటీ’ని బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేసిన తర్వాత దేశంలో రాజకీయ నిర్లిప్తత నెలకొన్న సమయంలో, శాసనసభల్లో ప్రభుత్వ విధానాలను స్వరాజ్యపార్టీ దుయ్యబట్టిన తీరు ప్రజలను ఆకర్షించింది. ఆ విధంగా ఆ పార్టీ తమ కార్యకలాపాల ద్వారా దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడకుండా చేయగలిగింది. జాతికి మహోన్నత మేలు చేసింది, సైమన్‌ కమిషన్‌ నియామకం కూడా వీరి వల్లే జరిగిందని చెప్పవచ్చు.

 

తర్వాత కొంతకాలానికి కొందరు నాయకుల మతతత్వ వైఖరి వల్ల స్వరాజ్య పార్టీలో చీలికలు వచ్చాయి. మదన్‌మోహన్‌ మాలవ్య, లాలా లజపతిరాయ్, ఎన్‌.సి కేల్కర్‌లతో సహా మరికొందరు నాయకులు ‘సమాధానవాదులు’ అనే పేరుతో ఒక బృందంగా  ఏర్పడ్డారు. వీరు ప్రభుత్వానికి సహకారం అందించారు. 1925లో స్వరాజ్య పార్టీ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్‌ దాస్‌ మరణంతో పార్టీ బలహీన పడింది.

 

దేశంలో 1923 నుంచి రాజ్యాంగ సంస్కరణల పట్ల స్వరాజ్యవాదుల ఒత్తిడి ఎక్కువవుతోంది. మరోవైపు మతకల్లోల ఉద్రిక్తత అగ్ని పర్వతంలా ఉన్న ప్రజల అసంతృప్తి పరిస్థితులను బ్రిటిష్‌ ప్రభుత్వం గమనించింది. అంతేకాకుండా బ్రిటన్‌లో 1928 సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. అందుకే 1927లో సర్‌ జాన్‌ సైమన్‌ అధ్యక్షతన భారత ప్రభుత్వ చట్టం, 1919 పనితీరును సమీక్షించడానికి, భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల సమస్యను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి విచారణ సంఘాన్ని నియమించింది. ఆ సంఘం దాని అధ్యక్షుడి పేరుమీదుగా సైమన్‌ కమిషన్‌గా ప్రసిద్ధిగాంచింది. ఇది చట్టబద్ధ కమిషన్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం విచారణ సంఘం పేరుతో ఉపశమన కార్యంగా కాలయాపన చేసి, శాశ్వతంగా అధికారం అనుభవించడం అనేది దీని లోగుట్టు. సైమన్‌ కమిషన్‌లోని ఏడుగురు సభ్యులు బ్రిటన్‌ దేశ పార్లమెంట్‌ సభ్యులే. ఇందులో భారతీయులు ఎవరూ లేరు. అలాంటి చిత్తశుద్ధి కూడా ప్రభుత్వానికి లేదు. అసలు భారతీయులు స్వపరిపాలనకు అర్హులా, కాదా అనే అంశాన్ని బ్రిటిష్‌వారు నిర్ణయించడం భారతీయులకు తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. భారతీయుల స్వయం పాలన హక్కు పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్న బ్రిటిష్‌ విధానాలు భారతీయులను అవమాన పరిచాయి. భారతదేశ ప్రతినిధి లేని సైమన్‌ కమిషన్‌ను 1927లో ఇంగ్లండ్‌లో నియమించిన వెంటనే మద్రాసులో ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారీ (ఎం.ఎ.అన్సారీ) అధ్యక్షతన నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో తీవ్రంగా ఖండిస్తూ ఆ విచారణ సంఘాన్ని బహిష్కరించాలని తీర్మానించారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌ లాంటి వివిధ రాజకీయ పార్టీలు బలపర్చాయి. ఈ విధంగా సైమన్‌ కమిషన్‌ నిరసన కార్యక్రమం రూపొందింది. 

 

1928 ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌ బొంబాయిలో అడుగుపెట్టగానే దేశవ్యాప్తంగా హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. సైమన్‌ కమిటీ పర్యటించిన ప్రతి ఊరిలో హర్తాళ్‌ ప్రకటించి నల్ల జెండాలతో ‘సైమన్‌ వెనక్కి వెళ్లు’ (సైమన్‌ గో బ్యాక్‌) అనే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. 

 

లాహోర్‌లో లాలాలజపతి రాయ్, లక్నోలో గోవింద్‌ వలభ్‌ పంత్, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి నాయకులు సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చారు. ప్రభుత్వం దమనకాండకు పూనుకుంది. ఉద్యమకాలంలో లాలాలజపతి రాయ్‌ పోలీసులు లాఠీ దెబ్బలు తిని తర్వాత గాయాలతో మరణించాడు. మద్రాసులో ప్రకాశం పంతులు పోలీసుల తుపాకీలకు ఎదురొడ్డి తన ఛాతిని చూపిస్తూ కాల్చివేయండని గర్జించాడు. ప్రకాశం పంతులు ‘ఆంధ్రకేసరి’గా పేరొందాడు. ఆంధ్రదేశంలో కొండా వెంకటప్పయ్య, టంగుటూరి, బులుసు సాంబమూర్తి, పట్టాభి, దండు నారాయణ రాజు లాంటి నాయకులు నల్ల జెండాలతో ‘సైమన్‌ వెళ్లిపో’ అనే నినాదాలతో ఉద్యమాన్ని నిర్వహించారు. ఉద్యమకారులు బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను తిరస్కరిస్తూ భారతదేశానికి స్వపరిపాలిత రాజ్యాంగం కావాలనే ఆకాంక్షను ఏకకంఠంతో వెల్లడించారు. 

 

సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల తర్వాత దేశంలో రాజకీయ కార్యక్రమ శూన్యత లేకుండా స్వరాజ్యపార్టీ తన పాత్రను ప్రతిభావంతంగా నిర్వహిస్తే, ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమంతో భారత అవనిపై రాజకీయ శక్తులు పునరేకీకరణ చెంది బ్రిటిష్‌ సామ్రాజ్య శక్తితో తలబడటానికి బలోపేతమయ్యాయి. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 24-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌