• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు బానిస వంశం - బాల్బన్‌

ఘియాసుద్దీన్‌ బాల్బన్‌ 

* క్రీ.శ. 1266-86 వరకు రాజ్యపాలన చేశాడు. మొత్తం 20 ఏళ్లు ఢిల్లీ సుల్తాన్‌గా పాలించాడు. ఇతడి పాలనలో ప్రజలకు శాంతిభద్రతలు లభించాయి. 

* బాల్బన్‌ ఇల్బరి తెగకు చెందినవాడు. అసలు పేరు బహుద్దీన్‌. 

* ఇతడ్ని మంగోలులు బంధించి బస్రాలో జమాలుద్దీన్‌కి బానిసగా అమ్మేశారు. తర్వాత ఇతడ్ని ఇల్‌టుట్‌మిష్‌ కొన్నాడు. ఇతడి ప్రతిభను గుర్తించిన ఇల్‌టుట్‌మిష్‌ తన వ్యక్తిగత కాపలాదారుడిగా నియమించుకున్నాడు. తన కుమార్తెను సైతం ఇచ్చి వివాహం జరిపించాడు. బాల్బన్‌ను చిహల్‌గని కూటమిలో సభ్యుడిగా నియమించాడు.

* బాల్బన్‌ సుల్తాన్‌ కాకముందే క్రీ.శ. 1240లో ఢిల్లీలో లాల్‌ మహల్‌ను నిర్మించాడు.

* మొదట నసీరుద్దీన్‌కు వజీరుగా (ప్రధానిగా) పనిచేశాడు. అతడు మరణించాక తనను తాను ఢిల్లీ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. 


బాల్బన్‌ పాలనా కాలం నాటి పరిస్థితులు

* చిహల్‌గని కూటమి బాల్బన్‌ను సుల్తాన్‌గా అంగీకరించలేదు. సామంతుల్లో సుల్తాన్‌లపై గౌరవం తగ్గింది.

* భారత్‌పై మళ్లీ మంగోలులు దాడులు చేయడం ప్రారంభించారు. వీటిని ఎదుర్కొనే క్రమంలో ధనాగారం ఖాళీ అయ్యింది. 

* వివిధ రాష్ట్రాల పాలకులు తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. దేశమంతా అనేక తిరుగుబాట్లు చెలరేగాయి.

సుల్తాన్‌గా బాల్బన్‌ చర్యలు: మొదట చిహల్‌గని కూటమిని అణచివేశాడు. తురుష్కులను ఉన్నత పదవుల్లో నియమించాడు. వీరిని చిహల్‌గనికి ప్రత్యామ్నాయంగా చేశాడు. చిహల్‌గని కూటమిని విచ్ఛిన్నం చేసి, అందులోని సభ్యులను చంపించాడు. 

* ఇతడు న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాడు. 

పాలనాపరమైన చర్యలు: పరిపాలనలో అవకతవకలకు పాల్పడిన అధికారులను శిక్షించాడు. గూఢచారులను నియమించి, అవినీతిపరులను తొలగించాడు. 

* ఉద్యోగులు లంచాలు తీసుకోకుండా ఉండేందుకు అధిక మొత్తంలో జీతాలు ఇచ్చాడు. 

‘మియోలు’ అనే దారి దోపిడీ దొంగలను అణచివేశాడు.

సైనిక శక్తి: బాల్బన్‌ సుల్తాన్‌ అయ్యాక సైన్యాన్ని పటిష్ఠం చేశాడు. ప్రత్యేకంగా సైనిక మంత్రిని నియమించాడు. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు. వీటితో తన రాజ్యపరిపాలనను విజయవంతం చేసుకున్నాడు.

రాచరిక ప్రతిష్ట: బాల్బన్‌ రాచరికం దైవదత్త అధికారమని భావించి, దాని ప్రతిష్టను పెంచాడు. తనను తాను ‘జిల్‌-ఇ-ఇల్లా’ (భగవంతుడి నీడ)గా ప్రకటించుకున్నాడు. బాల్బన్‌ పాలనలో నిరంకుశ విధానాన్ని అనుసరించాడు. పాలనలో తురుష్క ఇతిహాస నాయకుడు అఫ్రిసియాబును ఆదర్శంగా తీసుకున్నాడు. 

* పాదాలు ముద్దు పెట్టుకోవడం (పైబోస్‌), సాష్టాంగ దండప్రమాణం (సిజ్జా) లాంటి పర్షియన్‌ ఆచారాలను దర్బారులో ప్రవేశపెట్టాడు. 

* నౌరోజ్‌ అనే పర్షియన్‌ పండుగను నిర్వహించాడు. 

* దర్బారులో రాజదుస్తుల్లోనే కనిపించేవాడు. అధికారులతో మినహా వేరేవారితో మాట్లాడేవాడు కాదు. బలహీనవర్గాల వారిని అసహ్యించుకుని, వారిని ఉన్నత పదవుల్లో నియమించలేదు.

* నవ్వడం, ఏడవడం మానేశాడు. తన దర్బారులో ఎవరినీ నవ్వనివ్వలేదు. 

* మత్తు పానీయాలు, జూదాలను నిషేధించాడు. పారశీక సాంప్రదాయాలు పాటించాడు. ఇతడి పాలన సగం సివిల్, సగం సైనికపాలన అని డా.ఈశ్వరీప్రసాద్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు.


తిరుగుబాట్ల అణచివేత: బాల్బన్‌ తన హయాంలో రాజ్య విస్తరణ కోసం కొత్తగా యుద్ధాలు చేయలేదు. అంతర్గత తిరుగుబాట్లను క్రూరంగా అణిచివేశాడు. శాంతిభద్రతల పరిరక్షణకు విశేష ప్రాధాన్యం ఇచ్చాడు. 

* ఢిల్లీ, ఔద్, దోబ్‌ ప్రాంతాల్లోని దొంగలు, దోపిడీదార్లు, తిరుగుబాటుదార్లను క్రూరంగా అణిచివేశాడు. ఈ సమయంలోనే రోహిల్కండ్‌లో హిందువులు తిరుగుబాటు చేయగా, వారిలో మగవారందరినీ చంపించాడు. 

* బెంగాల్‌ గవర్నర్‌ తుగ్రిల్‌ఖాన్‌ తనకు తాను స్వాత్రంత్య్రం ప్రకటించుకుని, తనపేరు మీదుగా నాణేలు కూడా విడుదల చేశాడు. 

* దీన్ని అణచడానికి బాల్బన్‌ చేసిన ప్రయత్నాలు మొదట విఫలమయ్యాయి. తర్వాత తన రెండో కుమారుడు బుగ్రాఖాన్‌తో పాటు తానే స్వయంగా రెండు లక్షల సైన్యాన్ని వెంటపెట్టుకుని బెంగాల్‌పై దండెత్తాడు. ఈ యుద్ధంలో తుగ్రిల్‌ఖాన్‌ మరణించాడు.

* బెంగాల్‌కు బుగ్రాఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఇమాద్‌ ఉల్‌ముల్క్‌ను సైనిక పర్యవేక్షణాధికారిగా నియమించాడు.

మంగోలుల దండయాత్రలు: ఇల్‌టుట్‌మిష్‌ కాలం నుంచే మంగోలులు భారత్‌పై దండయాత్రలు చేయడం ప్రారంభించారు. వీరిని ఎదుర్కొనేందుకు బాల్బన్‌ అనేక చర్యలు తీసుకున్నాడు. 

* సమర్థులైనవారిని సైన్యంలోకి తీసుకుని వారికి సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ బాధ్యతలు అప్పగించాడు. 

* సరిహద్దు కోటలను పటిష్ఠం చేశాడు. కొత్త కోటలు నిర్మించాడు. 

* వాయవ్య రాష్ట్రాన్ని రెండుగా విభజించి, ఇద్దరు గవర్నర్లను నియమించాడు. 

* తన కొడుకులైన మహమ్మద్, బుగ్రాఖాన్‌లకు ముల్తాన్, సుమన్‌ల బాధ్యతలు అప్పగించాడు. 

* మంగోలుల ప్రతి చర్యలకు అడ్డుపడి, వారు భారత్‌ వైపు రాకుండా నిలువరించాడు. 

* క్రీ.శ.1286లో జరిగిన మంగోలుల దండయాత్రలో ఇతడి పెద్ద కుమారుడు మహమ్మద్‌ మరణించాడు. ఈ దిగులుతోనే బాల్బన్‌ మరణించాడు. ఇతడు మరణించక ముందే తన సమాధిని నిర్మించుకుని దానికి ‘దర్‌-ఉల్‌-అమాన్‌’ (స్వర్గ నిలయం) అని పేరు పెట్టాడు.

* చనిపోయాక అందులోనే ఇతడ్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఇది ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉంది.


బహరాంషా రజియా సుల్తానా తర్వాత బహ

రాంషా ఢిల్లీని పాలించాడు. ఇతడి కాలంలో సుల్తాన్, టర్కీ అధికారుల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరిగింది. టర్కీ అధికారులు మొదట బహరాంషాకు మద్దతు ఇచ్చినా, తర్వాతి కాలంలో వారు ఇతడ్ని వ్యతిరేకించారు. బహరాంషాను క్రీ.శ. 1246లో అతడి సొంత సైన్యమే హత్య చేసింది.

అల్లాఉద్దీన్‌ మసుద్‌షా 

బహరాంషా మరణించాక క్రీ.శ.1246లో అల్లాఉద్దీన్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాడు. ఇతడు రక్‌ఉద్దీన్‌ ఫిరోజ్‌షా కొడుకు, రజియా సుల్తానా మేనల్లుడు. 

అల్లాఉద్దీన్‌ ప్రభుత్వ పాలనను నిర్వహించడంలో విఫలమయ్యాడు. దీంతో ఇతడి స్థానంలో నసీరుద్దీన్‌ మహమ్మద్‌ సుల్తాన్‌ అయ్యాడు.


నసీరుద్దీన్‌ మహమ్మద్‌ 

ఇతడు ఇల్‌టుట్‌మిష్‌ మనవడు. క్రీ.శ.1246-65 మధ్య రాజ్యపాలన చేశాడు. బాల్బన్‌ సాయంతో ఇతడు సింహాసనాన్ని అధిష్టించాడు. బాల్బన్‌ తన కుమార్తెను నసీరుద్దీన్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. నసీరుద్దీన్‌ రాజైనప్పటికీ అధికారం మొత్తం బాల్బన్‌ చేతిలోనే ఉండేది. 

క్రీ.శ. 1265లో నసీరుద్దీన్‌ మరణించాడు. ఇబన్‌ బటూటా, ఇసామి లాంటి చరిత్రకారులు ఇతడికి బాల్బన్‌ విషం ఇచ్చి చంపినట్లు తమ రచనల్లో పేర్కొన్నారు.


బాల్బన్‌ ఘనత: ‘‘బాల్బన్‌ ఒక సామాన్య బానిస జీవితం నుంచి హిందుస్థాన్‌కు సుల్తాన్‌గా ఎదిగాడు’’ అని లేన్పూల్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు. 

 బాల్బన్‌ కవి పోషకుడు. ఇతడి ఆస్థానంలో అమీర్‌ ఖుస్రూ, అమీర్‌ హసన్‌ లాంటి కవులు ఉండేవారు. రోజూ వీరితో కలిసి భోజనం చేసేవాడని వివిధ చరిత్రకారులు పేర్కొన్నారు. 

ఇతడు తన పాలనా కాలాన్నంతా పోరాటాలతోనే గడిపాడు. రాచరిక ప్రతిష్ఠను పెంచారు. 

చిహల్‌గని కూటమిని అణచివేశాడు. ఢిల్లీ సింహాసనాన్ని స్థిరపరిచాడు. 

భవిష్యత్తులో ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పర్చేలా ఇతడు అల్లాఉద్దీన్‌ ఖిల్జీకి సానుకూల పరిస్థితులు కల్పించాడని చరిత్రకారులు పేర్కొన్నారు. 

బాల్బన్‌ మొదట బుగ్రాఖాన్‌ను తన వారసుడిగా ప్రకటించాడు. అతడు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. తర్వాత మహమ్మద్‌ కుమారుడైన కైఖుస్రూను తన వారసుడిగా ప్రకటించాడు. 

బాల్బన్‌ తర్వాత కైఖుస్రూ, షంషుద్దీన్, కైకుబాద్‌ మూడేళ్లు ఢిల్లీని పాలించారు. ఖిల్జీల నాయకుడైన జలాలుద్దీన్‌ ఫిరోజ్‌ ఖిల్జీ క్రీ.శ.1290లో కైకుబాద్‌ను హత్య చేసి, ఢిల్లీని ఆక్రమించాడు.రచయిత

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌