• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ జాతరలు, ఉత్సవాలు

శతాబ్దాల సంప్రదాయాలు సజీవం!

కొండగట్టు అంజన్న, కొమురవెల్లి మల్లన్నలను కొలవడం, దర్గాల దర్శనాలు, ఉర్సు ఉత్సవాలు అన్నీ తెలంగాణ మిశ్రమ సంస్కృతిలో భాగాలే. వందల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఈ వేడుకలు కలిసిపోయాయి. హిందూ, ముస్లింలు ఎవరివారు తమ నమ్మకాల మేరకు భక్తిశ్రద్ధలతో కొన్నింటిని నిర్వహించుకుంటే, మరికొన్ని జాతరలను కలిసి జరుపుతారు. సమైక్య సంస్కృతికి చిహ్నంగా సాగే ఈ జాతరలు, ఉత్సవాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

శతాబ్దాలుగా తెలంగాణలో అభివృద్ధి చెందిన మిశ్రమ సంస్కృతిలో బోనాలు, సీత్ల, తీజ్, నవరాత్రులు, బతుకమ్మ, సమ్మక్క-సారక్క, పెద్దగట్టు, ఏడు పాయల జాతర వంటి వేడుకలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వాటితోపాటు మరికొన్ని ముఖ్యమైన జాతరలు, ఉత్సవాలను రాష్ట్రంలో నిర్వహిస్తారు. 

 

కొండగట్టు జాతర 

  కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 35 కి.మీ. దూరంలో ముత్యంపేట సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని 160 ఏళ్ల కిందట కృష్ణారావు అనే దేశ్‌ముఖ్‌ నిర్మించాడు. అయితే దీన్ని 300 సంవత్సరాలకు పూర్వమే సింగం సంజీవుడు అనే గోవుల కాపరి కట్టించాడని స్థానికుల నమ్మకం. ఇక్కడ  దేవుడి విగ్రహం ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయస్వామి ముఖాలతో ఉంటుంది. స్వామి మూలవిరాట్‌లో శంఖుచక్రాలు, హృదయంలో సీతారాములు ఉంటారు. ఈ దేవాలయంలో 40 రోజులపాటు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ జరిగే జాతర కొండగట్టు జాతరగా ప్రసిద్ధి చెందింది. ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడైన భేతాళస్వామి ఆలయం కొండపైన ఉంది.

 

నాగోబా జాతర

  దేశంలోని రెండో పెద్ద గిరిజన జాతర. ఇది ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవల్లి మండలం, కేస్లాపూర్‌లో జరుగుతుంది. ఏటా పుష్య బహుళ అమావాస్య రోజు నుంచి 10 రోజులపాటు నిర్వహిస్తారు. నాగోబా అంటే పామును దేవతా రూపంలో పూజిస్తారు. ఈ జాతరను గొండుల్లో మెస్రామ్‌ వంశీయులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ తెగవారు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుతం ఈ జాతరను దేవాదాయశాఖ నిర్వహిస్తోంది. ఈ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని గిరిజనులు వస్తారు. 

 

సలేశ్వరం జాతర

  మహబూబ్‌నగర్‌ జిల్లా, అచ్చంపేట మండలంలోని నల్లమల అడవుల్లో సలేశ్వర తీర్థం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం లింగమయ్య (శివుడు). ఈ జాతరను ఏటా ఏప్రిల్‌లో వచ్చే చైత్ర పౌర్ణమికి రెండు, మూడు రోజుల ముందూ, తర్వాత మొత్తం వారంపాటు నిర్వహిస్తారు. ఈ జాతరకు స్థానిక చెంచులు పూజారులుగా వ్యవహరిస్తారు.

 

కొమురవెల్లి జాతర

  వరంగల్‌ జిల్లా, చేర్యాల మండలం, కొమురవెల్లి గ్రామంలో శ్రీమల్లికార్జునస్వామి (మల్లన్న దేవుడు) దేవాలయం ఉంది. యాదవ కులస్థుడైన కొమురన్న తపస్సు ఫలితంగా మల్లికార్జునస్వామి పుట్టలో వెలిశాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఏటా మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు మల్లన్న దేవుడికి జాతర జరుగుతుంది.

 

కోటంచ జాతర

  వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజక వర్గం రేగొండ మండలంలోని కోటంచ (కోడవటంచ) గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలో ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో అక్కడ జరిగే జాతరకు ప్రజలు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండ్ల(రథాల)తో గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు.

 

రామప్ప జాతర

  వరంగల్‌ జిల్లా, పాలంపేట గ్రామంలో రామలింగేశ్వరస్వామి దేవాలయం (రామప్ప) ఉంది. ఈ ఆలయంలో ఏటా శివరాత్రి నుంచి మూడు రోజులు జాతర జరుగుతుంది.

 

బెజ్జంకి జాతర

  కరీంనగర్‌ జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల పోటీలు జరుగుతాయి.

 

కురుమూర్తి జాతర

  మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్మాపూర్‌ గ్రామంలో కురుమూర్తి (వేంకటేశ్వరస్వామి) స్వామి దేవాలయం ఉంది. దీన్ని పేదవాడి తిరుమల తిరుపతిగా పిలుస్తారు. ఈ ఆలయం క్రీ.శ.1350లో చిన్న గుహలో నిర్మించి ఆ తర్వాత కాలంలో విస్తరించినట్లు తెలుస్తోంది. కురుమూర్తి దేవుడి బ్రహ్మోత్సవాలను 19 రోజులపాటు జరుపుతారు. ఇందులో భాగంగా దీపావళి రోజున స్వామి వారి పాదరక్షల తయారీ కార్యక్రమం వడ్డెమాను గ్రామంలో ప్రారంభమై ఏడు రోజులు సాగుతుంది. ఎనిమిదో రోజు కార్తీక సప్తమినాడు స్వామివారికి ఉద్దాలసేవ జరిపి పాదరక్షలు సమర్పిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

 

సూఫీ గురువుల ఆరాధన

  సూఫీ మతస్థులు సిద్ధాంతంపరంగా మహమ్మదీయ మతానికంటే ఎంతో ముందు దశకు చెందినవారు. వీరు అన్ని మతాలను సమానంగా చూస్తారు. అల్లాను నమ్ముతారు. సూఫీల మూలసూత్రం టౌహిజో(దేవుడు ఒక్కడే). సూఫీలు రాజకీయాలకు, సమాజానికి దూరంగా ఉండేవారు. దాంతో ప్రజలకు వారంటే గౌరవం ఉండేది. సూఫీలు భారతదేశంలో హిందూమతానికి చెందిన సిద్ధాంతాలను ఆమోదించారు. కాబట్టి సూఫీ గురువులను హిందూ మతస్థులు కూడా గౌరవించి ఆరాధించేవారు. గోల్కొండ రాజ్యానికి అనేకమంది సూఫీ మత గురువులు వచ్చేవారు. ప్రజలు మతాలకు అతీతంగా వారిని ఆరాధించేవారు. సూఫీ గురువుల ప్రభావం వల్ల తెలంగాణలో హిందూ, ముస్లిం, మిగతా అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవించేవారు. దానివల్ల హైదరాబాద్‌లో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది.

 

దర్గాల దర్శనాలు

  సూఫీ సాధువు సమాధిపై నిర్మించే ఆలయాన్నే పారశీక భాషలో దర్గా అంటారు. స్థానిక ముస్లింలు దీన్ని ‘జియారత్‌’ అనే పేరుతో పిలుస్తారు. సాధారణంగా దర్గాకు అనుబంధంగా మసీదులు, గోష్టీ మందిరాలు, మదర్సాలు, ఉపాధ్యాయుడి లేక నిర్వాహకుడి నివాసగృహం, ఆసుపత్రి, సమాజ ప్రయోజనాల కోసం నిర్వహించే ఇతర భవనాలు కూడా ఉంటాయి. పారశీక భాషలో దర్గా అంటే ప్రవేశ ద్వారం, గుమ్మం అని అర్థం. మరణించిన సాధువు ఆశీర్వాదం పొందటానికి దర్గాను దర్శిస్తారు. తమ పక్షాన ఆయన దేవుడికి విన్నపం పంపుతాడని అందుకు దర్గాలు ప్రవేశ ద్వారాలని చాలా మంది ముస్లింల నమ్మకం.

 

ఉర్సు ఉత్సవాలు

  సూఫీ సాధువుల వర్ధంతినే ఉర్సు ఉత్సవంగా నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనకపోతే అనర్థాలు జరుగుతాయనే భయం ప్రజల్లో ఉండేది. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. ఈ సందర్భంగా  ప్రభుత్వాధికారులు దర్గాలకు మరమ్మతులు చేయిస్తారు.

పూజా విధానం: దర్గాలో ఉన్న సూఫీసాధువు సమాధిని ముందుగా శుభ్రం చేస్తారు. తర్వాత మంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధిపై పూసి, వస్త్రాన్ని అలంకరించి పూలహారాలు సమర్పిస్తారు. ఖురాన్‌ పఠనం తర్వాత పేదవారు, ధనికులనే తేడా లేకుండా అందరికి దస్తర్‌ ఖానా (భోజనశాల)లో ఒకే రకమైన భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ ఉర్సు ఉత్సవాలు మూడు నాలుగు రోజులపాటు సాగుతాయి. ప్రజలు దర్గాను దర్శించి తమ కోరికలు, మొక్కులను తీర్చుకుంటారు. తమ కుమారుల తలలను సమాధికి ఆనించి పూజలు చేస్తారు. ఫకీర్లు (సన్యాసులు) ఇక్కడ ప్రత్యేకం ఆకర్షణగా ఉంటారు. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలు, ఖవ్వాళీలు జరుగుతాయి. ప్రజలు సంప్రదాయక తలపాగాలు, టోపీలు ధరించి చేతిలో జపమాలతో రాత్రింబవళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సూఫీ సాధువుల సమాధులను పూజిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. 

ముఖ్యమైన ఉర్సులు: * దావూద్‌ షా సాహెబ్‌ ఉర్సు - హైదరాబాద్, * యూసుఫ్‌ సాహెబ్‌ షరీఫ్‌ సాహెబ్‌ ఉర్సు - హైదరాబాద్, * పహడి షరీఫ్‌ ఉర్సు - మౌలాలి, * ఖ్వాజాబంద్‌ నవాజ్‌ ఉర్సు - గుల్బర్గా

 

మొహర్రం

 ఇస్లాం పంచాంగంలో మొదటి నెల మొహర్రం. యుద్ధాన్ని పరిహరించాల్సిన నాలుగు పవిత్ర మాసాల్లో ఇదొకటి. రంజాన్‌ తర్వాత ముస్లింలకు ఇదే పవిత్ర మాసం. మొహర్రం అనేది హారామ్‌ (నిషిద్ధం) అనే పదం నుంచి వచ్చింది. మొహర్రంను ‘యౌము-యె-అఘరా’ అని షియా ముస్లింలు పిలుస్తారు. దీన్ని 10 రోజులు ఆచరిస్తారు. మొహర్రం రోజు చంద్రుడిని చూసిన తర్వాత ఆలం (అగ్నిగుండం) ఏర్పాటు చేస్తారు. ఈ పండుగ సమయంలో షియా ముస్లింలు నల్లటి వస్త్రాలు, ఇతరులు ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తారు. మొహర్రం ఉత్సవంలో భాగంలో పదిరోజులపాటు తియ్యటి రొట్టె, కాబూలీ (అన్నం, పప్పు), తియ్యటి పానీయం లాంటి పదార్థాలను చుట్టుపక్కలవారికి పంచుతారు. అయిదో రోజు భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. పదోరోజును తమ గురువు ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానం చేశాడని భావిస్తారు. ఆ రోజును షియాలు శోకదినంగా పాటిస్తారు. తెలంగాణ గ్రామాల్లో దీన్ని హిందూ ముస్లింలు పీర్ల పండగగా నిర్వహిస్తారు. 

 

అషుర్‌ఖానాలు

  వీటిని ఇయంబారా, బర్గా, అలవా, దర్గాలని కూడా పిలుస్తారు. అషుర్‌ఖానా అనేది ఇమామ్‌ హుస్సేన్‌ ధరించిన జెండాల సంప్రదాయపు నకళ్లను భద్రపరిచే ఆలయం. ఖలీఫా బంధువే ఇమామ్‌ హుస్సేన్‌. కర్బలా మైదానంలో శత్రువులతో పోరాడి ఇమామ్‌ మరణించారు. ఈయన బలిదానం శతాబ్దాల తరబడి ప్రజలపై ప్రభావం చూపుతోంది.

 

లింగంపల్లి జాతర

  కోహా మౌలాలి ఉర్సు ముగిసిన సాయంత్రం నుంచి ప్రజలందరూ లింగంపల్లి జాతరకు బయలుదేరతారు. అడిక్‌మెట్‌ నుంచి పుత్లీబౌలి వరకు రకరకాల పండ్లు, తినుబండారాల దుకాణాలు ఉంటాయి. ఉద్యానవనాలు, వీధులను దీపాలతో అలంకరిస్తారు. ఈ జాతర కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.ఈ జాతర అర్ధరాత్రి వరకు సాగుతుంది. ఇందులో అనేక రకాల వినోద కార్యక్రమాలు ప్రజలను అలరిస్తాయి. అప్పట్లో జాతరలో ఏనుగులు, గుర్రాలు, రథాలు, జట్కాల కోసం ప్రత్యేక దారిని కూడా ఏర్పాటు చేసేవారు. అసఫ్‌జాహీ ఆరో పాలకుడైన మహబూబ్‌ అలీఖాన్‌ ఈ జాతరకు వచ్చేవాడు. నిజాంకు కావాల్సిన సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. 

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 12-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌