• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సామాజిక పరిస్థితులు

వెట్టిచాకిరి... వలసల తాకిడి!

  తెలంగాణ సమాజం చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. అందుకు పలు చారిత్రక, భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా ఆ వైవిధ్యాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా వెట్టిచాకిరి, బాలకార్మికులు, జోగిని వ్యవస్థ వంటివి  ప్రబలటానికి దోహదపడిన పరిస్థితులను, వాటి నిర్మూలనకు జరిగిన పోరాటాలను, ఇతర ప్రయత్నాలను అర్థం  చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపైనా అవగాహన పెంచుకోవాలి.    

  శతాబ్దాలుగా తెలంగాణలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని రకాల సమస్యలు తల్తెత్తాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం దక్కన్‌ పీఠభూమిలో ఉంది. దాదాపు రెండు వందల సంవత్సరాలకుపైగా నిజాంల పాలన సాగింది. ముస్లిం మత ప్రభావం కూడా ఈ సమాజంపై ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల కంటే  భిన్నమైన పరిస్థితులు ఏర్పడి ప్రజాజీవనాన్ని ప్రభావితం చేశాయి. తెలంగాణ సామాజిక నిర్మాణంలో  భూస్వామ్య లేదా ఉన్నత కులాల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు తక్కువ లేదా నిమ్న కులాల వారిని రకరకాల పనుల కోసం వినియోగించేవారు.  వివిధ వృత్తులు చేసేవారిని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు. ప్రతిఫలంగా తోచింది ఇచ్చేవారు. శ్రమకు తగిన ఫలితం నిమ్నకులాల వారికి అందేది కాదు. నిర్ణీత మొత్తాన్ని వాళ్లకు చెల్లించాలనే సంప్రదాయం కూడా ఉండేది కాదు. చాలావరకు ఉచితంగా పనులు చేయించుకునేవారు. ఆ వెట్టిచాకిరి, శ్రమదోపిడి తదనంతర కాలంలో సాయుధ రైతుల పోరాటం తీవ్రంగా జరగడానికి ప్రాతిపదికలుగా మారాయి.

  తెలంగాణలో మరో ముఖ్యమైన సమస్య బాలకార్మిక వ్యవస్థ. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ జీవనం ప్రధానంగా భూమి ఆధారంగా సాగుతుంది. ఆ భూములన్నీ ప్రాబల్య కులాల చేతుల్లో ఉన్నాయి. వాటిలో నిమ్న కులాలకు చెందిన వారంతా కూలీలుగా పని చేస్తున్నారు. దీంతో అత్యంత పేదరిక పరిస్థితుల్లో జీవనం సాగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీల కుటుంబాల్లోని పిల్లలూ పనికి వెళుతున్నారు. ఫలితంగా బాలకార్మిక వ్యవస్థ పెరిగిపోయింది. 

  ఆడవారిని పరోక్షంగా వ్యభిచార వృత్తిలోకి దించే సంప్రదాయం ఒకటి ఉంది. దాన్నే తెలంగాణలో జోగిని లేదా దేవదాసి వ్యవస్థ అంటారు. ఆంధ్రప్రాంతంలోనూ ఈ దేవదాసి విధానం ఉంది. నిజానికి మహిళలు తమను తాము దేవుడికి సమర్పించుకోవడం జోగిని వ్యవస్థ. అంటే దేవాలయాలకు తమను అర్పించుకోవడం అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడి సేవలకు బదులుగా వారిని వ్యభిచారంలోకి దించేవారు. దీని వల్ల చాలా రకాల సామాజిక సమస్యలు తలెత్తాయి. 

 

ఒక్కో రీతిలో... ఒక్కో చోటికి!

  తెలంగాణ సమాజంలో ప్రముఖంగా కనిపించే మరో సమస్య వలసలు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రకరకాల పనుల్లో ఇక్కడి ప్రజలు కనిపిస్తుంటారు. పాత కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని చేనేత వృత్తులవారు దేశంలోని పలు ప్రాంతాలకు వలసలు వెళ్లారు. మన మహబూబ్‌నగర్‌ శ్రామికులు కట్టిన ఇళ్లు, రోడ్లు, ఇంకా ఇతర నిర్మాణాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మెదక్‌ నుంచి వలసలు వెళ్లేవారిలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరకంగా ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లారు. వ్యవస్థీకృతమైన సాగునీటి వ్యవస్థ దీనికి ఒక ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.పంటలన్నీ వర్షాధారం లేదంటే భూగర్భజలాలతో సాగవుతాయి. దీంతో ఎక్కువమంది నష్టాలకు గురవుతున్నారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేనేత కార్మికులు సాంస్కృతికంగా చాలావరకు తమ వృత్తులకే అలవాటు పడిపోయారు. వీరు వేరే పనులు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. దీని వల్ల కూడా ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా రైతులు, చేనేత కార్మికులే ఉంటున్నారు. ఈ విధంగా తెలంగాణ సమాజం భౌగోళిక, చారిత్రక, రాజకీయ పరిస్థితులతో ప్రభావితమై అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది.  

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌