• facebook
  • whatsapp
  • telegram

 బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానం

 సనాతన విద్యకు సంస్కరణలు! 

బ్రిటిష్‌ వలస పాలనలో భారతీయ విద్యావ్యవస్థ సనాతనం నుంచి ఆధునికతను సంతరించుకుంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, సమాజ నియమాలు, చట్టాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిషర్లు విద్యాసంస్థలను, ఆంగ్ల బోధనను ఇక్కడ ప్రారంభించారు. యూనివర్సిటీలను నెలకొల్పారు. దాంతో సరికొత్త భారత మేధావి వర్గం పుట్టుకొచ్చింది. వారు  సామ్రాజ్యవాద పోకడలను, ఆర్థిక దోపిడీని అర్థం చేసుకున్నారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్లలో పెంపొందించేందుకు కృషి చేశారు.  అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిణామక్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి సంస్కరణలను అమలు చేసిందో తెలుసుకోవాలి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన ప్రారంభానికి ముందు విద్య సంప్రదాయ విధానంలో ఉండేది. విద్యాకేంద్రాలుగా హిందువులకు గురుకులాలు, దేవాలయాలు వ్యవహరిస్తే, ముస్లింలకు పర్షియన్‌ మదర్సాలు ఉండేవి. ఈ విద్యాసంస్థలు, మదర్సాలు ఎక్కువగా రాజ కుటుంబీకులు/వారి ఉన్నత ఉద్యోగులు/సుల్తానులు, జమీందారులు, కులీన కుటుంబాల పోషణలో ఉండేవి. హిందూ విద్యాసంస్థల్లో పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్యం, ఖగోళం, గణితం, వైద్యం, తత్వం లాంటివి పాఠ్యాంశాలుగా ఉండేవి. మత/నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణులు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు.


18వ శతాబ్దం చివరినాటికి ఈ సంప్రదాయ విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించడం ప్రారంభించడంతో  స్వదేశీ సంస్థానాలు బలహీనపడ్డాయి. వాటి ప్రభావం వారి ఉద్యోగ బృందం మీద కూడా పడింది. విద్యావ్యవస్థలకు పోషణ కరవైంది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తో ఇంగ్లండ్‌కు కేవలం ముడిసరకులు సరఫరా చేసే వలసప్రాంతంగా మన దేశం మారింది.తమ ఫ్యాక్టరీల్లో తయారుచేసిన వస్తువులకు మంచి విపణిగా ఈ దేశాన్ని బ్రిటిషర్లు  మార్చడంతో ఇక్కడి కుటీర పరిశ్రమలకు ఆదరణ కరవైంది. దీంతో దేశంలో వృత్తివిద్యలు కూడా దెబ్బతిన్నాయి. స్థూలంగా చెప్పాలంటే దేశీయ విద్యావ్యవస్థ విదేశీయుల పాలనలో క్షీణించింది.


బక్సర్‌ (1764) యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం ఆంగ్లేయుల హస్తగతమైంది. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు, యూరోపియన్, క్రైస్తవ మిషనరీల ప్రసక్తి తప్ప తొలిదశలో భారతదేశంలో విద్య కోసం చేసిన కృషి గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు (1772-85) 1781లో కలకత్తాలో ముస్లింల కోసం ఒక మదర్సా స్థాపించారు. 1782లో జోనాథన్‌ డంకన్‌ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. హేస్టింగ్స్, అతడి తోటి అధికారులు హాల్‌హెడ్, జోనాథన్‌ డంకన్‌ ప్రాచ్య విద్య పట్ల మక్కువ చూపారు. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం కూడా అవసరమని భావించారు. ఆ ప్రయత్నంలో హాల్‌హెడ్‌ మనుస్మృతిని జెంటూలాస్‌ అనే పేరుతో అనువాదం చేశాడు. మరుగున పడిన భారతీయ సంస్కృతిని వెలికితీయడానికి అప్పటి కంపెనీ న్యాయాధికారి విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్, మరొక కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తర్వాత అనేక ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత గ్రంథాలను కంపెనీ సేవలో భారతదేశానికి వచ్చిన పలువురు ఆంగ్లేయులు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. లార్డ్‌ వెల్లస్లీ పరిపాలనా కాలంలో కలకత్తాలోని విలియమ్స్‌ కోటలో కంపెనీ అధికారులకు పరిపాలనలో తర్ఫీదు ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో భారతీయ సంస్కృతి, న్యాయం, భౌగోళిక శాస్త్రం, తత్వం కూడా బోధించేవారు. బ్రిటిషర్లు తమ పాలన కోసమే ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని వల్ల భారతదేశ సాంస్కృతిక వైభవం వెలుగులోకి వచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని కొన్ని యూరోపియన్‌ క్రైస్తవ మిషనరీలు కూడా మనదేశంలో విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి. విలియం క్యారీకి చెందిన బాప్టిస్ట్‌ మిషన్‌ బెంగాల్‌లో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది. పోర్చుగీసు వారు అచ్చు యంత్రాన్ని మనకు పరిచయం చేశారు. క్రైస్తవ మిషనరీలు బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లోకి అచ్చువేయడం ద్వారా భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వాడకం విస్తృతమైంది. రాజా రామ్మోహన్‌ రాయ్, రాధాకాంత్‌ దేవ్, డేవిడ్‌ హేర్‌ లాంటి వారి కృషి వల్ల కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1817లో రాజా రామ్మోహన్‌ సహాయంతో, డేవిడ్‌ హేర్‌ కలకత్తాలో ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌ స్థాపించాడు. రామ్మోహన్‌ రాయ్‌ వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు.


కంపెనీ పాలనలో స్పష్టమైన విద్యా విధానం 1813 చార్టర్‌ చట్టంతో ప్రారంభమైంది. ఈ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూ.లక్ష కేటాయించాలని సూచించింది. కానీ ఆ మొత్తం ప్రాచ్య విద్య కోసమా లేదా పాశ్చాత్య విద్యాభివృద్ధి కోసమా అనే వాదనలు తలెత్తాయి. దాంతో ఈ నిధిని చాలా కాలం ఉపయోగించలేదు. వాదనలు విలియం బెంటింక్‌ కాలం (1828-35) వరకు నడిచాయి. బెంటింక్‌ చొరవతో అతడి కార్యనిర్వాహకవర్గ న్యాయ సభ్యుడు లార్డ్‌ మెకాలే ఆ పీటముడిని విప్పాడు. అతడి సూచన మేరకు బెంటింక్‌ 1835లో భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో సాహిత్యం, లెక్కలు, సైన్స్, తర్కం, తత్వం లాంటి పాశ్చాత్య విషయాలను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం విద్యారంగంలో ఒక చారిత్రక సంఘటన.

లార్డ్‌ డల్హౌసీ పదవీ కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి తగిన సూచనలు చేయడానికి ప్రభుత్వం సర్‌ చార్లెస్‌ ఉడ్‌ను నియమించింది. ఆయన సూచనలను ‘ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854’ అంటారు.

అందులోని ముఖ్యాంశాలు:

* ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు

* ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

* ప్రాంతీయ భాషల్లో బోధన

* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, యూనివర్సిటీ విద్యాలయాలుగా విభజించడం; మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన

* ఉపాధ్యాయ శిక్షణ

* బాలికా విద్యకు ప్రోత్సాహం

* విద్యారంగంలో ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలతో ఉడ్స్‌ డిస్పాచ్‌ ఆధునిక విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేసింది.


ఉడ్స్‌ డిస్పాచ్‌ తర్వాత చెప్పుకోదగిన విద్యారంగ సంస్కరణలు లార్డ్‌ రిప్పన్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్నప్పుడు జరిగాయి. ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854 సూచించిన విధానాలు, వాటి అమలు తీరును పరిశీలించడానికి విలియం హంటర్‌ కమిషన్‌ (1882)ను లార్డ్‌ రిప్పన్‌ నియమించాడు. ఇది బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించిన మొదటి కమిషన్‌.


హంటర్‌ నివేదిక ముఖ్యాంశాలు:  

* ప్రాథమిక, మాధ్యమిక విద్యను విస్తరించాలని, దాని నిర్వహణ బాధ్యత కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది.

* మతాలకు అతీతంగా లౌకిక బోధన జరగాలని పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలు విద్యాసంస్థలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాధ్యమిక విద్యతో పాటు వృత్తి విద్య నేర్పించాలని, స్త్రీ విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది.


రిప్పన్‌ తర్వాత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పదవీకాలంలో థామోస్‌ రాలి కమిషన్‌ (1902)ను నియమించాడు. దీనినే విశ్వవిద్యాలయాల కమిషన్‌ అంటారు. విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి దీన్ని నియమించారు. ఈ కమిషన్‌ సూచనల ప్రాతిపదికగా 1904 విశ్వవిద్యాలయాల చట్టం రూపొందింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను ప్రభుత్వమే నియమిస్తుంది. సెనెట్‌లో ఎన్నుకున్న సభ్యుల సంఖ్య తగ్గి, అధికార సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ చట్టం కారణంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది.


విద్యా సంస్కరణల్లో మరొక మైలురాయి హార్టోగ్‌ కమిటీ నియామకం. ఈ కమిటీని లార్డ్‌ ఇర్విన్‌ (1926-31) గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు నియమించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని సూచించింది. 1934లో నియమించిన సప్రూ కమిటీ వృత్తి విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యం ఇవ్వమని సూచించింది. 1944లో లార్డ్‌ వేవెల్‌ పదవీ కాలంలో సార్జెంట్‌ కమిటీని నియమించారు.

ఆధునిక భారతదేశంలో 20వ శతాబ్ద ప్రథమార్ధానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ విశ్వభారతితో సహా అలీగఢ్, ఉస్మానియా, ఆంధ్ర, ఢాకా, లఖ్‌నవూ, దిల్లీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1916లో ఆచార్య డి.కె.కార్వే పూనాలో స్త్రీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక వృత్తిపరమైన అంటే వైద్య, న్యాయ వ్యవసాయ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటై బ్రిటిష్‌ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశాయి.


ఆధునిక విద్యనభ్యసించిన విద్యావంతులు బ్రిటిషర్ల పాలన నిజ స్వరూపాన్ని గుర్తించగలిగారు. ఈ దేశ ఆర్థిక వెనుకబాటుకు పరాయి పాలనే కారణమని, వారి వివక్షా పూరిత విధానాలు, నిరంతర ఆర్థిక దోపిడీని ఆకళింపు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని భారతీయులకు ఈ ఆధునిక విద్యే అందించిందనడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు