• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ వివరణ

భారతీయుడు ఎప్పటికీ  భారతీయుడే!

 


ఒక వ్యక్తిని దేశ పౌరుడిగా చట్టబద్ధంగా గుర్తించడాన్నే పౌరసత్వం అంటారు. ఆధునిక రాజ్యాల అవతరణలో పౌరసత్వ భావనకు ప్రాధాన్యం పెరిగింది. పౌరసత్వం ఉన్నవారు దేశంలోని అన్నిరకాలైన హక్కులు, పదవులు పొందేందుకు అర్హులవుతారు. భారత రాజ్యాంగంలో వివరించిన పౌరసత్వ నిబంధనలు, పార్లమెంటు రూపొందించిన పౌరసత్వ చట్టాలు, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు, కోల్పోయే సందర్భాలపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి. 

మొదటిసారిగా పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినవారు గ్రీకులు.  పరిపాలించేందుకు, పరిపాలనలో భాగమయ్యేందుకు అర్హత ఉన్నవారే పౌరులు. ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. రాజకీయ హక్కులు ఉండే వారిని పౌరులు అంటారు. రాజకీయ హక్కులు అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి. పౌరులకు దేశంలో సంపూర్ణ పౌర స్థాయి ఉంటేనే, ఆ దేశంలో కల్పించే అన్ని రకాల హక్కులు పొందేందుకు అర్హత ఉంటుంది. దేశంలో ఉండే విదేశీయులకు ఆ విధమైన రాజకీయ హక్కులు లభించవు.

భారత రాజ్యాంగంలోని రెండో భాగంలో ఆర్టికల్‌ 5 నుంచి 11 మధ్య పౌరసత్వం గురించి పేర్కొన్నారు. పౌరసత్వం అంశం కేంద్ర జాబితాలో ఉంది. దేశం పరిపాలనాపరమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు పౌరులందరికీ ఏక పౌరసత్వాన్ని నిర్దేశించారు. దీనిప్రకారం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులందరికీ ఏక పౌరసత్వం (భారత పౌరసత్వం) ఉంటుంది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఏక పౌరసత్వ భావనను బ్రిటన్‌ నుంచి గ్రహించారు.

ఆర్టికల్‌ 5: భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత పౌరులుగా ఎవరిని పరిగణిస్తారనే అంశాన్ని వివరించింది. ] 1950, జనవరి 26 కంటే ముందు భారత్‌లో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతిఒక్కరికి భారత పౌరసత్వం లభిస్తుంది. ] 1950, జనవరి 26 కంటే ముందు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ అతడి తల్లి/తండ్రికి అప్పటికే భారత పౌరసత్వం ఉంటే అలాంటి వ్యక్తికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. (1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రులిద్దరికీ భారత పౌరసత్వం ఉండాలి) ] 1950, జనవరి 26 కంటే ముందు ఒక వ్యక్తి భారత్‌లో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసిగా ఉంటే ఆ వ్యక్తికి భారత పౌరసత్వం లభిస్తుంది.

ఆర్టికల్‌ 6: దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారి పౌరసత్వాన్ని గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. దీనిప్రకారం 1948, జులై 19 నాటికి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చి సంబంధిత కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ విధంగా పౌరసత్వం పొందేవారు ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ప్రకారం భారత పౌరులుగా నమోదై ఉండాలి.

ఆర్టికల్‌ 7: ‘1947, మార్చి 1 తర్వాత భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ ఉండలేక 1948, జులై 19 నాటికి తిరిగి వచ్చిన వారి పౌరసత్వం’ గురించి వివరిస్తుంది. ఆ విధంగా భారత్‌కు తిరిగి వచ్చినవారు సంబంధిత కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని, భారతదేశంలో కనీసం ఆరు నెలల పాటు స్థిర నివాసం ఉంటే భారత పౌరసత్వాన్ని పొందొచ్చు. 


ఆర్టికల్‌ 8: భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, వారికి విదేశాల్లో కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పించవచ్చు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ సంతానం పేర్లను ఒక సంవత్సరంలోగా రాయబార కార్యాలయంలో నమోదు చేయించాలి.

ఆర్టికల్‌ 9: భారత పౌరులకు ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఎవరైనా భారత పౌరులు విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.


ఆర్టికల్‌ 10: భారత పౌరసత్వానికి  శాశ్వతత్వం ఉంటుంది. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడుగానే కొనసాగుతాడు.


ఆర్టికల్‌ 11: భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై సమగ్ర వివరణ లేదు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు, దాన్ని పొందే పద్ధతులు, కోల్పోయే సందర్భాలపై చట్టాలు రూపొందించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకే వదిలిపెట్టారు.


భారత  పౌరసత్వ చట్టం-1955

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 11 ప్రకారం పార్లమెంటు 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. కొన్ని నియమాల ఆధారంగా ఈ చట్టం రూపొందింది. అవి- 1) జన్మస్థలం ఆధారంగా పౌరసత్వం 2) రక్త సంబంధం/వారసత్వం ఆధారంగా పౌరసత్వం ఈ చట్టం ప్రకారం ఐదు పద్ధతుల్లో భారత పౌరసత్వం పొందొచ్చు.

1) జన్మతః పౌరసత్వం: 1950, జనవరి 26 తర్వాత భారతదేశంలో జన్మించిన, స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారంతా భారత పౌరసత్వాన్ని పొందుతారు. తర్వాత కాలంలో కొన్ని మార్పులు చేర్పులు  జరిగాయి. నీ 1950, జనవరి 26 నుంచి 1987, జూన్‌ 30 మధ్య భారత దేశంలో జన్మించిన వ్యక్తి అతడి తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేకుండా భారత పౌరుడు అవుతాడు. నీ 1987, జులై 1న గాని, ఆ తర్వాత గాని భారత్‌లో జన్మించిన వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరికి భారత పౌరసత్వం ఉంటే ఆ వ్యక్తి కూడా భారత పౌరుడవుతాడు.

పరిమితులు: మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయ ఉద్యోగులకు జన్మించిన పిల్లలు, మన దేశానికి విహార యాత్ర కోసం వచ్చిన విదేశీ దంపతులకు జన్మించిన పిల్లలు, మనదేశంలో ఉన్న శత్రుదేశాల దంపతులకు జన్మించిన పిల్లలు భారత పౌరసత్వానికి అర్హులు కారు.

2) వారసత్వ రీత్యా పౌరసత్వం: 1950, జనవరి 26 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/తండ్రికి భారత పౌరసత్వం ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తికి కూడా భారత పౌరసత్వం పొందేందుకు అర్హత ఉంటుంది.


3) నమోదు ద్వారా పౌరసత్వం: విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు ‘భారత పౌరసత్వ చట్టం, 1955’లోని సెక్షన్‌ 5(1)(a)లో పేర్కొన్నట్లు పౌరసత్వం పొందొచ్చు. భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ అదే  చట్టంలోని సెక్షన్‌ 5(1)(c) ప్రకారం భారత పౌరసత్వాన్ని పొందొచ్చు. నోట్‌: దరఖాస్తుదారులు భారత పౌరులను వివాహం చేసుకున్న విదేశీ వ్యక్తి అయితే దరఖాస్తు చేసుకున్న రోజు నాటికి ముందే 12 నెలల పాటు భారత్‌లో నివాసం ఉండాలి. ఆ 12 నెలలకు ముందు గడిచిన 8 సంవత్సరాల్లో కనీసం ఆరేళ్లు భారత్‌లో నివసించి ఉండాలి. అంటే వారు భారతదేశంలో కచ్చితంగా 7 సంవత్సరాలు (12 నెలలు + 6 సంవత్సరాలు) స్థిరనివాసం ఉండాలి.

4) సహజీకృతం ద్వారా పౌరసత్వం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువతో ఉన్న విదేశీయులు ‘భారత పౌరసత్వ చట్టం-1955’లోని సెక్షన్‌ 6(1) ప్రకారం ఇక్కడి పౌరసత్వాన్ని పొందొచ్చు. అందుకు కొన్ని అర్హతలు ఉండాలి. నీ కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. మంచి వ్యక్తిత్వం ఉండాలి. నీ అంతకుముందు ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అఫిడవిట్‌ సమర్పించాలి.నీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోని భాషల్లో ఏదైనా ఒక భారతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండాలి.నీ భారతదేశంలో 5 సంవత్సరాల పాటు శాశ్వత స్థిరనివాసం ఉండాలి. 

ఉదా: యుగొస్లేవియా దేశస్థురాలైన మదర్‌ థెరిసా భారత పౌరసత్వం పొందారు.


5) ఒక భూభాగం శాశ్వతంగా భారత్‌లో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం:  1950, జనవరి 26 తర్వాత ఒక కొత్త ప్రాంతం/భూభాగం/రాష్ట్రం/దేశం భారత్‌లో శాశ్వతంగా కలిసిపోతే ఆ భూభాగంలోని ప్రజలందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది. 

ఉదా: 1954లో ఫ్రెంచ్‌ వారి నుంచి పుదుచ్చేరి, 1961లో పోర్చుగీసు వారి నుంచి గోవా, 1975లో చోగ్యాల్‌ రాచరికం నుంచి సిక్కిం భారత్‌లో విలీనమయ్యాయి. ఆ భూభాగాల్లోని ప్రజలందరికీ భారత పౌరసత్వం లభించింది.


పౌరసత్వం రద్దు /కోల్పోయే పద్ధతులు

పార్లమెంటు 1955లో రూపొందించిన చట్టం ప్రకారం 3 రకాల పద్ధతుల్లో భారత పౌరసత్వం రద్దవుతుంది.

1) పరిత్యాగం: ఎవరైనా భారత పౌరుడు/పౌరురాలు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకుంటే, భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవచ్చు లేదా రద్దు చేయించుకోవచ్చు.

2) రద్దు చేయడం: ఎవరైనా భారత పౌరుడు తన భారత పౌరసత్వాన్ని త్యజించకుండా, విదేశీ పౌరసత్వం పొందితే ఇక్కడి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.

3) అనివార్య రద్దు: ఎవరైనా వ్యక్తి భారత పౌరసత్వాన్ని అక్రమంగా లేదా మోసపూరితంగా పొందినా, భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, భారతదేశ సంస్కృతిని అవమానించినట్లు ధ్రువీకరణ జరిగినా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు. 

 


 

 

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 17-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌