• facebook
  • whatsapp
  • telegram

1857 తిరుగుబాటు వ్యాప్తి

గడ గడలాడిన ఆంగ్లేయులు!

ప్రచండ వేగంతో ప్రజల్లోకి చొచ్చుకొని ప్రజ్వరిల్లిన భారత తొలి స్వాతంత్య్ర విప్లవ గర్జన తెల్లవారిని వణికించింది. సామ్రాజ్యవాదం, ఆర్థిక దోపిడీలపై సమర భేరిని మోగించి గడగడలాడించింది.  ఆ మహా తిరుగుబాటును తట్టుకోవడానికి ఇంగ్లిష్‌వారు సర్వశక్తులూ కూడగట్టుకోవాల్సి వచ్చింది.  దావానలంలా జనంలోకి వ్యాపించిన ఉద్యమాన్ని స్వదేశీ రాజులు, జమీందారుల అండదండలతో ఆంగ్లేయులు అతి కర్కశంగా అణచివేశారు. కానీ మనవారి విప్లవ రణన్నినాదంతో విక్టోరియా మహారాణి దిగివచ్చింది. కంపెనీని పక్కన పెట్టి బ్రిటిష్‌ పార్లమెంటు నుంచి మంచి పాలన అందిస్తామనే హామీని ఇప్పించింది. 

 

  మీరట్‌ నుంచి దిల్లీ చేరిన తిరుగుబాటు సిపాయిలు ఎర్రకోటకు చేరుకుని, నామమాత్రపు మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షాను భారతదేశ సార్వభౌముడిగా ప్రకటించారు. అయిష్టంగానే ఆయన ఈ మహావిప్లవంలో భాగస్వామి అయ్యాడు. బ్రిటిషర్లను ఓడించాలంటూ స్వదేశీ రాజులకు పిలుపునిచ్చాడు. దీంతో సిపాయిల తిరుగుబాటు విప్లవ సమరంగా మారింది. తిరుగుబాటు అనతికాలంలోనే ఉత్తర భారతదేశంలో దావానలంలా వ్యాపించింది. పంజాబ్‌ మొదలు దక్షిణాన నర్మదా నది, తూర్పున బిహార్, పడమర రాజస్థాన్‌ వరకు అనతికాలంలోనే అంతటా వ్యాపించింది. తిరుగుబాటుకు దిల్లీ, కాన్పూర్, లఖ్‌నవూ, ఝాన్సీ, బరేలి, అరా ప్రధాన కేంద్రాలయ్యాయి.

 

దిల్లీ: దిల్లీలో తిరుగుబాటుకు భక్తాఖాన్‌ నాయకత్వం వహించాడు. అనేకమంది యూరోపియన్లు ఊచకోతకు గురయ్యారు. నాటి గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ పంజాబ్‌ నుంచి సిక్కు సైనికులను రప్పించి తిరుగుబాటును అణచివేశాడు. ఆంగ్లేయ సైన్యం దిల్లీని మరుభూమిగా మార్చింది. మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షా బందీ అయ్యాడు. అతడిని దేశ బహిష్కరణ చేసి బర్మాకు పంపగా, అక్కడే 1862లో దయనీయ పరిస్థితిలో మరణించాడు.

 

కాన్పూర్‌: చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్‌ తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశాడు. నానాసాహెబ్‌కు అత్యంత విధేయుడైన తాంతియా తోపే కూడా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.

 

లఖ్‌నవూ: బేగం హజరత్‌ మహల్‌ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

 

ఝాన్సీ: మూడో మహారాష్ట్ర యుద్ధం తర్వాత ఝాన్సీ ఆంగ్లేయ రక్షిత రాజ్యమైంది. పాలకుడు గంగాధరరావు మరణించాడు. రాణి లక్ష్మీబాయి దత్తతకు అనుమతి కోరగా నాటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ నిరాకరించాడు. ఝాన్సీని ఆంగ్ల రాజ్యంలో విలీనం చేశాడు. లక్ష్మీబాయి పురుష వేషంలో యుద్ధరంగంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరస్వర్గాన్ని చేరింది. ఆంగ్ల సైనికాధికారి సర్‌ హ్యూరోజ్‌ ఈ తిరుగుబాటును అణచివేశాడు.

 

బరేలి: ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.

 

అరా: కున్వర్‌సింగ్‌ నాయకత్వంలో తిరుగుబాటు జరగగా, ఆంగ్లేయ అధికారి విలియం టేలర్‌ అణచివేశాడు.

  రాజస్థాన్, మహారాష్ట్రల్లో ప్రజల మద్దతుతో చిన్న చిన్న రాజ్యాలు తిరుగుబాటు చేశాయి. ఈ విప్లవం ప్రచండవేగంతో ప్రజల్లోకి వెళ్లింది. చాలాచోట్ల రైతులు, చేతివృత్తులవారు ఉద్యమించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్లేయుల తొత్తులైన జమీందారులు, వడ్డీ వ్యాపారులు వీరి లక్ష్యం అయ్యారు. అనేక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు విజయం సాధిస్తుంటే ప్రజలు ఆనందపడ్డారు. అయితే బ్రిటిషర్లు తమ సైనిక బలం, ఆయుధ సంపత్తి అంతా కూడదీసుకుని తిరుగుబాటు అణచివేత ప్రారంభించారు. దీనికి అనేకమంది స్వదేశీ రాజుల మద్దతు తోడవడంతో 1858 ఏప్రిల్‌ నాటికి తిరుగుబాటు సద్దుమణిగింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, ఆర్థిక దోపిడీ, అణచివేత విధానాలపై భారతీయుల తొలిపోరాటం బ్రిటిష్‌ వారిని గడగడలాడించింది. 

 

వైఫల్యానికి కారణాలు

* తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దక్షిణ భారతదేశంలో ప్రభావం తక్కువే. మద్రాసు, బొంబాయి ప్రాంత రాజుల్లో ప్రజల తిరుగుబాటు పట్ల సానుభూతి ఉన్నప్పటికీ క్రియాశీలకంగా పాల్గొనలేదు.

* చాలామంది స్వదేశీ రాజులు ఉదాహరణకు సింధియా, హోల్కర్, నిజాం, కొన్ని రాజపుత్ర రాజ్యాలు, భోపాల్‌ నవాబు, పాటియాలా రాజు, జమీందార్లు ఆంగ్లేయ కంపెనీకి ప్రత్యక్షంగా/పరోక్షంగా బాసటగా నిలిచారు.

* తిరుగుబాటుదారుల్లో జాతీయ దృక్పథం/లక్ష్యం లేదు. ఉమ్మడి శత్రువుగా బ్రిటిషర్లను గుర్తించడంలో, కార్యాచరణ రూపొందించడంలో విఫలమయ్యారు.

* తిరుగుబాటు వీరులకు సరైన వార్తా, రవాణా సదుపాయాలు అంటే టెలిగ్రాఫ్, రైల్వే అందుబాటులో లేవు. అదే సమయంలో ఇంగ్లిష్‌ వారు వాటిని సమర్థంగా ఉపయోగించారు.

* తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధ సంపత్తి/వాటిని ఉపయోగించే శిక్షణ, సరైన యుద్ధవ్యూహం లేవు. బ్రిటిష్‌ కంపెనీ ఆధునిక ఎన్‌ఫీల్డ్‌ తుపాకీలు ఉపయోగించింది.

* ఆంగ్లేయ సైన్యానికి శిక్షణ పొందిన, సమర్థులైన సైనికాధికారులు జాన్‌ నికోల్సన్, లారెన్స్, కాలిన్‌ కాంప్‌ బెల్, నీల్, హ్యూరోజ్‌ తదితరులు నాయకత్వం వహించారు.

* ఆధునిక విద్యావంతులు కూడా బ్రిటిష్‌ పాలన భారతదేశానికి మంచి చేస్తుందనే నమ్మకంతో, తిరుగుబాటు పట్ల ఆసక్తి చూపలేదు.

* గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ తిరుగుబాటుదారుల పట్ల ఔదార్యం చూపి క్షమాభిక్ష ప్రసాదించాడు.

  ఆ రోజుల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం దేదీప్యమానంగా వెలిగిపోతుండేది. పైగా స్వదేశీ రాజులు/జమీందారుల మద్దతు వారికి ఉంది. భారతదేశ రాజుల్లో అనైక్యత అనాదిగా బాహ్య శత్రువులకు బలంగా మారింది. అందివచ్చిన గొప్ప అవకాశాన్ని స్వదేశీ రాజులు చేజార్చుకున్నారు. ఫలితంగానే మహా తిరుగుబాటు విఫలమైంది. లక్ష్యసాధనలో వైఫల్యం చెందినా, బ్రిటిష్‌ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించింది.

 

భారత ప్రభుత్వ చట్టం-1858

  సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం బ్రిటిష్‌ ఇండియా పాలనలో సమూల మార్పులు తీసుకొస్తూ భారత ప్రభుత్వ చట్టం-1858 తీసుకొచ్చింది. దీనిప్రకారం భారతదేశ పాలనాధికారం ఆంగ్లేయ కంపెనీ నుంచి బ్రిటిష్‌ మహారాణికి అంటే బ్రిటిష్‌ ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. ఇక్కడి వ్యవహారాలను లండన్‌ నుంచి నిర్వహించేందుకు, బ్రిటిష్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉండి పార్లమెంటుకు బాధ్యత వహించేందుకు భారత రాజ్య కార్యదర్శి అనే అధికారిని నియమించారు. ఇతడికి సలహా, సహకారాలు అందించేందుకు భారతదేశ మండలి అనే సంస్థను నెలకొల్పారు. ఇండియాలో గవర్నర్‌ జనరల్‌ రాజ ప్రతినిధిగా వ్యవహారంలోకి వచ్చాడు.

 

విక్టోరియా మహారాణి ప్రకటన

  1858 చట్టంతో జరిగిన మార్పులేవీ భారతీయులను మెప్పించలేకపోయాయి. బ్రిటిష్‌ కంపెనీ విధానాలతో చిన్నాభిన్నమై, భయాందోళనలో ఉన్న భారతీయులను శాంతపరచడానికి బ్రిటిష్‌ మహారాణి స్వయంగా జోక్యం చేసుకుని ఒక ప్రకటన చేసింది. ఆనాటి రాజప్రతినిధి, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ 1858 నవంబరు 1న అలహాబాద్‌లో ఏర్పాటుచేసిన దర్బారులో మహారాణి ప్రకటనను ఆహూతులకు వినిపించాడు. దాని సారాంశం...

* భారతదేశంలో బ్రిటిష్‌ రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి చెప్పి, స్వదేశీ రాజుల హక్కులను గౌరవిస్తారు.

* స్వదేశీ రాజుల దత్తత స్వీకరణకు అనుమతి.

* స్వదేశీ సంస్థానాల ఆంతరంగిక వ్యవహారాల్లో బ్రిటిష్‌ ప్రతినిధులు జోక్యం చేసుకోరు.

* స్వదేశీ రాజులతో కంపెనీ చేసుకున్న పూర్వ ఒప్పందాలు యథాతథంగా కొనసాగుతాయి.

* ప్రజల సాంఘిక, మత వ్యవహారాల్లోనూ బ్రిటిష్‌ జోక్యం ఉండదు.

* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాతి, మత, కుల వివక్ష లేకుండా విద్యాసామర్థ్యం ప్రాతిపదికగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు.

* బ్రిటిష్‌ పౌరులతో సమానంగా భారతీయులకు అవ‌కాశాలు కల్పిస్తారు.

బ్రిటిష్‌ రాణి ప్రకటనతో భారతీయుల్లో ఆశలు చిగురించాయి. 1857 తిరుగుబాటు సద్దుమణిగింది. కానీ లక్ష్యసాధనలో ఆ మహావిప్లవం విఫలమైనా, నిస్సందేహంగా ప్రజల్లో జాతీయ భావాలు పెంపొందించేందుకు దోహదపడింది. తర్వాత కాలంలో తలెత్తిన ఉద్యమాలకు స్ఫూర్తిని, శక్తిని ఇచ్చింది. తదనంతర తరాలకు, విప్లవవీరులకు ప్రేరణగా నిలిచింది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌