• facebook
  • whatsapp
  • telegram

తూర్పు చాళుక్యులు

రాజకీయ చరిత్ర
* రెండో పులకేశి (పశ్చిమ చాళుక్య రాజు) సోదరుడైన కుబ్జ విష్ణువర్థనుడు క్రీ.శ. 624  642 మధ్య విషమసిద్ధి, మకరధ్వజుడు లాంటి బిరుదులతో పాలించాడు.
* కుబ్జ విష్ణువర్థనుని భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైనులకు నెడుంబవసది గుహాలయాలను నిర్మించి, ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. క్రీ.శ. 642  673 మధ్య పాలించిన మొదటి జయసింహ వల్లభుడు సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి లాంటి బిరుదులను పొందాడు. ఇతను విప్పర్ల శాసనాన్ని వేయించాడు. తూర్పు చాళుక్య కాలంనాటి తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. ఇతని కాలంలోనే పల్లవులతో సంఘర్షణ ప్రారంభమైంది.
* తూర్పు చాళుక్యుల్లో అతి తక్కువ కాలం పాలించిన రాజు ఇంద్ర భట్టారకుడు (7 రోజులు పాలన). రెండో జయసింహుడు ‘నిరవద్య’ బిరుదుతో పాలించాడు. మూడో విష్ణువర్థనుడు కవి పండిత కామధేనువు, త్రిభువనాంకుశ లాంటి బిరుదులను పొందాడు. ఇతను పల్లవుల చేతిలో ఓడిపోయి, భోయకొట్టాల ప్రాంతాన్ని కోల్పోయాడు.
* మొదటి విజయాదిత్యుని కాలంలో తూర్పు చాళుక్య- రాష్ట్రకూట ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతను రాష్ట్రకూట రాజు గోవిందుని చేతిలో ఓడిపోయాడు. నాలుగో విష్ణువర్థనుడు రాష్ట్రకూట రాజు ధ్రువుని చేతిలో ఓడిపోయి, తన కూతురు శీలమహాదేవిని అతనికిచ్చి వివాహం చేశాడు. ధ్రువుని తరపున వచ్చిన మొదటి అరికేసరి నాలుగో విష్ణువర్థనుడిని ఓడించినట్లు పంప రచించిన విక్రమార్జున విజయం అనే గ్రంథం వివరిస్తోంది.
* రెండో విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించి నరేంద్ర మృగరాజు అనే బిరుదు పొందాడు. ఇతని పేరు మీదుగానే బెజవాడ విజయవాడ అయ్యింది.
* తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడైన గుణగ/ మూడో విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వర బిరుదు పొందాడు. సాతలూరు శాసనం ఇతని విజయాలను వివరిస్తోంది. ఇతని సేనాని పాండురంగడు అద్దంకి, కందుకూరు శాసనాలను వేయించాడు. గుణగ వింగవల్లి యుద్ధంలో రాష్ట్రకూట అమోఘవర్షుని చేతిలో ఓడిపోయినా, అతని వారసుడు రెండో కృష్ణుడిని ఓడించి, వారి పాళీధ్వజాన్ని, గంగా-యమునా తోరణాన్ని తన ధ్వజంపై ముద్రించాడు. ఇతని ఆస్థానాన్ని సులేమాన్‌ అనే అరబ్బు యాత్రికుడు సందర్శించాడు.

* మొదటి చాళుక్య భీముడు లేదా ఆరో విష్ణువర్థనుడు పంచారామాలను అభివృద్ధి చేశాడు. ద్రాక్షారామం, చేబ్రోలు ఆలయాలను నిర్మించాడు. గాంధర్వ విద్యా విశారదగా పేరొందిన చల్లవను పోషించాడు. ఆమెకు అత్తిలి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పందిపాక శాసనం ఇతని విజయాలను వివరిస్తుంది.
* మొదటి అమ్మరాజు ‘రాజమహేంద్ర’ బిరుదుతో పాలించాడు. ఇతను రాజమహేంద్రవరాన్ని నిర్మించినట్లు విన్నకోట పెద్దన రచించిన కావ్యాలంకార చూడామణి గ్రంథం పేర్కొంటోంది.
* మొదటి యుద్ధమల్లు బెజవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు. రెండో యుద్ధమల్లు బెజవాడలో నాగమల్లీశ్వరి ఆలయాన్ని నిర్మించాడు. ఇతను వేయించిన బెజవాడ శాసనంలో మధ్యాక్కరలు అనే చంధస్సు ఉంది. ఇతను చేబ్రోలును రాజధానిగా చేసుకుని పాలించినట్లు బెజవాడ శాసనం పేర్కొంటోంది.
* క్రీ.శ. 945  970 మధ్య పాలించిన రెండో అమ్మరాజు / ఆరో విజయాదిత్యుడు ‘కవిగాయక కల్పతరువు’ బిరుదు పొందాడు. ఈయన జైన మతాన్ని అవలంబించిన ఏకైక తూర్పు చాళుక్యరాజు. ప్రకాశం జిల్లాలో కఠకాభరణ జినాలయాన్ని నిర్మించి, మలియంపూడి గ్రామాన్ని దానం చేశాడు. ఇతని భార్య చామెకాంబ కూడా సర్వలోకాశ్రయ జినాలయాన్ని నిర్మించి, కలఛుంబుర్రు గ్రామాన్ని దానం చేసింది. బాడపుని ఆరుంబాక శాసనం, దానార్ణవుని మాగల్లు శాసనాలు కూడా రెండో అమ్మరాజు గురించి వివరిస్తాయి.
* దానార్ణవుడు రెండో అమ్మరాజును వధించి 970  973 మధ్య పరిపాలించాడు. ఇతను మాగల్లు శాసనాన్ని వేయించాడు. తెలుగు చోడ[ వంశస్థుడైన జటాచోడ భీముడు దానార్ణవుడిని వధించి, తూర్పు చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇతనికి ‘చోడ త్రినేత్ర’ అనే బిరుదు ఉంది.
* మొదటి శక్తివర్మ (దానార్ణవుడి కుమారుడు) చాళుక్యచంద్ర బిరుదుతో పాలన చేశాడు. మొదటి శక్తివర్మ అనంతరం అతని సోదరుడు విమలాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను రాజరాజు కూతురు కుందవ్వను, జటాచోడ భీముని కుమార్తె మేళమలను వివాహం చేసుకున్నాడు. గురువు త్రికాలయోగి / సిద్ధాంతదేవుడి కోసం రామతీర్థంలో రామకొండ గుహాలయాన్ని నిర్మించాడు.
* క్రీ.శ. 1019  1060 మధ్య రాజరాజ నరేంద్రుడు రాజ్యపాలన చేశాడు. ఇతని బిరుదు కావ్యగీతి ప్రియుడు. రాజేంద్రచోళుడి కూతురు అమ్మాంగదేవిని వివాహం చేసుకున్నాడు. కలిదిండి యుద్ధంలో మరణించిన చోళ సేనాను కోసం కలిదిండిలో మూడు శివాలయాలను నిర్మించాడు. క్రీ.శ. 1021 లో పట్టాభిషేకం జరుపుకున్నాడు. రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు. నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లనలాంటి కవులను పోషించాడు. కళ్యాణి చాళుక్యరాజు సోమేశ్వరుడు నారాయణభట్టును రాయబారిగా ఇతని ఆస్థానానికి పంపాడు. రాజరాజ నరేంద్రుడు నారాయణభట్టుకు నందంపూడి అగ్రహారాన్ని, పావులూరి మల్లనకు నవఖండ్రవాడను దానం చేశాడు.
* ఏడో విజయాదిత్యుడు చివరి తూర్పు / వేంగి చాళుక్యరాజు. క్రీ.శ. 1076 లో రాజరాజ నరేంద్రుని కుమారుడు రాజేంద్రుడు ‘కులోత్తుంగ చోళుని’ పేరుతో చోళ-చాళుక్య పాలన ప్రారంభించి, వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

పాలనాంశాలు
* రాజ్యాన్ని విషయాలు - నాడులు - కొట్టాలు - గ్రామాలుగా విభజించారు. అష్టాదశ తీర్థులు అనే మంత్రి పరిషత్తు రాజుకు పరిపాలనలో సాయపడేది. అష్టాదశ తీర్థుల గురించి మొదటి అమ్మరాజు మాగల్లు శాసనం వివరిస్తోంది. 
నోట్‌: దానార్ణవుడు కూడా మాగల్లు శాసనం వేయించాడు.

* రెండో అరికేసరి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రాహి, తంత్రపాల అనే ఉద్యోగనామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ బృందాన్ని వియోగాధిపతులు అనేవారు.
* గ్రామ సభను వారియం అని, గ్రామ కార్యనిర్వాహక మండలిని పంచవారియం అని, గ్రామాధికారిని గ్రాముండ అని పిలిచేవారు. ఆస్థాన న్యాయాధికారులను ప్రాఢ్వివాక్కులు అని, న్యాయమూర్తులు చదివే తీర్పులను జయపత్రాలు అని పిలిచేవారు.
* నందంపూడి శాసనం పంచ ప్రధానులను, రెండో అమ్మరాజు బందరు శాసనం ద్వాదశ స్థానాధిపతులను, రెండో చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం అగ్రహారాల్లోని బ్రాహ్మణ పరిషత్తుల గురించి తెలియజేస్తున్నాయి.


ఆర్థిక పరిస్థితులు
* నాటి వర్తక సంఘాలను నకరాలు అని, వర్తక సంఘాల నియమాలను సమయకార్యం అని పిలిచేవారు. నాటి నగర ప్రధాన కేంద్రం పెనుగొండ.
* విదేశాలతో వర్తకం చేసేవారిని నానాదేశి పెక్కండ్రు అని, వర్తక సంఘాలపై పన్ను వసూలు అధికారిని సుంకప్రెగ్గడ అని పిలిచేవారు. మాండలికుడు అనే అధికారి ప్రాంతీయంగా వర్తక నిర్వహణకు అనుమతి ఇచ్చేవాడు. గద్యాణము, మాడలు, ద్రమ్మములు అనే నాణాలు చలామణిలో ఉండేవి.
* గ్రామరక్షణ అధికారిని తలారి అని, గ్రామాల్లో పన్ను వసూలు అధికారులను రట్టగుళ్లు అని పిలిచేవారు.
* భూ ఫలసాయంలో రాజుకు చెల్లించే భాగాన్ని కోరు అనేవారు. కల్లు (కల్లానక్కానం), వివాహం (కళ్యాణక్కానం), యువరాజు భృతి కోసం (దొగరాజు పన్ను), సైన్యాన్ని నిర్వహించడానికి (పడేవాళే పన్ను) పన్నులు వసూలు చేసేవారు. యుద్ధ సమయంలో సైన్యాన్ని పోషించే గ్రామాలను జీతపుటూళ్లు అనేవారు.
* యుద్ధంలో రాజు ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఊదే కొమ్మును ధర్మదార అనేవారు. మార్కెట్‌ కూడళ్లకు సరుకులు రవాణా చేసేవారిని పెరికలు అంటారు.
* చినగంజాం నాటి ముఖ్య రేవుపట్టణమని అహదనకర శాసనం తెలుపుతోంది.
* నాణాలను గద్యాణం (బంగారు నాణెం), మాడ (వెండి నాణెం), కాసు (రాగి నాణెం) అని పిలిచేవారు. పంటకు ముందు నిర్ణయించే పన్ను సిద్దాయ, కాగా పంట వచ్చిన తర్వాత విధించేదాన్ని అరి పన్ను అనేవారు.
సామాజిక పరిస్థితులు: బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. వైశ్యులు జైన మతాన్ని అవలంబించారు. వారి కులదేవత వాసవీ కన్యకాపరమేశ్వరి.
* పంచానం వారు అంటే విశ్వకర్మలు. వీరు కంసాలి, కమ్మరి, కంచరి, కాసె, వడ్రంగి అనే అయిదు శాఖలుగా ఏర్పడ్డారు.
మత పరిస్థితులు: పరమ భాగవత, పరమ మహేశ్వర బిరుదులు ధరించిన తూర్పు చాళుక్యులు స్మార్త సంప్రదాయాన్ని పాటించారు. వీరు శైవమతాన్ని ఆచరించారు.
* బౌద్ధమతం క్షీణించి జైనమతం రాజాదరణ పొందింది. బౌద్ధరామాలు పంచారామాలుగా మారిపోయాయి.
* కులోత్తుంగ చోళుడు మునుగోడు (గుంటూరు జిల్లా) దగ్గర పృధ్వీతిలక బసది పేరుతో శ్వేతాంబర జైన బసదిని, రాష్ట్రకూట మూడో ఇంద్రుడు కడప జిల్లా దానవులపాడులో గొప్ప జైనక్షేత్రాన్ని నిర్మించారు.
* బోధన్‌లో ఉన్న గోమఠేశ్వరం విగ్రహం నమూనాలోనే చాముండరాయుడు శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వర విగ్రహాన్ని నిర్మించాడు.
* గణపతి, శివుడు, విష్ణువు, ఆదిత్యుడు, దేవి అనే అయిదుగురు దేవతలను ఒకేసారి ఆరాధించే పంచాయతన పూజా విధానం ప్రారంభమైంది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరాల వల్ల ఆంధ్రదేశం త్రిలింగ దేశంగా పేరొందింది.
* శైవ మతంలో పాశుపత, కాపాలిక, కాలాముఖ శాఖలు ఏర్పడ్డాయి. ప్రాచీనమైన పాశుపత శాఖను లకులీశుడు, కాలాముఖ శాఖను కాలాననుడు స్థాపించారు. భవభూతి రచన ‘మాలతీ మాధవం’ శ్రీశైలాన్ని కాపాలిక క్షేత్రంగా పేర్కొంటోంది.
* రెండో యుద్ధమల్లు బెజవాడ శాసనం చేబ్రోలు మహసేన జాతర గురించి వివరిస్తోంది. సర్పవరం (కాకినాడ) భవన్నారాయణ స్వామి ఆలయం, పిఠాపురం కుంతీ మాధవస్వామి ఆలయం, శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) ఆంధ్ర మహావిష్ణు దేవాలయాలను ఈ కాలంలోనే నిర్మించారు.


విద్యా-సారస్వతాలు
* నాటి విద్యాలయాలు-ఘటికలు, నాటి రాజభాష- సంస్కృతం. కవిగాయక కల్పతరువుగా పేరొందిన రెండో అమ్మరాజు పోతనభట్టు, మాధవభట్టు, భట్టిదేవుడు లాంటి కవులను పోషించాడు. మూడో విష్ణువర్థనుడు కవి పండిత కామధేనువు బిరుదు పొందాడు.
* నన్నయ నారాయణభట్టు సాయంతో మహాభారతంలో మొదటి రెండున్నర పర్వాలను తెలుగులో రాశాడు. ఆంధ్రభాషానుశాసనం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.
* పావులూరి మల్లన ‘గణితసార సంగ్రహం’ అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు. దీన్ని సంస్కృతంలో మహావీరాచారి రచించాడు. ఉగ్రాదిత్యుడు కళ్యాణకారక్‌ అనే వైద్య గ్రంథాన్ని రచించాడు.
* శాద్వాదాచల సింహ, తార్కిక చక్రవర్తి బిరుదులు పొందిన సోమదేవసూరి యశస్తిలక, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి సూత్ర వంటి గ్రంథాలను రచించాడు. కుమారిలభట్టు పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేశాడు.
వాస్తు, కళారంగాలు: శైవ, వైష్ణవ ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది. పంచారామాలు అభివృద్ధి చెందాయి. బిక్కవోలు (బిరుదాంకనిప్రోలు) ఆలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు.
పంచారామాలు: ద్రాక్షారామం/ భీమారామం- ద్రాక్షారామం, కుమారారామం - సామర్లకోట, అమరారామం- అమరావతి, క్షీరారామం-పాలకొల్లు, సోమారామం - గునుపూడి (భీమవరం).
* నాటి ముఖ్య వినోదం కోలాటం. మొదటి చాళుక్య భీముని కాలంలో హల్లీశకం అనే కోలాటరీతి అభివృద్ధి చెందింది.
* నాటి శిల్పాల్లో వీణ, పిల్లనగ్రోవి, మృదంగం, తాళాలు లాంటి వాద్య పరికరాలు ఎక్కువగా కనిపిస్తాయి.  విజయవాడ, జమ్మిదొడ్డిలో సంగీత శిల్పాలున్నాయి. కందుకూరు, బిక్కవోలు పట్టణాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించి అభివృద్ధి చేశాడు.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌