• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యుల కాలంనాటి సాంస్కృతిక పరిస్థితులు

పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని అనేక విషయాలుగా, ఒక్కో విషయాన్ని సీమలుగా విభజించారు. విషయంపై అధికారిని విషయాధిపతి అని, సీమపై అధికారిని సేనానాయకుడు అని అంటారు.


గ్రామాధికారులు: 
1) గ్రన్తి  నీటి నిల్వలపై అధికారి
2) కరణం  భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
3) తలారి  గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
4) గ్రామోపాధ్యాయుడు  గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు

    ఈ కాలంనాటి న్యాయాధికారిని ప్రాడ్వివాకుడనేవారు. రాజ్యాదాయానికి ప్రధానమైన ఆధారం భూమిశిస్తు. పన్నులు లేని భూములను ‘ఉంచాలి’ అనేవారు. ఈ కాలంలో విదేశీ వాణిజ్యం బాగా జరిగేది. గోదావరి, మంజీరా నదులు ఓడలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేవి. వర్తకులు మంజీరికా దేశానికి నౌకల్లో వెళ్లేవారు. కాళేశ్వరం, కందుకుర్తి గొప్ప వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. వర్తకులను తైర్థికులు అని, సుంకాన్ని హెజ్జుంక లేదా పెర్జుంక అనేవారు. వర్తక సంఘాలను ‘నకరములు’ అనేవారు. గద్యాణం, హాగ అనే పేరుతో నాణేలుండేవి.


మతం: 
వేములవాడ చాళుక్యుల కాలంలో జైన, వైదిక మతాలు ఉండేవి. జైనులు ఇతర మతాల వారిని తమవైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. అనేకమంది రాజులు జైన మతాన్ని అనుసరించి, అనేక జినాలయాలను నిర్మించారు. వేములవాడ గొప్ప జైన క్షేత్రంగా ఉండేది. రెండో అరికేసరి, కొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించారు.


విద్యా సారస్వతాలు:
ఆ కాలంనాటి రాజ భాష కన్నడం. అప్పటి శాసనాలన్నీ కన్నడ భాషలోనే ఉండేవి. శైవ మఠాలు, జైన బసదులు నాటి ఉన్నత విద్యాలయాలు. ఇందులో వేదాంగాలు, ఆగమాలు, పురాణాలు బోధించేవారు.
    వేములవాడ చాళుక్యుల కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం లాంటిది. రెండో అరికేసరి ఆస్థానంలో కన్నడ భాషల్లో ఆదికవిగా పేరొందిన పంప కవి ఉండేవాడు. ఇతడికి ‘కవితాగుణార్ణవుడు’ అనే బిరుదు ఉండేది. పంపకవి జైన మతాభిమాని. ఇతడు ‘విక్రమార్జున విజయం’ అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించి, తన రాజైన రెండో అరికేసరికి అంకితం ఇచ్చాడు. 
 సోమదేవసూరి అనే మరో జైన కవి ‘యశస్తిలక’ అనే చంపూ కావ్యాన్ని  రచించాడు. ఇతడికి ‘శ్యాద్వాదాచలసింహ’ అనే బిరుదు ఉండేది. జినవల్లభుడు పంపకవి సోదరుడు. ఇతడు కుర్క్యాల శాసనాన్ని సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. కుర్క్యాల శాసనంలో తెలుగు భాషలో మూడు కంద పద్యాలు ఉండేవి. ఇవి తెలుగు భాషలో మొదటి కంద పద్యాలు. 
* జినవల్లభుడు జిన భవనాలను నిర్మించడంలో నేర్పరి. ఇతడు అనేక జినాలయాలను నిర్మించాడు. జినవల్లభుడి మిత్రుడు మల్లియరేచన ‘కవిజనాశ్రయం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలో వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కుర్క్యాల, గంగాధరల్లో ఆలయాలను నిర్మించారు. వేములవాడలోని రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయాలను ఈ కాలంలోనే నిర్మించారు.


ముదిగొండ చాళుక్యులు
ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యులకు సామంతులుగా మంచికొండ మండలాన్ని పాలించారు. వీరు ముదిగొండ, కొరవి, బొట్టు రాజధానులుగా పాలించారు. ముదిగొండ చాళుక్య వంశానికి మూలపురుషుడు రణమర్థుడు. 
రెండో కుసుమాయుధుడికి ‘వినీత జనాశ్రయుడు’ అనే బిరుదు ఉండేది.
ముదిగొండ చాళుక్యుల చివరి పాలకుడు నాగతి రాజు.


కాకతీయులు
శాతవాహనుల అనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే పరిపాలనలోకి తెచ్చిన ఘనత కాకతీయులకే దక్కింది. కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. వీరు హనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా మూడు శతాబ్దాలకు పైగా పాలించారు. కాకతీయ చరిత్రకు సంబంధించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడి మాగల్లు శాసనంలో మొదటిసారి కాకతీయుల గురించి  ప్రస్తావన ఉంది.


మొదటి బేతరాజు(క్రీ.శ. 995 - 1052)
 ఇతడు కాకతీయుల్లో తొలి పాలకుడు. ఈ విషయం మనకు కాజీపేట, బయ్యారం శాసనాల ద్వారా తెలుస్తుంది. బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని (కరీంనగర్‌ జిల్లా) యుద్ధమల్ల జినాలయాన్ని పునరుద్ధరించి, అక్కడ శనిగరం శాసనం వేయించాడు. బేతరాజుకు ‘కాకతి పురాధినాథ’ అనే బిరుదు ఉండేది.


రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 57) 
ఇతడు తొలి కాకతీయుల్లో ముఖ్యమైనవాడు. ఇతడి రాజకీయ విజయాలను హనుమకొండ శాసనం వివరిస్తుంది. ఓరుగల్లును శత్రు దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించడానికి రెండో ప్రోలరాజు పునాదులు వేశాడని చింతలూరి తామ్ర శాసనం తెలియజేస్తోంది.


గణపతిదేవుడు (క్రీ.శ. 1199 - 1262)
గణపతిదేవుడు కాకతీయ పాలకుల్లో గొప్పవాడు. ఇతడి రాజ్యం తమిళనాడులోని ఉన్న కంచి వరకు విస్తరించింది. ఇతడు దీర్ఘకాలం (63 సంవత్సరాలు) పాలించాడు. గణపతిదేవుడు దివిసీమ పాలకుడైన పిన్నచోడి కుమార్తెలైన నారమ, పేరమలను వివాహం చేసుకుని, వారి సోదరుడైన జాయపను తన సైన్యంలో గజసాహిణిగా నియమించాడు. గణపతిదేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ, మోటుపల్లి అభయ శాసనం (క్రీ.శ.1244లో) వేయించాడు. ఇతడు 1254లో తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు  మార్చాడు. గణపతిదేవుడికి ‘ఆంధ్రాధీశుడు’, ‘సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య’, ‘మహామండలేశ్వర’, ‘పృథ్వీశ్వర’ లాంటి బిరుదులు ఉండేవి. 


రుద్రమదేవి (క్రీ.శ. 1262 - 89)
రుద్రమదేవి గణపతిదేవుడి కుమారై. ఈమె రుద్రదేవ మహారాజు పేరిట సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె తెలంగాణను పాలించిన మొదటి స్త్రీ పాలకురాలు. దేవగిరిని పాలించే యాదవ వంశరాజైన మహాదేవుడు ఓరుగల్లుపై దండెత్తి రాగా, రుద్రమదేవి అతడిని ఓడించి, దేవగిరి వరకు తరిమింది. 
ఈమె కాయస్త అంబదేవుడితో జరిగిన యుద్ధంలో మరణించినట్లు చందుపట్ల శానసం తెలియజేస్తుంది. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమె పాలనా కాలంలో వెనిస్‌ (ఇటలీ) యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని, మోటుపల్లి ఓడరేవును దర్శించాడు.


ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323)
ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు, కాకతీయుల్లో చివరి పాలకుడు. ఇతడు రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన గ్రామాలను నిర్మించాడు. అడవులను పంట పొలాలుగా మార్చి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఇతడి కాలంలో ఢిల్లీ సుల్తాన్‌లు కాకతీయ రాజ్యంపై ఎనిమిదిసార్లు దండయాత్ర చేశారు. ఎనిమిదో దండయాత్రలో (1323) జునాఖాన్‌ (మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌) ప్రతాపరుద్రుడిని ఓడించి, ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు. అయితే మార్గమధ్యంలోనే నర్మదా నది (సోమోద్భవ) తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ముసునూరి ప్రోలయ నాయకుడి విలస శాసనం, అనితల్లి వేయించిన కలువచేరు తామ్ర శాసనం తెలుపుతున్నాయి. దీంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఢిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. ఇతడు తెలంగాణ మొత్తాన్ని ఆక్రమించి అక్కడ రాజప్రతినిధిని నియమించి తన పరిపాలనను ప్రారంభించాడు.


రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 96)
ఇతడు రెండో ప్రోలరాజు కుమారుడు. హనుమకొండ శాసనం రుద్రదేవుడి ఘన విజయాలను పేర్కొంటుంది.  రుద్రదేవుడు ‘వినయ విభూషణుడు’ అని ద్రాక్షారామ శాసనం తెలియజేస్తుంది. రుద్రదేవుడు సంస్కృత భాషలో ‘నీతిసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉండేది. క్రీ.శ.1163లో హనుమకొండలో రుద్రేశ్వరాలయం (వేయి స్తంభాల గుడి) అనే త్రికూటాలయాన్ని నిర్మించాడు. రుద్రేశ్వర దేవాలయ పోషణకు మద్దిచెరువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. దేవగిరి యాదవ రాజైన జైతుగితో (జైత్రపాలుడు) జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌