• facebook
  • whatsapp
  • telegram

వర్ణం - కులం

కులం... సజాతి సమూహం!

 కులం అసమానతలకు బలమైన సామాజిక మంత్రం. ఆధునిక యుగంలోనూ అది కొనసాగుతూనే ఉంది. ఎన్నోరకాల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిణామాలకు, పరిస్థితులకు ప్రాతిపదికగా మారింది. అసలు ఈ కులం అంటే ఏమిటి? ఎలా రూపుదిద్దుకుంది? దీని వెనుక ఉన్న సిద్ధాంతాలు, భావనలు, నిర్వచనాలు, ప్రభావాలు ఏవిధంగా ఉన్నాయి? ఈ అంశాలపై అభ్యర్థులు కనీస అవగాహన పెంపొందించుకోవాలి. 

కులం భారతీయ సామాజిక స్తరీకరణలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వహిస్తుంది. భారతీయుల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో మౌలికమైన పాత్రను పోషిస్తుంది. భారతీయ సమాజంపై కుల వ్యవస్థ ప్రభావాన్ని చూపుతుంది.
వర్ణం - భావన: సాధారణ వాడుకలో వర్ణ అంటే హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభాగాలు. పి.ఎన్‌.ప్రభు అనే సామాజికవేత్త వర్ణం అనే పదాన్ని ఉపయోగించే వారికి దాని గురించి సంపూర్ణ జ్ఞానం లేదని పేర్కొన్నారు. ఆర్యులు, దస్యులకు శరీర ఛాయల్లో ఉండే భేదాల కారణంగా రెండు వర్ణాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. వర్ణం అంటే రంగు అని అర్థం. హిందూ సమాజంలో ఈ అర్థంతోనే వర్ణ విభజన జరిగినట్లు తెలుస్తుంది. కొంతకాలం తర్వాత ‘శతపథ బ్రాహ్మణం’లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి చర్చించారు. ఈ నాలుగు రకాల వర్ణ విభజనకు కూడా శరీర ఛాయ కారణమని భావిస్తున్నారు. 
* తెలుపు రంగు శరీర ఛాయ - బ్రాహ్మణులు  
* ఎరుపు రంగు శరీర ఛాయ - క్షత్రియులు 
* పసుపు రంగు శరీర ఛాయ - వైశ్యులు  
* నలుపు రంగు శరీర ఛాయ - శూద్రులు  
కాలక్రమేణా మనుషుల విభజన శరీర ఛాయను బట్టి కాదని, పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడని, అతడు సముపార్జించుకునే గుణాల ఆధారంగా ఆ వ్యక్తి ఈ నాలుగు వర్ణాల్లో ఏదో ఒకదానికి చెందుతాడని హిందూ శాస్త్రకారులు వివరించారు. 
భగవద్గీతలో సత్యగుణాలు కలవారు బ్రాహ్మణులు, సత్య - రజోగుణాలు ఉన్నవారు క్షత్రియులు, రజో - తామస గుణాలు కలవారు వైశ్యులు, తామస గుణాలు కలవారు శూద్రులని పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం వర్ణం అనేది వ్యక్తి సాధించుకునే స్వేచ్ఛా వ్యవస్థ అని అర్థం అవుతుంది. కానీ మనుధర్మశాస్త్రంలో ఈ నాలుగు వర్ణాలు బ్రహ్మ అంగాల నుంచి ఉద్భవించాయని వివరిస్తూ వర్ణం పుట్టుక వల్ల వచ్చేదని సమర్థించారు.  
బ్రాహ్మణులు - బ్రహ్మ తల నుంచి జన్మిస్తారు. వీరికి 8 లేదా 12 ఏళ్ల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు.  
క్షత్రియులు - బ్రహ్మ భుజాల నుంచి జన్మిస్తారు. వీరికి 10 లేదా 14 ఏళ్ల వయసులో ఉపనయనం చేస్తారు. 
వైశ్యులు - బ్రహ్మ తొడ భాగం నుంచి జన్మిస్తారు. వీరికి 12 లేదా 16 ఏళ్ల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు. 
శూద్రులు - బ్రహ్మ పాదం నుంచి జన్మిస్తారు. వీరికి ఎలాంటి ఉపనయనం ఉండదు. 
(చాతుర్‌ వర్ణ వ్యవస్థను పురుషసూక్త శ్లోకంలో పైవిధంగా చెప్పారు)

సిద్ధాంతాలు  

వర్ణం లేదా కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలిపే వివిధ సిద్ధాంతాలు   
దైవదత్త సిద్ధాంతం: పురుషసూక్తం, భగవద్గీత లాంటి హిందూ మత గ్రంథాల ఆధారంగా చాతుర్‌ వర్ణాలు, వాటికి అనుగుణమైన కుల వ్యవస్థ భగవత్‌ నిర్మితాలని దైవదత్త సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం ఏర్పడటానికి ప్రధాన కారణం వేదాలు.
వృత్తి సిద్ధాంతం: దీన్ని నెస్‌ఫీల్డ్‌ ప్రతిపాదించగా ఇబ్బెస్టన్‌ బలపరిచారు. ప్రజలు ఆచరించే వృత్తులు కులానికి మూలం అని, జాతి, మతం కారణం కాదని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. వృత్తి సంఘాలు కుల వ్యవస్థ నిర్మాణానికి దారితీశాయని పేర్కొంటుంది. 
జాతి సిద్ధాతం: దీన్ని ప్రతిపాదించినవారు హెర్బర్ట్‌ రిస్లీ. వ్యక్తుల శారీరక లక్షణాలు పొట్టి, పొడవు, శరీర ఛాయ, ముక్కు ఆకారం, కళ్లు  లాంటి వాటిపై ఆధారపడి సమాజంలోని వ్యక్తులు వివిధ సమూహాలుగా ఏర్పడ్డారు. ఆ సమూహాలే కాలక్రమేణా కులాలుగా రూపొందాయని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది.  
సంస్కార సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఎ.ఎం.హోకర్ట్, సెనార్ట్‌. భారతదేశం మత సంస్కారాలకు కేంద్రం. మంత్రాలు చదవడం, ప్రదేశాన్ని శుభ్రం చేయడం, అలంకరించడం, మేళతాళాలు లాంటి వాటి ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. 
భౌగోళిక సిద్ధాంతం: దీన్ని గిల్బర్ట్‌ ప్రతిపాదించారు. దేశ భౌగోళిక అంశాలైన శీతోష్ణస్థితి, సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, పర్వత ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడి వివిధ వృత్తులను అవలంబిస్తారు.  
జాతి - వృత్తి సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు పి.ఎఫ్‌.స్లేటర్‌. ఈయన ప్రకారం దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థ ఉత్తర భారతదేశంలో కంటే బలంగా ఉంది. కాబట్టి ఆర్యులు రాకముందే భారత్‌లో కుల వ్యవస్థ వృత్తుల విభజనకు దారితీసింది. 
మను సిద్ధాంతం: దీన్ని ప్రతిపాదించినవారు హటన్‌. మానవాతీత శక్తులపై నమ్మకం వల్ల కుల వ్యవస్థ ఏర్పడిందని ఇతడి అభిప్రాయం. 

ప్రస్తుత భారతదేశంలో కుల వ్యవస్థ 

స్వాతంత్య్రానంతరం భారతీయ సామాజిక వ్యవస్థలో వివిధ కారణాల వల్ల అనేక పరివర్తనలు వచ్చాయి. అందులో భాగంగా కుల వ్యవస్థలో మార్పులు  రావడానికి కింది పరిస్థితులు దోహదం చేశాయి. 
* సాంఘిక సంస్కర్తల కృషి ఫలితంగా భారత ప్రభుత్వం అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేసింది. పర్యవసానంగా భారతీయ సమాజంలో అంటరానితనం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. విద్యాభివృద్ధి కారణంగా ఈ విషయంలో ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. 
* ఆధునిక విద్యా విధానం కూడా కుల వ్యవస్థను సమర్థించడం లేదు.
* పారిశ్రామికీకరణ వల్ల అనేక కొత్త వృత్తులు ఉద్భవించాయి. నగరీకరణ వల్ల బస్సులు, హోటళ్లు, ఆఫీసుల్లో కుల నిబంధనలు పాటించడానికి వీలు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. 
* కొత్త చట్టాలు కూడా కుల వ్యవస్థ లక్షణాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. 
ఉదా:  ప్రత్యేక వివాహ చట్టం కులాంతర వివాహాలను న్యాయబద్ధంగా సమర్థించింది. 
* కులాన్ని హిందూ మత ఉక్కు కవచం అని ఎ.ఆర్‌.దేశాయ్‌ అనే సామాజికవేత్త పేర్కొన్నారు. 
* జి.ఎస్‌.షుర్యే కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తే కులాన్ని నిర్మూలించవచ్చు అని పేర్కొన్నారు. 
* ఈనాటికి కూడా హరిజనులు గ్రామాల్లో సమాన హోదా పొందడం లేదు. 

కులం - భావన 

కులం (caste) అనే పదం స్పానిష్‌ భాషలోని కాస్టా (casta) అనే పదం నుంచి వచ్చింది. కాస్టా అంటే జాతి, వ్యవస్థ, వారసత్వ లక్షణాల సముదాయం అని అర్థం. కులం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించినవారు పోర్చుగీసుకు చెందిన గ్యార్సియా డీ ఓర్టా (1563). భారత్‌లో కులం అనే పదాన్ని పోర్చుగీసువారు ఉపయోగించారు. Caste అనే పదం కాస్టస్‌ (castus) అనే లాటిన్‌ భాషా పదం నుంచి ఏర్పడి ఉండవచ్చని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం. కాస్టస్‌ అంటే పరిశుద్ధం అని అర్థం.

లక్షణాలు  

* పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది - వ్యక్తి అంతస్తు, వృత్తి, విద్య, ఆస్తి లాంటి వాటిలో అనేక మార్పులు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి కులం, అంతస్తు మాత్రం మారవు. 
* కులం అంతర్వివాహ సమూహం - ఏ కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి చెందిన వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కులానికి అతి ముఖ్యమైన లక్షణం ఇదే అని వెస్టర్‌ మార్క్‌ అభిప్రాయపడ్డారు. 
* కుల వృత్తిని పాటించడం - సర్వసాధారణంగా ప్రతి కులానికి ఏదో ఒక వృత్తి కేటాంయింపు ఉంటుంది. కుటుంబంలో చిన్నతనం నుంచే ఆ వృత్తికి సంబంధించిన శిక్షణ ఇస్తారు. 
* ఆహారపు అలవాట్లకు సంబంధించిన నిబంధనలు - కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కులాల వారు తీసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా తన కులస్థులతో మాత్రమే సహపంక్తి భోజనం చేయాలి. వండిన ఆహార పదార్థాలను తన కంటే తక్కువ కులస్థుల వారి నుంచి స్వీకరించకూడదు.
* కుల పంచాయితీలు - కుల సంబంధమైన నిబంధనలు పరిశీలించడానికి, కులస్థుల మధ్య తగాదాలు తీర్చడానికి, వారి అవసరాలను పరిరక్షించడానికి కుల పంచాయితీలు సహాయం చేస్తాయి. 
* సామాజిక సంబంధాల విషయంలో నిషేధం - కులాల మధ్య సంబంధాలను కఠినతరం చేశారు. ముఖ్యంగా కొన్ని కులాల వారిని అంటరానివారిగా భావిస్తారు.  

నిర్వచనాలు 

* ఒకే వారసత్వ వృత్తిని పాటించే, అంతర్‌ వివాహం మాత్రమే చేసుకునే, ఒకే పేరుతో చెలామణి అయ్యే కొన్ని కుటుంబాలు లేదా బంధు సమూహాల సమూహమే కులం అని హెచ్‌.హెచ్‌.రిస్లే పేర్కొన్నారు. 
* వారసత్వ లక్షణాల సముదాయమే కులం అని సి.హెచ్‌.కూలే పేర్కొన్నారు. 
* వారసత్వం, వివాహం, సంప్రదాయ వృత్తి సంబంధాలను కలిగి ఉండి స్థానిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అంతస్తును కలిగి ఉండే అంశమే కులం అని ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. 
* కులం ఒక బంధిత సమూహం అని డి.ఎన్‌.మజుందార్, టి.ఎన్‌.మదన్‌లు పేర్కొన్నారు.  
* కులాలు నిర్మితులు అని ఎఫ్‌.జి.బెయిరీ, ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. 
* కులం భారత్‌కే పరిమితమైన విశిష్ట అంశం అని హట్టన్‌ నిర్వచించారు.  
* కులం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని క్రోబర్, రిస్లీ పేర్కొన్నారు. ప్రాచీనకాలంలో ఈజిప్ట్, మధ్యయుగంలో యూరప్, ప్రస్తుతం యునైటైడ్‌ స్టేట్స్‌లో కూడా కులం అనే భావన కనిపిస్తుంది.  
* కులం అనేది ఒక సజాతి సమూహం అని బ్లంట్‌ అన్నారు.
* కాథలిన్‌ గఫ్‌ కులాలు జన్మ ద్వారా ఏర్పడిన సమూహాలని తెలిపారు.
* వంశపారంపర్యంగా వచ్చేదే కులం అని భోగ్‌ పేర్కొన్నారు. 

తిరుగుబాట్లు

*డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కుల నిర్మూలన కోసం ఎన్నో పోరాటాలు చేశారు.  
* రాజస్థాన్‌లోని గుజ్జర్లు తమను ఎస్టీలో చేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌లోని కాపులు తమను ఓబీసీలో చేర్చాలని, తెలంగాణలోని వాల్మీకులు/బోయ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తున్నారు.  
* యునిసెఫ్‌ ప్రకారం కుల వివక్ష ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ వివక్ష ఆసియా (భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్‌), ఆఫ్రికా ఖండాల్లో ప్రబలింది. 
* ఆచార్య ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ పంచవర్ష ప్రణాళికలు, ఓటుహక్కు, ఉచిత విద్య, వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు లాంటివి కులాన్ని నిర్మూలించడంలో తోడ్పడతాయని తెలిపారు. 

కులం - ప్రకార్యాలు 

వృత్తిని నిర్ణయిస్తుంది: హిందూ కుల వ్యవస్థలో ఒక్కో కులంలో పుట్టిన వారికి ఒక్కో వృత్తిని నిర్ణయించడం వల్ల ఆ వ్యక్తులు చిన్నతనం  నుంచి తమ కులవృత్తిలో నిమగ్నమై, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు.  
సాంఘిక భద్రత - నియంత్రణ: ఏ కుల సభ్యుడికైనా అన్యాయం జరిగితే నిస్సహాయుడైన అతడిని ఆ కులంలోని వారంతా ఆదరించి  భద్రత కల్పిస్తారు.  
శ్రమ విభజన: వివిధ కులాలకు రకరకాల వృత్తులను కేటాయించడం ద్వారా కుల వ్యవస్థ శ్రమ విభజన యంత్రంగా పనిచేస్తుంది. కుల విధుల నిర్వహణలో ఒక కులం వారు మరొక కులంతో సన్నిహిత సామరస్య భావాలతో పరస్పరం సహకరించుకునేవారు. 
మత పరిరక్షణ: కుల వ్యవస్థ అనేది హిందూ మతానికి మూలస్తంభం.
సంస్కృతి పరిరక్షణ: ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు, నమ్మకాలు ఉండటం వల్ల ప్రతి కులం ఒక ప్రత్యేక సాంస్కృతిక వర్గంగా రూపొంది సంస్కృతిని స్థిరంగా ఉంచే విధిని నిర్వహిస్తుంది. 

ప్రాబల్య కులం   

ప్రాబల్య కులం అనే భావన ఎమ్‌.ఎన్‌.శ్రీనివాస్‌ వివరించిన సంస్కృతీకరణ ప్రక్రియలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందింది. ఈయన ‘ది డామినెంట్‌ క్యాస్ట్‌ ఇన్‌ రాంపుర’ అనే పుస్తకంలో ప్రాబల్య కుల లక్షణాలను పేర్కొన్నారు. అవి 
* ఒకే కులానికి చెందినవారు. 
* అధిక సంఖ్యాకులుగా ఉండటం. 
* స్థానిక కుల క్రమశ్రేణిలో ఉన్నత స్థానాన్ని కలిగి ఉండటం.
* పాశ్చాత్య విద్యను కలిగి ఉండటం.
* పరిపాలనా రంగంలో ఉద్యోగాలు చేస్తుండటం.

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

Posted Date : 27-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌