• facebook
  • whatsapp
  • telegram

దళిత ఉద్యమాలు

అసమానతలపై అలుపెరుగని పోరాటాలు!

వృత్తులు కులాలుగా మారిపోయి, శతాబ్దాలుగా శ్రమ సహా అన్ని రకాల దోపిడీలకూ గురై, అంటరానితనం అనే అమానవీయ దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోయిన బాధితులు దళితులు. వారి అభివృద్ధికి అనేక పోరాటాలు జరిగాయి. అవి బుద్ధుడి కాలం నుంచి మొదలై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి, అణచివేతలను ఎదిరించి, సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా కృషి చేయడమే దళిత ఉద్యమాల ప్రధాన లక్ష్యం. ఆ అలుపెరుగని పోరాటాల వల్ల సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

కుల, వర్ణవ్యవస్థలు అంతర్భాగంగా ఉన్న హిందూ సమాజంలో వందల ఏళ్లుగా అస్పృశ్యతకు గురవుతున్న వాళ్లే దళితులు. హిందూ సామాజిక క్రమంలో చివరి మెట్టుపై జీవిస్తున్న వారు దళితులు అని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వీరిని హరిజనులుగా, దేవుడి బిడ్డలుగా పిలిస్తే, భారత రాజ్యాంగం ఎస్సీలుగా గుర్తించింది.

 

చారిత్రక నేపథ్యం

క్రీ.పూ. 6వ శతాబ్దంలో బ్రాహ్మణ ఆధిపత్య క్రమాన్ని తిరస్కరిస్తూ సమానత్వంపై ఆధారపడిన సమాజాన్ని సృష్టించేందుకు ‘గౌతమ బుద్ధుడు’ తొలి ప్రయత్నం చేశాడు. బౌద్ధసంఘంలో అస్పృశ్యులను చేర్చుకున్నాడు. ఆ తర్వాత మహావీరుడు కూడా కులవ్యవస్థను వ్యతిరేకించి, అస్పృశ్యులను జైనమతంలోకి ఆహ్వానించాడు. కబీర్, గురునానక్, రవిదాస్, నాభా, నాయ్‌ మొదలైనవారూ కులవ్యవస్థను నిరసించారు. బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, సత్యశోధక సమాజం మొదలైన సంస్థలు కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాయి. ఫలితంగా బ్రిటిష్‌ హయాంలోనే 1911 నుంచి ‘చండాలురు’ పదాన్ని తొలగించారు. 

నామదేవ్‌ పంత్, సత్నామీ పంత్, నావల్‌ధర్మ్‌ వంటి సంస్థలు తమ సంస్కరణల ద్వారా దళితులను చైతన్యవంతం చేశాయి. జ్యోతిబా ఫులే 1912లో నామశూద్ర సంఘాన్ని ప్రారంభించారు. శ్రీముకుంద్‌ బిహారీ, శ్రీ హరిచంద్‌ ఠాకుర్‌లు కలసి స్థాపించిన నామశూద్ర సంక్షేమ సంఘం నిమ్నకులాల వారికి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని, 17% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

 

స్వాతంత్య్రానంతర దళిత ఉద్యమాలు

ఇండియన్‌ రిపబ్లిక్‌ పార్టీ: ప్రజల సాంఘిక, ఆర్థిక హక్కుల సాధన కోసం 1957లో ఇండియన్‌ రిపబ్లికన్‌ పార్టీని స్థాపించారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్నికల బరిలోకి దిగింది. ఇది రాజకీయ పార్టీ అయినప్పటికీ, సమాజంలో దళితుల అభివృద్ధికి పలు సంస్కరణలను చేపట్టింది. భూమిలేని వారికి భూమి ఇప్పించడం, రిజర్వేషన్‌ విధానం అమలు ప్రధాన లక్ష్యాలుగా ఉద్యమాలు నిర్వహించింది.

దళిత్‌ పాంథర్‌లు: దళిత సముదాయాల్లోని విద్యావంతులు 1970ల నుంచి తమ హక్కుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 1972లో మహారాష్ట్రలో దళిత యువత మిలిటెంట్‌ సంస్థగా దళిత పాంథర్స్‌ ప్రారంభమైంది. అమెరికాలోని బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం లాగానే ఇది ప్రారంభమైంది. అణగారిన వర్గాల మధ్య ఐక్యతకు దళిత పాంథర్స్‌ కృషి చేసింది. వీరు చేసిన సమ్మెలు, అలజడుల ఫలితంగానే భారత ప్రభుత్వం 1989లో ది షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ యాక్ట్, 1989ను రూపొందించింది.

సమకాలీన ధోరణులు: 1980 నుంచి దళిత ఉద్యమాలు కొనసాగుతున్నాయి. దళిత్‌ ఇంటర్నేషనల్, వాయిస్‌ ఆఫ్‌ దళిత్‌ ఇంటర్నేషనల్, దళిత మహాసభ, దళిత క్రైస్తవ సభ లాంటి సంస్థలు వార్షిక సదస్సులు నిర్వహిస్తున్నాయి.

దళిత ఉద్యమాలు లేదా బాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను పలు రకాలుగా వర్గీకరించారు. 


ఘన్‌శ్యామ్‌ షా వర్గీకరణ (1980): 

1) ప్రత్యామ్నాయ ఉద్యమాలు: మత మార్పిడికి ఉద్యమం, మత/లౌకిక ఉద్యమాలు 

2) సంస్కరణాత్మక ఉద్యమాలు: ఇందులో భాగంగా అస్పృశ్యతను నిరోధించే ఉద్దేశంతో భక్తి ఉద్యమం, నవ్య వేదాంతిక ఉద్యమాలను చేపట్టారు. అలాగే నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సంస్కృతీకరణ ఉద్యమం నిర్వహించారు.

పటాంకర్, గైల్‌ ఓమ్‌దేవ్‌ వర్గీకరణ: 1) కుల ప్రాతిపదికన 2) వర్గ ప్రాతిపదికన

 

వివిధ రకాలుగా దళిత పోరాటాలు: 

* పురోహితులు లేకుండానే వివాహాలు జరపడం.

* దేవాలయ ప్రవేశం, బావులు, నీటి కోసం పోరాడటం.

* దళిత వ్యతిరేక సాహిత్యాన్ని దహన చేయడం.

* బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం.

* దళితులకు ఆధునిక విద్యను అందించడం.

 

1931 జనాభా లెక్కల ప్రకారం దళితుల సమస్యలు: 

* వనరుల వినియోగం. * అంటరానితనం * అసమాన హోదా * వృత్తిని వదిలే స్వేచ్ఛ లేదు

 

నాయకులు-సంస్థలు

భాగ్యరెడ్డి వర్మ: తెలంగాణలో దళిత ఉద్యమాలకు మూల పురుషుడు భాగ్యరెడ్డి వర్మ. దళితులు మూలవాసులని పేర్కొంటూ, వారికి ఆది హిందువులని పేరు పెట్టారు. అంబేడ్కర్, గాంధీ కంటే ముందు చైతన్యాన్ని రగిలించిన నేతగా ప్రసిద్ధి చెందారు.1906లో ‘జగన్‌ మిత్రమండలి’ని ఆయన స్థాపించారు. 1910లో దళిత పిల్లలకు చదువు చెప్పించేందుకు ఇసామియా బజార్‌లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. 1911లో మాన్య సంఘం, 1912లో అహింసా సమాజాన్ని  స్థాపించారు. 1917లొ భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన విజయవాడలో ఆదిహిందూ సదస్సు నిర్వహించారు. 1931లో  భాగ్యనగర్‌ పత్రిక, 1937లో ఆది హిందు మాసపత్రికలను ప్రారంభించారు.1942లో వర్మ కుమారుడు గౌతమ్‌ దళిత బాలికలకు ఆదిహిందూ భవన్‌ పేరుతో పాఠశాలను స్థాపించారు. 

ఎం.ఎల్‌.యాదయ్య:  ఈయన దళిత భీష్ముడుగా ప్రసిద్ధి. ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేశారు. దళితులను పాఠశాలలో చేర్చుకోకపోతే జరిమానా అమలయ్యే విధంగా చేశారు. 1931, జులైలో జరిగిన ఆది హిందూ ధార్మిక సభకు అధ్యక్షత వహించారు.

బి.ఎస్‌.వెంకట్రావ్‌ (బత్తుల ఆశయ్య): హైదరాబాద్‌ అంబేడ్కర్, రావు సాహెబ్‌ అనేవి ఈయన బిరుదులు. డిప్రెస్డ్‌ క్లాస్‌ అసోసియేషన్‌ స్థాపించి దళితుల హక్కుల కోసం పోరాటం చేశారు. అంబేడ్కర్‌ ప్రారంభించిన మహద్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

అరిగె రామస్వామి: దళితుల్లో రాజకీయ చైతన్యానికి కృషి చేశారు. 1922లో ‘ఆది హిందూ జాతి ఉన్నతి సభ’ను స్థాపించారు.

జె.సుబ్బయ్య: ఈయన హైదరాబాద్‌ షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య అధ్యక్షుడు. అంబేడ్కర్‌ చేపట్టిన దళిత ఉద్యమాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు.

రిపబ్లికన్‌ పార్టీ ఉద్యమం (1964): 1957లో షెడ్యూల్డ్‌ కులాల ఫెడరేషన్‌ పేరును రిపబ్లికన్‌ పార్టీ ఉద్యమంగా పేరు మార్చారు.

ఆది ఆంధ్ర ఉద్యమం: మద్రాస్‌ రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఆది ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. 1917లో బెజవాడలో గూడూరు రామచంద్రరావు ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీన్ని ‘పంచమ కాన్ఫరెన్స్‌’గా పేర్కొంటారు.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ):  ఉత్తర్‌ప్రదేశ్‌లో 1984, ఏప్రిల్‌ 14న కాన్షీరామ్‌ బీఎస్పీని స్థాపించారు. పార్టీ చిహ్నం ఏనుగు. అంతకుముందు 1981లో కాన్షీరామ్‌ దళిత్‌ శోషిత్‌ సమాజ్‌ సంఘర్ష్‌ సమితి (డీఎస్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతి కోసం పనిచేశారు. డీఎస్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ది అప్రెస్డ్‌ ఇండియన్‌ అనే పత్రిక నడిచింది. అంబేడ్కర్‌ బౌద్ధమతం స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2002, అక్టోబరు 14న కాన్షీరామ్‌ తన 20 లక్షల మంది అనుచరులతో బౌద్ధం స్వీకరించారు.

బామ్‌సెఫ్‌: డి.కె.ఖపర్డే, దినభన, రాంకొబ గాడి కలిసి 1978లో ఏర్పాటు చేసిన సంస్థ బామ్‌సెఫ్‌ (BAMCEF - The all India Backward And Minority Communities Employees Federation).-. ఇందులో 1999లో 2 లక్షల సభ్యులున్నారు.

ఇండియన్‌ రిపబ్లిక్‌ పార్టీ (1957):  సమాజంలో దళితుల అభివృద్ధి కోసం ఏర్పాటైన పార్టీ ఇది. మహారాష్ట్రకే పరిమితమైంది.

ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం: 1994లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌)ని మందకృష్ణ మాదిగ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, వారి హక్కులను, గౌరవాన్ని కాపాడటం కోసం ఈ సంస్థ ఏర్పాటైంది. 

* 2014, జ‌న‌వ‌రి 5న మ‌హాజ‌న సోష‌లిస్టు పార్టీని మంద‌కృష్ణ స్థాపించారు.

* 20వ శతాబ్దంలో ఆది హిందూ సామాజిక సేవాసమితి, ఆది అరుంధతీయ సభ, మాన్యం వంటి సంఘాలు దళితుల్లో ఆత్మగౌరవం పెంచేందుకు ఉద్యమాలు చేపట్టాయి.

* 1940లో బి.ఎస్‌.వెంకటరావ్, శ్యామ్‌సుందర్, జె.హెచ్‌.సుబ్బయ్య లాంటి నాయకులు దళితులను సమీకరించి వారిలో చైతన్యం కల్గించడానికి ప్రయత్నించారు.

* 1930లో శ్రీ హరిచంద్రహేడ, జ్ఞానకుమారి హేడ హరిజన్‌ సేవక్‌ సంఘ్‌లో కార్యదర్శిగా, కోశాధికారిగా దళితుల కోసం తీవ్రంగా శ్రమించారు.

 

తెలంగాణలో..

స్వాతంత్య్రాంతరం తెలంగాణలో అస్పృశ్యత, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా దళిత ఉద్యమాలు జరిగాయి. జాగీర్దార్‌ వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన దళిత ఉద్యమాలను 3 దశలుగా విభజించారు. అవి 1) 1950-80; 2) 1980-90; 3) 1990 నుంచి ఇప్పటివరకు.

సమకాలీన అంశాలు: * దళితుల్లోని ఉపకులాల సమస్యలపై పనిచేస్తున్నాయి. దళిత సమూహాల్లో చైతన్యం కోసం 1) కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్‌) 2) దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్‌)  3) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేడబ్ల్యూపీఎస్‌) వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో దళిత చిల్లర కులాల సంఘం అంబేడ్కర్‌ యువజన సంఘం కింద సంఘటితమైంది.. దళిత సంఘాలు, దళిత బహుజన అసోసియేషన్‌ అనే సంస్థలు నేటికీ పోరాటాలు కొనసాగిస్తున్నాయి. 

 

 

అంబేడ్కర్‌ విశేష కృషి

దళిల కోసం బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1927లో మహద్‌ పేరుతో నీటిపోరాటం చేశారు. 1930లో దళితుల హక్కుల కోసం నాసిక్‌లో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు. 1946లో పుణెలో ఆయన ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమానికి విశేష ఆదరణ లభించింది. 1956లో తన అనుచరులతో కలిసి బౌద్ధమతం స్వీకరించారు.

అంబేడ్కర్‌ స్థాపించిన సంస్థలు:

* బహిష్కృత హితకారిణి సభ (1924)

* ఆల్‌ ఇండియా ఎస్సీ ఫెడరేషన్‌ (1942)

* సమాజ్‌సంఘ్‌ (1927)

* పీపుల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (1945)

 

రాజకీయ పార్టీలు: * ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (1936)  * రిపబ్లికన్‌ పార్టీ (1956)

జర్నల్స్‌: * మూక్‌నాయక్‌ * జనతా * బహిష్కృత భారత్‌

పుస్తకాలు: * బుద్ధ అండ్‌ హిజ్‌ ధర్మ * గాంధీ అండ్‌ గాంధీయిజం * స్టేట్‌ అండ్‌ మైనారిటీస్‌ * ది అన్‌టచ్‌బుల్స్‌ * హూఆర్‌ అన్‌టచ్‌బుల్స్‌ * క్యాస్ట్స్‌ ఇన్‌ ఇండియా

హైదరాబాద్‌ సందర్శన: * అంబేడ్కర్‌ 1944, సెప్టెంబర్‌ 29న హైదరాబాద్, సికింద్రాబాద్‌లను సందర్శించి షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య సమావేశం ఏర్పాటు చేశారు.

* ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబేడ్కర్‌ పేరు మీదుగా గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తుంది.


ముఖ్యాంశాలు

* దళిత్‌ అనేది మరాఠీ పదం. ముక్కలుగా చేయబడిన అనేది దీని అర్థం.

* దళితులకు ‘హరిజనులు’ అని నామకరణం చేసినవారు గాంధీ (1933).

* వీరు చాతుర్వర్ణ వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందినవారు. వీరిని అవర్ణులు, పంచములు, అస్పృశ్యులుగా వ్యవహరించేవారు.

* హిందూ మతం నుంచి కుల వ్యవస్థను వేరుచేయడం అసాధ్యమని ఎం.ఎన్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

* మహారాష్ట్ర, తమిళనాడు, కేరళల్లో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దళితుల్లో మొదట చైతన్యం తెచ్చినవారు- జ్యోతిబా ఫులే.

* బహుజన్‌ అనే పదాన్ని మొదట గౌతమ బుద్ధుడు.ఉపయోగించాడు.

* 1936లో దళితులను షెడ్యూల్డ్‌ కులాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌