• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

ఆస్తిహక్కు 
ఆర్టికల్‌ 31: దీని ప్రకారం భారతీయులకు ఆస్తిని సంపాదించడానికి, అనుభవించడానికి హక్కు ఉంది. 

* 1978లో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. దీన్ని రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్‌ 300(A) లో ‘చట్టబద్ధమైన హక్కు’గా నిర్దేశించింది. ఇది 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 31(A): 1951లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా  ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
దీని ప్రకారం, భూసంస్కరణల అమలు కోసం పార్లమెంట్‌ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూడదు. ఈ ఆర్టికల్‌ ప్రకారం ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేయవచ్చు.

ఆర్టికల్‌ 31(B):  ఈ ఆర్టికల్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. దీని ప్రకారం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో రద్దు చేయడానికి వీల్లేదు. అంటే కోర్టులకు ఈ అంశాలపై న్యాయసమీక్ష చేసే అధికారం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే భూసంస్కరణల చట్టాలకు పూర్తి రక్షణ కల్పించారు.

ఆర్టికల్‌ 31(C): 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చింది. దీని ప్రకారం ప్రైవేట్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించడం కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు న్యాయ సంరక్షణ ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 39(b), ఆర్టికల్‌ 39(c) అమలుకోసం రూపొందించిన శాసనాలు ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్స్‌ 14, 19 లకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆర్టికల్‌ 31(c) ప్రకారం చెల్లుతాయి.

రాజ్యాంగ పరిహారపు హక్కు 
ఆర్టికల్‌ 32: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఈ హక్కును రాజ్యాంగానికి ‘ఆత్మ, హృదయం’ లాంటిది అని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. ప్రభుత్వాల నియంతృత్వ విధానాలు, అధికార దుర్వినియోగం నుంచి ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడానికి  ఈ హక్కును రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్‌ 32(1): దీని ప్రకారం ఎవరైనా పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని భావిస్తే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
ఆర్టికల్‌ 32(2): ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఉన్నత న్యాయస్థానం 5 రకాల రిట్లు జారీ చేస్తుంది. 
‘రిట్‌’ అంటే ఉన్నత న్యాయస్థానం జారీచేసే, తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం. ఈ భావనను మనం ఇంగ్లండ్‌ నుంచి గ్రహించాం.
ఆర్టికల్‌ 32(3): ‘రిట్స్‌’ జారీచేసే అధికారాన్ని ఇతర న్యాయస్థానాలకు కూడా కల్పిస్తూ పార్లమెంట్‌ చట్టాన్ని రూపొందించవచ్చు.
ఆర్టికల్‌ 32(4): చట్టబద్ధంగా తప్ప ఇతర పద్ధతుల ద్వారా ‘రిట్స్‌’ జారీచేసే అధికారాలపై ఎలాంటి పరిమితులు విధించకూడదు. జాతీయ అత్యవసర పరిస్థితి, మార్షల్‌లా విధించిన సందర్భంలో రిట్స్‌పై పరిమితులు విధించవచ్చు.

ఇంజంక్షన్‌ (కోర్ట్‌ నిషేధాజ్ఞ):  ఒక వ్యక్తిని ఏదైనా పని చేయమని లేదా చేయొద్దని న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వునే ‘ఇంజంక్షన్‌’ అంటారు. ఆస్తికి సంబంధించిన సివిల్‌ వివాదాల్లో యథాతథస్థితిని కాపాడటం కోసం దీన్ని జారీ చేస్తారు. సరి చేయడానికి వీలుకాని నష్టాన్ని నిలిపేయడమే ఇంజంక్షన్‌ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలపై కూడా జారీ చేస్తారు.

అమికస్‌ క్యూరీ: బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు, అతడి తరపున వాదించడం కోసం న్యాయస్థానం నియమించే వ్యక్తి లేక అధికారిని ‘అమికస్‌ క్యూరీ’ అంటారు. 

ఆర్టికల్‌ 33: శాంతి భద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, కేంద్ర సాయుధ దళాల ఉద్యోగులకు, రహస్య, గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి, రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విచారణ సంస్థల సిబ్బందికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు. ఇందుకు అవసరమైన చట్టాలను పార్లమెంట్‌ పూర్తిస్థాయిలో రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 34:  ఏదైనా ప్రాంతంలో గొడవలు జరిగినప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు, అక్కడ సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సైనిక శాసనాన్ని విధిస్తే అక్కడ నివసించే ప్రజలకు ‘ప్రాథమిక హక్కులు’ పూర్తిగా లభించవు. ఇందుకు అవసరమైన శాసనాలను పార్లమెంట్‌ రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 35: ఆర్టికల్‌ 33 లో పేర్కొన్న వర్గాలకు, ఆర్టికల్‌ 34 ద్వారా సైనిక శాసనం విధించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ఆర్టికల్‌ 371లో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల వారి హక్కుల కోసం పార్లమెంట్‌ విశిష్టమైన చట్టాలను రూపొందించవచ్చు.

అవి: 

1. The Air Force Act, 1950

2. The Navy Force Act, 1950

3. The Armed Force Act, 1950

4. The Police Force Act, 1966

* భారతదేశంలో పర్యటించే విదేశీయులకు ఆర్టికల్‌ 15, 16, 19, 29, 30లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు.
* ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో పేర్కొన్న అనేక పరిమితులు వల్ల నార్మన్‌ డీఫార్మర్‌ వీటి గురించి కింది విధంగా వ్యాఖ్యానించారు. ‘భారత రాజ్యాంగం ఒక చేతితో హక్కులను ప్రసాదించి, వాటిపై అనేక పరిమితులు విధించడం ద్వారా మరో చేతితో వెనకకు తీసుకున్నట్లుగా ఉంది’.
* మినర్వామిల్స్‌ ్ర( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1980: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొన్నప్పటికీ, వాటికి భంగం కలిగే విధంగా హక్కులను సవరించకూడదు అని పేర్కొంది.

రిట్స్‌ 
ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తాయి. అవి:

1. హెబియస్‌ కార్పస్ (బందీ ప్రత్యక్ష):  నిర్బంధంలో ఉన్న వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా కోర్టు ముందు హాజరుపర్చమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశమే ‘హెబియస్‌ కార్పస్‌’. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయడం చట్టబద్ధమా? కాదా? అని నిర్ణయించేందుకు న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. దీన్ని ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులపై కూడా జారీ చేయొచ్చు. ఇది అతిపురాతనమైన రిట్‌.
* పార్లమెంట్‌ ధిక్కారం, శాసనసభా ధిక్కారం, కోర్టు ధిక్కారం, క్రిమినల్‌ నేరం కింద అరెస్ట్‌ అయినవారికి, నివారక నిర్బంధ చట్టం ప్రకారం అదుపులోకి తీసకున్నవారికి ఈ రిట్‌ వర్తించదు.

2. మాండమస్(అత్యున్నత ఆదేశం): మాండమస్‌ అంటే ’We Command‘ అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారికి లేదా ప్రభుత్వ అధికార సంస్థకు మీ విద్యుక్త ధర్మాన్ని (Publice Duty) సక్రమంగా నెరవేర్చండి అని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశం మాండమస్‌. తమ అధికార పరిధిలో ఉన్న విధులను నిర్వర్తించడానికి నిరాకరించిన ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ సంస్థలకు ఈ రిట్‌ జారీ చేస్తారు.
* ఈ రిట్‌ను రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులు, ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.

3. ప్రొహిబిషన్‌ (నిషేధిస్తూ జారీ చేసే ఆదేశం): ఏదైనా దిగువస్థాయి న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం దాన్ని ఆపేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘ప్రొహిబిషన్‌’. దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నిరోధించడమే ఈ ‘రిట్‌’ ఉద్దేశం. ఏదైనా నిర్దిష్ట కేసులో తీర్పు ఇవ్వకుండా దిగువ న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ను ఈ రిట్‌ నియంత్రిస్తుంది.
* మాండమస్‌ రిట్‌ ఒక పని చేయాలని ఆదేశిస్తే, ప్రొహిబిషన్‌ రిట్‌ ఒక పని చేయకూడదని నిర్దేశిస్తుంది.

4. సెర్షియోరరి: ఈ రిట్‌ను ‘ప్రొహిబిషన్‌ రిట్‌’తో కలిపి జారీ చేస్తారు. దిగువ న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ ఆపేసిన కేసు విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క కోర్టుకు బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘సెర్షియోరరి రిట్‌’. ఉదా: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన ‘బెస్ట్‌ బేకరీ కేసు’ను జహీరాషేక్‌ విన్నపం మేరకు ముంబయి కోర్టుకు బదిలీ చేశారు. ప్రొహిబిషన్, సెర్షియోరరి రిట్స్‌ను జ్యుడీషియల్‌ రిట్స్‌ అంటారు.

5. కోవారంటో  (ఏ అధికారంతో): ఒక వ్యక్తికి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారాలు లేకపోయినప్పటికీ అధికారాలను చెలాయిస్తుంటే అతడు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నాడు? అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘కోవారంటో రిట్‌’. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని నివారించడానికి న్యాయస్థానం దీన్ని జారీ చేస్తుంది. 
* దీని ప్రకారం, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా, కలగకపోయినా అర్హతలేని వ్యక్తి అధికారం చేపట్టినప్పుడు దాన్ని నియంత్రించడానికి సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా కోవారంటో రిట్‌ను జారీచేయాల్సిందిగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌