• facebook
  • whatsapp
  • telegram

శాతవాహన అనంతర యుగం 

 ఆంధ్ర దేశాన్ని పాలించిన తొలి క్షత్రియులు ఇక్ష్వాకులు. మొదటి శాంతమూలుడు (వాశిష్ఠీ శ్రీ క్షాంతామూలుడు) ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. వీరి రాజధాని విజయపురి. అధికార భాష ప్రాకృతం. అధికార చిహ్నం సింహం. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, విష్ణుకుండినుల రాజవంశాలు పాలించాయి. వీరి కాలంలో ఆంధ్రదేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. 

ఇక్ష్వాకులు (క్రీ.శ. 225 - 300) 
పురాణాల్లో ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నారు. వాయుపురాణం ప్రకారం అయోధ్యను పాలించిన ఇక్ష్వాకుడి కుమారుడు వికుక్షి తండ్రి తర్వాత పాలకుడయ్యాడు. విష్ణుపురాణంలో ఇక్ష్వాకులను బుద్ధుడి వారసులుగా పేర్కొన్నారు. బ్యూలర్, రాప్సన్ లాంటి చరిత్రకారులు ఇక్ష్వాకులు అయోధ్య ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చారని ప్రకటించారు. కానీ, జైన మత గ్రంథమైన ధర్మామృతం ఇక్ష్వాక వంశస్థుడైన యశోధనుడు వేంగి దేశానికి వచ్చి ప్రతీపాలపురంను నిర్మించినట్లు వివరిస్తోంది. వీర పురుషదత్తుడి 'నాగార్జున కొండ శాసనం' ఇక్ష్వాకులను శాక్యముని వంశస్థులని పేర్కొంటుంది. కాల్డ్‌వెల్ పండితుడు మాత్రం కృష్ణానదీ తీరంలో ఇక్షు (చెరకు) చిహ్నాన్ని ఆరాధించే స్థానిక గణరాజులే ఇక్ష్వాకులు అని పేర్కొన్నాడు. ఇక్ష్వాకులు కన్నడవాసులని వోగెల్ పండితుడు; తమిళ ప్రాంతవాసులని గోపాలాచారి పేర్కొన్నారు. పురాణాలు ఏడుగురు ఇక్ష్వాక రాజులను గురించి పేర్కొంటుండగా, శాసనాలు మాత్రం నలుగురి రాజుల గురించి ప్రస్తావిస్తున్నాయి.

 

రాజకీయ చరిత్ర
ఆంధ్రను పాలించిన తొలి క్షత్రియులు ఇక్ష్వాకులు. పల్లవ రాజులు వీరకూర్చవర్మ మంచికల్లు శాసనం, శివస్కంధవర్మ మైదవోలు శాసనాలు పల్లవుల చేతిలో ఇక్ష్వాకులు ఓడిపోయినట్లు పేర్కొంటున్నాయి. చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావిని ఓడించి మొదటి శాంతమూలుడు / వాశిష్ఠీపుత్ర శ్రీ క్షాంతామూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. రామిరెడ్డి పల్లి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాలు ఇక్ష్వాకుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. అధికార భాష ప్రాకృతం. అధికార చిహ్నం సింహం.

 

మొదటి శాంతమూలుడు
ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. చివరి శాతవాహన రాజు మూడో పులోమావిని ఓడించి రాజ్యస్థాపన చేశాడు. రెంటాల, కేశనపల్లి శాసనాల ప్రకారం ఇతడు అశ్వమేధ, వాజపేయాది క్రతువులను నిర్వహించాడు. నాగార్జున కొండ వద్ద అశ్వమేధయాగం వేదికలు బయల్పడ్డాయి. ఇతడు మహారాజ బిరుదు ధరించాడు. లక్ష నాగళ్లతో భూమిని దున్ని శతసహస్ర హాలక బిరుదును కూడా పొందాడు. బంగారు నాణేలు, లక్షలాది గోవులను దానం చేశాడు. ఇతడి భార్య మాఠరీ దేవి. సోదరీమణులు హర్మ్యశ్రీ, శాంతశ్రీ. కుమారుడు వీరపురుషదత్తుడు, కుమార్తె అడవి శాంతిశ్రీ. తన కుమార్తెను స్కంధ విశాఖుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఉజ్జయిని శక రాకుమార్తె రుద్రభట్టారికను తనకోడలిగా చేసుకున్నాడు. శాంతమూలుడు వైదిక మతస్తుడు. కార్తికేయుడి ఆరాధకుడు. నాగార్జునకొండ / శ్రీ పర్వతం వద్ద కార్తికేయ ఆలయం నిర్మించాడు. 

 

వీరపురుషదత్తుడు
శాంతమూలుడి తర్వాత అతడి కుమారుడు వీరపురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు మొదట శైవమతాన్ని అనుసరించినప్పటికీ ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతడి కాలం దక్షిణ దేశంలో బౌద్ధమతానికి స్వర్ణయుగంగా పేరొందింది. భావ వివేకుడు అనే పండితుడు విజయపురి వద్ద ఒక విహారాన్ని నిర్మించినట్లు సీయూకీ గ్రంథం తెలుపుతోంది. వీరపురుషదత్తుడు శివలింగాన్ని తొక్కుతున్నట్లుగా ఉన్న మాంథాత శిల్పం (పుణ్యశిల) కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో బయల్పడింది. మేనరికపు వివాహాలను ప్రారంభించింది వీరపురుషదత్తుడే. నాగార్జునకొండలో పుష్పభద్రస్వామి, అష్టభుజ స్వామి, హారితీ దేవాలయాలను నిర్మించాడు. ఇతడి విజయాలు, ఆరోగ్యం కోసం శాంతిశ్రీ అనేక దానాలు చేసింది. ఇతడి 6వ పాలనా సంవత్సరంలో నాగార్జునకొండ మహాచైత్యాన్ని పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపారు. రాజ భాండాగారికుడు 'బోధిశర్మ' మేనకోడలైన ఉపాసికా బోధిశ్రీ శ్రీ పర్వతంలో చుళధమ్మగిరిపై చైత్యాన్ని నిర్మించింది. వీరపురుషదత్తుడి భార్యలు భట్టిమహాదేవి, రుద్ర భట్టారిక, బాపిశ్రీ, షష్ఠిశ్రీ (బాపిసిరి, షష్ఠిసిరి). ఇతడి కుమార్తె పేరు కొడబలశ్రీ / కొండబాలశ్రీ. అల్లుడు శివస్కంధ శాతకర్ణి.

 

ఎహూవల శాంతమూలుడు/ రెండో శాంతామూలుడు
వీరపురుషదత్తుడు, భట్టిమహాదేవిల సంతానం రెండో శాంతమూలుడు. ఇతడు వమ్మభట్టాదేవి అనే క్షాత్రప రాకుమారిని వివాహం చేసుకున్నాడు. ఇతడి సోదరి పేరు కొండ బాలశ్రీ/ కొడబలశ్రీ. ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన పాలకుడు ఇతడే (భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించింది రుద్రదాముడు). ఇతడి సేనాని ఎలిసిరి కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. కొండ బాలశ్రీ మహీశాసకులకు విహారాన్ని నిర్మించింది. కాగా రెండో శాంతమూలుడు మహాసేన దేవాలయాన్ని నిర్మించాడు.

 

రుద్రపురుషదత్తుడు
చివరి ఇక్ష్వాక పాలకుడు రుద్రపురుషదత్తుడు. పల్లవ రాజు సింహవర్మ చేతిలో ఓడిన ఇక్ష్వాక రాజు ఇతడే. తనను తాను శివభక్తుడిగా ప్రకటించుకున్నాడు. నాగార్జునకొండ, గురజాలల్లో ఇతడి శాసనాలు లభించాయి.

 

ఇక్ష్వాకుల సాంస్కృతిక సేవ
వీరి కాలంలో రాష్ట్ర పాలకులను మహాతలవర అని పిలిచేవారు. మాతృమూర్తుల పేర్లను తమ పేర్ల ముందు పెట్టుకునేవారు. బౌద్ధమత నిర్మాణాలు విరివిగా జరిగి స్వర్ణయుగంగా పేరొందింది. ఉపాసికా బోధిశ్రీ బౌద్ధమత ప్రచారకులకు ధన సహాయం చేసి కాశ్మీర్‌తోపాటు చైనాలో బౌద్ధాన్ని ప్రచారం చేయించింది. వీరి కాలం నాటి మహాసాంఘికులను అంధకులు అనేవారు. శాతవాహనుల్లా వీరు కూడా తమ పేర్ల ముందు మాతృమూర్తుల పేర్లను ఉంచుకున్నారు. దక్షిణ భారతదేశంలో హిందూదేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించినవారు ఇక్ష్వాకులే.  

         దేశంలో ఏర్పాటు చేసిన తొలి ద్వీపపు మ్యూజియం నాగార్జునకొండ మ్యూజియం వీరి కాలానికి చెందింది. నాటి వర్తక బృందాలను నేగమాలు అనేవారు. గ్రామ సముదాయాలను గ్రామపంచిక అనేవారు. సువర్ణం, ఫణం, దీనార్, మారకం లాంటి నాణేలను వినియోగించారు. శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించింది. కొండబాలశ్రీ విహారాన్ని నిర్మించింది. శ్రీ శాంతమూలుడి భార్య మాఠరీ దేవి అమరావతిలో నివసించే బౌద్ధ బిక్షువులకు నెలరోజుల పాటు అన్నదాన వ్రతం చేపట్టింది. భారతదేశంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున కొండ విశ్వవిద్యాలయం. వీర పురుషుదత్తుడి కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి రెండో నాగార్జునుడు. ఈ విశ్వవిద్యాలయం విజయపురి దక్షిణాది బుద్ధగయగా పేరొందింది. మోటుపల్లి, ఘంటశాల నాటి ప్రధాన ఓడరేవులు. నాటి సమాజంలో సతీసహగమనం ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
 

బృహత్పలాయనులు (క్రీ.శ. 300 - 325)
ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న బృహత్పలాయనులు వారి తర్వాత కృష్ణానది ఉత్తరభాగంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరిని శకులుగా భావిస్తున్నారు. వీరి చరిత్రకు గల ఒకే ఒక ఆధారం కొండముది తామ్ర శాసనం. దక్షిణ భారతదేశంలో తొలి తామ్ర శాసనం కొండముది త్రామ శాసనం. దీన్ని వేయించింది జయవర్మ. గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో ఈ శాసనం లభించింది. జయవర్మ బ్రాహ్మణ మతస్థుడు. వీరి రాజధాని కోడూరు (కూడూరు). జయవర్మ ఇష్ట దైవం మహేశ్వరుడు. ఇతడు కృష్ణా జిల్లాలోని పంతూర (పాంటూరు) గ్రామాన్ని ఎనిమిది మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానం చేశాడు. మహేశ్వర పాద పరిగ్రహీత ఇతడి బిరుదు. కొండముది తామ్ర శాసనాన్ని ప్రాకృత భాషలో వేశారు. దీనిలో స్కందావరాలు, కటకాలు; పల్లవుల బ్రాహ్మణ మత విజృంభన, బౌద్ధమత క్షీణతల గురించి వివరణ ఉంది. బృహత్పలాయనుల గురించి తన శాసనాల్లో పేర్కొన్న ఇక్ష్వాక రాజు రుద్రపురుషదత్తుడు. జయవర్మ సేనాధిపతి పేరు బాపమహావర్మ. జయవర్మ కొండముది తామ్ర శాసనాన్ని తన పదో పాలనా సంవత్సరంలో ప్రాకృత భాషలో వేయించాడు. కానీ శాసన ముద్రిక మాత్రం సంస్కృత భాషలో ఉంది. నాటి కుడూరను నేటి కోడూరు అని బి.కృష్ణారావు పేర్కొనగా, గూడూరు అని పేర్కొంది జోవోదూబ్రే. బృహత్పలాయనులను ఓడించి శాలంకాయనులు వారి రాజ్యాన్ని ఆక్రమించారు. వీరి రాజభాష ప్రాకృతం.

 

శాలంకాయనులు (క్రీ.శ. 300 - 440)
శాలంకాయనులను బప్ప భట్టారక పాదభక్తులుగా పిలిచేవారు. విజయదేవవర్మ శాలంకాయన రాజ్య స్థాపకుడు. వీరి రాజధాని వేంగి. రాజభాష సంస్కృతం. రాజలాంఛనం వృషభం. వీరి ఆరాధ్య దైవం చిత్రరథ స్వామి. శాలంకాయనుల చరిత్రకు మూడు ప్రాకృత భాషా శాసనాలు, ఆరు సంస్కృత భాషా శాసనాలు, ఒక ప్రాకృత, సంస్కృత మిశ్రమ భాషా శాసనం మొత్తంగా 10 శాసనాలు ఆధారం. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ తన జాగ్రఫీ గ్రంథంలో బెన్‌గురాన్ (వేంగి) దగ్గరలో సలెకినాయ్ (శాలంకాయనులు) ఉన్నట్లు పేర్కొన్నాడు. విజయదేవ వర్మ తర్వాత పాలించిన శాలంకాయన రాజు హస్తివర్మ. సముద్రగుప్తుడి దక్షిణ భారతదేశ దండయాత్రలో ఓడిపోయిన (వేంగి) శాలంకాయన రాజు ఇతడే. హస్తివర్మ ఆస్థానంలో భావ వివేకుడు, బుద్ధదత్తుడు అనే పండితులున్నట్లు తెలుస్తోంది. భావ వివేకుడి పేరుతోనే భావయపట్ల (బాపట్ల) వెలసింది. బర్మాకు చెందిన బుద్ధదత్తుడిని హస్తివర్మ సన్మానించాడు. ఏలూరు సమీపంలో చిత్ర రథస్వామి ఆలయాన్ని హస్తివర్మ నిర్మించాడు. బర్మా గ్రంథాల్లో శాలంకాయన రాజ్యాన్ని సాన్-లాన్-క్రోన్ అని ప్రస్తావించారు. శాలంకాయనుల కాలంలోనే దిజ్ఞాగుడు వేంగిపురాన్ని సందర్శించాడు.
         ఏలూరు ప్రాకృత శాసనం ప్రకారం రాజ్య స్థాపకుడు విజయదేవవర్మ. కానుకొల్లు, గుంటుపల్లి శాసనల ప్రకారం శాలంకాయన స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది హస్తివర్మ. శాసనాల్లో హస్తివర్మను నానా ప్రకార విజయస్య, ధర్మమహారాజ లాంటి బిరుదులతో ప్రస్తావించారు. హస్తివర్మ కుమారుడు నందివర్మ. ఇతడే కానుకొల్లు శాసనం వేయించాడు. నందివర్మకు గోసహస్రప్రదాయి, వివిధ ధర్మ ప్రధానస్య అనే బిరుదులు ఉన్నాయి. నంది వర్మ మనుమడు, రెండో హస్తివర్మ కుమారుడు అయిన ఖండపోత్త ఆయురారోగ్యాల కోసం బ్రాహ్మణులకు దానం చేశాడు. మొదటి నందివర్మను ఓడించి అతడి సోదరుడు రెండో దేవవర్మ సింహాసనం ఆక్రమించాడు. రెండో దేవవర్మను ఓడించి అఛండవర్మ రాజ్యానికి వచ్చినట్లు అతడి ధారికాటూరి శాసనం తెలుపుతోంది. అచంఢవర్మ తర్వాత అతడి సోదరుడు రెండో హస్తివర్మ రాజ్యానికి వచ్చినట్లు అతడి పెనుగొండ శాసనం తెలియజేస్తోంది. (నంది వర్మను ఓడించిన దేవవర్మ అశ్వమేధయాగం చేసి రెండో విజయదేవవర్మ పేరుతో రాజ్యపాలన చేశాడు). తర్వాత రాజ్యానికి వచ్చిన విజయనంది వర్మ/ రెండో నందివర్మ ఎక్కువ శాసనాలు వేయించిన శాలంకాయన రాజుగా పేరొందాడు. చివరి శాలంకాయన రాజు విజయస్కంధ వర్మ.
         గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేసింది రెండో నందివర్మ. ఆంధ్రదేశంలో విష్ణుదేవాలయాలు ఉన్నట్లు తెలిపే తొలి శాసనం పెదవేగి శాసనం. దీన్ని రెండో నందివర్మ వేయించాడు. విజయదేవవర్మ వేయించిన ఏలూరు శాసనంలో మున్యద అనే రాజకీయోద్యోగి పేరు ప్రస్తావించారు. నాటి ప్రముఖ రేవుపట్నం ప్రాలూర. ప్రాలూరలోని విష్ణుగృహస్వామి ఆలయానికి విజయనందివర్మ/ రెండో నందివర్మ గ్రామాలను దానం చేశాడు. కొల్లేరు, పెదవేగి శాసనాలను రెండో నందివర్మ; కంతేరు శాసనాన్ని విజయస్కంధవర్మ వేయించారు. వీరి సమకాలీనుడైన దిజ్ఞాగుడు శుద్ధ ఆర్కవిద్యకు పునాది వేశాడు. చంఢవర్మ బిరుదు ప్రతాపోనత సామంతస్య, రెండో నందివర్మ బిరుదు పరమభాగవతుడు కాగా విజయదేవవర్మ బిరుదు పరమ మహేశ్వరుడు. బప్ప భట్టారకులు అంటే తండ్రిని దైవంగా భావించే వారని అర్థం.

 

ఆనంద గోత్రజులు/ ఆనందగోత్రికులు
         త్రికూట పర్వతాధిపతులుగా పేర్కొన్నవారు ఆనందగోత్రికులు. రాజ్యస్థాపకుడు కందారరాజు. వీరి రాజధాని కందారపురం (గుంటూరు జిల్లా). రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం వృషభం. కందార రాజు చేజర్ల శాసనం వేయించాడు. వీరిలో గొప్ప పాలకుడు దామోదర వర్మ. ఇతడు మట్టిపాడు శాసనం వేయించాడు. అందులో ఇతడి బిరుదు హిరణ్యగర్భోద్భవ. బౌద్ధాలయంగా ఉన్న చేజర్లలో కపోతేశ్వరాలయం నిర్మించింది దామోదర వర్మ. ఈ దేవాలయంలో శిబి చక్రవర్తి కథ శిల్పంగా మలిచి ఉంది. తర్వాతి పాలకుడైన అత్తివర్మ గోరంట్ల తామ్రశాసనం వేయించాడు. ఇతడిని కూడా హిరణ్యగర్భోద్భవ అనే బిరుదుతోనే ప్రస్తావించారు. శాసనాల్లో ఆనందగోత్రజులు- కపిధ్వజులు, త్రికూట పర్వతాధిపతులమని పేర్కొన్నారు. త్రికూట పర్వతం అంటే నేటి కోటప్పకొండ. కందారపురం అనేది నేటి కంతేరు. ధాన్యకటక యుద్ధంలో ఆంధ్రరాజు శాలంకాయన నందివర్మను ఓడించింది దామోదర వర్మ. మట్టిపాడు శాసనం ప్రాకృత, సంస్కృత భాషల్లో ఉండగా, గోరంట్ల తామ్ర శాసనం పూర్తిగా సంస్కృతంలో ఉంది. అత్తివర్మ తాడికొండలో కొంతభూమిని, అంతకూర గ్రామాన్ని కోటిశర్మ అనే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాడు. కంగూర గ్రామాన్ని దామోదర వర్మ బ్రాహ్మణులకు దానం చేశాడు. మార్కండేయ పురాణంలో ఆనందగోత్రజులను గోలాంగుల వంశస్థులుగా పేర్కొన్నారు. దామోదర వర్మ బిరుదు సమ్యక్సం బుద్ధస్య పదాను దాతస్య. అత్తివర్మ వంకేశ్వర శంభువును ఆరాధించాడు.

 

విష్ణుకుండినులు (క్రీ.శ. 440 - 616)
తెలుగునేలపై సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని పాలించిన మొదటి వంశీయులు విష్ణుకుండినులు. వీరి జన్మస్థలం వినుకొండ (గుంటూరు జిల్లా) అని కీల్‌హారన్ పండితుడు పేర్కొన్నాడు. వీరి చరిత్రకు 10 శాసనాలు ఆధారంగా లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి: తుమ్మలగూడెం శాసనం - గోవిందవర్మ; ఈపూరు, ఖానాపూర్, పొలమూరు తామ్ర శాసనాలు; వేల్పూరు శిలాశాసనాలు - మాధవవర్మ; రామతీర్థం శాసనం - ఇంద్రవర్మ; చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్ర భట్టారక వర్మ. వీరి కాలనిర్ణయానికి ప్రధాన ఆధార శాసనం ఇంద్రపాలనగర శాసనం. దీన్ని వేయించింది విక్రమేంద్ర భట్టారక వర్మ. వీరి నాణేలపై సింహం, శంఖం ముద్రలు; శాసనాలపై లక్ష్మీ, శ్రీవత్సాల ముద్రలు ఉన్నాయి. విష్ణుకుండినులు బ్రాహ్మణులు. వీరి రాజధానులు వరుసగా వినుకొండ, కీసరగుట్ట, దెందులూరు (వేంగి), విజయవాడ (కనకపురి). మూలపురుషుడు ఇంద్రవర్మ. 
                            విష్ణుకుండిన వంశ స్థాపకుడు మొదటి మాధవవర్మ. ఇతడి తొలి రాజధాని వినుకొండ. తర్వాత కీసరగుట్ట (కరీంనగర్)కు మార్చాడు. ఇతడు 11 అశ్వమేధ యాగాలు చేసినట్లు పేర్కొంటారు. వాకాటక రాకుమార్తెను పెండ్లాడిన తొలి విష్ణుకుండిన రాజు మాధవ వర్మే. ఇతడు వేల్పూరు శిలాశాసనాన్ని వేయించాడు. పరమ బ్రాహ్మన్య, పరమేష్ఠి బిరుదులు. విష్ణుకుండినుల్లో తొలి సుప్రసిద్ధ రాజు గోవిందవర్మ. పల్లవులను ఓడించి గుండ్లకమ్మ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. శాస్త్రాల్లో పండితుడు. బౌద్ధమతాభిమానియైన వైష్ణవుడు. ఇతడి రాణి పరమభట్టారికా మహాదేవి వేల్పూరులో బౌద్ధవిహారాన్ని నిర్మించింది. గోవిందవర్మ వేల్పూరు బౌద్ధ విహారానికి పెణుకుపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. తుమ్మల గూడెం శాసనం వేయించాడు. బౌద్ధాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు గోవిందవర్మ.
          విష్ణుకుండిన రాజుల్లో గొప్పవాడు రెండో మాధవవర్మ. ఇతడు అశ్వమేధ, రాజసూయ, నరమేధ యాగాలు చేశాడు. త్రికూటమలయాధిపతి, జనాశ్రయ బిరుదులు పొందాడు. రాజధానిని అమరపురం నుంచి దెందులూరు (వేంగి)కు మార్చాడు. ఉండవల్లి గుహల్లోని బుద్ధుడి శిల్పాన్ని శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం(అనంత సాయి)గా మార్చాడు. ఉండవల్లి గుహలపై పూర్ణకుంభాన్ని చెక్కించాడు (రాష్ట్ర అధికార చిహ్నం). ఇతడి కాలంలో అమరావతిలో బౌద్ధ, శైవ సంఘర్షణలు జరిగినట్లు, అమరావతిని అమరలింగేశ్వరస్వామి ఆలయంగా మార్చినట్లు ఫాహియాన్ పేర్కొన్నాడు. తర్వాత పాలించిన మూడో మాధవర్మ న్యాయసింహుడు, అవసిత వివిధ దివ్య లాంటి బిరుదులు పొందాడు. తన కుమారుడికే ఉరి శిక్ష విధించినట్లు దగ్గుపల్లి దుగ్గన రచించిన నచికేతోపాఖ్యానం గ్రంథం వివరిస్తోంది. నందిమల్లయ్య, ఘంట సింగన రచించిన ప్రబోధ చంద్రోదయం గ్రంథం ప్రకారం ఇతడి కాలంలో విజయదుర్గ కనకవర్షం కురిపించిందని, కాబట్టి విజయవాడను కనకపువాడగా పిలిచారని తెలుస్తుంది. చివరి విష్ణుకుండిన రాజు విక్రమేంద్రవర్మ/ రెండో విక్రమేంద్రుడు. ఇతడికే మంచన భట్టారకుడు అనే నామాంతరం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు సకల భువన రక్షాభరణై కాశ్రయ అనే బిరుదు పొందాడు. ఇతడు వేయించిన చిక్కుళ్ల తామ్ర శాసనంలోనే విజయోత్సవ సంవత్సరంబుల్ అనే తొలి తెలుగు వాక్యం ఉంది.
యుగ విశేషాలు
          రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. హస్తికోశ, వీరకోశ లాంటి అధికారులను నియమించారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారి కొండలను తొలిచి ఆలయాలను నిర్మించింది విష్ణుకుండినులే. ఉండవల్లి గుహల్లో అనంతపద్మనాభ స్వామి ఆలయం, మొగల్ రాజపురంలో అర్ధనారీశ్వర మూర్తి గుహలు, విజయవాడలోని అక్కన్న, మాదన్న గుహలు; నెల్లూరులోని భైరవకొండ గుహలు... వీరి కాలంలో నిర్మించినవే. చివరి పాలకుడైన ఇంద్ర భట్టారక వర్మ/ మంచన భట్టారక వర్మ/రెండో విక్రమేంద్ర వర్మ కోస్తాలో ఘటికలు స్థాపించినట్లు ఉదంకుని సామవేద గ్రంథం తెలుపుతోంది. రెండో పులకేశి చేతిలో కునాల/ కొల్లేరు యుద్ధంలో ఓడిన పాలకుడు ఇంద్రభట్టారక వర్మ. భైరవకొండలో 8 గుహాలయాలున్నాయి. విజయవాడలో నాలుగు అంతస్థుల దేవాలయాన్ని నిర్మించారు. వీరు నిర్మించిన లింగాలమెట్టు బౌద్ధ స్తూపం (గోవింద వర్మ) నమూనాలోనే బోరోబుదురు (జావా) బౌద్ధస్తూపం నిర్మించారు. ఆంధ్రదేశంలోని తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథంగా పేరొందిన జనాశ్రయ చంధోవిచ్ఛిత్తిని గణస్వామి వీరికాలంలోనే రచించాడు. రెండో విక్రమేంద్ర వర్మ రాజధానిని దెందులూరు నుంచి అమరపురానికి మార్చినట్లు తెలుస్తోంది. తూర్పుచాళుక్యులు, రణదుర్జయులు లాంటి వారి దాడులతో విష్ణుకుండిన వంశం అంతమైంది.
          (రణ దుర్జయులు పిఠాపురం రాజధానిగా పాలించారు. రణదుర్జయుడు, విక్రమేంద్రుడు, పృథ్వీ మహారాజులు పాలించారు. గొప్పవాడు పృథ్వీ మహారాజు. ఇతడు రెండో విక్రమేంద్రవర్మను వధించాడు. కానీ, రెండో పులకేసి చేతిలో కునాల యుద్ధంలో మరణించాడు.)

 

ముఖ్యాంశాలు
* విష్ణుకుండిన రాజులు ధర్మవిజయ బిరుదులను పొందారు. (పల్లవులు ధర్మమహారాజు బిరుదు పొందారు)
* బృహత్పలాయనులు రాష్ట్రాలను ఆహారములు అని, దాని అధిపతిని వ్యాపృతుడు అని పిలిచేవారు.
* శాలంకాయనుల కాలంలో గ్రామాధికారిని ముతుడ అని పిలిచేవారు.
* ఆంధ్రాధిపతి గజ ఘటములను సంగ్రహించిన పాలకుడిగా కందారరాజు పేరొందాడు.
* పల్లవులు తమ రాజ్యాన్ని పథములు, భోగాలు, మాడబములుగా విభజించారు.
* పల్లవుల కాలం నాటి స్థానికోద్యోగులను గుమిక అరణ్యాధికృత అని పిలిచేవారు.
* సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక రాజు ప్రతినిధిని గుల్మికుడు అనేవారు.
* రాజశాసనాలు బహిరంగపరిచే వాడిని శాసన సమరాంతకుడు అని, శాసనాలను అమలుపరిచే అధికారిని మహాబలాధికృత, దండనేత్ర అని పిలిచేవారు.
* వృత్తిపన్నుల ప్రస్తావన ఉన్న శాసనం - విళవట్టి శాసనం
* వేల్పూరు వద్ద గణపతి ప్రతిష్ఠ చేసిన రాజు - మొదటి మాధవవర్మ (వేల్పూరు శాసనం)
* ఇటీవల కర్నూలు జిల్లాలోని వీరాపురంలో ఇక్ష్వాకుల కాలంనాటి దేవాలయం బయల్పడింది.
* భూత గ్రాహక స్వామి/ యముడు ఆలయం వేల్పూరులో ఉంది.
* గౌతమ బుద్ధుడు ధాన్యకటక ప్రాంతంలో కాలచక్ర తంత్రాన్ని బోధించాడు.
* వజ్రయాన సిద్ధాంతకర్త సిద్ధ నాగార్జునుడు ఆంధ్రదేశవాసి అని రామిరెడ్డి పల్లెశాసనం పేర్కొంది.
* శాసనాల్లో సంస్కృతాన్ని వాడటం ప్రారంభించింది ఇక్ష్వాకులు.
* తెలుగు భాషా పరిణామాన్ని వివరిస్తున్న పొట్లదుర్తిని రేనాటి చోఢరాజు పుణ్యకుమారుడు వేయించాడు.
* భూస్పర్శ ముద్రలతో బుద్ధ ప్రతిమలు బొజ్జనకొండ (విశాఖపట్నం జిల్లా) వద్ద లభించాయి.
* మొగల్రాజపురంలో 5 గుహలున్నాయి. 4వ గుహలో దుర్గ, 5వ గుహలో శివ తాండవం/ నటరాజ/ అర్ధనారీశ్వర మూర్తి విగ్రహాలున్నాయి.
* ఉండవల్లి గుహలు 3. మధ్య గుహలో నాలుగు అంతస్థులతో అనంతసాయి గుడి(బుద్ధుడి శిల్పాన్ని శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహంగా మలిచారు.) ఉంది.
* గుంటుపల్లి గుహాలయం సింహం ప్రతిరూపంతో ఉంటుంది. గుహ ముఖంపై ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఉంటుంది.
* నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో 8 గుహలున్నాయి. వీటిలో రేనాటిచోడులు, విష్ణుకుండిన కాలం నాటి శైవమతానికి సంబంధించిన ఆధారాలున్నాయి.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌