• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ కళలు

తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం

నృత్యం సమాహార కళ. రాగ, తాళ, లయాన్వితమైన సంగీతంతో పాటు సాహిత్యం/వాచికం. ఆంగికం, అభినయం, ఆహార్యం అన్నీ కలిసిన కళారూపం నృత్యం. ఏ సమాజంలోనైనా మొదట సంప్రదాయబద్ధమైన నృత్యం పుట్టలేదు. సందర్భానుసారం కలిగిన అనుభూతులకు ప్రతిస్పందనగా ఆదిమ సమాజంలోని మానవుడు వేసిన లయబద్ధమైన అడుగులు, చిందులు, ఆటలు నృత్యానికి ప్రాతిపదికలు.

 

లయబద్ధమైన చిందులకు తోడు రాగం, తాళం జత కలవడం క్రమంగా వాచికం, అభినయం, ఆహార్యం కలిసి కాలగతిలో సర్వహంగులతో కూడిన సమాహార కళగా నాట్యం/సంప్రదాయ నృత్యకళ ఆవిర్భవించింది. దేశీ నృత్య రీతుల నుంచే సంప్రదాయం మార్గ నృత్యరీతులు అభివృద్ధి చెందాయని దీన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ నేలమీద సంప్రదాయ నృత్యారీతులతో పాటు ప్రత్యేకించి పలు జానపద నృత్య రీతులు, గిరిజనుల నృత్య రూపాలు వికసించాయి.

 

తెలంగాణలో దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విష్ణుకుండినుల కాలంలోనే నృత్యకళకు బీజాలు పడ్డాయని తెలుస్తోంది. ఆలయాల ప్రాకారాలు, గోపురాలపై నృత్య భంగిమల్లోని శిల్పాలను బట్టి ఇది స్పష్టమవుతోంది. నాటి దేవాలయాలు నృత్య, గానాది కళలకు ఆలవాలమయ్యాయి. కాకతీయుల కాలంలో దేవాలయాలు దేవదాసీల ఆటపాటలకే కాకుండా ఆర్థిక వనరులుగా ప్రసిద్ధిగాంచాయి. జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’ కాకతీయుల కాలం నాటికి మార్గ/సంప్రదాయ నృత్యరీతులనే కాకుండా అనేక దేశీ నృత్యాలను, రీతులను పేర్కొంటోంది. భరతముని ‘నాట్యశాస్త్రం’లో ప్రస్తావించిన నృత్యరీతులే కాకుండా తెలుగువారు అనేక నూతన నృత్య సంప్రదాయాలకు ఒరవడి దిద్దారు. 

 

భామా కలాపం, గొల్ల కలాపాలు

సిద్ధేంద్రయోగి రూపొందించిన సంప్రదాయ నృత్యమైన ‘కూచిపూడి’ శైలికి చెందిన జానపద నృత్య రూపకాలే ఈ కలాపాలు. ఈ ‘కలాపం’ అనేది సాధారణ నృత్య రూపకం మాదిరిగానే సాగే ఏకపాత్రాభినయంతో కూడిన జానపద కళారూపం. సూత్రధారుడు సన్నివేశాన్ని బట్టి ప్రధాన కథను వ్యాఖ్యాన రూపంలో వినిపిస్తుండగా కథలోని ఒక్కో పాత్ర తన వృత్తాంతాన్ని చెబుతూ మరో పాత్రతో మాట్లాడుతూ, సంవాద రూపంలో రూపకాన్ని కొనసాగిస్తుంది. ‘కలాపం’ కళా రూపాల్లో ప్రధానంగా భక్తి, శృంగార రసాలతో కూడిన స్వాత్త్వికాభినయానికే ప్రాధాన్యముంటుంది. ప్రధానంగా కూచిపూడి నాట్యాచార్యులైన సిద్ధేంద్రయోగి నైతిక విలువలను ప్రబోధించేలా ఈ కలాపాలను తీర్చిదిద్దారు. ఆ కాలంనాటి సంప్రదాయ నర్తకి/నాట్యకత్తెల నృత్యాన్నుంచి, గొల్ల/భామా కలాపాలను వేరుచేసి చూపించడానికి, వీటికొక ప్రత్యేకతను ఆపాదించడానికి సిద్ధేంద్రయోగి ఈ మార్పులను చేశారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని యువకులను ఎంచుకుని, శిక్షణిచ్చి సంప్రదాయ మెలకులను నేర్పించారు. భగవంతుడు అనేక రూపాలను ధరించి ఈ భూమి మీద అవతరించడానికి ఉన్న నేపథ్యాన్ని, ధర్మతత్పరతను, ఆధ్యాత్మిక, తాత్త్విక విశేషాలను సామాన్య గొల్లవాడు పండితులైన బ్రాహ్మణుడికి ఎలా వివరిస్తాడో తెలియజేయడమే ఈ కలాపాలు వెల్లడించే సందేశం.

 

దండారియా 

పూర్వం ప్రాచీన హైదరాబాద్‌ నగరానికి ఉత్తరాన ఉన్న కొండ ప్రాంతాల గిరిజనులైన గోండులు ఆచరించే నృత్య కళా రూపమే ఈ దండారియా. దండ లేదా కర్రలను లయబద్ధంగా కొడుతూ, ఆడుతూ సాగుతారు. పురుషులు అందమైన రంగురంగుల వస్త్రాలను, తలపాగాలను ధరించి ముందు డప్పులు, బాజాలు మోగించుకుంటూ వెళ్లే బృందాన్ని అనుసరిస్తూ కోలాటం వేసుకుంటూ ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తారు. కొన్నిసార్లు ఆతిథ్యమిచ్చిన గ్రామస్థులు కూడా వారి ‘దండారియా’ నృత్యాన్ని అనుసరించి ఆటపాటల్లో  పాల్గొంటారు. గోండుల ఇతిహాసం ప్రకారం గోండు జాతీయుల నాయకుడైన దండారియానే ఈ నృత్యరీతిని సృష్టించాడని, ఆయన వాస్తవానికి భారత వీరులైన పాండవుల వారసుడని వీరి ప్రగాఢ విశ్వాసం. అందుకే గోండు జాతీయులు తాము పాండవుల వంశీయులమని విశ్వసించి ఆనందంగా, కేరింతలతో ఈ నృత్య సంబరంలో  పాల్గొంటారు.

 

ఢమాల్‌ నృత్యం

ఇదొక మూగ నృత్య రూపం. మాటలు, పాటలు ఉండవు. దీన్ని హైదరాబాద్‌ ప్రాంతంలోని సిద్ధీలు అనే ఒక ప్రత్యేక తెగవారు మాత్రమే చేస్తారు. ఆఫ్రికా, అబిసీనియా జాతీయులైన వీరిని క్రీ.శ.12వ శతాబ్దంలో బానిసలుగా ఆంధ్రదేశానికి తీసుకువచ్చారు. ఆ కాలం నాటి హిందూ రాజ్యాల ప్రభువులు వీరిని సైనికులు, నావికులు, అంగరక్షకులుగా వినియోగించుకున్నారు. ఢమాల్‌ నృత్యం మార్షల్‌ ఆర్ట్స్‌ రూపంలో సాగే నృత్య విశేషం. వీరంతా కత్తులు, బళ్లాలను ధరించి, వైవిధ్యభరితమైన అడుగులు వేస్తూ అనేక సంగీత వాయిద్యాలు మోగుతుండగా లయబద్ధంగా నృత్యం చేస్తారు. దీన్ని ప్రత్యేకంగా వివాహ సందర్భాల్లోనే ఆచరిస్తారు. ఈ నృత్య సమయంలో వారి ప్రదర్శన యుద్ధ భూమిలోని సన్నివేశాలను స్ఫురింపజేస్తుంది. వేషధారణలో కూడా వారి దేశీయతా, ఉనికి ప్రతిఫలిస్తుంది.

 

మాధురి నృత్యం 

ఇది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఉండే ‘మాధురి’ తెగకు చెందిన గిరిజనులు చేసే ప్రత్యేక నృత్యం. ప్రధానంగా శ్రావణ మాసంలోని వర్ష రుతువులో మాత్రమే చేసే నృత్యం. అన్ని నృత్య సంప్రదాయాల్లోనూ పురుషులే స్త్రీ పాత్రలనూ పోషించడం కనిపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా మాధురి నృత్యంలో స్త్రీలు, పురుషులు కలిసి న్యత్యం చేస్తారు. పురుషులు బాహ్య వలయాకారంగా ఏర్పడి అడుగులు వేస్తుంటే స్త్రీలు అంతర వలయంలో ఉండి మతపరమైన, సాంఘికాంశాలతో కూడిన పాటలు పాడుకుంటూ లయబద్ధంగా చప్పట్లు కొడుతుంటే పురుషులు కర్రలను/దండలను కోలాటంలా కొడుతుంటారు. ఈ తెగకు చెందినవారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర నుంచి వలస వచ్చారని పేర్కొంటారు. వీరి నృత్యం కూడా యూపీలోని ‘రాసలీలా’ వృత్తాన్ని అనుసరించిన నృత్యరీతిగా భావిస్తున్నారు.

 

గోండు నృత్యం 

ఇది గోండు జాతివారు ప్రదర్శించే నృత్య కళా రూపం. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు సమీపంలోని కేసాపూర్‌లో గోండు జాతికి చెందిన భీమ్‌దేవ్‌ ఆలయంలో ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తారు. 15 రోజులపాటు సాగే ఈ జాతర ‘నాగోబా’ జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఈ జాతర సందర్భంగా గోండు జాతీయులు చేసే నృత్యమే గోండు నృత్యం. ఈ ఉత్సవంలో పా పాల్గొనడానికి గోండులే కాకుండా ఇతర కులాలకు చెందినవారు, పొరుగు రాష్ట్రాల్లోని గిరిజనులూ హాజరవుతారు. భారీ ఎత్తున నృత్య కళాకారులు, వాయిద్య కళాకారులు, గాయకులు  పాల్గొని ఆటపాటలతో ఉర్రూతలూగిస్తారు. గోండు జాతి గీతాలను పాడుతూ, వాయిద్యాల మోతలకు లయబద్ధంగా చిందులేస్తారు.

 

పులి నృత్యం 

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రసిద్ధమైన జానపద నృత్య కళారూపం పులి నృత్యం/పులివేషం. ముఖ్యంగా తెలంగాణలో దసరా, పీర్ల పండుగ సందర్భాల్లో ఈ పులి వేషగాళ్లు తమ ఆటలతో అలరిస్తారు. వీధుల్లో గంతులు వేస్తూ, ఎగురుతూ, మధ్యలో పల్టీలు కొడుతూ, తొడగొట్టి పంజా విసిరినట్లుగా చేస్తూ ఇంటింటా తిరుగుతూ బిక్షాటన చేస్తారు. పులి వేషం అనేది జంతువుల నడక, గంతులకు అనుకరణగా భావిస్తారు. జానపదులు, గ్రామీణుల వల్లే ఈ కళా రూపం ప్రాచుర్యాన్ని పొందింది. పులివేషం వేసిన వేషధారి తన శరీరంలోని అన్ని భాగాలను రంగులతో నింపేయాల్సిందే. అక్కడక్కడా పులి చర్మంమీది చారల్లా నల్లని రంగు చారలను చిత్రించి, తలకు మాత్రం తోలుతో కుట్టిన టోపీని తగిలించుకుని అచ్చంగా పులిలాగానే తయారై వీధుల్లోకి వచ్చి ఆట ప్రారంభిస్తారు.

 

కాముని ఆట 

తెలంగాణలో హోలీ పండుగనే ‘కాముని పున్నమి’ అని కూడా అంటారు. పున్నమి వెన్నెల వెలుతుర్లో వారం రోజుల ముందునుంచే యువతీ యువకులు జట్లు జట్లుగా ఏర్పడి ఆటపాటలతో వినోదాన్ని పంచుతారు. ఈ కళారూపంలో ఆట, పాటలు రెండూ సమప్రాధాన్యాన్ని సతరించుకున్నాయి. కోలాటపు కొయ్యలతో లయబద్ధంగా కొడుతూ స్త్రీలు వెన్నెల పాటలు, అల్లోనేరెళ్లు, కోలాటపు పాటలు పాడుతుంటే పురుషులు జాజర పాటలు పాడుతూ ఉంటారు. హోలీ వచ్చిందంటే ‘‘హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేళిర హోలీ’’ అంటూ సాగే ఆట-పాటలు మారుమోగుతుంటాయి. ‘కాముని ఆట’ను కోలాట నృత్యం కూడా కలిసిన కళారూపంగా పరిగణించవచ్చు. పాటల్లోని లయకు అనుగుణంగా వేసే అడుగులు వలయాకారంలో నుంచి ఒకసారి బయటకు, మరోసారి లోపలకు వేసే అడుగులు, పాటలూ కలసి ఉత్సాహభరితంగా కొనసాగడం ఈ కళారూపం ప్రత్యేకత.

 

కోలాటం

తెలుగు నాట ప్రసిద్ధిగాంచిన నృత్యరూపం కోలాటం. కోలాటం అనే మాట ‘కోల + ఆట్టం’  అనే రెండు పద బంధాల మేళవింపు. కోల అంటే కర్ర, ఆట్టం అంటే ఆడటం అని అర్థం. ఇది ప్రధానంగా స్త్రీలు చేసే నృత్యం.  పాటలు, లయాత్మకమైన అడుగులు, సంగీతం ముప్పేటలా అల్లుకున్న కళారూపం కోలాటం. సాధారణంగా కోలాటం జట్టులో కనీసం 8 మంది, గరిష్ఠంగా 40 మంది కళాకారులు ఉంటారు. జట్టులోని కళాకారులంతా కలిసి రెండు వలయాకారాలుగా విడిపోయి ఒక్కోసారి అడుగులు లోపలికి, బయటికి వేస్తూ కోలల్ని కొడుతూ లయబద్ధంగా ఆడతారు. కాళ్లకు గజ్జెలు, ప్రత్యేకమైన వస్త్రధారణతో అందంగా అలంకరించుకుంటారు. ‘కోలాటం’ నృత్య రూపం ఆవిర్భావానికి సంబంధించి కొన్ని ఐతిహ్యాలు, కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటి ప్రకారం కోలాట నృత్య రూపానికి బసవాసురుడనే రాక్షసుడికి సంబంధం ఉంది. అమానుషమైన, క్రూరమైన హింసాత్మక చర్యలకు ప్రసిద్ధిగాంచినవాడు బసవాసురుడు. కొంతమంది యువతులు చేతిలో సన్నని కోలాటం కర్రలను ధరించి బసవాసురుడి కొలువుకు వెళ్లి అందమైన ఆటపాటలతో కోలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అప్పుడా అసురుడు బ్రహ్మానందాన్ని పొంది, వారి ఆట, పాటలు, గాన మాధుర్యానికి సంతోషపడి తన క్రూరమైన, హింసాత్మక చర్యలను వదిలేస్తానని అభయమిస్తాడు. ఆనాటి నుంచి దక్షిణ భారతదేశంలోని అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ‘కోలాటం’ నృత్యాన్ని ఆడుతుంటారు. కోలాటంలోనే ‘జడకోపు కోలాటం’ అనే రీతి కూడా ప్రచారంలో ఉంది. ఇది కొంత మేధో సంపత్తితో కూడిన కళారూపం. కళాకారులు అందరూ సమ సంఖ్యలో తాళ్లు పట్టుకుని వలయాకారంగా నిలుస్తారు. తర్వాత రెండు జట్లుగా విడిపోతారు. విడిపోయిన కేంద్రంలో నుంచి మరో కేంద్రంలోకి ఒకరి తర్వాత మరొకరు ప్రత్యామ్నాయంగా లయబద్ధంగా తిరుగుతూ తాళ్లన్నీ జడలా అందంగా అల్లినట్టుగా తీర్చిదిద్దుతారు. ఈ అల్లికలో వేసే అడుగుల్లో ఏ ఒక్కరు తప్పటడుగు వేసినా జడలో చిక్కుముడి పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వరుస తప్పకుండా నైపుణ్యంతో జడను అల్లుతారు. జడకోపు పూర్తయ్యాక అందరూ ఒక పుష్పాకారంలోకి దగ్గరగా చేరి మళ్లీ ఎలా అల్లుకొచ్చారో అదే క్రమంలో అభిముఖంగా తిరిగి జడను విడదీస్తారు. ఇది వినోదంతోపాటు విజ్ఞానం మేళవించిన కళారూపం. పాల్కురికి సోమన ‘పండితారాధ్య చరిత్ర’లో కోలాటాన్ని ‘కోలాటగడియ’ అని ప్రస్తావించాడు.

 

బతుకమ్మ 

ఇది ఆట-పాటలు రెండూ కలిసి సాగే కళారూపం. బతుకునిచ్చిన అమ్మ గౌరమ్మను స్తుతిస్తూ ఆశ్వయుజ మాసం శుద్ధపాడ్యమి నుంచి మొదలు దసరాకు ముందురోజు మహా నవమి వరకూ తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు నిర్వహించుకునే పండుగే బతుకమ్మ. ప్రకృతిలో దొరికే పూలతో బతుకమ్మను తయారు చేసి, పేర్చి దానిపై మధ్యలో పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను నిలిపి, దేవాలయాల ప్రాంగణాల్లో లేదా ఒక నిర్ణీత స్థలంలో పెట్టి ఆడపడచులంతా వాటి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ ‘బతుకమ్మ’ ఆడతారు. ‘‘శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ’,  ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో....’ అంటూ అమ్మవారి మహిమలను కొనియాడే పాటలే కాకుండా లక్ష్మీ, పార్వతుల స్తోత్రాలు, అనేక పౌరాణిక కథా ఘట్టాలను శ్రుతి బద్ధంగా పాడుతూ స్వరార్చనతో అమ్మవారిని పూజించే పండుగగా ‘బతుకమ్మ’ తెలంగాణలో ప్రాచుర్యాన్ని పొందింది


పేరిణీ నృత్యం

కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన విశిష్ట తెలంగాణ నృత్య సంప్రదాయమే పేరిణీ నృత్యం. కాకతీయుల కాలం నాటి యుద్ధ వీరులు యుద్ధ రంగానికి బయలుదేరే ముందు నటరాజు, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి విగ్రహం ముందు నిలుచుని ప్రేరణను ఇవ్వమని వేడుకుంటూ చేసే నృత్యం ఇది. కేవలం పురుషులు మాత్రమే చేసే నృత్యం. అతి గంభీరంగా మృదంగ వాయిద్య నాదం మోగుతుండగా, ఆ నాద కంపానికి అనుగుణంగా నాట్యకారులందరూ తమ శరీరమంతా కంపించేలా లయబద్ధంగా వీరావేశంతో ఊగిపోవడం ఈ నాట్య విశేషం. సాక్షాత్తూ ఆ పరమశివుడే తమ శరీరాలను ఆవహించి ప్రేరణ కల్పిస్తాడని, శక్తియుక్తులు, కదనోత్సాహం, ఉత్తేజాన్ని అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు. అందుకే  ఈ నృత్యాన్ని ‘యుద్ధవీరుల నృత్యం’  అని పేర్కొంటారు. సుమారు రెండు శతాబ్దాల పాటు అత్యంత వైభవోపేతంగా వెలుగొందిన కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత కాకతీయులతో పాటే ఈ నృత్య కళా ప్రాభవం కూడా మరుగునపడి, నిరాదరణకు గురై అంతరించిపోయింది. తర్వాత 20వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణ విశేషమైన కృషి వల్ల వెలుగులోకి వచ్చింది. జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’లోని నాట్య సంప్రదాయాలను, రామప్ప దేవాలయంలో చెక్కిన శిల్పాల్లోని నృత్య భంగిమలపై అధ్యయనం చేసి, పరిశోధించి ‘పేరిణీ నృత్య’ కళకు పునరుజ్జీవం కల్పించారు. ఎంతోమంది శిష్యులను తయారుచేసి ‘పేరిణీ నృత్యానికి’ విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు.

 

 

 

 

 

 

Posted Date : 29-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌