• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక అత్యవసర పరిస్థితి

ఆర్థిక అల్లకల్లోలాలకు అత్యవసర పరిష్కారం

 

దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినప్పుడు, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినప్పుడు, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 360ని అనుసరించి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దీని పర్యవసానాలు, రాజ్యాంగ వివరణపై పోటీపరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

  భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్‌ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని పేర్కొంటుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్‌ 360ని ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. 

ఆర్టికల్‌ 360(1): దేశం మొత్తానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. 

ఆర్టికల్‌ 360(2): రాష్ట్రపతి ప్రకటించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంట్‌ రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన సమయం నాటికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో అది అమల్లోకి వస్తుంది. కానీ కొత్తగా ఏర్పడిన లోక్‌సభ దాన్ని నెలరోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. 

కాలపరిమితి: ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత దాన్ని ఉపసంహరించే వరకు అది కొనసాగుతుంది. అంటే పార్లమెంటు ఆమోదం పొందిన ఆర్థిక అత్యవసర పరిస్థితి నిరంతరం కొనసాగుతుంది. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. 

 

పర్యవసానాలు 

* కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. 

* కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్‌ కాపీలను కేంద్రానికి పంపాలి.

* ఆర్టికల్‌ 275 ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది. 

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించాలని కేంద్రం ఆదేశించవచ్చు.

* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను గణనీయంగా తగ్గిస్తారు.  

* ఆర్థిక అత్యవసర పరిస్థితిని మన దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించలేదు. దీన్ని అవసరమైన సమయంలో విధించడం వల్ల ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో వివరించారు. 

* ఆర్థిక అత్యవసర పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ పేర్కొన్నారు. 

 

మాదిరి ప్రశ్నలు 

 

1. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? 

1) 18వ భాగం, ఆర్టికల్‌ 360 

2) 19వ భాగం, ఆర్టికల్‌ 360 

3) 17వ భాగం, ఆర్టికల్‌ 360 

4) 20వ భాగం, ఆర్టికల్‌ 360

 

2. ఆర్టికల్‌ 360 ప్రకారం విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి కిందివాటిలో సరైంది? 

ఎ) రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్‌ రెండు నెలల్లోపు ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. 

బి) పార్లమెంట్‌ 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారా దీన్ని ఆమోదించాలి. 

సి) పార్లమెంట్‌ ఆమోదంతో దీన్ని ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. 

డి) రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా దీన్ని ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు. 

1) ఎ, బి, సి               2) ఎ, బి, డి             3) ఎ, సి, డి          4) ఎ, బి, సి, డి 

 

3. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు జరిగే మార్పును గుర్తించండి. 

ఎ) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది. 

బి) ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను గణనీయంగా తగ్గిస్తుంది. 

సి) రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ కాపీలను తనకు పంపాలని కేంద్రం ఆదేశిస్తుంది. 

డి) రాష్ట్రపతి జీతభత్యాలను తగ్గిస్తారు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి             3) ఎ, బి, డి             4) ఎ, బి, సి, డి 

 

4. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని రాజ్యాంగ సభలో ఎవరు వివరించారు? 

1) హెచ్‌.ఎన్‌.కుంజ్రూ 2) హెచ్‌.వి.కామత్‌ 

3) కె.టి.షా        4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

 

సమాధానాలు

1-1     2-3     3-1     4-4

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

 కేంద్ర‌మంత్రి మండ‌లి

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌