• facebook
  • whatsapp
  • telegram

  బ్రిటిష్‌ ఇండియా పాలనా వ్యవస్థ పరిణామక్రమం

ఆంగ్లేయుల పాలనలో మూడు మూలస్తంభాలు! 

వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ, ఇక్కడి సంస్థానాల అనైక్యతను, పాలకుల కలహాలను   స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. ఆధునిక ఆయుధ పాటవంతో సంస్థానాలను ఒక్కొక్కటిగా జయిస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించింది. బెంగాల్‌తో మొదలుపెట్టి మొత్తం భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. ఈ క్రమంలో బ్రిటిష్‌ కంపెనీకి, ఆ తర్వాత బ్రిటిష్‌ రాణికి పాలనలో సహకరించిన ముఖ్యమైన మూడు మూలస్తంభాల వంటి సివిల్‌ సర్వీసులు, సైన్యం, పోలీసు వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటిని రూపొందించిన విధానం, అందులో క్రమానుగతంగా చేసిన మార్పులు, వలస దోపిడీ నిరాటంకంగా కొనసాగేందుకు కారణమైన స్థానిక పరిస్థితులతో పాటు భారతీయ ఉద్యోగులతోనే భారత ప్రజలను నియంత్రించి, దోచుకున్న తీరును అర్థం చేసుకోవాలి.


ఇంగ్లిష్‌ ఈస్టిండియా కంపెనీ చరిత్రలో ప్లాసీ, బక్సర్‌ యుద్ధాలు మైలురాళ్లు. కంపెనీ 1757లో బెంగాల్‌ నవాబు సిరాజ్‌ ఉద్‌-దౌలాతో ప్లాసీ యుద్ధం చేసింది. ఆ తర్వాత 1764లో స్థానిక రాజ్యాల సమాఖ్యతో అంటే మొగల్‌ చక్రవర్తి రెండో షా ఆలం, అయోధ్య (అవధ్‌) నవాబు షుజా ఉద్‌-దౌలా, మీర్‌ ఖాసీంతో బక్సర్‌ యుద్ధంలో తలపడింది. ఈ విజయాల అనంతరం షా ఆలం, షుజాలతో కంపెనీ కుదుర్చుకున్న అలహాబాదు సంధి (1765) భారతదేశంలో ఇంగ్లిష్‌ కంపెనీ స్వరూప స్వభావాలను సమూలంగా మార్చేసింది. బెంగాల్‌లో రాజ్యాధికారాన్ని స్థాపించడానికి ముందు కంపెనీ భారతదేశంలో ఒక వ్యాపార సంస్థ మాత్రమే. బక్సర్‌ యుద్ధం తర్వాత కంపెనీ బెంగాల్‌ ప్రాంతంలో రాజకీయాధికారాన్ని చేపట్టింది. దీనితోనే భారతదేశంలో సామ్రాజ్యవాద చరిత్రకు శ్రీకారం చుట్టింది. బెంగాల్‌లో సాగించిన విచ్చలవిడి దోపిడీ సొమ్మును ఈ దేశపు సంస్థానాలను జయించడానికి వినియోగించి అచిరకాలంలోనే సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆ విధంగా జయించిన ప్రాంతాల పరిపాలన నిర్వహణ కోసం ఉద్యోగ బృందాన్ని నియమించుకోవాల్సిన అవసరం ఇంగ్లిష్‌ కంపెనీకి ఏర్పడింది. 1757-1857 మధ్య కాలంలో కంపెనీ లాభాలను వృద్ధి చేసుకుంటూ, సామ్రాజ్యవాదాన్ని అమలుపరుస్తూ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వందేళ్లలో కంపెనీ ప్రభుత్వ పరిపాలనా విధానం తరచూ మార్పులకు గురైంది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో బ్రిటిష్‌ మహారాణి కంపెనీ పాలనను రద్దు చేసి భారతదేశ పాలనా బాధ్యతలను నేరుగా చేపట్టింది. మహారాణి పాలనలో భారతదేశ పాలనావ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆంగ్లేయుల పరిపాలనా సౌధానికి 


1) సివిల్‌ సర్వీసులు (సైనికేతర ప్రభుత్వ శాఖలు) 


2) సైన్యం 


3) పోలీస్‌ వ్యవస్థలు మూడు మూల స్తంభాలుగా నిలిచాయి.

 

సివిల్‌ సర్వీసులు 


భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఇంగ్లిష్‌ కంపెనీ, ఇంగ్లండ్‌ నుంచి తక్కువ జీతంతో తెచ్చుకున్న ఉద్యోగ బృందంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేది. ఈ ఉద్యోగులకు ప్రైవేటు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉండేది. బక్సర్‌ యుద్ధం తరువాతి పరిణామాల వల్ల బెంగాల్‌ రాజ్యాధిపత్యం కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే ఉద్యోగ బృందమే పాలనా బాధ్యతలు కూడా చూసేది. అప్పటికే కంపెనీ అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ రెగ్యులేటింగ్‌ చట్టం-1773 ద్వారా ఉద్యోగుల అవినీతిని నివారించడానికి ప్రయత్నం చేసినా, కొంతవరకే సఫలీకృతుడయ్యాడు. భారతదేశంలో ‘సివిల్‌ సర్వీస్‌’కు మూల పురుషుడు అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కారన్‌ వాలీస్‌. సమర్థులైన ఆంగ్లేయులను ‘కోవెనెంటేడ్‌’ అధికారులుగా ఉన్నత పదవుల్లో నియమించాడు. లంచగొండితనాన్ని రూపుమాపడానికి అధికారుల జీతాలను గణనీయంగా పెంచాడు. ప్రైవేట్‌ వ్యాపారం నిషేధించాడు. కేవలం అనుభవం (సీనియారిటీ) ఆధారంగా పదోన్నతి కల్పించాడు. పరిపాలనలో ఉద్యోగులుగా ఆంగ్లేయులకే అవకాశం ఇచ్చాడు. కారన్‌ వాలిస్‌ కాలం నుంచి ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌లో భారతీయులకు స్థానం దక్కలేదు. సంవత్సరానికి 500 పౌండ్ల జీతం మించి అందే అన్ని పైపదవులకు ఆంగ్లేయులనే నియమించాలని 1793లో అధికారిక విధానంగా ప్రకటించి అమల్లోకి తెచ్చారు. ఇదే విధానం సైన్యం, పోలీసు న్యాయవ్యవస్థలకూ వర్తిస్తుంది. తర్వాత బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ, సివిల్‌ సర్వీసుల్లో మరికొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. యువకులైన బ్రిటిష్‌ అధికారులకు ఇక్కడి భాషలు, సంప్రదాయాలు, పరిపాలనా విషయాలపై శిక్షణ ఇవ్వడం కోసం కలకత్తాలోని ఫోర్ట్‌ విలియమ్స్‌ (కోట)లో కళాశాల ఏర్పాటు చేశాడు. అనంతరం కంపెనీ డైరెక్టర్లు లండన్‌ సమీపంలో హెయిలీబరీ వద్ద తూర్పు ఇండియా కళాశాలను స్థాపించడంతో వెల్లస్లీ ఏర్పాటు చేసిన కళాశాల కొద్దికాలమే నడిచింది.


1853 వరకు సివిల్‌ సర్వీస్‌ నియామకాలన్నీ కంపెనీ డైరెక్టర్ల చేతుల మీదుగా సాగాయి. కంపెనీకి చెందిన ఆర్థిక, రాజకీయ ప్రత్యేక హక్కులను పార్లమెంటు తొలగించినప్పటికీ, ఈ ఉద్యోగ నియామక హక్కులను వదులుకోవడానికి కంపెనీ యాజమాన్యం నిరాకరించింది. అయితే భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న విద్యావంతుల అసంతృప్తిని గమనించి బ్రిటిష్‌ ప్రభుత్వం, భారతదేశపు సివిల్‌ సర్వీస్‌లో అన్ని నియామకాలు పోటీ పరీక్ష ద్వారా జరగాలని శాసిస్తూ చార్టర్‌ చట్టం-1853ని ఆమోదించింది. భారత ప్రభుత్వ చట్టం-1858, భారతదేశ పరిపాలనలో అనేక సమూల మార్పులకు కారణమైంది. తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం 1861లో ‘ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ చట్టం’ తీసుకొచ్చింది. అయినప్పటికీ సివిల్‌ సర్వీసుల్లో భారతీయులు ప్రవేశించకుండా ఆంగ్లేయులు ఆ పోటీ పరీక్షలు ఇంగ్లండ్‌లో నిర్వహించడం, పరీక్షలకు వయసు పరిమితిలో తరచూ హెచ్చుతగ్గులు చేయడం లాంటి అనేక అవరోధాలు సృష్టించారు. 1863లో సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌ సివిల్‌ సర్వీస్‌కి ఎంపికైన మొదటి భారతీయుడు. అనంతర కాలంలో లార్డ్‌ డఫ్రిన్‌ రాజప్రతినిధి (వైస్రాయ్‌)గా ఉన్నకాలంలో 1886లో అచిన్సస్‌ కమిషన్‌ వేశారు. ఈ కమిషన్‌ సివిల్‌ సర్వీసులో కోవెనేటెట్, నాన్‌-కోవెనేటెడ్‌’ అనే పదాలు తొలగించింది. సివిల్‌ సర్వీస్‌లను ‘ఇంపీరియల్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌’, ‘ప్రొవిన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌’, ‘సబార్డినేట్‌ సివిల్‌ సర్వీస్‌’గా విభజించింది. గరిష్ఠ వయసు పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. 1919లో మాంటేగ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లో భారతదేశంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్ష నిర్వహించడానికి అంగీకరించింది. 1924లో నియమించిన ‘లీ కమిషన్‌’ సివిల్‌ సర్వీసులకు సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి 


1) సివిల్‌ సర్వీస్‌ల ప్రత్యక్ష నియామకాల్లో భారతీయులకు 50% కేటాయించడం. 


2) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సివిల్‌ సర్వీస్‌ల పరీక్షలు నిర్వహించడానికి ఇండియాలోనే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం. 


 మొదటగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 1926లో సర్‌ రోజ్‌ బర్కర్‌ అధ్యక్షతన ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం-1935 ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ప్రొవిన్షియల్‌ సర్వీస్‌ కమిషన్‌లను స్థాపించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా రూపొందింది. ఇది యువకులు, ఉత్సాహవంతులు, సమర్థులను అధికారులుగా ఎంపికచేస్తూ, ప్రశంసనీయమైన సేవలను అందిస్తోంది.


సైన్యం 


భారతదేశంలో బ్రిటిష్‌ పాలనకు రెండో మూల స్తంభం సైన్యం అని చెప్పవచ్చు. ఇది మూడు పనులు నిర్వర్తించింది. 


1) విదేశీ దాడుల నుంచి బ్రిటిష్‌ ఇండియా రక్షణ 


2) స్వదేశీ సంస్థానాలను ఓడించడం 


3) ఆంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడం.


కంపెనీ పాలనలో/మహారాణి పాలనలో సైన్యంలో భారతీయుల సంఖ్య ఎక్కువే. కానీ ఉన్నత పదవులన్నీ ఆంగ్లేయులకే కేటాయించేవారు. సైనిక పాలనలో జాతి వివక్ష ఎక్కువగా పాటించేవారు. జీతభత్యాలు, సదుపాయాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ, పదోన్నతి తదితర అనేక విషయాల్లో బ్రిటిష్‌ సైనికుడికి, భారతీయ సిపాయికి వ్యత్యాసం ఉండేది. అయినా భారతీయ సిపాయిలు తాము జీతం తీసుకుంటున్న ఆంగ్లేయులకు విశ్వాసపాత్రులుగా ఉండేవారు. డల్హౌసీ కాలంలో ఆర్టిలరీ విభాగాన్ని మీరట్‌కి తరలించారు. 1879లో లార్డ్‌ లిట్టస్‌ ‘ఆర్మీ రీ ఆర్గనైజేషన్‌ కమిషన్‌‘ను నియమించాడు. 1895 నాటికి సైన్యాన్ని పంజాబ్, మద్రాస్, బెంగాల్, బొంబాయి అని నాలుగు విభాగాలు చేసి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆధీనంలో ఉంచారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నా, ఆంగ్లేయులు స్వదేశీ సంస్థానాలను జయించారంటే, భారతీయుల్లో అప్పటికి ఆధునిక జాతీయభావాలు నెలకొనలేదు. అందుకే బిహారీ మహారాష్ట్రులను; అయోధ్య వాసి పంజాబీని ఓడించడానికి సంశయించలేదు.


పోలీస్‌ వ్యవస్థ


ఇది మూడో మూల స్తంభం. బ్రిటిషర్లు బెంగాల్‌ను జయించిన తొలిదశలో, జమీందారులు పోలీస్‌ విధులు నిర్వర్తించేవారు. కారన్‌ వాలిస్‌ జమీందారుల నుంచి పోలీస్‌ విధులు తొలగించి, అమలులో ఉన్న వ్యవస్థను ఆధునీకరించి రెగ్యులర్‌ పోలీస్‌ వ్యవస్థను నెలకొల్పాడు. శాంతిభద్రతల రక్షణ పోలీసుల బాధ్యత. బెంగాల్‌ రాజ్యంలో కొన్ని గ్రామాలకు ‘ఠాణా’ అనే అనే సర్కిల్‌ను స్థాపించాడు. అందులో ‘దరోగ’ అనే పోలీస్‌ అధికారిని నియమించాడు. ఠాణాలు నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక పర్యవేక్షణ అధికారి ‘సూపరింటెండెంట్‌’ను నియమించాడు. పోలీస్‌ దళం అప్పటి సమాజానికి ప్రమాదకరంగా ఉన్న ‘దగ్గులు’, ‘పిండారీలు’ను అణచివేసింది. లార్డ్‌ క్యూరిజోస్‌ పదవీకాలంలో పోలీస్‌ వ్యవస్థ సమర్థతను పెంచడానికి సూచనల కోసం ప్రేజర్‌ కమిషన్‌ను నియమించాడు. ప్రతి రాష్ట్రంలో సీఐడీ వ్యవస్థను ఏర్పరచాలని, ఉన్నత విద్యావంతులైన భారతీయులను పోలీస్‌ ఉన్నత అధికారులుగా నియమించాలంటూ ఈ కమిషన్‌ చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. అయితే పోలీస్‌ వ్యవస్థ కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యకారులను కొమ్ము కాస్తూ, ఎక్కువగా భారతీయులను పీడించడమే పనిగా పెట్టుకుంది. స్వాతంత్రోద్యమకారులను, స్వాతంత్రోద్యమాన్ని కఠినంగా అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఒక పావుగా వాడుకుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో పాలనా మూలస్తంభాలైన సివిల్‌ సర్వీస్‌లు, సైన్యం, పోలీసువ్యవస్థ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి, వలసవాద విధానాలకు అనుగుణంగానే పనిచేశాయి.

 


 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 08-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు