• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ ఉద్యమాలు

విధ్వంసాలపై జనరణం!

  ప్రగతి లక్ష్యాలు పెరిగాయి. ప్రకృతి విధ్వంసం మొదలైంది. పరిరక్షణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. సాగునీరు, తాగునీరు, కరెంటు అందుతుందనుకుంటే కష్టాలు  ఉత్పన్నమయ్యాయి. జనం నిర్వాసితులవుతున్నారు. జంతుజాలానికి ముప్పు ముంచుకొచ్చింది. అడవులు అంతరిస్తున్నాయి. నదులు కనుమరుగు కాబోతున్నాయి. కాలుష్యం కోరల్లో జీవులు అల్లాడుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. పోరాటాలుగా మారింది. కొన్నిచోట్ల ప్రభుత్వాలు దిగివచ్చాయి. మరికొన్ని సమస్యలు కొనసాగుతున్నాయి. 

 

  జీవులకు, పర్యావరణానికి విడదీయరాని బంధం ఉంది. మనుగడకు మూలాధారమైన ప్రకృతిని మనుషులు తమ స్వార్థం, స్వలాభం కోసం నాశనం చేస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతలో ప్రధానమైన అడవులను అభివృద్ధి పేరిట ఇష్టారీతిన నరికేస్తున్నారు. ఫలితంగా జంతుజాలం నశించిపోతోంది. స్థానికుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఈ పరిస్థితులను నిలువరించేందుకు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు జరిగాయి.

 

తెహ్రీ డ్యామ్‌ వ్యతిరేక పోరాటం

  ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్‌ జిల్లా తెహ్రీ పట్టణానికి సమీపంలో భాగీరథి, భిలాంగనా నదులపై జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ప్రాజెక్టునే తెహ్రీ డ్యామ్‌గా పిలుస్తారు. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్‌. రూ.3,000 కోట్లతో పనులను ప్రారంభించారు. రష్యా ఆర్థిక సహాయంతో 1988, జులైలో తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది.

 

ప్రయోజనాలు - ఆందోళనలు: తెహ్రీ డ్యామ్‌ నిర్మాణం పూర్తయితే 2.7 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, వెయ్యి మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన జరుగుతుందని అంచనా. దీంతో ఉత్తర భారతదేశంలో విద్యుత్తు కొరత తగ్గుతుంది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు తాగునీటి సమస్యలు తీరతాయి. చేపల పెంపకం, వలస పక్షులకు కేంద్రంగా తెహ్రీ డ్యామ్‌ మారుతుంది. ఇన్ని ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని డ్యామ్‌ నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ నేతృత్వంలోని తెహ్రీబాంధ్‌ విరోధి సంఘర్ష్‌ సమితి ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్‌ నిర్మాణం ఆపాలని ఉద్యమం నడిచింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీరేంద్ర దత్‌ సక్లానీ అందులో పాల్గొన్నారు. డ్యామ్‌ నిర్మాణం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని పర్యావరణ ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతో పాటు మరో 23 ఊళ్లు పూర్తిగా మునిగిపోతాయని, 73 గ్రామాలు పాక్షికంగా దెబ్బతింటాయని, 5,200 హెక్టార్ల నేల రిజర్వాయర్‌లో కొట్టుకుపోతుందని, 85,000 మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు. హిమాలయాలకు అత్యంత సమీపంలో ఉన్న తెహ్రీ, గద్వాల్‌ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. ఇలాంటిచోట భారీ డ్యామ్‌ నిర్మిస్తే, నీటిమట్టం కారణంగా హిమాలయాలపై ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, అడవులు, హిమాలయాల్లోని అరుదైన జంతువులు, వృక్షాలు నశించిపోతాయని, జీవావరణానికి హాని కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఈ ఉద్యమానికి ప్రజల స్పందన అంతగా లేదు. ఆనకట్ట నిర్మాణం చేపట్టిన తర్వాత 1991లో ఉత్తర కాశీలో పెద్ద భూకంపం వచ్చింది.ఆ భూకంపానికి, డ్యామ్‌ నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. కానీ ఈ ఘటనతో ప్రజలకు ఉద్యమకారుల మాటలపై నమ్మకం ఏర్పడి పోరాటాల్లో భాగస్వాములయ్యారు. భూకంపానికి, డ్యామ్‌ నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం వల్ల డ్యామ్‌ పునాదులకు ఎలాంటి ముప్పు ఏర్పడ లేదని, చెక్కు చెదరలేదని కూడా చెప్పింది. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెహ్రీ డ్యామ్‌ నిర్మాణ పనులు కొనసాగాయి. సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పేంత వరకు తెహ్రీ నిర్మాణం వివాదాస్పద కట్టడంగానే నిలిచింది.

 

సైలెంట్‌ వ్యాలీలో..

  కేరళలోని పశ్చిమ కనుమల్లో వ్యాపించిన అరణ్యాన్ని సైలెంట్‌ వ్యాలీ (నిశ్శబ్ద లోయ) అంటారు. ఈ అడవుల్లో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే సైలెంట్‌ వ్యాలీ అనే పేరు వచ్చింది. ఇవి సతతహరిత వనాలు. అరుదైన జంతు, వృక్ష జాతులకు నిలయాలు. ఈ లోయను భారతదేశంలోనే అపురూప సంపదగా భావిస్తారు. ఇక్కడి నీలగిరి పర్వతాల సమీపంలో 240 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రం నిర్మించాలని 1967లో కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాని వల్ల సుమారు వెయ్యి హెక్టార్ల అడవి ధ్వంసమవుతుదని స్థానికులు వ్యతిరేకించారు. పర్యావరణ సమతౌల్యత దెబ్బతిని అరుదైన వృక్ష, జంతు జాతులకూ ప్రమాదం వాటిల్లుతుంది. జలవిద్యుత్తు కేంద్రం 30 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేయదని, దానికోసం అటవీసంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.శాస్త్ర, సాహిత్య పరిషత్‌ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయ పార్కుగా ప్రకటించారు.

 

నల్గొండలో యురేనియం 

  తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలాశయం సమీపంలోని కొన్ని గ్రామాల్లో అటవీ భూమి, పట్టా భూములు కలిపి మొత్తం 1,303.35 ఎకరాల్లో యురేనియం నిల్వలున్నట్లు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) గుర్తించింది.యురేనియం మైనింగ్‌ యూనిట్, శుద్ధి కర్మాగారం స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను నాటి రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపురం గ్రామాల్లో తవ్వకాలకు యూసీఐఎల్‌ అనుమతి ఇచ్చింది. 795 ఎకరాల్లో రూ.315 కోట్ల వ్యయంతో దాదాపు 20 ఏళ్ల పాటు తవ్వకాలు జరపాలని నిర్దేశించింది. 2002, సెప్టెంబరులో యురేనియం నమూనాల కోసం తవ్వకాలు ప్రారంభించినప్పుడు కొందరు స్థానికులు వ్యతిరేకించారు.

 

అణువిద్యుత్‌పై మత్సకారుల వ్యతిరేకత

  తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 2002లో కూడంకుళం అణువిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి రష్యా సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్తును తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి సరఫరా చేస్తారు. మొత్తం సామర్థ్యం 6 వేల మెగావాట్లు. కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు ఉద్యమం ప్రారంభించారు. అణువ్యర్థాల వల్ల నీరు కలుషితమవుతుంది, తమ జీవనోపాధి పోతుందని వారి వాదన. కానీ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక్కడ అణువిద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది.

 

జైతాపూర్‌ అణువిద్యుత్తు కేంద్రం

  మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మదబాన్‌ గ్రామం వద్ద ఈ అణువిద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రం. మొత్తం సామర్థ్యం 9,900 మెగావాట్లు. ఫ్రెంచ్‌ కంపెనీ ఆరివా సహకారం అందిస్తోంది. ఈ కేంద్రానికి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అణువిద్యుత్తు కేంద్రంతో విపరీతమైన రేడియేషన్‌ వెలువడి వాయుకాలుష్యం పెరుగుతుందని, పరిసర ప్రాంతాల వారితో పాటు మత్స్యకారులు జీవనభృతిని కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

 

గంగా సంరక్షణ

  గంగా నది పరిరక్షణ కోసం గంగా సంరక్షణ ఉద్యమాన్ని రమారౌతా ప్రారంభించారు. తారాగాంధీ భట్టాచార్య (గాంధీజీ మనుమరాలు) ఈ ఉద్యమానికి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 2007 డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌) నివేదిక ప్రకారం ప్రపంచంలో అంతరించే మొదటి పది నదుల జాబితాలో గంగానది ఒకటి. గంగానది ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 1985లో మొదటిసారి గంగానది ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైంది. 2015, మే 13న కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగా యోజన’ను మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు కేటాయించింది. 2022 నాటికి 1,632 గంగా పరీవాహక గ్రామాలను శుద్ధి చేయాలన్నది లక్ష్యం.

 

సోన్‌ నది కాలుష్యం

  మధ్యప్రదేశ్‌ షాడోల్‌ జిల్లాలోని సోన్‌ నది పక్కనున్న అమ్లాయ్‌ నగరంలో 1965లో ఓరియంట్‌ పేపర్‌ మిల్స్‌ పేరుతో కాగితం పరిశ్రమను స్థాపించారు. ఈ ఫ్యాక్టరీకి ముడి పదార్థమైన వెదురును చౌక ధరకే సరఫరా చేయడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమ పెట్టిన రెండేళ్లకే నదిలోని చేపలు, చుట్టుపక్కల ప్రాంతాల పశువులు చనిపోవడం మొదలైంది. ఫ్యాక్టరీ కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితమయ్యాయని నదీతీర ప్రాంతంలోని 20 గ్రామాల ప్రజలు 1970 నుంచి ఆందోళనకు దిగారు.  అప్పటి ఫ్యాక్టరీ అధికారులు, జిల్లా కలెక్టరు, మంత్రులకు విన్నవించారు. అయినా పరిశ్రమ యాజమాన్యం స్పందించలేదు. 1973లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపి ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్య ప్రభావం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల పాల దిగుబడి తగ్గిందని, నదిలోని చేపలు, గ్రామాల్లో పశువులు క్రమంగా చనిపోతున్నాయని వెల్లడించింది. దాంతో కంపెనీ యాజమాన్యం కాలుష్య నివారణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉద్యమ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని (ది వాటర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ పొల్యూషన్‌) రూపొందించింది. 

 

చాలియార్‌ నది 

  1958లో బిర్లా సంస్థలకు చెందిన గ్వాలియర్‌ రేయాన్స్‌ ఫ్యాక్టరీని కేరళలోని చాలియర్‌ నది పక్కన స్థాపించారు. దాని కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నీటిని ఉపయోగించే పంట పొలాలు మాడిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ చర్మ సంబంధ సమస్యలు ఏర్పడ్డాయి. బాధితులంతా 1963లో ఉద్యమం నడిపారు. కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే మురుగును 20 కి.మీ. పైపులైను ద్వారా నేరుగా సముద్రంలో కలిపేందుకు అంగీకరించింది. కానీ మాట నిలబెట్టుకోలేదు. కంపెనీ నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు 1966 నుంచి 1973 వరకు అనేకసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు. 1974లో ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలు, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులతో త్రైపాక్షిక సమావేశం జరిపారు. ఫ్యాక్టరీ మురుగును పైపులైన్‌ ద్వారా సముద్రంలో కలుపుతామని యాజమాన్యం మళ్లీ మాట ఇచ్చి సరిపెట్టింది. విసుగు చెందిన స్థానికులు 1975లో భారీఎత్తున ఉద్యమం చేపట్టారు. కాలుష్య నియంత్రణ మండలి 1981లో కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది. చివరకు కేరళ హైకోర్టు జోక్యంతో ఆ ఫ్యాక్టరీ మూతపడింది.

 

పోలవరం ప్రాజెక్టు 

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రస్తుత ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉంది. దీని వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయితే సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా. వీరిలో ఎక్కువమంది గిరిజనులు. సాగు భూమి, ఖనిజ సంపద, అడవులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, పక్షి సంరక్షణా కేంద్రాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉందంటూ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు ఉద్యమం ప్రారంభించారు

 

సోంపేట థర్మల్‌ విద్యుత్తు

  2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని సారవంతమైన భూముల్లో థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు కోసం నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 2,640 మెగావాట్లు. దీని నిర్మాణం వల్ల వ్యవసాయదారులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు జీవనోపాధి కోల్పోతారంటూ 2009, డిసెంబరు 5న దీక్షతో ప్రారంభమైన ప్రజాఉద్యమం చివరికి పోలీసుల కాల్పులకు దారితీసింది. దీంతో కంపెనీ ప్రాజెక్టును కృష్ణపట్నానికి మార్చుకుంది. 2015 ఆగస్టులో ఏపీ కేబినెట్‌ మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు మార్పుపై నిర్ణయం తీసుకున్నారు.

 

అన్నాహజారే వాటర్‌షెడ్‌ పథకాలు

  అన్నాఅజారే మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయిన తర్వాత స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో స్థిరపడ్డారు. అది నీటివనరులు లేని చాలా వెనుకబడిన ప్రాంతం. కనీసం తాగునీరు కూడా దొరకని దుస్థితి. కరవు, కాటకాలతో బీటలు వారిన భూములు ఎడారిలా కనిపించేవి. జీవనాధారం లేక గ్రామ ప్రజలు వలసలు వెళ్లేవారు. ఈ దైన్యస్థితిని చూసి అన్నాహజారే చలించిపోయారు. దీనికంతటికీ కారణం జలవనరులు లేకపోవడమేనని గ్రహించి సంప్రదాయక పద్ధతిలో జలరక్షణ చేయడానికి పరిష్కార మార్గం ఆలోచించి వాటర్‌షెడ్‌ పథకాలను ఒక ఉద్యమంలా చేపట్టి సఫలీకృతులయ్యారు.

 

నల్లమల రక్షణ 

  నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా 2019లో సేవ్‌ నల్లమల ఉద్యమం నడిచింది. ఈ తవ్వకాల్లో వెలికితీసే యురేనియం వ్యర్థాల వల్ల రేడియోధార్మికత విడుదలవుతుంది. దాని కారణంగా గర్భస్రావాలు, చర్మవ్యాధులు, ఫ్లోరోసిస్, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు వస్తాయి. సుమారు 3 లక్షల ఎకరాల అటవీ భూమి ధ్వంసమవుతుంది. చెంచు గిరిజనులు తమ నివాసాలను కోల్పోతారు. జంతువులు, వృక్షజాతులకు నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ ఆమ్రాబాద్‌ టైగర్‌ ప్రాజెక్టు దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చేందుకు సిద్ధపడటంతో స్థానికులు, పర్యావరణవేత్తలు అడ్డుకున్నారు. సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమానికి మద్దతు తెలిపారు. 

 

పటాన్‌చెరు కాలుష్యం

హైదరాబాద్‌లో పారిశ్రామికీకరణతో కాలుష్యం పెరిగి పటానుచెరు ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పటాన్‌చెరు యాంటీ పొల్యూషన్‌ కమిటీ ఏర్పాటైంది. కాలుష్య ప్రభావం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతోంది. ప్రజలను చైతన్యవంతం చేస్తోంది.

 

ర్యాలీ ఫర్‌ రివర్స్‌ - 2017

  నదులను కాపాడుకోవాలంటూ ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. గోదావరి నది కొంత ఎండిపోయింది. గంగానది అంతరించిపోతోంది. నర్మద, తపతి నదుల్లో ఇప్పటికే 40 - 60 శాతం నీరు తగ్గిపోయింది. 2030 నాటికి దేశంలో నదుల్లో కేవలం 50% వరకే నీరు ఉంటుంటూ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 2017, సెప్టెంబరు 3 నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కన్యాకుమారి, తిరువనంతపురం, మధురై, బెంగళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్, ముంబయి, హరిద్వార్, దిల్లీ మీదుగా 13 రాష్ట్రాల్లో 6,500 కిలోమీటర్ల మేర సాగింది. నదుల సంరక్షణకు పౌరులకు కొన్ని సూచనలు చేసింది. నదికి ఇరువైపులా ఒక కి.మీ. మేర మొక్కలు నాటడం, పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో స్థానికంగా ఎదిగే మొక్కల్ని నాటడం, ఇసుక తవ్వకాలు నిలిపేయడం, ప్రైవేట్‌ స్థలాల్లో పండ్ల మొక్కలు పెంచడం వంటి సూచనలు చేసింది.

 

పర్యావరణహిత పండగలు

గుడ్లగూబల పండగ: ఈల ఫౌండేషన్‌ అనే సంస్థ 2018లో ఈ పండగను ప్రారంభించింది. పుణేలో పురందల్‌ తాలుకా పింగోరి గ్రామంలో పండగ నిర్వహించారు. గుడ్లగూబల పట్ల మూఢనమ్మకాలను తొలగించి, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం పండగ ప్రధాన లక్ష్యం.

 

సాంగాయ్‌ పండగ: సాంగాయ్‌ జంతువును మణిపుర్‌లో తమిన్‌ అని, డాన్సింగ్‌ డీర్‌ అని అంటారు. ఇది మణిపుర్‌ రాష్ట్ర జంతువు. మణిపుర్‌ పర్యాటక విభాగం ఏటా నవంబరు 21-30 వరకు ఈ పండగను నిర్వహిస్తుంది. 2010కి ముందు దీన్ని టూరిజం ఫెస్టివల్‌గా పిలిచేవారు. 2010 తర్వాత సాంగాయ్‌ ఫెస్టివల్‌గా మార్చారు. సాంగాయ్‌ జంతువు మణిపుర్‌లో లోక్‌తక్‌ సరస్సు ప్రాంతంలో, కైబుల్‌ లేమ్‌జావో జాతీయ పార్కులోనూ కనిపిస్తుంది.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 07-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌