• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ ఉద్యమాలు

ప్రకృతి పరిరక్షణకు పోరుబాట!

  భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. ఈ పంచభూతాలు ప్రమాదంలో పడ్డాయి. ఆధునిక ప్రగతి పేరుతో మనుషులే ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. సమస్త జీవరాశుల మనుగడకు ముప్పు ముంచుకొచ్చింది. ఈ పరిణామాలను పర్యావరణవేత్తలు అడ్డుకుంటున్నారు. బాధితులైన స్థానికులతో కలిసి పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వాలను మేల్కొలిపి ప్రజా సంక్షేమానికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా జరిగిన ప్రధాన ఉద్యమాల వివరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  

జీవుల మనుగడకు అవసరమైన భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి లభ్యతలను పర్యావరణం అంటారు. ఆ పర్యావరణంలో మార్పులు జరిగినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు చేపట్టే చర్యలను పర్యావరణ పరిరక్షణ అంటారు. గాలి, నీరు, భూమిపై ఉండాల్సిన మూలకాలు తగిన నిష్పత్తుల్లో లేకపోతే అందరికీ ప్రాణాంతకమే. కార్బన్‌ డై ఆక్సైడ్‌ అవసరానికి మించి ఉండటం వల్ల జీవులకు అత్యవసరమైన ఆక్సిజన్‌ కూడా హానికరంగా మారుతోంది.

* ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్‌ 5

* అంతర్జాతీయ అటవీ దినోత్సవం మార్చి 21 

* ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం మే 22

 

అటవీ సంరక్షణలో చిప్కో 

  చిప్కో అనే హిందీ పదానికి అర్థం అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం. ఉత్తరాఖండ్‌ అడవుల్లో నివసించే గిరిజనులు (బిష్ణోయ్‌ తెగకు చెందిన స్త్రీలు) చెట్లను నరికివేతల నుంచి కాపాడుకోవడానికి చేపట్టిందే చిప్కో ఉద్యమం. 1927 భారత అటవీ చట్టంతో హక్కులు కోల్పోయిన బిష్ణోయ్‌ తెగ ప్రజలు 1930లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో తెహ్రీ గర్హలాల్‌ ప్రాంతంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్రానంతరం చిప్కో ఉద్యమం గాంధేయ విధానంలో మీరాబెహన్, సరళా బెహన్‌ లాంటి వారి ఆధ్వర్యంలో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్‌ కొండల్లో వ్యాపించాయి. ఆ తర్వాత కాలంలో చంఢీప్రసాద్‌ భట్, సుందర్‌లాల్‌ బహుగుణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజన ప్రజలు, కొందరు గాంధేయవాదులు సరళా బెహన్‌ సారథ్యంలో 1961లో ఉత్తరాఖండ్‌ సర్వోదయ మండల్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత గోపేశ్వర్‌ జిల్లాలోని దషోలి గ్రామంలో చంఢీప్రసాద్‌ భట్‌ నాయకత్వంలో ‘దషోలి గ్రామ స్వరాజ్‌ మండల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఎక్కువగా అటవీ సంరక్షణకు  కృషి చేసింది.

  1968లో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల దోపిడీని అడ్డుకోవడానికి అనేక మంది గిరిజనులు ప్రయత్నించారు. 1972 డిసెంబరు 12, 15 తేదీల్లో ఉత్తర కాశీ, గోపేశ్వరం ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. చిప్కో ఉద్యమం 1973లో హిమాలయ ప్రాంతం (ఉత్తరాఖండ్‌)లో ప్రారంభమైంది. కాంట్రాక్టర్లు చెట్లను నరకకుండా గిరిజన స్త్రీలు చెట్లను కౌగిలించుకొని నిద్రలేని రాత్రులు గడిపారు.

  ఉద్యమ నాయకత్వం: సరళాబెహన్, మీరాబెహన్, చంఢీప్రసాద్‌ భట్, సుందర్‌లాల్‌ బహుగుణ లాంటి వారంతా ఈ ఉద్యమాన్ని నడిపారు. చిప్కో ఉద్యమానికి సుందర్‌లాల్‌ బహుగుణ ప్రముఖ నాయకుడు. ఈయన గాంధేయవాది. 1974 మార్చిలో గౌరీదేవీ నాయకత్వంలో 27 మంది గిరిజన యువతులు చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఉత్తరాంచల్‌ చమోలీ జిల్లాలో జరిగింది. వీరు 2,500 చెట్లను నరకకుండా కాపాడారు. 1977లో నరేంద్రనగర్‌ అటవీ ప్రాంతం వేలం వేసినప్పుడు బచీనీదేవి నాయకత్వంలో అనేక మంది గిరిజనులు చెట్లను నరకకుండా కాపలా కాశారు. 

  1981లో సుందర్‌లాల్‌ బహుగుణ కశ్మీర్‌ నుంచి కోహిమా వరకు 5 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 1989 నుంచి హిమాలయ ప్రాంతంలో డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు. ఈయనకు 2009లో పద్మభూషణ్‌ వచ్చింది. చిప్కో ఉద్యమంపై ఘన్‌శ్యామ్‌ రాటూరి పాట రాశారు. ఈ ఉద్యమానికి రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు వచ్చింది. అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం హేమావతీ నందన్‌ కూడా చిప్కోకి మద్దతు పలికారు. 1980లో ఉత్తర్‌ప్రదేశ్‌ అడవుల్లో 15 సంవత్సరాల వరకు చెట్లను నరకకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే కాలంలో గౌరీదేవి నాయకత్వంలో ‘పర్యావరణ సత్యాగ్రహ’ ఉద్యమాన్ని చేపట్టారు.

 

కలాసేలో అప్పికో 

ఉత్తర కన్నడ జిల్లాలోని కలాసే అటవీ ప్రాంతంలో 1983లో అప్పికో ఉద్యమం జరిగింది. అప్పికో అంటే కన్నడ భాషలో హత్తుకోవడం అని అర్థం. ఈ ఉద్యమాన్ని లక్ష్మీనరసింహ‌ యువమండలి అనే సంస్థ ప్రారంభించింది. ఈ ఉద్యమ నాయకుడు పాండురంగా హెగ్డే. పశ్చిమ కనుమల్లో పారిశ్రామికీకరణ, మోనోకల్చర్‌ (టేకు), జలవిద్యుత్తు కేంద్రాల ఏర్పాటును ఈ ఉద్యమం వ్యతిరేకించింది.

 

నర్మదా బచావో ఆందోళన్‌ 

  పర్యావరణ పరిరక్షణకు, వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో జరిగిన ఉద్యమాలన్నింటిలో ‘నర్మదా బచావో ఆందోళన్‌ (1985)’ ప్రధానమైంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నీటికొరత వల్ల ఏటా తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడేది. ఈ పరిస్థితిని మార్చి ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1961లో కేంద్ర ప్రభుత్వం నర్మదా నదిపై సర్దార్‌ సరోవర్‌ పేరుతో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. నర్మదా నది, దాని ఉపనదులపై 3000 చిన్న, 135 మధ్యతరహా, 30 పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. వీటన్నింటినీ కలిపి ‘సర్దార్‌ సరోవర్‌’ ప్రాజెక్ట్‌ అంటారు. దీని వల్ల తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని భావించి ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది (ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 4 కోట్ల మంది ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు).

  దేశంలో పశ్చిమానికి ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్దది నర్మద. దీనిపై నిర్మిస్తున్న పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా నర్మదా బచావో ఆందోళన్‌ సాగింది. 1961లో నిర్మాణంలో ఉన్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల అనేక మంది గిరిజనులు ఉద్యమాన్ని చేపట్టారు. ఇది 1980లో ప్రజా ఉద్యమంగా మారింది. 1986లో ఏర్పాటైన ‘నర్మదా ధరన్‌ గ్రస్త్‌ సమితి’ దీన్ని కొనసాగించింది. ఈ ఉద్యమంలో బాబా ఆమ్టే, నందితాదాస్, అమీర్‌ఖాన్, అరుంధతీరాయ్, మల్లికా సారాభాయ్‌ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1987లో 450 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రుణం ఇచ్చిన ప్రపంచ బ్యాంక్‌ 1991లో మ్యూర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1994లో నర్మదా బచావో ఆందోళన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు 1997లో డ్యామ్‌ పనులు ఆపేయమని చెప్పింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఇచ్చిన మరో తీర్పులో ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత డ్యామ్‌ పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. 1985లో ఈ డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం, దానివల్ల తలెత్తే సమస్యల గురించి మేధాపాట్కర్‌ అధ్యయనం చేశారు. డ్యామ్‌ ఎత్తు పెంచడాన్ని నిరసిస్తూ 1991లో 21 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. దీనికిగానూ ఆమెకు రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు లభించింది. 

 

నవధాన్య పోరాటం

రైతులకు సరైన మార్కెట్‌ విలువ, జీవవైవిధ్య సంరక్షణ, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం లాంటి లక్ష్యాలతో వందనాశివ నవధాన్య ఉద్యమాన్ని 1982లో ప్రారంభించారు. ఆమె ‘స్టేయింగ్‌ ఎలైన్‌ ఉమెన్‌ ఎకాలజీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పుస్తకం రాశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నెలకొల్పిన శాంతినికేతన్‌ స్ఫూర్తితో దేహ్రాడూన్‌లో ఎర్త్‌ యూనివర్సిటీ (స్కూల్‌ ఆఫ్‌ ది సీడ్‌)/బీజ విద్యాపీఠ్‌ను ఏర్పాటు చేశారు. వేప, పసుపు, బాస్మతి బియ్యం లాంటి వాటిపై అమెరికన్‌లు పేటెంట్‌ హక్కులు పొందడానికి వ్యతిరేకంగా వందనాశివ పోరాటం చేసి విజయం సాధించారు. ఆమెకు రైట్‌ లైవ్లీహుడ్‌ (1993), సిడ్నీ పీస్‌ ప్రైజ్‌ (2010), మిరోడి ప్రైజ్‌ (2016), ఫుకౌకా ఏషియన్‌ కల్చర్‌ ప్రైజ్‌ (2012) తదితర అవార్డులు వచ్చాయి.

 

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనపై..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌’ అనే అమెరికా ఆధారిత పురుగుమందుల తయారీ ప్లాంట్‌ నుంచి 1984 డిసెంబరులో మిథైల్‌ ఐసోసైనేట్‌ వాయువు లీకవడంతో భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 3,787 మంది మరణించారు. 5 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఈ ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా మిగిలింది. దుర్ఘటన జరిగిన కంపెనీ సీఈవో వారెన్‌ అండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేశారు. ఈ విషవాయువు పీల్చిన వేల మంది వైక‌ల్యానికి గుర‌య్యారు. క్యాన్సర్‌ బాధితులుగా మారారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి భూగర్భ జలాలు నేటికీ తాగడానికి పనికిరాకుండా ఉన్నాయి. బాధితులకు వైద్య సదుపాయం, పునరావాసం, పరిహారం అందించడంతో పాటు అపరాధులను శిక్షించాలనే డిమాండ్లతో రషీధాభి, చంపాదేవి శుక్లా 2002లో దిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. వీరి పోరాటానికి 2004లో గోల్డ్‌మన్‌ పర్యావరణ అవార్డు వచ్చింది.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌