• facebook
  • whatsapp
  • telegram

బాలకార్మికులు

ప‌సిప్రాయంపై ప‌నిభారం

  లేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయసు ప్రమాదకర పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తోంది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. బట్టీల్లో బండ చాకిరికి బలైపోతోంది. చదువు లేదు. ఆటలు లేవు. సరైన పోషకాహారం అందదు. పిల్లలు శ్రామిక యంత్రాలుగా మారిపోయిన సామాజిక దురవస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉంది.  అందులోనూ మన దేశంలో మరీ తీవ్రమైన పరిస్థితి. ఇందుకు కారణాలు, ఏయే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బాలలు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు? వీరి విముక్తికి ప్రభుత్వాలు, సామాజిక సేవా కార్యకర్తలు చేస్తున్న కృషి గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

  పుట్టుక నుంచి కౌమారం వరకు బాల్యం. బంగారు భవిష్యత్తుకు పునాది పడే దశ. ఈనాటి బాలలే రేపటి భారత నిర్మాణ సారథులు. అలాంటి వారిని చదువులకు, ఆటలకు దూరం చేసి శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాలకార్మిక వ్యవస్థ అంటారు. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు.  ఈ వ్యవస్థను వివిధ సంస్థలు, ప్రభుత్వాలు పలు రకాలుగా నిర్వచించాయి.

 

నిర్వచనాలు

* 1989లో ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా 18 ఏళ్ల లోపు పనిచేసే వారిని బాలకార్మికులుగా పేర్కొంది.

* భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పనిచేసే పిల్లలను బాలకార్మికులుగా వ్యవహరిస్తారు.

* అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 15 ఏళ్ల లోపు వయసుండి, పనిచేస్తున్న బాలబాలికలంతా బాలకార్మికులే.

* 1971 భారత ప్రభుత్వ జనాభా గణన ప్రకారం 15 ఏళ్ల లోపు పనిచేస్తున్న బాలలంతా బాలకార్మికులే.

 

యూనిసెఫ్‌ ప్రకారం: 5 - 11 సంవత్సరాల మధ్య వయసున్న వారు వారంలో కనీసం ఒక ఆర్థిక కార్యకలాపంలో పాల్గొన్నా లేదా 24 గంటలు ఇంటిపనుల్లో, 12-14 గంటల పాటు ఆర్థిక కార్యకలాపాల్లో, 42 గంటలు గృహకృత్యాల్లో పాల్గొంటే వారిని బాలకార్మికులుగా గుర్తించింది.

ముఖ్యమైన సంవత్సరం తేదీలు
* అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979
* ప్రపంచ బాలల దినోత్సవం జూన్‌ 1
* ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్‌ 12
* అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం  నవంబరు 20
* భారత్‌లో బాలల హక్కుల దినోత్సవం నవంబరు 14
* బాలల సంరక్షణ దినోత్సవం నవంబరు 7

అత్యధికం ఇక్కడే: ప్రపంచంలోనే అత్యధిక బాలకార్మికులు ఉన్న దేశం భారత్‌ అని యూనిసెఫ్‌ తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం బాలకార్మికుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది. దేశంలో 6 - 14 ఏళ్ల వయసున్న పిల్లలు 18.5 కోట్లు. వీరిలో 5.5 కోట్ల మందికి చదువు లేదు. దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో 7.5 కోట్ల మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

 

దేశంలో బాలకార్మిక వ్యవస్థ

  భారత ప్రభుత్వం మొదటిసారిగా పిల్లల సంరక్షణ కోసం బాలల హక్కుల అంతర్జాతీయ పత్రాన్ని అనుసరించి 1974, ఆగస్టులో ఒక జాతీయ సిద్ధాంతాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఒ (జాతీయ నమూనా సర్వే 2004-2005) సంవత్సరంలో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 90 లక్షల మంది బాలకార్మికులున్నారు. దీని ప్రకారం అత్యధికంగా బాలకార్మికులున్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (22.8%), మహారాష్ట్ర (13.2%).

* 2009-10 ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఒ ప్రకారం 5 - 14 ఏళ్లలోపు వయసున్న బాలకార్మికుల సంఖ్య 49.83 లక్షలు. ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా బాలకార్మికులున్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్‌ (35.62%), రాజస్థాన్‌ (8.14%), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (4.7%).

* యూనిసెఫ్, ప్రణాళికా సంఘం ప్రకారం 43% మంది బాలబాలికలు 8వ తరగతిలోపే బడి మానేస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫ్రీ ట్రేడ్‌ యూనియన్‌ సర్వే ప్రకారం భారత్‌లో 6 కోట్ల మంది బాలకార్మికులున్నారు. దేశంలో అత్యధిక బాలకార్మికులున్న ప్రాంతం శివకాశి (తమిళనాడు). అత్యధిక బాలకార్మికులున్న నగరం ముంబయి.

* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో బాలకార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (8,96,301), మహారాష్ట్ర (4,96,916). అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు సిక్కిం (2704), మిజోరం (2793). బాలకార్మికులు అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ (26,473), చండీగఢ్‌ (3135). అత్యల్పంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు డామన్‌ అండ్‌ డయ్యూ (774), లక్షద్వీప్‌ (28).

 

కారణాలు: 

* పేదరికం 

* నిరుద్యోగం/తక్కువ ఆదాయం 

* నిరక్షరాస్యత - అజ్ఞానం 

* అతితక్కువ జీవనప్రమాణం 

* సామాజిక వెనుకబాటుతనం

* సామాజిక ఆర్థిక కారణాలు

  బాలకార్మికులు ఎక్కువగా క్వారీలు, తివాచీ పరిశ్రమ, వ్యవసాయం, గ్లాస్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కేరళలో అక్షరాస్యత రేటు పెరగడంతో బాలకార్మికుల సంఖ్య తగ్గిందని అంచనా. కానీ మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు అక్షరాస్యతలో పురోగతి సాధించినప్పటికీ బాలకార్మికులు ఎక్కువగానే ఉన్నారు. అక్షరాస్యత తక్కువ ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో చిన్నారి శ్రామికుల సంఖ్య అధికంగా ఉంది. అక్షరాస్యతకు, బాలకార్మికులకు మధ్య ఎలాంటి సంబంధం లేదనే విశ్లేషణలూ ఉన్నాయి.

 

ఏయే వృత్తుల్లో?

 ప్రధానంగా కొన్ని రకాల వృత్తుల్లో బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారని అంచనా వేశారు. 

 

అగ్గిపెట్టెలు, టపాసు పరిశ్రమ: దాదాపు 50 వేల మంది పిల్లలు (3.5 సంవత్సరాలు మొదలు 15 సంవత్సరాల్లోపు వారు) తమిళనాడులోని శివకాశి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని అంచనా. వీరు రోజులో 12 గంటలు చీకటి గదుల్లోనూ ఉంటూ పొటాషియం క్లోరైడ్, ఫాస్ఫరస్, జింక్‌ ఆక్సైడ్‌ లాంటి విషపూరిత రసాయనాల మధ్య పనులు చేస్తుంటారు.

 

గనులు, క్వారీలు: దాదాపు 20 వేల మంది (మేఘాలయ, మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్, ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం, కేరళలోని పలకల పరిశ్రమల్లో) పనిచేస్తున్నారు.

 

చేపల పరిశ్రమ: కేరళలోని క్విరాన్, కొచ్చి; తమిళనాడులోని కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో 35 వేల మంది పనిచేస్తున్నారు. సాధారణంగా చేపల లోడింగ్, ఆన్‌లోడింగ్‌లలో బాలురు: చేపలు శుభ్రపరిచే పనిలో బాలికలు ఉంటారు.

 

బీడీ పరిశ్రమ: తిరుచునాపల్లి, త్రిసూర్‌లో దాదాపు 7 వేల మంది పిల్లలున్నారు.

 

తాళం బుర్రల పరిశ్రమ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అలీగఢ్‌లోని తాళం బుర్రల పరిశ్రమలో దాదాపు 10 వేల మంది బాలకార్మికులున్నారు.

 

చేనేత పరిశ్రమ: కాంచీపురం, తిరువనంతపురంలో సుమారు 10 వేల మంది బాలకార్మికులు పనిచేస్తున్నారు. వెలుతురు, గాలి చొరబడని స్థలాల్లో పనిచేయడం వల్ల కంటి వ్యాధులకు గురవుతున్నారు.

 

తివాచీ పరిశ్రమ: జమ్మూ-కశ్మీర్‌లో 12 వేల మంది బాలకార్మికులు పనిచేస్తున్నారు.

 

సుప్రీంకోర్టు తీర్పులో గుర్తించిన బాలకార్మికులున్న పరిశ్రమలు: 

* గాజు పరిశ్రమ - ఫిరోజాబాద్‌ (యూపీ)

* వజ్రాలు మెరుగుపట్టే పరిశ్రమ- సూరత్‌ (గుజరాత్‌)

* తాళంబుర్రల పరిశ్రమ - అలీగఢ్‌ (యూపీ)

* అగ్గిపెట్టెల పరిశ్రమ - శివకాశి (తమిళనాడు)

* బలపం తయారీ పరిశ్రమ- మంద్‌సౌర్‌ (మధ్యప్రదేశ్‌)

* ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమ - మొరాదాబాద్‌ (యూపీ)

* తివాచీ, చేతివృత్తుల పరిశ్రమ - మీర్జాపూర్‌ బదోమ్‌ (యూపీ)

 

వీధి బాలలు

  భారత్‌లోని వివిధ నగరాల్లో వీధుల్లో పనులు చేస్తూ, వీధుల్లోనే నివసించే బాలలు వేల సంఖ్యలో ఉన్నారు. చెన్నైలో నిర్వహించిన ఒక సర్వేలో వీధిబాలల్లో 90% మంది తమ తల్లిదండ్రులతో కలిసి ఫుట్‌పాత్‌లపైనే నివసిస్తున్నారు. ఈ నగరంలోని వీధి బాలల్లో అత్యధికులు (22 శాతం) కూలీలుగా పనిచేస్తున్నారని తేలింది. దేశం మొత్తంమీద వీధిబాలల్లో 10.4% మంది హోటళ్లు, 9.6% మంది చెత్తసేకరణలో, 8% రిక్షా లాగుతూ, 7.1% పూలు అమ్ముతూ జీవిస్తున్నారు. వీరిలో 0.3% మంది వ్యభిచారంలోనూ ఉన్నారు. రోజుకు 10-12 గంటల పాటు పనిచేసినా, కడుపు నిండా తినడానికి ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. 

  బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం పేదరికం. రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12లో దేశంలో 29.5 శాతం జనాభా పేదరికంలో ఉంది. ప్రతి 10 మందిలో ముగ్గురు పేదలే. పెద్దలు పనిచేస్తున్నా కనీస అవసరాలు గడవని పరిస్థితితో ఆయా కుటుంబాల్లోని పసిపిల్లలు శ్రామికులుగా మారుతున్నారు. 2011-12 ప్రణాళికా సంఘం ప్రకారం 27 కోట్ల మంది (21.9%) ప్రజలు పేదరికంలో ఉన్నారు. పేదల సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ (5.98 కోట్లు), బిహార్‌ (3.58 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

 

వివిధ చట్టాలు

* ఫ్యాక్టరీల చట్టం - 1948

* తేయాకు తోటల కార్మికుల చట్టం - 1957

* గనుల చట్టం - 1952 

* హిందూ అడాప్షన్, మెయింటెన్స్‌ చట్టం - 1961

* బాలకార్మిక నిషేధ చట్టం - 1986 

* బాలన్యాయ చట్టం - 1986

* బాలల హక్కుల పరిరక్షణ చట్టం - 2005

* వెట్టిచాకిరి నివారణ చట్టం - 1976

 

ఆచరణాత్మక పరిష్కారాలు

* ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు. 

* బిడ్జ్‌ కోర్సు నిర్వహణ.

* అంగన్‌వాడీలు 

* ప్రాథమిక సదుపాయాల కల్పన 

* వృత్తి విద్య, శిక్షణ 

* పేదరికం, నిరక్షరాస్యత, పిల్లల వెట్టిచాకిరి మొదలైన సమస్యల గురించి సంపూర్ణ వివరాల సేకరణ. 

* బడిబయట పిల్లల సంఖ్యను కచ్చితంగా తేల్చే సమగ్ర సర్వేలు నిర్వహిండం.

* బాలకార్మిక నిషేధ చట్టంతో పాటు, విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటం.

 

అంతర్జాతీయ కృషి

  అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919 ప్రథమ సమావేశంలో 14 సంవత్సరాల్లోపు బాలబాలికలను పనిలో నియమించకూడదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటనలో బాలబాలికల విద్యాభివృద్ధి హక్కులు, మానసిక, శారీరక వికాస హక్కులను ప్రస్తావించింది. 1989 నవంబరు 20న బాలల హక్కుల ఒడంబడిక (చిల్డ్రన్‌ రైట్స్‌ కన్వెన్షన్‌ - సీఆర్‌సీ)ను ఐరాస ఆమోదించింది. భారత్‌ సహా 107 దేశాలు సీఆర్‌సీని ఆమోదించాయి. దీంతో 1990 సెప్టెంబరు 2 నుంచి ఇది అంతర్జాతీయ న్యాయంగా అమల్లోకి వచ్చింది. సీఆర్‌సీపై 1992, డిసెంబరు 11న భారత్‌ సంతకం చేసింది. 1995లో యూరో కామర్స్, యూరో కమిషన్‌లు బాలకార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులు కొనకూడదని షరతు విధించాయి. 1999లో అంతర్జాతీయ కార్మిక సంస్థ బాలకార్మికుల గురించి 182వ ఒడంబడికను ఆమోదించింది.

 

రకరకాల పథకాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి రకరకాల పథకాలను అమలు చేస్తున్నాయి. 

 

చైల్డ్‌ లైన్‌ ప్రాజెక్టు: బాలల అవసరాలు గుర్తించి వారి హక్కులను పరిరక్షిస్తారు.

 

ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌: బాలలు వివిధ రకాలైన దోపీడీలకు గురికాకుండా రక్షించేందుకు చర్యలు తీసుకుంటారు.

 

ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌: పోషకాహారం, ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుంది.

 

సాక్ష్యం: బాలురలో లింగపరమైన సున్నితత్వాన్ని, అలాగే నైతిక ప్రవర్తనను పెంపొందిస్తుంది.

 

సర్వశిక్షా అభియాన్‌: ప్రాథమిక విద్యను అందిస్తుంది.

 

సబల: కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం సరఫరా.

 

బాలికా సమృద్ధి యోజన: బాలికా విద్యను పోత్సహిస్తుంది.

 

బేటీ బచావో- బేటీ పడావో: బాలికా విద్య, పోషకాహారం, లింగ వివక్షకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

 

కార్యక్రమాలు-వ్యక్తులు

 

ఆపరేషన్‌ స్మైల్‌/ఆపరేషన్‌ ముస్కాన్‌: తప్పిపోయిన బాలబాలికలను రక్షించడానికి, బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకుపోయిన వారికి విముక్తి కల్పించడానికి  ఏర్పాటుచేసిన పథకం. దీనిలో 19 వేల మందిని రక్షించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. అత్యధికంగా హరియాణాలో 5,366, మధ్యప్రదేశ్‌లో 4,350, తెలంగాణలో 485 మంది రక్షించినట్లు పేర్కొన్నారు.

 

ఆపరేషన్‌ మిలాప్‌ (2014 డిసెంబరు): తప్పిపోయిన, బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకుపోయిన పిల్లల్ని రక్షించడానికి దిల్లీ పోలీసులు చేపట్టిన కార్యక్రమం. 7 నెలల్లో 300 మందిని కాపాడారు.

 

కైలాష్‌ సత్యార్థి - బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ - 1980) : బాల్యాన్ని రక్షించండి అంటూ సాగిన ఈ ఉద్యమ స్థాపకుడు కైలాష్‌ సత్యార్థి. వెట్టిచాకిరి నిర్మూలన, మానవ అక్రమ రవాణా, విద్యాహక్కులకై పోరాటం చేశాడు. 1990 నుంచి ఇప్పటివరకు 80 వేల మందిని కాపాడాడు. 1998లో ప్రపంచంలోనే అతిపెద్ద పౌర అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశాడు. ఇతడి సేవలకు 2014లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. 2015 అక్టోబరు 16న హార్వర్డ్‌ యూనివర్సిటీ ‘హ్యుమానిటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌ అందజేసింది. ప్రస్తుతం ‘గ్లోబల్‌ మార్చ్‌ ఎగైనెస్ట్‌ చైల్డ్‌ లేబర్‌’ సంస్థకు ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు.

 

ప్రొఫెసర్‌ శాంతాసిన్హా- ఎమ్‌.వి పౌండేషన్‌: ఏపీలోని నెల్లూరుకు చెందిన శాంతాసిన్హా.. బాలల హక్కుల సాధన కోసం 1981లో మామిడిపూడి వెంకటరంగయ్య (ఎమ్‌.వి.) ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆమె సేవలకు 1998లో పద్మశ్రీ, 2003లో రామన్‌ మెగసెసే అవార్డులు వచ్చాయి. 2007లో బాలల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

 

మలాలా యాసఫ్‌జాయ్‌: పాకిస్థాన్‌లోని మింగోరాలో 1997 జులై 12న జన్మించిన మలాలా ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తోంది. 2012 అక్టోబరు 9న తాలిబన్ల తుపాకీ కాల్పులకు గురైంది. ఛాందసవాదుల బెదిరింపులకు వెరవకుండా మహిళలు, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా టైమ్‌ మేగజీన్‌ ప్రకటించిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో ఒకరిగా నిలిచారు. 2013లో ఐరాసలో ప్రసంగించారు. 2014లో నోబెల్‌ శాంతి పురస్కారం ఆమెను వరించింది.

 

ప్రథమ్‌ (1995): పాఠశాల పిల్లల కోసం ఏర్పాటుచేసిన అతి పెద్ద సంస్థ. ప్రథమ్‌ తరఫున డాక్టర్‌ జున్నెడ్‌ఖాన్‌ 2005 నవంబరు 21న దిల్లీ మురికివాడల్లోని కుట్టుపని కేంద్రాల్లో పనిచేస్తున్న 4800 మందిని కాపాడారు.

 

గురుపాదస్వామి కమిషన్‌ (1979): భారత్‌లో బాలకార్మిక వ్యవస్థపై ఏర్పాటైన కమిషన్‌. దీని నివేదిక ఆధారంగా బాలకార్మిక నిషేధ చట్టం (1986) అమల్లోకి వచ్చింది.

 

ధనలక్ష్మి పథకం (2008 - 09): బాలికల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన పథకం.

 

నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ) 1988: ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుచేసి, మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి నెలా స్టైపెండ్‌ అందించే కార్యక్రమం.

 

బాలకిరణాలు: 8-10 తరగతుల విద్యార్థులకు ఉపాధి కోర్సులు నేర్పించే పథకం.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి


 

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌