• facebook
  • whatsapp
  • telegram

స్వాతంత్య్ర దినోత్సవం

 సంకెళ్లను తెంచుకొని.. స్వేచ్ఛా లోకంలోకి!
 

ఆ అర్ధరాత్రి దేశంలో సరికొత్త సూర్యుడు ఉదయించాడు. జాతి కల సాకారమైంది. పరాయి పాలనలో రెండు వందల సంవత్సరాలకుపైగా అణచివేతలు, దోపిడీలు, దారుణాలకు గురైన గడ్డ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆగస్టు పండగ తెచ్చిన ఉత్సాహం జన హృదయాల్లో నిండిపోయింది. అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఐకమత్యానికి ప్రతిరూపంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కష్టాలు, కన్నీళ్లు, కఠిన శిక్షలతో సాగిన సుదీర్ఘ పోరాటాల ప్రయాణం ముగిసింది. బానిస సంకెళ్లు తెంచుకొని ప్రజలు స్వతంత్ర ప్రపంచంలోకి పరుగులు పెట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసింది. ఈ పరిణామక్రమంలో చివరి ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనలను పోటీ పరీక్షార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ మధ్య ఏర్పడిన సైద్ధాంతిక సంఘర్షణ, దేశంలో చెలరేగిన మత కలహాలు, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విధానం, స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో బ్రిటిష్‌ పాలకులు వ్యవహరించిన తీరు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.  స్వాతంత్య్రంతోపాటు మాయని గాయంగా మిగిలిన దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలి.


ప్రత్యక్ష కార్యాచరణ దినం: మంత్రిత్రయ ప్రణాళికకు ఇండియన్‌ ముస్లింలీగ్‌ మొదట ఆమోదం తెలిపినప్పటికీ, తర్వాత తిరస్కరించింది. అయినా ప్రభుత్వం మంత్రిత్రయ ప్రణాళికను అనుసరించి 1946 జులైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించింది. అందులో భారత జాతీయ కాంగ్రెస్‌ 208 స్థానాలు సాధిస్తే, లీగ్‌ 73 స్థానాలను గెలుచుకుంది. సిక్కులు నాలుగు స్థానాల్లో నెగ్గారు. లీగ్‌ రాజ్యాంగ సభలో ప్రవేశించకుండా 1946 ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఆ రోజు బెంగాల్‌లో, ముఖ్యంగా కలకత్తా నగరంలో హిందూ, ముస్లిం మత సంఘర్షణలు చెలరేగాయి. ఇరు పక్షాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది క్షతగాత్రులయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. దీనినే ‘కలకత్తా మారణకాండ’గా అభివర్ణిస్తారు. కలకత్తా మతకలహాలు బిహార్, యూపీ, మహారాష్ట్రలోని బొంబాయి, దిల్లీ ప్రాంతాలకు వేగంగా పాకడంతో పరిస్థితులు విషమించాయి.

తాత్కాలిక ప్రభుత్వం: క్యాబినెట్‌ మిషన్‌ నివేదిక మేరకు భారత్‌లోని బ్రిటిష్‌ రాజప్రతినిధి, జవహర్‌లాల్‌ నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్‌ కూడా దానిని ఆమోదించడంతో 1946, సెప్టెంబరు 2న నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.


తాత్కాలిక ప్రభుత్వంలో: * నెహ్రూ - విదేశీ వ్యవహారాలు, కామన్‌వెల్త్‌ విషయాలు; * సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ - హోం శాఖ, * బల్‌దేవ్‌ సింగ్‌ - రక్షణ, * జాన్‌ మత్తాయ్‌ - పరిశ్రమలు, * రాజగోపాలచారి - విద్య, *హోమీ బాబా - గనులు, విద్యుత్తు; * డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ - వ్యవసాయం, ఆహారం; * జగ్జీవన్‌ రామ్‌ - కార్మిక శాఖ, * ఆసఫ్‌ అలీ - రైల్వే శాఖలను నిర్వహించారు. ముస్లిం లీగ్‌ రాజ్యాంగ పరిషత్తులో భాగస్వామి కావడానికి నిరాకరించినప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. లీగ్‌ తరఫున లియాఖత్‌ అలీఖాన్‌ - ఆర్థిక శాఖ, ఇబ్రహీం ఇస్మాయిల్‌ - వాణిజ్యం, అబ్దుల్‌ నిష్టర్‌ - వార్తా ప్రసారాలు, ఘజాఫర్‌ అలీఖాన్‌ - ఆరోగ్యం, జోగీంద్ర నాథ్‌ మండల్‌ - న్యాయశాఖ నిర్వహించారు.

రాజ్యాంగ పరిషత్‌ సమావేశం: 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం నిర్వహించింది. ఆనాటి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, ఆచార్య కృపలానీ, పండిట్‌ గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ లాంటి వారు పరిషత్తుకు ఎంపికయ్యారు. బిహార్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సుదీర్ఘకాలంగా సెంట్రల్‌ లెజిస్లేచర్‌ సభ్యుడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తర్వాత డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ను శాశ్వత అధ్యక్షుడిగా సభ ఎన్నుకుంది. ముస్లిం లీగ్‌ తాత్కాలిక ప్రభుత్వంలో చేరినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో భాగస్వామి కాలేదు. దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగింది. మత సంఘర్షణలు, హింసాకాండ దేశంలో నిత్యకృత్యమయ్యాయి.

బ్రిటిష్‌ ప్రధాని చర్చలు: ముస్లిం లీగ్‌ మొండి వైఖరి బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. చివరి ప్రయత్నంగా బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ క్లెమెంట్‌ అట్లీ, భారత నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ, బల్‌దేవ్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), మహమ్మద్‌ అలీ జిన్నా, లియాఖత్‌ అలీఖాన్‌ (లీగ్‌)లను లండన్‌కు పిలిపించాడు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన అధికార నివాసంలో సమావేశం ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి.

అట్లీ ప్రకటన: లీగ్‌ ప్రభుత్వంలో చేరి మంత్రివర్గ కార్యకలాపాలను అడ్డుకుంటూ, ప్రతిష్టంభన సృష్టించింది. ప్రత్యేక పాకిస్థాన్‌ దేశం ఏర్పాటును డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్‌-లీగ్‌ మధ్య సామరస్యం కుదరకపోగా, సంఘర్షణ అనివార్యమైంది. భారతదేశంలోని ఈ ఉద్రిక్త రాజకీయ పరిస్థితులను బ్రిటిష్‌ ప్రభుత్వం గమనించింది. ఆ దశలో నాటి బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ అట్లీ బ్రిటిష్‌ పార్లమెంటులో 1947, ఫిబ్రవరి 20న చరిత్రాత్మక ప్రకటన చేశాడు.


ప్రకటన సారాంశం: * బ్రిటిష్‌ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 1948, జూన్‌ 30 లోపు భారతదేశం నుంచి వైదొలుగుతుంది.


* ఈలోగా భారత రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగాన్ని రచిస్తే దాని ఆధారంగా ఏర్పడే ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేస్తుంది లేదా అప్పుడు అధికారంలో ఉన్న బాధ్యతాయుత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని అప్పగిస్తుంది.

* అధికార బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడానికి అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ స్థానంలో లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భారత రాజ్య ప్రతినిధిగా నియమితుడయ్యాడు.

లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ - భారత స్వాతంత్య్రం: లార్డ్‌ క్లెమెంట్‌ అట్లీ ప్రకటనతో దేశ ప్రజల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మరోవైపు బెంగాల్, పంజాబ్, దిల్లీ ప్రాంతాల్లో మతఘర్షణలు ఎక్కువయ్యాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ కూడా నిత్యం ఈ ఘర్షణలతో బతకడం కంటే, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండటం మేలని భావించింది. గాంధీజీకి దేశ విభజన ఇష్టం లేదు. జరుగుతున్న తతంగం చూసి వేదనకు గురయ్యారు. లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ 1947, మార్చిలో అధికార బాధ్యతలను స్వీకరించాడు. దేశ ప్రముఖ రాజకీయ నాయకులతో పలుసార్లు చర్చలు జరిపాడు. చివరికి బ్రిటిష్‌ మంత్రిత్రయ ప్రణాళిక అమలు చేయడం సాధ్యంకాదని, దేశ విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదనే నిర్ణయానికి వచ్చాడు. తానే ఒక ప్రణాళికను రూపొందించి 1947, జూన్‌ 3న ప్రకటించాడు.


బాటన్‌ ప్రణాళిక ముఖ్యాంశాలు: * ఇది ప్రధానంగా దేశ విభజన అమలు కోసం రూపొందించిన ప్రణాళిక. 


* భారతదేశం ఇండియా, పాకిస్థాన్‌ అనే రెండు డొమినియన్‌లుగా విడిపోతుంది. 


* పంజాబ్, బెంగాల్‌ అసెంబ్లీల నిర్ణయానుసారం ఆ రాష్ట్రాలను విభజిస్తారు. 


* అస్సాంలోని సిల్‌హెట్‌ జిల్లాలో, పశ్చిమోత్తర రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దానికి అనుగుణంగా భారత్‌ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.


* కొత్తగా ఏర్పడే రెండు దేశాల మధ్య సరిహద్దు నిర్ణయించడానికి ఒక కమిషన్‌ ఏర్పాటవుతుంది.


* భారత సంస్థానాలపై బ్రిటిష్‌ సార్వభౌమాధికారం ఉండదు. అవి తమ ఇష్టానుసారం కొత్తగా ఏర్పడిన ఇండియా, పాకిస్థాన్‌లలో దేనిలోనైనా చేరవచ్చు.

ప్రణాళిక అమలు-భారతదేశ స్వాతంత్య్రం: రాజప్రతినిధి ప్రకటించిన జూన్‌ ప్రణాళికను భారత రాజకీయ పార్టీలు భారమైన హృదయంతో ఆమోదించాయి. తూర్పు పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లు భారత యూనియన్‌లో ఉంటే, పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్, అస్సాంలోని సిల్‌హెట్‌ జిల్లా పాకిస్థాన్‌లో కలిశాయి. సింధ్‌ రాష్ట్రం పాకిస్థాన్‌లో కలవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశ విభజనకు వీలుగా బెంగాల్, పంజాబ్‌లను విభజించేందుకు సర్‌ రాడ్‌క్లిఫ్‌ నాయకత్వంలో సరిహద్దు కమిషన్‌ ఏర్పాటైంది. రాజప్రతినిధి ప్రణాళికను అనుసరించి 1947 జులై మొదటి వారంలో భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అది ‘భారత స్వాతంత్య్ర చట్టం 1947’గా జులై 18న ఆమోదం పొందింది. 1947, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం ఇచ్చారు. భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దయింది. బ్రిటిష్‌ రాజు ధరిస్తున్న ‘భారతదేశ సార్వభౌముడు’ బిరుదు రద్దయింది. అఖండ భారతదేశం ఇండియా, పాకిస్థాన్‌లుగా విడిపోయింది. సంస్థానాలపై బ్రిటిష్‌ సార్వభౌమాధికారం రద్దయింది. కొత్త డొమినియన్‌ల భూభాగాలను నిర్వచించారు. శాసనరీత్యా ఏర్పడిన పార్లమెంటు ఉభయ డొమినియన్‌లలో లేకపోవడం వల్ల ఆయా భూభాగాల్లోని రాజ్యాంగ పరిషత్తులే శాసన, రాజ్యాంగ రచనా విధులు నిర్వహిస్తాయి.


ఆగస్టు 15వ తేదీ భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. కోట్లాది భారతీయుల సుందర స్వప్నం సాకారమైన రోజు. లక్షలాది త్యాగమూర్తుల తరతరాల అవిశ్రాంత పోరాటాలు, త్యాగాలు ఫలించిన రోజు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు శ్వాసించే వేళ  దిల్లీలోని పార్లమెంటు భవనం విశాలమైన హాలులో భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే అధికార పత్రాన్ని రాజప్రతినిధి చదివాడు. జాతి పులకించిపోయింది. దేశం యావత్తు జయజయధ్వానాలతో నిండిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 22-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు