• facebook
  • whatsapp
  • telegram

వివాహాలు - రకాలు

బొట్టు పెట్టినా... చేయి పట్టినా పరిణయమే!

  భారత సమాజంలోని విభిన్న జాతులు, తెగల్లో అనేక రకాలుగా వివాహాలు జరుగుతాయి. కొందరు కన్యాశుల్కం చెల్లిస్తారు. ఇంకొందరు వధువు కుటుంబానికి సేవలు చేసి మెప్పిస్తారు. నచ్చిన యువకుడి ఇంట్లోకి యువతి నేరుగా ప్రవేశిస్తుంది. ఎంత హింసించినా బయటకి వెళ్లదు. ఆఖరికి కోడలిగా మారిపోతుంది. యువకులు జాతరలు, సంతల్లో కాపుకాసి నచ్చిన యువతి నుదుటిపై బొట్టు పెట్టేస్తారు. మెచ్చినవారి చేతిని పట్టుకుంటే పరిణయంగా భావిస్తారు. ఈ వివాహరీతులపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

  వివాహం ఒక జీవన అవసరం. రెండు జీవితాలను కలిపి ఉంచే పవిత్ర సంస్కారం. సమాజ నిర్మాణంలో మూలస్తంభం. ఇందులో నిర్దిష్ట నియమాలను అనుసరించి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. ఆచార వ్యవహారాలను పాటిస్తారు. సంప్రదాయాల ప్రకారం ఏకమవుతారు. ఇది అనేక రకాలుగా జరుగుతుంది. 

సంప్రదింపుల వివాహం (Consultancy Marriage): సంప్రదింపుల ద్వారా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. ఈ రకమైన వివాహంలో అవసరాన్ని బట్టి వరుడి తల్లిదండ్రులు లేదా వధువు అమ్మానాన్నలు ప్రతిపాదనలు చేసి సంప్రదింపులు ప్రారంభిస్తారు. భార్య చనిపోయినప్పుడు భార్య చెల్లెల్ని పెళ్లాడి తీరాలా, భర్త చనిపోయినప్పుడు భర్త సోదరుడిని పెళ్లి చేసుకోవాలా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.ఈ సంప్రదింపుల్లో కట్నం ప్రధానంగా ఉంటుంది. 

 

* ఓలీ చెల్లించడం ద్వారా వివాహం: ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే ఆమెకు తగిన విలువ ధన రూపంలో చెల్లించగలగాలి. 

 

* కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకున్న భార్య మరొకరితో వెళ్లిపోయినప్పుడు ఆమె రెండో భర్త మొదటి భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 

ఉదా: నాగా, పోలు క్రోట, హిదట్టాలు (ఆదిమ తెగలు)

 

* సేవా వివాహం (Service Marriage): వధువుకు సేవ చేయడం ద్వారా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం సేవా వివాహం. వివాహానికి ముందు లేదా తర్వాత లేదా వివాహకాలంలో వధువు కుటుంబం కోసం కొంతకాలం పాటు అంటే 2 - 3 సంవత్సరాలు సేవ చేయాల్సి ఉంటుంది. 

ఉదా: మధ్యప్రదేశ్‌ - గోండులు, ఆంధ్రప్రదేశ్‌ - భగత, సవర 


*  వధువు కుటుంబానికి వరుడు ఎప్పుడు (వివాహానికి ముందు/తర్వాత/వివాహ కాలంలో) తన సేవ ప్రారంభించాలనేది తెలుపుతుంది.  


* వరుడు చిన్న పనులు చేయాల్సి రావచ్చు లేదా కొద్ది వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పూర్తికాలం సేవ చేయాల్సి రావచ్చు. 


* సేవాకాలం పూర్తయిన తర్వాతనే వివాహం జరుగుతుంది. అప్పటి వరకు వధూవరులు పరాయివారుగానే ఉంటారు. 

 

* వినిమయ వివాహం (Exchange Marriage): వరుడి కుటుంబం కట్నానికి బదులుగా తమ ఇంటి ఆడపిల్లను ఇస్తారు. వరుడి చెల్లెల్ని లేదా మరొక బంధువును ఇచ్చి వివాహం చేస్తారు. అంటే ఇరు కుటుంబాల మధ్య రెండు వివాహాలు జరుగుతాయి. 

ఉదా: గోండులు, మురియా, బైగాలు, బగద, కోయ, సవర

 

* అనాహుత వివాహం (By Intrusion): స్త్రీ తనకు నచ్చిన యువకుడి ఇంట్లో నేరుగా ప్రవేశించి ఆ యువకుడికి ఇష్టం లేకపోయినా ఆ ఇంటి కోడలిగా ప్రవర్తిస్తుంది. వరుడి తల్లిదండ్రులు ఆమెను హింసించినా ఇల్లు వదలదు. చివరకు వారు ఆమెను కోడలిగా అంగీకరిస్తారు. 

ఉదా: కమార్, హో (మధ్యప్రదేశ్‌)

 

* పరీక్షావధి వివాహం (By Probationary): స్త్రీ పురుషులిద్దరూ తాత్కాలికంగా కలిసి ఉండి పరస్పరం అర్థం చేసుకున్న తర్వాతే శాశ్వత వివాహబంధంలోకి ప్రవేశిస్తారు. ఈ నియమంలో భార్యాభర్తల మధ్య అన్ని రకాల సంబంధాలు ఉంటాయి. ఒకవేళ విడిపోవాల్సి వస్తే తాత్కాలికంగా భార్యగా ఉన్నందుకు ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తారు. 

ఉదా: కుకీ (మణిపుర్‌)

 

* అపహరణ పద్ధతి ద్వారా వివాహం (By Capture): వధువును అపహరించి వివాహం చేసుకోవడం. శత్రువుల గ్రామాలపై దాడి చేసి స్త్రీలను అపహరించి వివాహం చేసుకుంటారు.

ఉదా: నాగా 

 

* కొన్ని తెగల్లో యువతులకు యువకులు ప్రేమ రాయబారం పంపిస్తారు. అంగీకరించకపోతే బలవంతంగా ఎత్తుకువెళ్లి వివాహం చేసుకుంటారు. 

ఉదా: హోలు (బిహార్‌), భిల్లులు (రాజస్థాన్‌), భగత (తమిళనాడు), సవర (ఆంధ్రప్రదేశ్‌)

 

* కొన్ని తెగల్లో వధూవరులు ప్రేమించుకున్నప్పుడు వివాహం చేసే స్థోమత లేకపోతే వధువు తల్లిదండ్రులే దీన్ని ప్రోత్సహిస్తారు. వధువు ప్రతిఘటించినట్లు నటిస్తుంది. 

ఉదా: గోండులు (మధ్యప్రదేశ్‌)

 

* తాము కోరిన యువతి కోసం యువకులు జాతరలు, సంతల్లో కాచుకొని ఆమె రాగానే నుదుటన బొట్టు పెడతారు. 

ఉదా: గోండులు (మధ్యప్రదేశ్‌)

సహపలాయనం ద్వారా వివాహం (By Elopment): ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు తల్లిదండ్రులను వ్యతిరేకించి ఎవరికీ తెలియకుండా దూరంగా పారిపోయి రహస్యంగా వివాహం చేసుకోవడం. ఉదా: గోండు, సవర, భగత

భౌతిక పరిగ్రహణ వివాహం (By Physical Caputre): తాను ఇష్టపడిన వ్యక్తిని భౌతికంగా చేయిపట్టుకొని ఎత్తుకుపోవడం. ఉదా: నాగా, గోండు, హో, ముత్తవన్‌

ప్రయోగ వివాహం (By Experimental Marriage): రాజస్థాన్‌లోని భిల్లులు హోళీ పండుగ రోజున జరుపుకునే వివాహ వేడుక. దీని ప్రకారం గ్రామం మధ్యలో ఒక చెట్టును లేదా స్తంభాన్ని పెట్టి దానికి గ్రీజు లేదా ఆయిల్‌ పూస్తారు. ఆ స్తంభం/చెట్టుపై ఒక తెల్లని వస్త్రంలో కొబ్బరికాయ, బెల్లం ముక్కను ఉంచుతారు. యువకులు పైకి ఎక్కి ఆ బెల్లం, కొబ్బరి ముక్కను తిని కిందకు రావాలి. వారు పైకి ఎక్కేటప్పుడు జుట్టు పట్టుకొని లాగడం, చొక్కా లాగడం లాంటి అవాంతరాలు కలిగిస్తారు. వీటన్నింటినీ అధిగమించిన యువకుడు కింద వరుసగా నిల్చొని ఉన్న యువతుల్లో ఒకరిని ఎంపిక చేసుకుంటాడు. 

 

సిద్ధాంతాలు

మానసిక విశ్లేషణ సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం కొడుకు తల్లివైపు, కూతురు తండ్రి వైపు ఆకర్షితులవుతారు. పెద్దల భయం వల్ల పిల్లలు తమ కోరికలను బలవంతంగా అణుచుకుంటారు. 

బాల్య స్నేహ సిద్ధాంతం (Childhood familiarity theory): దీన్ని వెస్టర్‌ మార్క్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒకే కుటుంబంలో నివసించే పిల్లలు ఒకరినొకరు ఆకర్షించుకోలేకపోయినా పరిచయం బాగా ఉండటం వల్ల ఒకరి లోటుపాట్లు మరొకరికి తెలుస్తాయి. 

ప్రజనన సిద్ధాంతం (Inbreeding theory): స్వగోత్రికులు లేదా ఇతర బందువులతో సంతానోత్పత్తి జరపడం. దీన్ని డేవిడ్‌ అబెరుల్‌ ప్రతిపాదించారు. జంతువుల్లో కనిపించే ఈ స్థితి ప్రభావం మానవ సమాజంపై ఉంటుంది. 

కుటుంబ చీలికా సిద్ధాంతం (Family disruption theory): తండ్రి కూతురిని, తల్లి కుమారుడిని, అన్న చెల్లెలిని, తమ్ముడు అక్కను వివాహం చేసుకోరాదు. ఇలా వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబం చీలిపోతుంది. దీన్ని మలినోస్కీ ప్రతిపాదించారు.  

సహకార సిద్ధాంతం (Cooperation theory): కుటుంబంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు బంధువులై ఉండటమే సహకార సిద్ధాంతం. దీన్ని టైలర్‌ ప్రతిపాదించారు. లెస్లీవైట్‌ విశ్లేషించారు. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  గిరిజన సమూహాలు

‣ బంధుత్వం - అనుబంధం

‣ తెలంగాణ సామాజిక పరిస్థితులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌