• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

విచక్షణ.. వివక్ష.. విభేదాలు!

  ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య తలెత్తుతున్న విభేదాలు పరిపాలనకు అవరోధాలుగా మారుతున్నాయి. సమాఖ్య వ్యవస్థ సామరస్యంగా సాగిపోడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ పదవి చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. రాజకీయ లేదా ఇతర కారణాలతో రాష్ట్రాధినేత, ప్రభుత్వాధిపతి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. విచక్షణ, వివక్షగా మారుతోందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు హోదాలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు, వివిధ కమిషన్లు-కమిటీలు చేసిన సిఫార్సులపై అభ్యర్థులు పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

                 భారతదేశం పరిపాలనా పరమైన సమాఖ్యగా కొనసాగడంలో, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో గవర్నర్‌ కీలకపాత్ర పోషిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారు. రాష్ట్రాధినేత గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో పరిపాలన నిర్వహిస్తే ప్రజాస్వామ్యం విజయవంతమై ప్రజలకు మేలు జరుగుతుంది. అలాకాకుండా ఇరువురి మధ్య పరిపాలనాపరమైన అభిప్రాయ భేదాలు వస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్షీణించి అంతిమంగా ప్రజలకు అభిలషణీయమైన పరిపాలన దూరమవుతుంది.

 

రాజ్యాంగ నిర్మాతల ఆలోచన

* రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రస్థాయిలో పార్లమెంట్‌ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కేంద్రం నియమించే గవర్నర్‌ రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తూ నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. ఓటర్ల ద్వారా ప్రాతినిధ్యం పొందిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తూ వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. 

* గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని రాజ్యాంగ సభ సలహాదారుడైన బెనగళ నరసింగరావు ప్రతిపాదించారు. కానీ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలని పేర్కొన్నారు. ఈ వాదననే రాజ్యాంగ సభ సమర్థించింది. 

 

గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడానికి కారణాలు 

* గవర్నర్‌ను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రితో వివాదాలు ఏర్పడతాయి. 

* గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. 

* గవర్నర్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఆ పదవి పార్టీ రాజకీయాలకు లోనవుతుంది. అప్పుడు గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.

 

విచక్షణాధికారాలు 

ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహా లేకుండా లేదా ఆ సలహాకు వ్యతిరేకంగా గవర్నర్‌ చేపట్టే చర్యలను ‘విచక్షణాధికారాలు’ అంటారు. వీటి వల్ల గవర్నర్‌ పదవి తరచూ వివాదాస్పదమవుతుంది. ఈ విచక్షణాధికారాలు రెండు రకాలు.  


1) రాజ్యాంగపరమైనవి 

భారత రాజ్యాంగంలో అంతర్గతంగా గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలను పేర్కొన్నారు. వీటిని నిర్వహించడంలో గవర్నర్‌ మంత్రిమండలి సలహాను పాటించాల్సిన అవసరం లేదు. 

* రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం. 

* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా రాజ్యాంగ పరమైన కారణాలతో రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయడం. 

* రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరడం. 

* రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయించడం. 

 

2) సందర్భాన్ని అనుసరించి లభించేవి 

రాజకీయ పరిస్థితుల్లో వచ్చే మార్పుల ఆధారంగా గవర్నర్‌ కొన్ని విచక్షణాధికారాలను పొందుతారు. 

* రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించని సమయంలో ముఖ్యమంత్రిని నియమించడం.

* రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేక విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేయడం.

* శాసనసభలో మెజార్టీ కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ రద్దు చేయవచ్చు.

* అధికారంలో ఉన్న ప్రభుత్వం పతనమైనప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేనప్పుడు శాసనసభ కాలపరిమితి ముగియకముందే శాసనసభను రద్దుచేయడం.

* శాసనసభను రద్దుచేయాలనే ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్‌ తిరస్కరించగలరు లేదా ఆమోదించగలరు. 

 

ఉదాహరణకు... 

* 1985లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫార్సు చేస్తే గవర్నర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ రద్దు చేశారు.

* 1994లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫార్సు చేస్తే గవర్నర్‌ కృష్ణకాంత్‌ తిరస్కరించారు.

* 2004లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు సిఫార్సు చేస్తే గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా రద్దు చేశారు. 

 

గవర్నర్‌ పదవి - సుప్రీంకోర్టు తీర్పులు

 

ఆర్‌.ఎస్‌.మెహతా Vs (స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసు (2013)

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గవర్నర్‌ తన అధికారాల నిర్వహణలో పార్లమెంట్‌కు లేదా రాష్ట్ర శాసనసభకు లేదా రాష్ట్ర మంత్రిమండలికి ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

 

పురుషోత్తం నంబూద్రి Vs (స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1962)

రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌ ఎంతకాలంలోగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఎలాంటి కాలపరిమితి లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  

* కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసిన వివిధ కమిటీలు గవర్నర్‌ వ్యవస్థపై కీలకమైన సిఫార్సులు చేశాయి. 


కమిషన్‌లు, కమిటీల సిఫార్సులు

 

సర్కారియా కమిషన్‌ 

* క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనేవారిని గవర్నర్‌గా నియమించరాదు.

* గవర్నర్‌లకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేయాలి.

* గవర్నర్‌ల పేర్లను సూచించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.

* కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్‌లుగా నియమించరాదు.

* గవర్నర్‌ను నియమించే సమయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి.

* విశిష్ట వ్యక్తిత్వం, వివాదాస్పదం కాని వారిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి.

* గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించరాదు.

* ఒక వ్యక్తిని సొంత రాష్ట్రంలో గవర్నర్‌గా నియమించకూడదు.

 

మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌ 

* కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసిన మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌ గవర్నర్‌ వ్యవస్థపై కింది సిఫార్సులను చేసింది. 

* గవర్నర్‌ పదవీకాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి.

* రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా మంత్రులపై న్యాయ విచారణ జరపడానికి అనుమతించే అధికారం గవర్నర్‌కు కల్పించాలి.

* రాష్ట్రంలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సెలర్‌లను నియమించడానికి గవర్నర్‌లకు ఉండే అధికారాన్ని వెంటనే తొలగించాలి.

* రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు గవర్నర్‌ను రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తొలగించేలా చట్టం చేయాలి.

* ప్రధానమంత్రి నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు గవర్నర్‌ను ఎంపిక చేయాలి.

 

రాజమన్నార్‌ కమిటీ 

* గవర్నర్‌ను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలి. 

* గవర్నర్‌ సంతృప్తిగా ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి.

* గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధించరాదు.

 

గవర్నర్‌ పదవి - రాజ్యాంగ ఆర్టికల్స్‌ 

* ఆర్టికల్‌ 153 - ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్‌ ఉంటారు

* ఆర్టికల్‌ 154 - రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు గవర్నర్‌ పేరు మీదుగా నిర్వహిస్తారు 

* ఆర్టికల్‌ 155 - గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు

* ఆర్టికల్‌ 156 - గవర్నర్‌ పదవీకాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది

* ఆర్టికల్‌ 157 - గవర్నర్‌ పదవికి ఉండాల్సిన అర్హతలు

* ఆర్టికల్‌ 158 - గవర్నర్‌ జీతభత్యాలు, వసతి

* ఆర్టికల్‌ 159 - ప్రమాణస్వీకారం (హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో)

* ఆర్టికల్‌ 160 - గవర్నర్‌ పదవికి ఖాళీ ఏర్పడితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు

* ఆర్టికల్‌ 161 - గవర్నర్‌కు గల క్షమాభిక్ష అధికారాలు

 

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌