• facebook
  • whatsapp
  • telegram

మనుషుల అక్రమ రవాణా - 2

అంగట్లో మానవత్వం!

 

మనుషులను అంగడి సరుకులుగా మార్చి మనుషులే క్రయవిక్రయాలు జరిపే దుర్మార్గం ఆధునిక నాగరిక సమాజంలోనూ సాగుతున్న వికృత వ్యవహారం. లైంగిక దోపిడీ, బలవంతపు చాకిరీల కోసం బానిసలను సరఫరా చేస్తూ అక్రమ లాభార్జనే ధ్యేయంగా అత్యంత క్రూరంగా మానవత్వంపై దాడి కొనసాగుతోంది. ఈ దురాగతాలను దేశాలు నిషేధించాయి. అకృత్యాలను అడ్డుకోడానికి అంతర్జాతీయ ఒడంబడికలు కుదుర్చుకున్నాయి. చట్టాలు చేశాయి. బాధితుల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టాయి. ఆ వివరాలను, వాటి ప్రభావాలను, ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం, ఆకలి, వాతావరణ కాలుష్యం వంటి వాటిని సాధారణంగా పేర్కొంటారు. కానీ మరో ప్రమాదకరమైన వికృత సమస్య ఉంది. అది ‘మనుషుల అక్రమ రవాణా (Human Trafficking). ఇది అత్యంత దుర్మార్గమైన మానవహక్కుల ఉల్లంఘన. మనుషులతోనే మనుషులు క్రయవిక్రయాలు జరపడం. ప్రభుత్వాలు మొదలు కుటుంబ సభ్యుల వరకు అందరూ తోటివారి హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేస్తున్నారు. అక్రమ రవాణా అంటే లైంగిక దోపిడీ, వెట్టిచాకిరి, లైంగిక బానిసత్వం సహా ఇంకా ఎన్నో రూపాల్లో ఉంది. లాభాల కోసం మనుషులను అమ్మడం, కొనడం. ఆధునిక యుగ బానిసత్వానికి ‘మనుషుల అక్రమ రవాణా’ ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 

 

నిర్వచనాలు

స్త్రీలను, పిల్లలను బలవంతంగా వేశ్య వృత్తిలోకి దింపడాన్ని తెలియజేస్తూ 20వ శతాబ్దం మధ్యభాగంలో ‘అక్రమ రవాణా’, ‘స్త్రీల, పిల్లల అక్రమ రవాణా’ అనే పదాలను ఉపయోగించారు. 1990 దశకం నాటికి ఆధునిక కాల బానిసత్వాన్ని వర్ణించడానికి ‘మనుషుల అక్రమ రవాణా’ అనే పదాన్ని వినియోగించడం ప్రారంభించారు. 

* 1998లో యూరోపోల్‌ (యూరోపియన్‌ పోలీస్‌ ఆఫీస్‌) ఇచ్చిన నిర్వచనం చాలావరకు ఆమోదయోగ్యంగా ఉంది. ఈ నిర్వచనం ప్రకారం లైంగిక వ్యాపారంలోకి బలవంతంగా ప్రవేశపెట్టడమే అక్రమ రవాణా. ఇందులో బలవంతపు చాకిరీ రూపాలు కూడా చేరాయి. అయితే బలవంతపు చాకిరీ రూపాలు ఏమిటి అనే అంశాన్ని వివరించలేదని ఐఓఎమ్‌ (ఇంటర్నేషనల్‌ ఫర్‌ మైగ్రేషన్‌) సంస్థ పేర్కొంది. 2000లో ఐక్యరాజ్యసమితి ప్రోటోకాల్‌ ప్రకారం ‘మోసం (ఫ్రాడ్‌), బలవంతం చేయడం కూడా అక్రమ రవాణా’ కిందకు వస్తాయి. మధ్యయుగంలో కూడా మనుషులను బానిసలుగా కొనడం, వారిని ఆస్తిగా పరిగణించడం కొనసాగింది. 8 నుంచి 11వ శతాబ్దంలో బానిస వ్యాపారం కాస్పియన్‌ సముద్రం నుంచి లండన్‌ వరకు విస్తరించింది.

* 1500 సంవత్సరం నుంచి 1800 వరకు ఐరోపా, అమెరికా, ఆఫ్రికాల మధ్య జరిగిన బానిస వ్యాపారంతో ఆఫ్రికా నుంచి దాదాపు 1 కోటి 30 లక్షల మంది బానిసలుగా అమ్ముడుపోయారు. ఈ దేశాంతర బానిస వ్యాపారాన్ని చరిత్రలో అతి పెద్దస్థాయి మనుషుల అక్రమ రవాణాగానే కాకుండా, మానవ చరిత్రలోనే అతి క్రూరమైన ఘట్టంగా పరిగణిస్తారు.

* బ్రిటన్‌ బానిస వ్యాపారాన్ని 1833లో నిషేధించింది. అమెరికా 1865లో, బ్రెజిల్‌ 1988లో ఈ వ్యాపారాన్ని నిషేధించాయి. 1926లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ బానిస వ్యాపారాన్ని నిషేధిస్తూ ఒక అంతర్జాతీయ ఒడంబడిక చేసింది. 1948లో ఐక్యరాజ్యసమితి ఈ ఒడంబడికను అనుసరిస్తూ బానిసత్వాన్ని నిషేధించింది. తమ దేశాల్లో బానిసత్వాన్ని నిషేధిస్తూ రూపొందించిన పత్రాలపై చివరిగా సంతకాలు చేసిన దేశాలు- ఖతార్‌ (1952), ఒమన్‌ (1970), మారిటానియా (1980).

* ‘పిల్లల అక్రమ రవాణా నిరోధక చట్టం-2003’ ప్రకారం ‘ఏదైనా సమూహాన్ని, వ్యక్తులను, పిల్లలను, స్త్రీలను సేకరించి, నియమించుకుని, సరఫరా/రవాణా చేస్తూ దేశం లోపల/వెలుపల అక్రమంగా, చట్టవ్యతిరేకంగా వారిని హింసిస్తూ, శ్రమను దోచుకుంటూ వారికి స్వతంత్ర జీవన విధానం లేకుండా మానవ యంత్రాలుగా చేసి, ద్రవ్యాన్ని ఆర్జించే అసాంఘిక వ్యవస్థే మనుషుల అక్రమ రవాణా.’

 

అక్రమ రవాణా - రూపాలు

 

లైంగిక దాడి:

* బలవంతపు వ్యభిచారం

* సాంఘిక, మతపరమైన వ్యభిచారం (దేవదాసి, జోగిని, మాతంగి)

* అసభ్యత, అశ్లీల రచనలు, నీలిచిత్రాలు చూపించడం.

 

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు:

* అక్రమ రవాణాకు గురైన వారితో భిక్షాటన చేయించి డబ్బు సంపాదించడం, అందుకోసం వారిని హింసించడం, బాధించడం, కొన్ని సమయాల్లో అవయవాలను తొలగించి, దివ్యాంగులుగా మార్చి భిక్షాటన చేయించడం.

* మానవ అవయవాలను తొలగించి అమ్మివేసి వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించడం.

* అక్రమ రవాణా ద్వారా వచ్చిన వ్యక్తులతో మత్తుమందులు అమ్మించి లాభాలు గడించడం.

 

కార్మికులు- వెట్టిచాకిరి: కూలీ ఇవ్వకుండా పనిచేయించుకుని ఇబ్బందులకు గురిచేయడం, సరైన పోషకాహారం, దుస్తులు ఇవ్వకపోవడం, వారిని కనీసం మనుషులుగా చూడకపోవడం.* వేతనాలు లేకుండా ఇళ్లలో పని, వ్యవసాయ కూలీ, నిర్మాణ కూలీ లాంటి పనులు చేయించుకోవడం.

 

అక్రమ రవాణా కారణాలు:  

* ఉపాధి సౌకర్యాలు లేకపోవడం * పేదరికం * ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమతౌల్యాలు * అవినీతి

* సరిహద్దు నియంత్రణల ఉల్లంఘన * జాతి, లింగ వివక్ష వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు

 

ఆధునిక యుగంలో అక్రమ రవాణాకు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని 19వ శతాబ్దం చివరి భాగంలో ఐరోపా, అమెరికాలోని సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చాయి.

* 20వ శతాబ్దంలో రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడిక,  తర్వాత 1904లో రూపొందించిన ‘ఇంటర్నేషనల్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ ది సెపరేషన్‌ ఆఫ్‌ ది వైట్‌ స్లేవ్‌ ట్రాఫిక్‌’ లకు 12 దేశాలు ఆమోదం తెలిపాయి.

* 1910లో శ్వేత బానిస రవాణాను అణచివేయడానికి అంతర్జాతీయ యంత్రాంగాలను, సహకారాన్ని బలోపేతం చేసేవిధంగా ఆ అంతర్జాతీయ ఒప్పందానికి ప్రోటోకాల్‌ను జతపరిచారు.

* ‘జాన్‌.డి. రాక్‌ఫెల్లర్‌’ అందించిన ఆర్థిక సాయంతో ‘అమెరికన్‌ బ్యూరో ఆఫ్‌ సోషల్‌ హైజీన్‌’ అక్రమ రవాణాపై పరిశోధన చేపట్టింది. ఇందుకోసం ఈ బ్యూరో కమిటీ 28 దేశాల్లోని దాదాపు అయిదు వేల మందిని ఇంటర్వ్యూ చేసింది.

* 1919లో ‘లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌’ ఏర్పడిన అనంతరం స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాను నిషేధించే చట్టాలను అంతర్జాతీయంగా సమన్వయపరిచే బాధ్యతను స్వీకరించింది.

* 1926 సెప్టెంబరు 25న నానాజాతి సమితి జెనీవాలో మానవ అక్రమ రవాణా నిషేధంపై ఒడంబడిక చేసింది. 1927, మార్చి 9 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

* 1930లో ఫోర్స్‌డ్‌ లేబర్‌ కన్‌వెన్షన్‌ బలవంతపు చాకిరిని నిషేధించింది.

 

             మానవ అక్రమ రవాణా వివరాలు

1. లైంగిక వ్యాపారం - 38%

2. గృహాల్లో బలవంతపు చాకిరి - 28%

3. బాలల బలవంతపు చాకిరి - 7%

4. ఇతర రూల్లో బలవంతపు చాకిరి - 7%

5. ఆసుపత్రులు, హోటల్స్‌లో చాకిరి - 4%

6. బాలల ద్వారా లైంగిక వ్యాపారం - 3%

7. వస్త్ర దుకాణాలు, ఆహార పదార్థాల తయారీలో బాలకార్మికులు - 3%

8. ఇతరాలు - 10%


 

చట్టాలు

ది సెపరేషన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ యాక్ట్‌-1956: 1950లో భారత ప్రభుత్వం - ‘ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ ఫర్‌ సెపరేషన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌’ను ఆమోదించి 1956లో ఈ చట్టం చేసింది. 1986లో దీనికి సవరణ చట్టం చేశారు. ఈ చట్టాన్ని ‘ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’గా పిలుస్తారు. దాని ప్రకారం ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా జీవితాంతం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ యాక్ట్‌-1994: ఈ చట్టం అవయవాల మార్పిడి ద్వారా అక్రమ ద్రవ్య ఆర్జనను అరికడుతుంది.

జువనైల్‌ జస్టిస్‌ కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ యాక్ట్‌-2000: ఈ చట్టానికి 2006, 2011లో సవరణలు జరిగాయి.

* జువైనల్‌ అంటే - మేజర్లుగా చట్టం నిర్ధారించిన వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు. వారికి పునరావాసం, వారిని ఎక్కడ నిర్బంధించాలో ఈ చట్టం పేర్కొంటుంది.

 

పథకాలు

ఉజ్వల (2007): మహిళల అక్రమ రవాణా నిషేధించడానికి, దోపిడీ నుంచి రక్షణ కల్పించడం ఈ పథకం లక్ష్యం. పునరావాసం, బాధితులను రక్షించడంపై సెమినార్ల ద్వారా అవగాహన కల్పిస్తారు.

ప్రజ్వల (1996): హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది. డాక్టర్‌ సునీతా కృష్ణన్, జోస్‌వెట్టి కాటిల్‌ స్థాపించారు. బాలికలు, మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దించడాన్ని అడ్డుకుంటుంది. అనైతిక తరలింపు నిషేధానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.

స్వధార్‌ (2002): మానసిక వైకల్యానికి గురైన మహిళలకు సేవలందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

పూర్ణశక్తి పథకం (2013): దేశంలో మహిళలందరికీ ప్రభుత్వ సేవలు, పథకాలు తెలియజేసేందుకు రూపొందించిన పథకం.


అక్రమ వ్యాపారాల్లో ‘మూడోది’


ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ వ్యాపారంగా మాదకద్రవ్యాల సరఫరా ఉంది. రెండో స్థానంలో ఆయుధాల అక్రమ రవాణా ఉండగా, మనుషుల అక్రమ రవాణాది మూడో స్థానం. ఈ నేరాలకు సంబంధించి ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరించారు.

టైర్‌-1: మానవ అక్రమ రవాణా తక్కువగా ఉన్న దేశాలు

టైర్‌-2: మానవ అక్రమ రవాణా మధ్యస్థంగా ఉన్న దేశాలు

టైర్‌-3: మానవ అక్రమ రవాణా ఎక్కువగా ఉన్న దేశాలు

 

యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్‌ అండ్‌ క్రైమ్స్‌ ప్రకారం అక్రమంగా తరలించిన వారిలో 79% లైంగిక దోపిడీకి, 18% బలవంతపు చాకిరికి గురవుతున్నారు. మొత్తంగా బాధితుల్లో 20% బాలబాలికలు ఉండగా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 100% బాలబాలికలే అక్రమ రవాణా అవుతున్నారు.

* ప్రపంచంలో మొదటిసారిగా రోమన్‌ సామ్రాజ్యంలో ‘స్పార్టకస్‌’ బానిసత్వాన్ని నిషేధించడానికి ప్రయత్నించాడు.

* బానిస వ్యాపారాన్ని నిషేధించిన తొలి దేశాలు డెన్మార్క్, నార్వే.

* బ్రిటన్‌ పార్లమెంటు క్రీ.శ.1807లో మానవ అక్రమ రవాణాను నిషేధించింది.

* 1833 బానిసత్వ నిషేధ చట్టంతో బ్రిటన్‌ దాని వలస రాజ్యాల్లోనూ బానిసత్వాన్ని నిషేధించింది.

* 1966, డిసెంబరు 16న పౌర, రాజకీయ హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. ఇది 1976, మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చింది.

* 1976లో 35 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మానవ అక్రమ రవాణా నిషేధాన్ని అంగీకరిస్తే, 2003లో 104 సభ్య దేశాలూ ఆమోదించాయి.

* 2004లో 22 అరబ్‌ దేశాలు మానవ అక్రమ రవాణాను నిషేధించాయి.

* ప్రపంచంలో ప్రతి 30 సెకన్లకు, భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు/బాలిక అపహరణకు గురవుతున్నారు. 

* మానవ అక్రమ రవాణాలో 90% మంది అంతర్‌ రాష్ట్రాలకు, 10% మంది విదేశాలకు ఎగుమతి అవుతున్నారు.

 

తెలంగాణ టాప్‌:  నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం దేశంలో మనుషుల అక్రమ రవాణాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. విదేశాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం బయటపడింది.

* ఎన్‌సీఆర్‌బీ ప్రకారం తెలంగాణలో 2019లో 137, 2020లో 184, 2021లో 347 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 2021లో నమోదైన 347 కేసుల్లో బాధితుల సంఖ్య 796. వీరిలో 18 ఏళ్లలోపు బాలురు 137, బాలికలు 85 ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 574 మంది ఉంటే వీరంతా యువతులే కావడం గమనార్హం.

 

పోలీస్‌ శాఖ స్పందన: ఎన్‌సీఆర్‌బీ నివేదికపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించింది. రాష్ట్రంలో ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వల్ల నేరాల సంఖ్య అధికంగా కనిపిస్తోందని చెప్పింది. తెలంగాణలో 80 వేల ఫిర్యాదులు వచ్చాయి. దేశంలోనే అత్యధికంగా 14,135 ఎఫ్‌ఐఆర్‌లు ఇక్కడ నమోదు చేసినట్టు డీజీపీ కార్యాలయం పేర్కొంది.

ఐపీసీ సెక్షన్లు:  ఐపీసీ సెక్షన్‌ 366(ఎ): మైనర్‌ బాలికల సేకరణ నిషేధం.

ఐపీసీ సెక్షన్‌ 366(బి): ఇతర దేశాల నుంచి స్త్రీలు, పిల్లలను దిగుమతి చేయడం నేరం.

ఐపీసీ సెక్షన్‌ 372: వ్యభిచారం కోసం బాలికలను అమ్మడం నేరం.

ఐపీసీ సెక్షన్‌ 373: వ్యభిచారం కోసం బాలికలను కొనడం నేరం.


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 26-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌